నాటి పాత రాతి యుగం నుంచి నేటి డిజిటల్-ఏఐ యుగం వరకు మానవాళి జీవనశైలిలో ఎనలేని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాలంతో భూమి కుగ్రామం అయిపోయింది. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ వైకుంఠం వెలిసింది. దేశాల సరిహద్దులు వెలవెలబోతున్నాయి. వేల కిమీ దూరాలు క్షణాల్లో ఆడియోవీడియో కాల్స్ ద్వారా దగ్గరవుతున్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, సమాచార వితరణ లాంటి అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకనాడు ఊహకందని ఇలాంటి అద్భుత నవ్య జీవన విధానాలు వైజ్ఞానిక సాంకేతిక శాస్త్రాల వల్లనే సుసాధ్యం అవుతున్నది. నేటి ఆవిష్కరణ రేపు పాతబడి పోతున్నది. సైన్స్ లేదా వైజ్ఞానిక శాస్త్రం పరిష్కరించని సమస్యలు ఉండడం లేదు. వైజ్ఞానిక శాస్త్ర మాద్యమంగా సాంకేతిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతున్నది. మానవాళి అన్ని సమస్యలకు సరైన పరిష్కారాలు దొరుకుతున్నాయి.
సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ వైజ్ఞానికశాస్త్ర దశాబ్దం 2024-33:
ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజ సుస్థిరాభివృద్ధి, శాంతియుత సహజీవనానికి వైజ్ఞానిక శాస్త్రం విప్లవాత్మక భూమికను నిర్వహిస్తున్నది. ఇలాంటి విషయాలన్నింటినీ గమనిస్తున్న యునెస్కో 2002 నుంచి ప్రతి ఏట 10 నవంబర్ రోజున “శాంతి, అభివృద్ధికి ప్రపంచ వైజ్ఞానిక దినం (వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్)”ను పాటిస్తున్నది. “సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ వైద్ఞానికశాస్త్ర దశాబ్దం 2024-33 (ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ సైన్స్ ఫర్ సస్టేనబుల్ డెవలప్‌మెంట్ 2024-33)” సమన్వయంతో శాంతి, అభివృద్ధికి ప్రపంచ వైజ్ఞానిక దినం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా యువత, వైజ్ఞానికేతర సమూహాలను ఏకం చేస్తూ డిజిటల్ ప్రపంచపు సైన్స్ పాత్రను వివరించుట జరుగుతుంది.
వైజ్ఞానిక శాస్త్ర ఫలాలతో ఉజ్వల భవిత:
శాంతి, అభివృద్ధికి ప్రపంచ వైజ్ఞానిక దినం-2024 థీమ్‌గా “వైజ్ఞానిక శాస్త్రం ఎందుకు ముఖ్యం – మనసు నిమగ్నంతో శక్తివంతమైన భవిష్యత్తు (వై సైన్స్ మ్యాటర్స్ – ఎంగేజింగ్ మైండ్స్ అండ్ ఎంపవరింగ్ ఫ్యూచర్)” అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం కొనసాగుతున్నది. సుస్థిర సమాజ స్థాపనలో సైన్స్‌తో పాటు సైంటిస్టుల భూమికను కూడా సామాన్య జనాలకు అవగాహన కల్పించడం, సైన్స్ అందిస్తున్న అద్భుత ఫలితాలతో మానవజాతి శాంతియుతంగా, సమగ్రాభివృద్ధి దిశగా దినదినం వడివడిగా అడుగులు వేస్తున్నది. మన జీవితాల్లో ఆర్థిక, సామాజిక, పర్యావరణ మార్పులకు పునాదిగా సైన్స్ ఆవిష్కరణలు నిలుస్తున్నాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రధాన భూమికను వైజ్ఞానిక శాస్త్రమే నిర్వహిస్తూ, మన ఉజ్వల శాంతియుత భవితకు ఊతం ఇస్తున్నది.
సమాజోన్నతి, శాంతి స్థాపనలో వైజ్ఞానికశాస్త్రం:
శాంతి, అభివృద్ధికి ప్రపంచ సైన్స్ దినం వేదికగా ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించడం, ప్రపంచ మానవాళిని ఏకం చేయడం, ప్రపంచ శాంతికి ఆజ్యం పోయడం, సమాజోన్నతికి సైన్స్‌ను వినియోగించడం, శాస్త్ర పరిశోధనలను కొనసాగించాల్సిన అవసరాన్ని చర్చించడం, సైన్స్ అందిస్తున్న ఫలాలతో మన దైనందిన జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. వైజ్ఞానికశాస్త్ర కత్తికి రెండు వైపుల పదును ఉంటుందని గమనిస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ దుర్వినియోగాల నష్టాలను క్షుణ్ణంగా వివరించడం కూడా జరగాలి. స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సైన్స్ ఆవిష్కరణలతో వచ్చిన టెక్నాలజీలను వ్యక్తులు, సంస్థలు, విద్యాలయాలు వివరించడం నిరంతరం కొనసాగాలి.
తమలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునే సందర్భంగా ఈ వేదికలను వినియోగించుకోవడం, సైన్స్ అండ్ టెక్నాలజీలను మానవాభివృద్ధికి, సమాళ్లను అధిగమించే దిశగా సమర్థవంతంగా వాడుకోవడం, సైంటిస్టులను గౌరవించడం, సైన్స్ అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేయడం మన కనీస బాధ్యతగా తీసుకోవాలి.