Telugu Special Stories

సృజనతోనే చదువులకు వెలుగు

 (నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం)

ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైన ఆయుధమే విద్య  –నెల్సన్ మండేలా 

ప్రపంచానికి అక్షరాస్యత ప్రాధాన్యతను వివరించడానికి యునెస్కో నిర్దేశించినదే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. 1966, నవంబర్ 17న యునెస్కో సభ్య దేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం 1967 నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మానవ హక్కుల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడం,  అక్షరాస్యత అభివృద్ధి, స్థిరమైన సమాజం వైపు అక్షరాస్యత ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం ప్రధాన ఎజెండాగా దీనిని రూపొందించారు. వాటితో పాటు అక్షరాస్యతను వ్యక్తులు, సంఘాలకు అందించడం కూడా లక్ష్యమే. ఇది కేవలం పిల్లల విద్య పైనే కాకుండా వయోజన విద్యపై కూడా తన దృష్టి కేంద్రీకరిస్తుంది. 

యునెస్కో పాత్ర

అందరికీ నాణ్యమైన, సమానమైన, సమ్మిళిత విద్యను అందించడానికి, అక్షరాస్యత, అభ్యాసాల ప్రాథమిక ప్రాముఖ్యతను పునరాలోచించడానికి యునెస్కో 1990 సంవత్సరాన్ని “అక్షరాస్యత సంవత్సరం”గా, 2003-2012 దశాబ్దాన్ని ‘అక్షరాస్యత దశాబ్దం’గా ప్రకటించింది. ‘లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఆఫ్ ఆల్, లర్నింగ్ ఫర్ ఆల్’ అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది. అక్షరాస్యత అనేది ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం ఐక్యరాజ్యసమితి తన 2030 ఎజెండాలో కీలకమైన అంశంగా పరిగణించింది.

 అక్షరాస్యులు అంటే

 7 సం. ల వయసు పైబడిన వారికి ఏదో ఒక భాషలో చదవడం,  రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు.  ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ మాటల్లో చెప్పాలంటే ‘అక్షరాస్యత అనేది కష్టాల నుంచి ఆశలకు వారధి.’ నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ అభిప్రాయం ప్రకారం “ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక బాలుడు/బాలిక, ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రపంచాన్ని మార్చగలరు.” అక్షర జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తికి సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది అని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రపంచ దేశాల అక్షరాస్యత రేటును  గమనిస్తే 100% అక్షరాస్యత సాధించిన ఫిన్లాండ్, గ్రీన్ ల్యాండ్, లగ్జంబర్గ్, నార్వే, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, నార్త్ కొరియా దేశాలు అభివృద్ధి చెందిన, మెరుగైన జీవన ప్రమాణం కలిగిన దేశాలుగా వర్ధిల్లుతున్నాయి‌.

అతి తక్కువ అక్షరాస్యత దేశాలైన చాద్, మాలి, బోట్స్వానా, అఫ్ఘనిస్తాన్, నైగర్, సోమాలియా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న, తక్కువ జీవన ప్రమాణం కలిగిన దేశాలుగా కొనసాగుతున్నాయి. నేటికీ ప్రపంచంలోని చాలా దేశాలు అన్ని రకాలుగా వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణాలు నిరక్షరాస్యత, అధిక స్థాయి పేదరికాలే అని మనం గ్రహించాలి. మన భారతదేశ అక్షరాస్యత రేటును పరిశీలిస్తే 1951లో 18.3%, 2001లో 64.8%, 2011 సంవత్సరంలో 74% గా నమోదయ్యాయి. అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రాల్లో కేరళ(93.9%) మొదటి స్థానంలో ఉండగా, లక్షదీప్, మిజోరం, త్రిపుర, గోవా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రతి దశాబ్దానికి 10 శాతం అక్షరాస్యత పెంచుతూ 2040 నాటికి 100% అక్షరాస్యతను సాధించేలా అంచనాలు రూపొందించింది మన దేశం. 

మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యా కేటాయింపులు

 2024-25 రాష్ట్ర బడ్జెట్ ను పరిశీలిస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో విద్యకు కేటాయింపులు చాలా తక్కువనే  చెప్పవచ్చు. అక్షరాస్యత పెంపు మందగమనంలో కొనసాగడానికి నిధుల కొరత కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2.91 లక్షల కోట్లు కాగా దీనిలో విద్యకు రూ. 21,292 కోట్లు మాత్రమే కేటాయించారు. మహారాష్ట్రలో రూ. 80,437 కోట్లు, ఉత్తరప్రదేశ్  లో రూ. 75,165 కోట్లు, రాజస్థాన్ లో రూ. 49,627 కోట్లు, తమిళనాడులో రూ. 43,799 కోట్లు, పశ్చిమబంగలో రూ. 43,466 కోట్లు కేటాయించడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్.ఎస్.ఓ) విడుదల చేసిన 2023 సంవత్సర లెక్కల ప్రకారం పై రాష్ట్రాలు వరుసగా 84.8%, 73%, 69.7%, 82.9%, 80.5% అక్షరాస్యత రేట్లు సాధించాయి. తెలంగాణ రాష్ట్ర  ప్రస్తుత అక్షరాస్యత రేటు మాత్రం 72.8%.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా రూ.1,100 కోట్లతో రాష్ట్రంలోని 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సౌకర్యాలు, నూతనంగా రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు, ఇటీవల పదోన్నతులు పొందిన  టీచర్లతో రాష్ట్ర రాజధాని నగరంలో ప్రత్యేక సమావేశ ఏర్పాటు, రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో నైతిక విలువల బోధనకు కేరళ తరహా వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు, జిల్లా కలెక్టర్లకు తరచు విద్యాసంస్థలు తనిఖీలు చేసేలా ఆదేశాలు, రూ. 5 వేల కోట్లతో 30 కాంప్లెక్స్ ల్లో 120 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యంగ్ ఇండియా పేరుతో) భవనాల నిర్మాణం చేపట్టడం, ప్రతి లోక్ సభ సెగ్మెంట్ లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కృషి, 57 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటి ఏర్పాటు తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఈ ప్రజా ప్రభుత్వం.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత సాధించిన జిల్లాగా హైదరాబాద్ (83.24%) ఉండగా జోగులాంబ గద్వాల జిల్లా 49.87% తో అతి తక్కువ అక్షరాస్యత సాధించిన జిల్లాగా నిలిచింది. రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత 57.30% కాగా పట్టణ అక్షరాస్యత 81.09%.   దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో విద్యకు 6 శాతం నిధులు కేటాయించాలని జాతీయ విద్యా విధానం – 2020 స్పష్టం చేసినప్పటికినీ.2.9% కేటాయించడం చాలా విచారకరం.భూటాన్, స్వీడన్ దేశాలు తమ జీడీపీలో విద్యకు 7.5% నిధులు 

కేటాయించడంతో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ఇంకా చాలా సాధించాలి

భారతదేశం సామాజిక, ఆర్థిక పురోగతికి అక్షరాస్యత కీలకంగా మారింది. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే 80% అక్షరాస్యత ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు రాబట్టాలి. నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. అందరికీ విద్య చేరువ కావాలంటే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలి. బాలికా విద్యను ప్రోత్సహించాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సృజన శక్తికి పెద్దపీట వేయాలి. సాంకేతికత అందిపుచ్చుకుని ఉపాధ్యాయులకు శిక్షణ అందించాలి. ఉపాధి ఆధారిత ఉన్నత విద్యా కోర్సులను తీసుకురావాలి. అప్పుడే దేశం విజ్ఞాన భాండాగారంగా

వెలుగొందే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో ఇంకా సవాళ్లు ఉన్నాయని వాటి పరిష్కారానికి మనం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది ఈ అక్షరాస్యత దినోత్సవం.  ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో అధిక  నిధులు కేటాయించేలా మంచి నిర్ణయం తీసుకుంటాయని కోరుకుందాం.

Show More
Back to top button