Telugu Politics

కూటమి ముందున్న అసలైన సవాళ్లు ఇవే..!

పదేళ్లు గడిచినా రాజధాని లేని రాష్ట్రం.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన దుస్థితి.. ఉపాధి చూపిస్తే తామే డబ్బులు సంపాదించుకుంటామని ఎదురుచూసే నిరుద్యోగులు.. పనుల కోసం తపిస్తున్న కార్మికులు.. ఇలా కోటి ఆశలతో ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ప్రభుత్వ పాలన అంటే కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తే సరిపోదని, తమ స్థానిక అవసరాలు తీర్చడంతోపాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి పెట్టాలని తీర్పు చెప్పిన ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెద్ద బాధ్యతనే పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంది.

ఏపీ ప్రజలకు రాజధాని విషయంలో స్పష్టత లేకుండానే పదేళ్లు గడిచిపోయాయి. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు తలపెట్టిన అమరావతి నిర్మాణంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రూ. 24 వేల కోట్ల రెవెన్యూలోటు, రూ. 55,817 కోట్ల ద్రవ్యలోటు ఉన్న పరిస్థితుల్లో రాజధానికి నిధులు సమకూర్చడం కూటమి ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ చెప్పవచ్చు. అయితే, కేంద్రంలో సీఎం చంద్రబాబుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్రానికి నిధుల కొరత ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అమరావతిలో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రెయినేజీ వ్యవస్థలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు వంటి వాటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. అమరావతికి ఒక రూపం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పాలనాపరమైన శాశ్వత భవనాలు, ఉద్యోగుల ఇళ్ల సముదాయాలు వెనువెంటనే పూర్తి చేయడం ద్వారా రాజధాని అభివృద్ధిలో వేగం పెంచవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన మరో ప్రధాన హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన. రాష్ట్రంలో గత పదేళ్లలో ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ కల్పన మినహా ఐటీ, టెలికాం, ఫార్మా, సెమీకండక్టర్ రంగాల్లో ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయిలో జరగలేదన్నది వాస్తవం. ఏపీలో డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన యువత ఉద్యోగాల కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకై ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఉపాధి కల్పనతోపాటు యువతలో నైపుణ్యాల పెంపుదల రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధిలో కీలకంగా నిలుస్తాయి. వృత్తి విద్యా కోర్సుల్లో బోధన శిక్షణ ఏకకాలంలో జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా ఎనలిటిక్స్ వంటి బూమింగ్ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానించి ‘ఇండస్ట్రియల్ నీడ్స్’పై యువతకు శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థి దశలోనే వారిలో నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, సామర్థ్యాలు పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెట్టాలంటే అన్ని రంగాల పై ప్రత్యేక దృష్టిసారించాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వాణిజ్యం, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించుకోగలగాలి. సకాలంలో పన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల కల్పన ద్వారా విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు. దానివల్ల పారిశ్రామికాభివృద్ధి ఊపందుకోవడమే కాకుండా, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి. విస్తారమైన తీర ప్రాంతం కలిగిన ఏపీ వంటి రాష్ట్రాల్లో అభివృద్ధి పరంగా ఉన్న అవకాశాల వినియోగానికి ప్రతి రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కీలకమన్నది 

నిపుణుల అభిప్రాయం.

ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. కీలకమైన ఎర్త్కమ్ రాక్ఫెల్ఫ్యామ్ నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే కొట్టుకుపోయిన డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సివుంది. ఆర్ఆర్ పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా పారిశ్రామిక వ్యవ సాయ రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించ డంతోపాటు ప్రభుత్వానికి – ప్రజలకు సంపద సృష్టి జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక రాష్ట్రంలో గతుకుల రోడ్ల వల్ల గత ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో రూ.2,749 కోట్లతో చేపట్టిన 122 రహదారుల విస్తరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు ప్రజలపై అనవసర పన్నులు మోపకుండా, ధరల పెరుగుదల లేకుండా ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై దృష్టిసారించాల్సి ఉంది.

రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో యూజర్ ఛార్జీల భారం, విద్యుత్ ఛార్జీల మోత, నీటి పన్నులు, చెత్తపన్నులు, నిర్మాణాల ఆధారంగా కాకుండా ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధిస్తున్న పన్నులు ప్రజలకు తలకుమించిన భారంగా మారాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

జగనన్న కాలనీలు పూర్తి చేయడం, మూలనపడ్డ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఏడాదికి మూడు సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 లాంటి సూపర్ సిక్స్ హామీల అమలుపై ఎదురుచూస్తున్నారు.

Show More
Back to top button