ఆధ్యాత్మిక విముక్తి స్థితిని ప్రశ్నించిన తత్వవేత్త.. ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి..

ఆధ్యాత్మిక విముక్తి స్థితిని ప్రశ్నించిన తత్వవేత్త మరియు వక్త ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి. తన యవ్వనంలో మతపరమైన మార్గాన్ని అనుసరించిన, ఆయన చివరికి దానిని తిరస్కరించారు. తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, గురువు వీటిలో ఏ విశేషణము సరిపోదు. తాత్విక తీవ్రవాది, అరాచక ఆధ్యాత్మిక వాది అని అంటూ ఉంటారు. ఆయనొక విలక్షణమైన తత్వవేత్త. 1918 వ సంవత్సరం బందరులో జన్మించి 2007లో (తన 89 సంవత్సరాల వయస్సులో) ఇటలీలో కన్నుమూసిన విలక్షణమైన తత్వవేత్త ప్రచారం అంటూ ఏమీలేని ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి కి ప్రపంచవ్యాప్తంగా వేల మంది అభిమానులు ఉండేవారు, ఉన్నారు. ఆయన అభిమానులలో గొప్ప గొప్ప ప్రముఖులు ఉన్నారు. అతి సాధారణ అభిమానులు ఉన్నారు. తన దగ్గర ఏ సిద్ధాంతాలు లేవు అని నొక్కి వక్కాణించిన ఆయన మాటలు వినడానికి ఆయన దగ్గర వేలాదిమంది వస్తూ ఉండేవారు.
ఆయనకు పేరు ప్రతిష్టలు వచ్చాక ఎలాంటి సభలు, సన్మానాలు ఏర్పాటు చేయలేదు. బోధన తరగతులు, శిక్షణ కేంద్రాలు ఏమీ లేవు. మంత్రాలు వల్లించలేదు, దీవెనలు అందించలేదు. ఏ సంస్థను స్థాపించలేదు. కార్యాలయం లేదు, ఫోన్ నెంబరు లేదు, ఫ్యాక్స్ నెంబరు లేదు. కార్యదర్శి లేడు, చిరునామా లేదు, అన్నిచోట్ల కనిపించేవారు. ఒక్కచోట ఉండేవారు కాదు. తన స్నేహితుల ఇంట్లో కానీ, చిన్న అద్దె ఇంట్లో కానీ ఉంటుండేవారు. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లండన్, సిడ్ని, బీజింగ్ ఎక్కడైనా ఉండేవారు. ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి వచ్చారంటే ఆయనను కలుసుకోవడానికి ఎగబడేవారు. ఆయనను కలుసుకోవాలని ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆంజ్ఞ అవసరం లేదు. ఎలాంటి బేషజాలు అవసరం లేదు. నీలా, నాలా అతి సాదాసీదాగా ఉండేవారు. కేవలం ఐదు కిలోల బరువు ఉన్న చిన్న సూట్ కేస్ తో ప్రయాణిస్తూ ఉండేవారు. మామూలు దుస్తులే ధరించేవారు.
ఎక్కడా రెండు మూడు నెలలకు మించి ఉండేవారు కాదు. ఇది చాలు తనకు విలక్షణమైన శైలి ఉన్నదని చెప్పడానికి. దాదాపు 50 సంవత్సరాలు వచ్చే వరకు అనేక మలుపులున్న సాధారణ జీవితం ఆయనది. పెళ్లి చేసుకున్నారు, పిల్లలున్నారు. దివ్యజ్ఞాన సమాజం గురించి ప్రచారం చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. హిమాలయాలకు వెళ్లి స్వామీజీలను కలుసుకున్నారు. రమణ మహర్షిని కలుసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు జిడ్డు కృష్ణమూర్తితో ఏడేళ్లు పరిచయం. ఇన్ని దశలు అయ్యాక వివాహ బంధం నుండి బయటపడ్డాక ఆయన 49 సంవత్సరాల వయస్సులో హఠాత్తుగా విచిత్రమైన మానసిక విస్ఫోటనానికి గురై పూర్తిగా విభిన్నమైన వ్యక్తిగా మార్పు చెందారు. అప్పటినుండి మనం చెప్పుకున్న విలక్షణమైన వ్యక్తిగా మార్పు చెందారు. విలక్షణ వ్యక్తిగా జీవించారు ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి.
జీవిత విశేషాలు…
జన్మ నామం : ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి
ఇతర పేర్లు : యు.జి.కె మూర్తి
జననం : 09 జూలై 1918
స్వస్థలం : బందరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాసం : మద్రాసు, తమిళనాడు
వృత్తి : తత్వవేత్త
జీవిత భాగస్వామి : కుసుమ కుమారి
పిల్లలు : వసంత్, భారతి, కుమార్, ఉష
మరణ కారణం : అనారోగ్య సమస్య తీవ్రతరం.
మరణం : 22 మార్చి 2007, వల్లేక్రోసియా, ఇటలీ..
నేపథ్యం…
ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి 09 జూలై 1918 నాడు బందరు లో జన్మించారు. తాను పుట్టిన ఏడవ రోజునే ఆయన తల్లి మరణించింది. అప్పటి నుండి తాత, అమ్మమ్మలే తనకు తల్లిదండ్రులయ్యారు. నాన్న రెండో పెళ్లి చేసుకుని గోపాలకృష్ణ మూర్తి గురించి న పట్టించుకోవడం మానేశారు. నెలల పిల్లవాడిని తన తాత తుమ్మలపల్లి గోపాల కృష్ణమూర్తి తన స్వగ్రామం గుడివాడ తీసుకెళ్లారు. ఆయన థియోసాఫికల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న సంపన్న బ్రాహ్మణ న్యాయవాది. ఆయనకు తన మనుమడే ప్రపంచం అయ్యాడు. ఉప్పులూరు గోపాలకృష్ణ మూర్తి తల్లి చనిపోతూ ఆమె నాన్నతో “నా కొడుకు గొప్పవాడు అవుతాడు, ఏదో సాధించి తీరుతాడని నా నమ్మకం” అని చెప్పింది. దానిని ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి తాతగారు సీరియస్ గా తీసుకున్నారు. ఒకవైపు తుమ్మలపల్లి గోపాలకృష్ణ మూర్తి (ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి తాతగారు) థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలకంగా ఉంటున్న తన ఇంట్లో ఆ సొసైటీకి సంబంధించిన ప్రముఖులు జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఫోటోలు ఉండేవి, మరోవైపు గుడివాడకు ఎవ్వరైనా స్వామీజీలు వస్తే ఇంటికి పిలిచి సన్మానిస్తుండేవారు. ఈ వైరుధ్యమైన వాతావరణం లోనే ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి (యు.జి) బాల్యం కొనసాగింది.
బాల్యం…
తాతగారి ప్రతీ చర్య కూడా యు.జి కి ప్రశ్నార్థకంగానే ఉండేది. యు.జి కి బాల్యం నుండే ఉపనిషత్తులు, పురాణాలు చదవడం అలవాటు చేశారు ఆయన తాతగారు తుమ్మలపల్లి గోపాలకృష్ణ మూర్తి (టి.జి). ఏడేళ్ల వయస్సులో తనకు కంఠతా వచ్చేవి. యు.జి తన ఏడేళ్ల వయస్సులో 1925లో మద్రాసులో థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) స్వర్ణోత్సవాలు జరిగాయి. అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి యు.జి మద్రాసుకి వెళ్ళాలి. వసతులు సరిగ్గా లేకపోవడంతో మద్రాసు వెళ్లడంలో సంశయం నెలకొంది. యు.జి తాను అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి మద్రాసు వెళితే ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నారు. కానీ అంతకుముందు తాను వందల సార్లు మొక్కుకున్న కొబ్బరికాయలు గనుక కొడితే అందులో సగం పూజారి తీసుకుంటారనే ఉద్దేశ్యంతో ఆ మొక్కును వెనక్కి తీసుకున్నారు. అయినా కూడా తాతయ్య యు.జి ని మద్రాసుకు తీసుకువెళుతుండడంతో యు.జి కి సందేహం వచ్చింది.
మొక్కు వెనక్కి తీసుకున్నా కూడా ఆయన మద్రాసుకు వెళుతున్నాడంటే దేవుడు మొక్కు నిజం కాదా అనే సందిగ్దం నెలకొంది. అలా నెలకొన్న సందిగ్దత తనను తన 42 సంవత్సరాల వరకు వెంటాడింది. మద్రాసులో జరిగిన ఆ దివ్యజ్ఞాన సమాజం సమావేశంలో “జిడ్డు కృష్ణమూర్తి” ప్రసంగం విన్నారు. కానీ ఆ ఉపన్యాసం చేస్తున్న జిడ్డు కృష్ణమూర్తి మాటల మధ్యలో తడుముకోవడం యు.జి కి నచ్చలేదు. అలాగే ఒకసారి తన తాతయ్య ధ్యానంలో ఉండగా బయటకు వచ్చి అల్లరిచేస్తున్న మనమరాలును చితకబాది వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో ఉన్న వారికి బయట జరుగుతున్న విషయాలు ఎలా తెలుస్తాయి? ఇలాంటి విషయాలన్నీ యు.జి లో తిరుగుబాటు ధోరణికి కారణమయ్యాయి. అమ్మమ్మ నౌకర్లకు చద్ది అన్నం పెట్టేది. అది యు.జికి నచ్చేది కాదు. ఒకసారి ఆయన వెళ్లి నౌకర్ల మధ్యలో కూర్చొని చద్ది అన్నం పెట్టమని అడిగారు. బడిలో పేద విద్యార్థులను వేరుగా కూర్చోబెట్టేవారు. తాతయ్య ఇచ్చిన డబ్బులతో, ఇంట్లో నుండి చాటుగా తీసుకున్న డబ్బులతో పేద పిల్లలకు బడి ఫీజులు కడుతూ వాళ్లకు పుస్తకాలు కొనిచ్చేవారు.
ప్రభావితం చేసిన సంఘటనలు…
1932 వ సంవత్సరంలో యు.జి తనకు 14 యేండ్ల వయస్సు ఉండగా రెండు సంఘటన జరిగాయి. శివగంగ పీఠాధిపతి యు.జి వాళ్ల ఇంటికి వచ్చారు. ఆయన వైభవం, ఆయన చుట్టూ ఉన్న శిష్యగనాన్ని చూసి ప్రభావితుడయ్యారు యు.జి. తాను కూడా వారితో వెళ్లి, వారికి సేవ చేసి కాలక్రమేణా పీఠాధిపతి అయ్యి దర్జాగా బ్రతకవచ్చు అనేది యు.జి ఆలోచన. ఆయన ఇదే విషయాన్ని పీఠాధిపతికి తెలియజేశారు. అలా బలవంతంగా రాకూడదని తాతయ్య వాళ్ళు బాధపడతారని చెప్పి యు.జి కి ఒక మంత్రం ఉపదేశించి వెళ్ళారు పీఠాధిపతి. దానిని ఆయన రోజుకు 3000 సార్లు చొప్పున ఏడేళ్లపాటు ఉచ్చరించారు. ఒక నిర్ణయం తీసుకొని దానిని క్రమం తప్పకుండా పాటించడం అనే గుణాన్ని అప్పటినుండి అలవర్చుకున్నాడు యు.జి.
మరో సంఘటన తన అమ్మగారి ఆస్తికం జరిపిస్తుండగా జరిగింది. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భోజనం చేయకుండా యు.జి. ని పస్తులు ఉండమని చెప్పారు పురోహితులు. కానీ పురోహితులు ప్రక్కనున్న హోటల్ లో భోజనం చేస్తున్నారు. తనని పస్తులుండమని పురోహితులు భోజనం చేయడం ఏంటో యు.జి కి అర్థం కాలేదు. దాంతో తనకు కోపం వచ్చింది. వెళ్లి తన తాతగారిని డబ్బులు అడిగారు. ఆ కోపంలోని భావన అర్థం చేసుకున్న తాత (టి.జి) ఇవ్వనన్నాడు. నీవు చిన్నవాడివి, నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు అన్నారు. మా అమ్మ డబ్బులు ఉన్నాయి కదా అవి ఇవ్వండి అని విసురుగా అన్నారు యు.జి. అప్పుడు నీకు, మాకు సంబంధం ఉన్నడు అన్నాడు టీ.జీ. ఇప్పుడేమో సంబంధం ఉన్నట్టు, నేను నీ కడుపులో పుట్టలేదు కదా అని కేక లేచాడు యు.జి.
అలా తన అల్లరినంతా తాత, అమ్మమ్మలు భరించేవారు. ఎందుకంటే వారికి మనవడు అంటే ఇష్టం. ఆయనను పెంచడం కోసం కాస్త కటువుగానే ప్రవర్తించేవారు టీ.జీ. ఆ విధంగా చిన్న్ననాటి నుండే ప్రశ్నించే మనస్తత్వం, దైవ చింతన గూర్చి అనుమానాలు, పెద్దమనుషుల ద్వంద ప్రవర్తన యు.జి. ని మానసికంగా అతలాకుతలం చేశాయి. తన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూనే పాఠశాల చదువు దగ్గర నుండి ఏడు సంవత్సరాల పాటు ప్రతీ వేసవి సెలవులలో రిషికేష్ వెళుతుండేవారు యు.జి.
రిషికేష్ పర్యటన రద్దు చేసుకున్న యు.జి…
యు.జి కి డబ్బులకు కొదవలేదు. రిషికేష్ లో స్వామి శివానంద శిష్యరికంలో మూడు నెలలు కఠోర ధ్యానం చేస్తుండేవాడు. స్వామీజీలు బోధించే కఠోర యోగ ప్రక్రియల్ని యు.జి అభ్యాసం చేశారు. ఎంత కాలం భోజనం చేయకుండా ఉండగలడో కూడా ప్రయత్నం చేసి చూసేవారు. దైవం, మోక్షం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని, అనుభవంలోకి తెచ్చుకోవాలని ఆయన తాపత్రయం. ఏడు సంవత్సరాలు క్రమం తప్పకుండా వెళ్లే యు.జి కి స్వామి శివానంద చెప్పేవి తాను పాటించడం లేదని, అవి కూడా ఇతరుల కోసమేనని ఆయనకు అర్థం అయిపోయింది. సాత్విక ఆహారం తినమని శిష్యులకు చెప్పే శివానంద లోపలికి వెళ్లి ఘాటైన పచ్చళ్లతో తినడం చూసి ఈయన కూడా ఇంతేనా? అసలు స్వామీజీలంతా ఇంతేనా? అనుకుని రిషికేష్ వెళ్లడం మానేశారు.
సగంలోనే బి.ఏ ఆపేసిన యు.జి…
గుడివాడలో ఎస్.ఎస్.ఎల్.సి పాసయ్యాక మద్రాసులో ఎఫ్.ఏ, బి.ఏ.ఆనర్స్ లో తత్వశాస్త్రం, మనోతత్వ శాస్త్రము లను పాఠ్యాంశాలను ఎంచుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్తలు వ్రాసిన పుస్తకాలను చదివేవారు. మనోతత్వ శాస్త్రమును అధ్యయనం చేసే క్రమంలో మనసు లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు యు.జి. ఒకవైపు చదువు, మరో వైపు రుషికేశ్ వెళ్లి ధ్యానం చేయడం ఇవన్నీ యు.జి లో అంతర్గతంగా ప్రశ్నల పరంపరను పెంచుతూ వచ్చాయి. ఒక ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటున్న తరుణంలో మరో ప్రశ్న.
తత్వశాస్త్రం అధ్యాపకుడిని అసలు మనసు అంటే ఏమిటి? అది ఎక్కడుంది? అని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆ అధ్యాపకులు ఏదో సమాధానం చెప్పారు. దానికి యు.జి మరిన్ని ప్రశ్నలు సంధించారు. దానికి బదులుగా ఆ అధ్యాపకులు “బాబు ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. పుస్తకంలో ఉన్న వాటిని బట్టీ పట్టి, పరీక్ష పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకో. ఆ తరువాత ఆలోచిద్దువు గానీ” అన్నారు. కాలక్రమేణా యు.జి కి తెలిసిందేమిటంటే ఆ అధ్యాపకులు ఒక్కరే నిజాయితీగా నాకేమీ తెలియదని కచ్చితంగా చెప్పారని చెప్పుకొచ్చారు. తెలుసుకున్న కొద్దీ, చదివిన కొద్దీ మానసిక అశాంతి పెరిగిందే తప్ప ఆ అధ్యాపకులు చెప్పినట్టు పరీక్షల కోసమే చదవలేకపోయారు యు.జి. బి.ఏ పరీక్షలు వ్రాయలేకపోయారు. ఆ సంఘటనలు జరిగే సమయానికి 1939 లో యు.జి వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే.
రమణ మహర్షిని కలుసుకున్న యు.జి…
కోరికలు చంపుకోవడం, కోపం తెచ్చుకోకుండా ఉండడం గౌతమ బుద్ధుడి బోధించిన బోధనలు ఎంతవరకు ఆచరణీయం? స్థితప్రజ్ఞత ఎలా ఉంటుంది? కోపం రావడం, కోరికలు కలగడం సహజసిద్ధమైన ప్రక్రియలు. వాటిని అణుచుకోవడం అంటే నన్ను నేను మోసం చేసుకోవడం, నేను నేనుగా కాకుండా, మరోలా జీవించడం ఇలా ఎందుకు చేయాలి? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న యూ.జి కి రిషికేశ్ పర్యటనలో మహర్షి “రమణ పాదానంద” రమణ మహర్షి దగ్గరికి వెళ్ళమని ఒక సలహా చెప్పారు. దానికి యు.జి ఒప్పుకోలేదు. ఎందుకంటే స్వామీజీలను నమ్మలేడు. అయినా కూడా మిత్రుని సలహా మేరకు పాల్బ్రేటర్ వ్రాసిన “సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా” పుస్తకం చదివారు. అందులో రమణ మహర్షి గురించి ఉన్న అధ్యయనాలను అధ్యయనం చేశారు. అయినా కూడా అతనికి ఉత్సుకత అనిపించలేదు.
అయిష్టంగానే ఒకరోజు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు యు.జి. ఆయన ఎదురుగా కూర్చున్నారు. ఒకరికొకరు రెండు గంటల వరకు ఏమీ మాట్లాడుకోలేదు. మనిషి ఐహిక బంధనాల నుండి పూర్తిగా విముక్తి పొందడం సాధ్యమేనా అని ప్రశ్నించాడు యూజీ? కొన్ని అందినట్లు అనిపిస్తాయి. కొన్ని అందినట్లు అనిపించవు. ఆ స్థాయి భేదాలు ఉంటాయా? ఈ ప్రశ్నలకు రమణ మహర్షి సమాధానం చెప్పారు. అందరూ మోక్షం మోక్షం అంటున్నారు కదా! ఆ మోక్షాన్ని నాకు ప్రసాదించగలరా? ఇత్యాది ప్రశ్నలను సంధించారు యు.జి. దానికి రమణ మహర్షి బదులిచ్చారు. “మోక్షాన్ని నేను ప్రసాదించగలను, కానీ నీవు దానిని స్వీకరించగలవా? అన్నారు”. దానికి యు.జి అవాక్కయ్యారు. ఎవ్వరూ తనకు ఈ విధంగా జవాబు ఇవ్వలేదు. ఆ తరువాత రమణ మహర్షిని ఎప్పుడూ కలుసుకోలేదు.
వివాహం…
మద్రాసులో చదువుకున్న రోజులలో దివ్యజ్ఞాన సమాజం ఉపాధ్యక్షులుగా ఉన్న అరుణ్ డిల్, జీనరాస్ దాస్ లు ఉపన్యాసాలు ఇచ్చే ఉద్యోగం యు.జి కి ఇచ్చారు. అందులో సుమారు పదేళ్లు (1953 వరకు) వరకు కొనసాగారు. కేవలం భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలే కాకుండా యూరప్ దేశాలు, అమెరికాలలో కూడా పర్యటించి యు.జి దివ్యజ్ఞాన సమాజం గురించిన వందలాది ఉపన్యాసాలు ఇచ్చారు. పదేళ్లపాటు సాగిన ప్రస్థానం యు.జి కి విసుగు తెప్పించింది. యు.జి తన 35 సంవత్సరాల వయస్సులో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. ఈ పదేళ్లలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి యు.జి వివాహం. రెండోది జిడ్డు కృష్ణమూర్తి తో పరిచయం.
ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి తన పాతికేళ్ల వయసున్నప్పుడు 1943లో తన అమ్మమ్మ చూపిన అమ్మాయి కుసుమ కుమారిని వివాహం చేసుకున్నారు. ఆ వివాహ బంధం 1960వరకు అంటే 17 సంవత్సరాల దాకా కొనసాగింది. దివ్యజ్ఞాన సమాజం పరిసర ప్రాంతాలలో నివసించిన యు.జి, వివాహం అనంతరం అందులో నుండి బయటికి వచ్చి భార్యతో వేరు కాపురం పెట్టారు. కాలక్రమేణా వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. అమ్మాయిలు భారతి, ఉష, అబ్బాయి వసంత్. అబ్బాయి వసంత్ కు చిన్నతనంలోనే పోలియో వ్యాధికి గురయ్యారు. పిల్లల విషయంలో వాళ్ళ చిన్నతనంలో యు.జి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు.
దివ్యజ్ఞాన సమాజం పై ఉపన్యాసాలివ్వడానికి విదేశాలు తిరిగినప్పుడు వీలైనప్పుడల్లా భార్య, పిల్లలను తనతో పాటు తీసుకెళ్తూ ఉండేవారు. ఆ రోజులలో జరిగిన రెండో సంఘటన జిడ్డు కృష్ణమూర్తిగా పరిచయం. జిడ్డు కృష్ణమూర్తి, యు.జి ల మధ్య 1947 నుండి 1953 వరకు తీవ్రమైన చర్చలు జరుగుతుండేవి. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు చేయడం, ఆయనను గురువుగా చూడటం యు.జి కి నచ్చలేదు. యు.జి కి ఆ బోధనలలో విషయం లేదు అనిపించింది. ఆ చర్చల చివరలో 1953 వ సంవత్సరంలో యు.జి కుమారుడు వసంత్ కి పోలియో వ్యాధి నయం చేస్తానన్నారు కృష్ణమూర్తి. దాంతో తన కొడుకు, భార్యతో కలిసి జిడ్డు కృష్ణమూర్తిని దర్శించుకున్నారు యు.జి. కాళ్లకు ఏదో మర్దన చేశారు. కానీ ఫలితం లేదు. జీకే బోధనలోని విధానం నచ్చక అక్కడినుండి బయటకు వచ్చేసాడు యు.జి.
కొడుకు చికిత్స కోసం అమెరికా పయనం…
ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి 1955లో కొడుకు వసంత్ చికిత్స కోసం తన ఇద్దరు ఆడపిల్లల్ని తన అక్కయ్య దగ్గర వదిలి, భార్య కొడుకుతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. అమెరికా పర్యటన ఐదేళ్లపాటు కొనసాగింది. పిల్లవాడికి ఇంకొన్నాళ్ళు వైద్యం చేయాలని వైద్యులు చెప్పారు. స్వదేశం కాదు. తెచ్చిన డబ్బులు అయిపోయాయి. అక్కడ తెలిసిన వారు లేరు. సహాయం చేసే వారు లేరు. దివ్యజ్ఞాన సమాజం గురించి తాను ఇదివరకు ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నారు. కనుక మళ్ళీ దాని గురించి ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. తన ఉపన్యాసాలకు గిరాకీ బాగా పెరిగింది. గంటకు వంద డాలర్ల పారితోషికం తీసుకునే స్థాయికి వెళ్లారు యు.జి. తన ఉపన్యాసాల నిర్వాహణ చూసుకోవడానికి ఒక మేనేజర్ ని కూడా పెట్టుకున్నారు. సంవత్సరానికి దాదాపు 100 ఉపన్యాసాలు ఇచ్చేవారు. ముగ్గురు కుటుంబ సభ్యులు ఉండడానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ భార్యతో ముభావంగా ఉండేవారు. తన సమస్య ఇది అని చెప్పలేని అనిశ్చిత స్థితి. రెండు సంవత్సరాలు తన ఉపన్యాసాలతో డబ్బులు సంపాదిస్తూ కుమారుడు వసంత్ కు వైద్యం చేయించేవారు. కొడుకు కోలుకున్నాడు. కానీ పూర్తిగా నయం అవ్వలేదు. ఊతకర్రల సహాయం లేకుండా కాళ్లు ఈడ్చుకుంటూ నడిచే స్థాయికి వెళ్ళాడు. ఇంకొన్నాళ్ళు ఉంటే సుదీర్ఘంగా నయమవుతుందని వైద్యులు చెప్పారు.
అమెరికాలో నాలుగో సంతానం…
తనకు నచ్చని పనిని హఠాత్తుగా ఆపేయడం యు.జి కి మొదటి నుండి ఉన్న అలవాటు. అప్పటికే ఆరు నెలలకు సరిపడా ఉపన్యాసాలు బుక్ అయి ఉన్నాయి. రాను రాను ఉపన్యాసాలు ఇవ్వడం తనకు విసుగు అనిపించింది. దాంతో ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం మానేశారు. సంస్కృతం, ఆంగ్లం లో డిగ్రీ చదివిన యు.జి భార్య కుసుమకుమారి ఉద్యోగం వెతుక్కున్నారు. “వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా” లో భారతీయ అంశాల మీద వ్యాసాలు వ్రాసే ఉద్యోగం వచ్చింది. ఆమె ఉద్యోగం చేస్తుంటే ఆయన ఇంట్లో ఉండి భార్యకు వ్యాసాలు వ్రాయడంలో సహాయం చేసేవారు. అమెరికాలోనే వున్న ఆ దంపతులకు 1958లో నాలుగో సంతానం అబ్బాయి కుమార్ జన్మించాడు. బాబు పుట్టాక కుసుమకుమారి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే, యు.జి ఇంట్లో ఉండి పిల్లలను చూసుకునేవారు.
వరల్డ్ యూనివర్సిటీ లో ఉద్యోగం…
అలా మరో రెండేళ్లు గడిచాయి. భర్త ప్రవర్తన లో మార్పు వచ్చింది. ఇండియాలో వదిలి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు, కుటుంబ పెద్దలకు దూరంగా అమెరికాలో పెరుగుతున్న మగపిల్లలు, ఇవన్నీ కుసుమకుమారిని నిరాశ, నిస్పృహలకు గురిచేశాయి. పెద్దబ్బాయి వసంత్ పోలియో నుండి తొందరగానే కోలుకున్నారు. భారతదేశం వెళదామని భార్య కుసుమకుమారి అడిగింది. నేను రాను నువ్వు వెళ్ళు అన్నాడు యు.జి. ఆయన ప్రవర్తన వ్యవహార శైలిని గమనించిన కుసుమకుమారి పెద్దగా వాదించలేదు. అప్పటివరకు బ్యాంకులో నిల్వ ఉన్న నగదుతో భార్య, కుమారులకు మద్రాసుకు టికెట్ కొన్నారు యు.జి. వాళ్లు వెళ్లిపోయారు. యు.జి ఒక్కడే అమెరికాలో ఉన్నారు. అప్పటికి ఇంకా ఆయనకు శిష్యులు లేరు. అందువలన తనకు సహాయం చేసే వారు లేరు. ఆయన తప్పని పరిస్థితుల్లో “వరల్డ్ యూనివర్సిటీ” లో ఉద్యోగం తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ వారు స్థాపించిన హాస్టల్ పనులను ఆయన సమన్వయం చేసేవారు.
భార్య పిల్లలను శాశ్వతంగా వదిలేసి…
వరల్డ్ యూనివర్సిటీ ఉద్యోగంలో భాగంగా యూరప్ దేశాలన్నీ తిరగాల్సి వచ్చేది. దాంతో 1961 వ సంవత్సరం మద్రాసుకు కు వచ్చి ఆడయార్ లోని తన నివాసంలో ఉన్న పుస్తకాలను సర్దుకుని అమెరికాకు బయలుదేరడానికి సిద్ధపడ్డారు. భార్య కుసుమకుమారి తన పిల్లలతో సహా వచ్చి కలుసుకుంది. తమతో పాటు ఉండమని భర్తను వేడుకొంది. పిల్లలను చూసిన ఆయన ఉండిపోతాడు అనుకుందామె . కానీ ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి భార్య మాటలు వినలేదు, పిల్లలను చూసి చలించలేదు. గతాన్ని పూర్తిగా సమాధి చేసి పూర్తిగా తెగిన గాలిపటంలా ప్రపంచం మీద పడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్య, పిల్లలు భారతదేశం లోనే ఉండిపోయారు. అప్పటికి యు.జి వయస్సు 44 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఆయనది స్థిరత్వం లేని జీవితం అయ్యింది. ఆ తరువాత మరో 45 సంవత్సరాలు తాను మరణించే వరకు భారతదేశం వదిలి వరల్డ్ యూనివర్సిటీ పనిమీద ముందుకు సాగిపోయారు.
భార్య మరణం…
కొంతకాలం తరువాత ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి కి తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. తన దగ్గర ఉన్న డబ్బుతో అంతకుముందు తాను పర్యటించిన యూరప్ దేశాలకు పయనమయ్యారు. ప్రత్యేకమైన గమ్యం లేదు. ఒక యాత్రికుడిగా వెళుతున్నారు. లండన్ వెళ్లారు. అక్కడ డబ్బులు అయిపోయాయి. దాంతో హస్తసాముద్రికం, వంటలు నేర్పడం వంటివి చేసి డబ్బులు సంపాదించేవారు. ఎక్కువ సమయం బ్రిటిష్ గ్రంథాలయంలోనే గడిపేవారు. ఎప్పుడో కార్ల్ మార్క్స్ కూర్చుని చదువుకున్న కుర్చీ ప్రక్కనే కూర్చుని తత్వశాస్త్రం పుస్తకాలు చదువుతూ ఉండేవారు యు.జి. ఆయన లండన్ లో ఉన్న జిడ్డు కృష్ణమూర్తిని కలుసుకుని రెండు రోజులు ఉండి తిరిగి వచ్చేసారు. యు.జి. తన దగ్గరున్న విమానం తిరుగు టికెట్ అమ్మి అక్కడే కొన్ని రోజులు గడిపారు. ఆయన ఇంగ్లాండ్ పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న ఆయన భార్య 1961- 62 ప్రాంతాలలో మరణించారు. తనకంటూ ప్రత్యేకమైన చిరునామా లేని యు.జి కి భార్య చనిపోయిన వార్త ఆరు నెలల తరువాత తెలిసింది. ఆయన భారతదేశంలో ఉన్న తన పిల్లలకు సానుభూతి తెలుపుతూ ఉత్తరం వ్రాశారు.
జ్యూరిక్ వెళ్ళబోయి జెనీవా కు..
ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. దాంతో లండన్ లో ఉన్న రామకృష్ణ మఠంలో కొన్నాళ్లున్నారు. అక్కడి నుండి ప్యారిస్ వెళ్లి అక్కడ కొన్నాళ్లున్నారు. స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ లో బ్యాంకులో ఉన్న తన ఖాతా గుర్తొచ్చింది. అందులో ఉన్న మిగిలిన డబ్బు తీసుకుందామని స్విజర్లాండ్ లో రైలు ఎక్కాడు. పొరపాటు జరిగి జ్యూరిక్ వెళ్లకుండా జెనీవా చేరుకున్నారు. అక్కడ చిన్న హోటల్ లోని ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. వారం అయ్యాక అద్దె కట్టనందున హోటల్ వాళ్ళు గదిని ఖాళీ చేయమన్నారు. గత్యంతరం లేక జెనీవాలో ఉన్న భారతీయ దౌత్యవేత్త కార్యాలయం (ఇండియన్ కాన్సులేట్) కి వెళ్ళారు యు.జి. అమెరికాలో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు “దివ్యజ్ఞాన సమాజం” వాళ్ళు ఇచ్చిన ప్రశంస పత్రాలను చూపించారు. దౌత్యవేత్త కార్యాలయం (ఇండియన్ కాన్సులేట్) లో స్వామి నిత్యబోదానంద అక్కడ ఉన్నారు. ఆయన యు.జి ని గుర్తుపట్టి అక్కడ ఉన్న అధికారులకు చెప్పారు. దాంతో ఆ అధికారులే హోటల్ బిల్లు చెల్లించారు. కానీ అంతకుమించి సాయం చేయడానికి వాళ్ళ నిబంధనలు ఒప్పుకోలేదు.
యు.జి కి ఆవాసం ఇచ్చిన వాలెంటైన్ డే కెర్విన్..
జెనీవా లో భారతీయ దౌత్యవేత్త కార్యాలయం జరుగుతున్న ఈ తతంగాన్ని అదే కార్యాలయంలో పనిచేస్తున్న స్విట్జర్లాండ్ వృద్ధ మహిళ గమనించింది. ఆమె వయస్సు సుమారు అరవై యేండ్లు. ఆమె యు.జి కి ఆశ్రమం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ప్రత్యామ్నయం లేని యు.జి ఆమె సహాయాన్ని అంగీకరించారు. ఆమె పేరు “వాలెంటైన్ డే కెర్విన్”. ఆమె ఒక వితంతువు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె ఆహ్వానం మేరకు వాళ్ళింటికి వెళ్లారు ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి. ఆమె ఆయన కన్నా పదిహేడు సంవత్సరాలు పెద్దది. ఆయన యోగ క్షేమ సమాచారాలు వాలంటైన్ చూసుకునేవారు. ఆ తరువాత కొద్ది కాలానికి వాలెంటైన్ పదవి విరమణ చేయాల్సి వచ్చింది. ఆ పదవీ విరమణతో వచ్చిన డబ్బులను బ్యాంకులో వేసి వచ్చిన వడ్డీ డబ్బులతో జీవితం కొనసాగించడం మొదలుపెట్టారు. “ఒక్కోసారి ఎవ్వరు ఎందుకు ఎప్పుడు కలుస్తారో, ఎందుకు ఒకరి మీద ఒకరికి అభిమానం కలుగుతుందో నిర్వచించడం కష్టం”. అలాంటిదే వాలెంటైన్, యు.జి ల పరిచయం. ఎక్కడో బందరులో పుట్టి, గుడివాడలో పెరిగి, మద్రాసులో చదువుకొని, పెళ్లి చేసుకుని, విడిపోయి ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరుగుతున్న ఒక భారతీయుడు, ఒక స్విట్జర్లాండ్ వృద్ధ మహిళతో పరిచయం, ఈ అనుబంధం జీవితాంతం కొనసాగడం నిజంగా అద్భుతమే.
భౌతిక మార్పులకు గురైన శరీరం…
1963 వ సంవత్సరం నుండి నాలుగు యేండ్ల వరకు ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి జీవితంలో ప్రశాంతమైన సమయం. ఆయన వాలెంటైన్ తో కలిసి జెనీవా చుట్టుప్రక్కల దేశాలు తిరుగుతూ ఉండేవారు. ఆయన క్రమం తప్పకుండా టైం మ్యాగజైన్ చదువుతూ ఉండేవారు. అప్పుడప్పుడు గంటల తరబడి నడక కొనసాగిస్తుండేవారు. యు.జి స్విట్జర్లాండ్ లోని సానెన్‌లో 13 ఆగస్టు 1963 నాడు జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసానికి వాలెంటైన్ తో కలిసి వెళ్లారు. ఆ ఉపన్యాసంలోని కొన్ని మాటలు ఆయనను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. సానెన్‌లో చెట్టు క్రింద కూర్చున్నారు. శరీరం కొత్త మార్పులకు లోనైంది. భౌతిక మార్పులకు గురైన తన శరీరంలో తన కణాలన్నీ పూర్తిగా నశించి పునరుజ్జీవం పొందిన అనుభవం యు.జి కి కలిగింది. వారం రోజుల తరువాత తన శరీరం క్రమస్థితికి వచ్చినా కూడా తనకు ఒకరకంగా చనిపోయి మళ్లీ పునరుజ్జీవం కలిగిన అనుభూతికి లోనయ్యారు. 1967 లో తన 49 సంవత్సరాల తరువాత ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తినే ప్రపంచం అందరికి తెలిసిన యు.జి. అక్కడి నుండి ఆయన జీవనశైలి పూర్తిగా మారిపోయింది.
ప్రపంచం చుట్టేసిన యు.జి…
ప్రపంచ పర్యటన సందర్భంగా ఆయనను కలుసుకోవడానికి వచ్చిన అభిమానులు, వారితో సంభాషణలు, ఆయన వెలిబుచ్చిన భావాలు 1967 నుండి ఆయన చనిపోయే 2007 దాకా 40 సంవత్సరాల జీవితంలోని యు.జి నే మన అందరికీ తెలిసిన ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి, అందరూ అభిమానించిన యు.జి. ఈ దశకు ముందు 49 సంవత్సరాల పాటు ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి ఎవరు అంటే పైన ఇప్పటివరకు మనం చర్చించిన యు.జి. తన చివరి 40 సంవత్సరాలలో యు.జి, వాలెంటైన్ లు పర్యటించని దేశం లేదు, పర్యటించని ఖండం లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా యు.జి అభిమానులు ఉండేవారు. ఆ అభిమానుల ఇళ్ళలోనే ఆయన ఆతిథ్యం తీసుకుంటూ ఉండేవారు. 1986 వరకు వాలెంటైన్ కూడా వాళ్లతో పాటే తిరిగేది. వాళ్ల పర్యటన కోసం అయ్యే ధనాన్ని ప్రత్యేకంగా ఒక ఖాతాలో వేసి ఉంచింది. ఎవ్వరైనా, ఎప్పుడైనా యు.జి ని కలుసుకోవచ్చు. తనకు పరిమితులు ఉండేవి కాదు. తాను ఎప్పుడు పుస్తకాలు వ్రాయలేదు. అన్నీ తన అభిమానులు వ్రాసినవే.
వాలెంటైన్ మరణం…
1985 – 86 సంవత్సరాలలో వాలెంటైన్ వయస్సు 77 సంవత్సరాలు. ఆ సంవత్సరాలలో ఆమెకు మతిమరుపు వ్యాధి మొదలైంది. దానిని వైద్యులు ఆల్జీమర్స్ గా గుర్తించారు. 1986లో వాలెంటైన్ పరిస్థితి మరీ దిగజారి ఎక్కడికీ ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. స్విజర్లాండ్ లో ఉన్న అక్కాచెల్లెళ్లకు పరిస్థితి వివరించిన యు.జి, ఆమె బ్యాంకు ఖాతా వివరాలు, ఆమె డబ్బు అంతా వాళ్ళ అక్కయ్యకు చూపించి ఆమె బాగోగులు చూసుకోమని చెప్పారు. దానికి ఆమె సముఖంగా లేదు. దాంతో బెంగళూరుకు తీసుకువచ్చి తన అభిమాని చంద్రశేఖర్ ఇంట్లో ఉంచారు. అక్కడ వాలంటైన్ ఐదు సంవత్సరాలు ఉన్నారు. ఆమెను వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు. అలా 1991లో ఒక రోజు కుర్చీలో కూర్చున్న వాలెంటైన్ అలాగే చనిపోయారు. వాలెంటైన్ బెంగళూరులో చనిపోయినప్పుడు యు.జి కాలిఫోర్నియాలో ఉన్నారు. ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. వాలెంటైన్ విదేశీయురాలు కాబట్టి అక్కడి పోలీసులకీ, విదేశీ ఎంబసీకి తెలియజేశారు. ఆ మరుసటి రోజు బెంగళూరులో వాలెంటైన్ భౌతిక కాయాన్ని దహనం చేశారు.
నిష్క్రమణ…
విధి ఎంత విచిత్రమైనది అంటే “ఎక్కడో స్విట్జర్లాండ్ లో జన్మించిన వాలెంటైన్ బెంగళూరులో చనిపోతే, బందరులో పుట్టిన ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి 2007లో ఇటలీలో చనిపోయారు”. 2007లో యు.జి ఇటలీ వెళ్ళారు. ఆయనది విలక్షణమైన శైలి. ఎప్పుడూ మందులు వాడే వారు కాదు. శరీరం సహజంగానే తన పని తాను చేసుకుపోతుందని తన నమ్మకం. 2007 జనవరిలో తాను ఉంటున్న ఇంట్లోనే క్రింద పడటం వలన గాయమైంది. అప్పటినుండి యు.జి మంచానికి పరిమితం అయ్యారు. ఇతరులతో సేవలు చేయించుకోవడానికి, మందులు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు.
ఆయనను చూడడానికి మార్చి 2007లో బొంబాయి నుండి దర్శక, నిర్మాత మహేష్ బట్ వచ్చారు. 22 మార్చి 2007 నాడు యు.జి పడుతున్న బాధలు చూడలేక మహేష్ భట్ కాసేపు బయట తిరుగుదామని వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి యు.జి ప్రాణాలతో లేరు. ఆ మరునాడు కొంతమంది యు.జి అభిమానులతో కలిసి మహేష్ భట్ యు.జి శరీరానికి దహనం చేశారు. తనకు ఎలాంటి అంత్యక్రియలు జరుపొద్దని యు.జి చెప్పారు. వీలైతే తన మృతదేహాన్ని చెత్తకుప్పలో పారేసినా అభ్యంతరం లేదన్నారు. తాను మరణించాక తనను ఎవ్వరూ గుర్తు పెట్టుకోవద్దు అని చెప్పారు. అలా తన 89 సంవత్సరాల వయస్సులో ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి నిష్క్రమణ తో ఆయన జీవితం పరిసమాప్తమయ్యింది.
ప్రసంగంలోని అద్భుతమైన వ్యాఖ్యలు…
★ నీకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు, దాచుకోవడానికి ఏమీ లేదు. నా మాటలు మీరు వింటున్నారంటే మీకు ఏదో ఉపయోగపడుతుందనే కదా. అలాంటి బోధనలు, సమాధానాలు నా దగ్గర ఏమీ లేవు. నేను మాట్లాడే పొంతన లేని మాటలు తప్ప.
★ నేను మాట్లాడే పొంతన లేని మాటలలోనే మీకు ఏదో అనిపిస్తుంది, కనిపిస్తోంది అంటే అదంతా మీరు చెప్పుకునే అన్వయమే తప్ప నా మాటల గొప్పతనం కాదు.
★ అందుకే నేను చెబుతున్న మాటలకు భావాలకు ఎలాంటి కాపీ రైట్ హక్కులు లేవు. ఇకముందు కూడా లేవు. వాటిని మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోండి, మార్చుకోండి, పూర్తిగా మీవేనని చెప్పుకోండి. నాకేం అభ్యంతరం లేదు.
★ నా భావాల మీద ప్రపంచం మీద ప్రతి ఒక్కరికి హక్కులుంటాయి. ఇక మీ ఇష్టం. మీరు మీ కాళ్ళ మీద నిలబడి నడవగలరు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. దయచేసి మీ ఊత కర్రలన్నీ విసిరి పారేయండి.
★ మీరు నిజంగా వికలాంగులు
అయితే ఎవరో ఒకరి మీద ఆధారపడక తప్పదనుకోండి. మీరు వికలాంగులు అని చాలామంది మిమ్మల్ని నమ్మిస్తున్నారు. అన్నింటినీ విసిరేయండి.
★ మీకు కావలసింది మీలోనే ఉంది. మీ కాళ్ళ మీద మీరు నడవగలరు. నేను చెప్పేది అదే. నేను పడిపోతే అనుకుంటున్నారా? అది మీ భయం. ఎవరి సహాయం లేకుండా నడవండి, మీరు పడిపోరు.
★ నేను జ్ఞానోదయం పొందిన వాడిని అని చాలామంది అనుకుంటారు. అటువంటిదేమీ లేదు, నమ్మకండి. నేను జ్ఞానోదయం పొందడానికి ప్రయత్నించి, ప్రయత్నించి జ్ఞానోదయం ఎక్కడా లేదని తెలుసుకున్నాను. ఉన్నదల్లా నేను, మీరు మాత్రమే.
★ చాలామంది జ్ఞానోదయం అయ్యింది, జ్ఞానబోధ చేస్తాం అంటుంటారు. అదంతా అబద్ధం. అలా చెప్పే వారంతా ప్రజల అమాయకత్వం మీద బ్రతికే స్వార్ధపరులు.
★ మనిషి బయట ఏ రకమైన శక్తి లేదు. మనిషే భయం నుండి దేవుడిని సృష్టించాడు. అసలు సమస్య భయమే, తప్ప దేవుడు కాదు.
★ ఈ మత గురువులు, మానసిక శాస్త్రవేత్తలు చూపించిన అనేక పరిష్కారాలు నిజమైన పరిష్కారాలు కాదు. ఇది మనకు తెలిసిన అంగీకరించలేని బలహీనత. వాళ్ళ బోధనలకు లొంగిపోయే బలహీనత.
★ ఇంకా ప్రయత్నించండి, వినయంతో ఉండండి, ధ్యానం చేయండి, తలక్రిందులుగా తపస్సు చేయండి ఇలా ఏవేవో చెబుతూ ఉంటారు కదా. అంతకుమించి వారు ఏమీ చేయలేరు, ఏమి ఇవ్వలేరు.
★ మీ ఆశలు, భయాలు అమాయకత్వాలు ప్రక్కనపెట్టి వారిని వ్యాపారులుగా చూడగలిగితే వాళ్ళు ఇస్తానన్నది ఏమీ ఇవ్వలేరు అని మీకు తెలుస్తుంది. అయిననూ ఈ బోధకులు అమ్మే నకిలీ సరుకులను మనం కొంటూనే ఉంటాం.
★ ఒక వేదిక మీద కూర్చొని మాట్లాడడం నేను ఎప్పటికీ చేయలేను. చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. ఒక పీఠం మీద కూర్చొని, ఒక అర్థం కాని పదాలతో ఊహాజణితమైన అంశాలను మాట్లాడమంటే సమయం వృధా చేయడమే అని నా అభిప్రాయం.
★ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీరు సంతోషాన్ని వెతుకుతూ ఉన్నంతకాలం అసంతుష్టులుగానే, అసంతృప్తితోనే మిగిలిపోతారు.
★ మీకు సమస్యలు లేకపోతే ఇదీ ఒక జీవితమేనా అనుకుంటారు. ప్రపంచాన్ని ఎక్కువగా పీడిస్తున్న ఆధ్యాత్మిక మత కాలుష్యంతో పోలిస్తే వాతావరణ కాలుష్యం చాలా తక్కువ.
★ నా చుట్టూ తిరిగితే మీకు ఏదో దొరుకుతుందని మిమ్మల్ని మీరు తెలివితక్కువ వాళ్ళను చేసుకుంటున్నారు.
★ మీకు ఎలా చెప్పాలి? నిజంగా నా దగ్గర ఏదీ దొరకదు. అసలు నిజం ఏమిటంటే ఎవరి నుండి ఏమి పొరపాటున పొందాల్సిన అవసరం లేదు. ఉండాల్సినదంతా మీలోనే ఉంది. ఆ విషయం ఒక్కటే మీరు తెలుసుకోవాలి.