
BRS పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు BRS అధినేత కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నిర్ణయానికి ఒకరోజు ముందు, అంటే సోమవారం(సెప్టెంబర్ 02), కవిత మీడియా సమావేశం నిర్వహించి, BRS పార్టీలోని కీలక నాయకులైన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. తనపై వ్యక్తిగత దాడి జరిగినా పార్టీ నాయకులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్ పక్కన ఉన్న నాయకుల వల్లే ఆయనకు అవినీతి మరక అంటిందని, హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె అన్నారు. తాను స్వతంత్రంగా ఉంటానని, తన వెనుక బీజేపీ లేదా కాంగ్రెస్ లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో, కవిత తన తండ్రి కేసీఆర్ను పొగుడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణలో ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కవిత, తాను స్థాపించిన ‘తెలంగాణ జాగృతి’ కార్యకలాపాలను మాత్రమే నిర్వహిస్తున్నారు. నల్గొండ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై విమర్శలు చేసిన తర్వాత, ఇప్పుడు నేరుగా హరీష్ రావు, సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కవిత వ్యాఖ్యలు ఒక డ్రామాలో భాగమేనని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబం అంతా కలిసి ప్రజాధనాన్ని దోచుకుందని, ఇప్పుడు వేర్వేరుగా నటిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్ ప్రకారం, కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం బలమైన పునాది వేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆమె వ్యవహారం ఇతర పార్టీలకు ఒక అస్త్రంగా మారవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఆమె వెంట ముఖ్య నాయకులు ఎవరూ లేకపోవడం ఆమెకు ఒక సవాలు అని ఆయన అన్నారు.
సొంత గూటిపైనే సమరం: కవితమ్మ కొత్త పార్టీ.. రాష్ట్రాభివృద్ధి కోసమా? రాజ్యాధికారం కోసమా?
BRSలో కవిత – కేటీఆర్ మధ్య విభేదాలు.? మరో షాక్ ఇచ్చిన అన్న.!










