అక్టోబర్ 26, 1947న నాటి జమ్ము-కశ్మీర్ రాచరిక రాజ్య పాలకుడైన మహారాజ హరి సింగ్ భారత ప్రభుత్వంతో “ఇనుస్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్ (విలీన సాధన/ప్రవేశ పత్రం)”పై సంతకం చేయడంతో జమ్ము-కశ్మీర్ ప్రాంతం చట్టబద్దంగా భారతదేశంలో అంతర్భాగంగా విలీనం కావడం జరిగింది. 2020 నుంచి ప్రతి ఏట 26 అక్టోబర్‌న ప్రభుత్వం అధికారిక సెలవు దినం ప్రకటించింది. 77వ జె అండ్ కె విలీన దినోత్సవాన్నిల పర్వదినంగా భావిస్తూ ర్యాలీలు, బాణాసంచా పేల్చడం, జాతీయ గీతాలాపన చేయడం లాంటి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాశ్మీరీ వేర్పాటువాదులు, పాకిస్థానీ సానుభూతి పరులు ఈ రోజన విలీన దినానికి బదులుగా “బ్లాక్ డే” పాటించడం కూడా అక్కడక్కడ కొనసాగుతోంది.
దేశ స్వాతంత్ర్య సంబురాలు – దేశ విభజన గాయాలు:
భారత్‌కు స్వాతంత్ర్యం ఇస్తూనే వలస పాలకులు అఖండ భారత్‌ను మతపరమైన ప్రాకిపదికగా రెండు దేశాలుగా విభజించడం, ముస్లిమ్‌లు పాకిస్థాన్ వైపు, హిందువులు భారత్ వైపు వలసలు వెళ్లడం, అల్లర్లు/హత్యలు/దోపిడీలు లాంటి హృదయవిదారక ఘటనలు మిగిలేచిన విభజన గాయాలు నేటికీ ఇంకా మాసిపోలేదు. నాటి పరిస్థితుల్లో భారతదేశవ్యాప్తంగా 570కి పైగా ప్రిన్స్‌లీ స్టేట్స్ లేదా రాచరిక రాజ్యాలు ఉండగా వాటిని భారత్ లేదా పాకిస్థాన్‌లో విలీనం కావాలని సూచించారు. 15 ఆగష్టు 1947న 560కి పైగా రాచరిక పాలన ప్రాంతాలు భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించగా జమ్ము-కశ్మీర్, హైదరాబాదు, జూనఘడ్ ప్రాంత రాజ్యాలు మాత్రం విలీనాన్ని వ్యతిరేకించాయి. నాటి జమ్ము-కశ్మీర్ రాజు మహరాజ హరి సింగ్ భారత్‌లో విలీనానికి ఇష్టపడక, పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను కొనసాగిస్తూ స్వతంత్ర రాచరిక రాజ్యంగా ఉంటామని తెలిపారు.
పాకిస్థానీ విఫల దాడులు – భారత్ ధీటైన సమాధానాలు:
అక్టోబర్ 1947లో పాకిస్థానీ గిరిజన పాస్తూన్ వర్గ దళంతో పాటు పాక్ సైన్యం కూడా కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనే నెపంతో పాకిస్థాన్ ఏకపక్షంగా దూకుడు పెంచి “ఆపరేషన్ గుల్మార్గ్” దండయాత్ర ప్రయత్నాలు ప్రారంభించి మహారాజను లొంగదీసుకోవాలని శ్రీనగర్ వైపు దళంగా కదిలారు. ఈ దుర్మార్గపు దండయాత్రలో ఉత్తర కశ్మీర్ బారముల్లా ప్రాంతంలో 11,000లకు పైగా సాధారణ ప్రజలు హత్యలు చేయబడ్డారు.
శాంతి భద్రతలు చేయి దాటడంతో మహారాజ హరి సింగ్ భయంతో తమను కావాడాలని భారత్‌ను కోరడం, భారత్‌లో విలీనం అయితేనే కాపాడుతామని భారత ప్రభుత్వం తెలుపడం, 26 అక్టోబర్ 1947న “ఇనుస్ట్రుమెంట్ ఆఫ్ ఏక్సెషన్ లేదా విలీన/ప్రవేశ సాధన పత్రం” పత్రంపై సంతకం చేయడంతో పాకిస్థానీ దండయాత్ర దళాన్ని భారత సైన్యం నిలువరించి జమ్ము-కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసుకుంది.
ఇనుస్ట్రుమెంట్ ఆఫ్ ఏక్సెషన్ తమకు సమ్మతం కాదని, కశ్మీర్ మా భూభాగమని నాటి నుంచి నేటి వరకు పాకిస్థాన్ పోరాటాలు, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావనలు చేస్తూనే ఉన్నది. ఈ విషయం 1948లో ఐరాస వేదికకు చేరగా, 01 జనవరి 1949న కాల్పుల విరమణతో పాటు వాస్తవాదీన రేఖ (ఎల్ ఓ సి) విషయంలో అంగీకారం కుదరడం, గిల్జిట్/బలూచిస్థాన్ ప్రాంతాలు పాకిస్థాన్ వైపు, ఇతర ప్రాంతాలు భారత్ వైపు విభజించబడ్డాయి.
ఆర్టికిల్ 370 రద్దుతో ప్రశాంత కాశ్మీరం:
నాటి నుంచి నేటి వరకు 1965, 1989, 19999 (కార్గిల్ వార్) లాంటి పలు సందర్భాల్లో పాకిస్థాన్ దూకుడుగా భారత్‌పై ఒత్తిడి లేదా పోరాటాలు చేయడం, ఉగ్రమూకల్ని ఉసిగొల్పడం, వేర్పాటువాదులకు వంత పలకడం, భారతాన్ని అస్థిరపరిచే విఫల కుతంత్రాలు చేయడం, ఓటమి చవిచూడడం కొనసాగుతూనే ఉన్నది. ఆగష్టు 05 ఆగష్టు 2019న జమ్ము-కశ్మీర్ రాష్ట్రానికే సంబంధించిన ప్రత్యేకమైన 370, 35ఏ ఆర్టికిల్స్ రద్దు కావడంతో పాటు జె అండ్ కె కేంద్రపాలిత ప్రాంతంగా లేదా యూనియన్ టెరిటరీగా రూపాంతరం చెందడం మనకు తెలుసు.
ఇప్పటికైనా బలమైన భారతదేశం ప్రదర్శించే ఓపికను బలహీనతగా భావించకుండా, పాకిస్థాన్ ప్రభుత్వం, వేర్పాటువాదులు, ఉగ్రమూకలు తోకలు ముడువాలని, లేదంటే మరో చావు దెబ్బ తినడానికి సిద్ధంగా ఉండాలని పౌర సమాజం సూచిస్తున్నది. భరతమాత నుదిటి బొట్టు వలె అందమైన జె అండ్ కె ప్రాంతం శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుందాం, జమ్ము-కశ్మీర్‌కు విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం.