
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు పైనుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా స్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు “రాజా.. ఈ ప్రపంచంలో నేరానికి శిక్ష ఉండదు. అందుకు నిదర్శనంగా నీకొక పగటి దొంగ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను “అంటూ ఇలా చెప్పసాగాడు. ఇలా ఎన్ని బేతాళ కథలు చదివినా కూడా ప్రారంభం ఈ విధంగానే ఉంటుంది. విక్రమార్కుడు బేతాళుని భుజాన వేసుకుని నడుస్తూ ఉండగా కథ ప్రారంభమవుతుంది. విక్రమార్కుడు ఎవరు? బేతాళుడిని భుజాన ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? ఎవరీ బేతాళుడు? అతని కథల వెనుక రహస్యం ఏమిటి? బేతాళుడిని తీసుకొని విక్రమార్కుడు ఎక్కడికి వెళ్లాలనుకుంటాడు? విక్రమార్కుడికి, బేతాళుడి సంబంధం ఏమిటి? అసలు విక్రమార్క – బేతాళ కథలకు ప్రారంభం ఏంటి? మరుగునపడ్డ ఆ మూల కథ ఏంటి?
బేతాళ కథలకు మూలం…
బేతాళ పంచవింశతి కథల మూలాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ. పూ. ఒకటవ శతాబ్దానికి చెందిన ఈ కథలు తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో ఒక భాగంగా చోటుచేసుకొన్నాయి. గుణాఢ్యుడు సంస్కృతములో రచించిన “బృహత్ కథ” బేతాళ కథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత “కథాసరిత్సాగరం” సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడు. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కానీ బేతాళ కథలలోని చివరి కథ ప్రస్తుతం అందుబాటులో లేదు. బేతాళ పంచవింశతి కథలు మొట్టమొదట పైశాచి భాష (ప్రాకృత భాషా భేదం) లో వ్రాయబడ్డాయి. ఈ కథలు తరువాతి కాలంలో సంస్కృత భాషలోనికి అనువదించబడ్డాయి. అయితే పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో చివరికి సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి.
“పైశాచి” భాషలో వున్న బృహత్కథను బుద్ధస్వామి, క్షేమేంద్రుడు, సోమదేవసూరిలు సంస్కృతంలో పద్యరూపంలోకి అనువదించారు. అయితే బుద్ధస్వామి (క్రీ.శ. 5 వ శతాబ్దం) “బృహత్కథా శ్లోక సంగ్రహం” లో ఈ బేతాళ కథలు లేవు. క్షేమేంద్రుడు (క్రీ.శ. 11 వ శతాబ్దం) “బృహత్కథామంజరి”, సోమదేవసూరి (క్రీ.శ. 11 వ శతాబ్దం) “కథాసరిత్సాగరం” లలోనే ఈ బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి. అవి కాలక్రమేణా బేతాళ పంచవింశతి పేరుమీదుగా కథాగ్రంధ రూపంలో వెలువడినప్పటికీ, బేతాళ పంచవింశతి సంస్కృత మూల గ్రంథం మాత్రం లభించలేదు. అప్పటివరకూ పద్య రూపంలోనే వున్న బేతాళ పంచవింశతి కథలను తొలిసారిగా శివదాసు (క్రీ.శ. 11 – 14 వ శతాబ్దం) చంపూ మార్గంలో (పద్య గద్య మయం) సంస్కృతంలో వ్రాసాడు. ఆ తరువాత జంభలదత్తు (క్రీ.శ. 11 – 14 వ శతాబ్దం) ఈ కథలను గద్యరూపంలో వ్రాసాడు.
చందమామ సంచికలో…
బేతాళ కథలు అనేవి చాలా కాలం “చందమామ” పత్రికలో కథా స్రవంతిగా వచ్చాయి. బేతాళ కథలు అనేవి చిత్రమైన కథల సంపుటి. చందమామలో ప్రతీ మాసం “విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని” అనే ఒక సంఘటనతో మొదలవుతుంది. అలాగే, “విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు” అనే మరొక సంఘటనతో అంతమయ్యేది. ప్రతీ ఒక్క కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి “శ్రమ తెలియకుండా విను” అని ఓ చక్కటి కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్నలు వేసేవాడు.
అలా ప్రశ్నలు వేసి, “ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది” అని విక్రమార్కుడికి ఒక హెచ్చరిక జారీ చేసేవాడు. నిజానికి విక్రమార్కుడు వచ్చిన పని వేరు. మౌనం వీడితే వ్రత భంగం అయిపోయి వచ్చినపని చెడుతుంది. కానీ బేతాళుడు వేసిన ప్రశ్నలకు సమాధానం తెలిసీ చెప్పకపోతే విక్రమార్కుడి ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో తన మౌనం వీడి బేతాళుడు వేసిన ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతీ నెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడి మౌనాన్ని భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా మరుసటి నెలకి కథ మొదటికే వచ్చేది.
మొదట్లో బేతాళ కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల అసక్తిని గమనించి తరువాత చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 1972 లో మొదటి బేతాళకథను రంగులలో పునర్ముద్రించారు. చందమామ సంచికలో మొట్టమొదట చెప్పబడిన కథకు పేరు పెట్టలేదు. ఆ తరువాత కథలన్నిటికీ కథ మొదటి పుటలో పైన కథ పేరు, కింద “బేతాళ కథలు” అని వేయసాగారు. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మను పలు సార్లు మార్చారు. అలాగే కథ చివరి పుటలో బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు తన కత్తి దూసి వెంట పడుతుండటం కూడా పలు రకాలుగా వెయ్యబడ్డాయి.
విక్రమార్కుడి నేపథ్యం…
బేతాళ కథలను రచించినది గుణాడ్యుడు. గుణాడ్యుడి సంకలనం ప్రకారం ఈ కథ మొత్తం ఉజ్జయినీ రాజ్యంలో జరిగినట్టు తెలుస్తోంది. ఉజ్జయినీ సామ్రాజ్యాన్ని విక్రమార్కుడు పరిపాలించేవారు. తన పరిపాలనలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. విక్రమార్కుడు తన పరిపాలన దక్షతతో కాళీమాతను ప్రసన్నం చేసుకుంటాడు. విక్రమార్కుడి వంటి పరిపాలన దక్షత ఉన్న భూపాలుడు ధరిత్రిని చిరకాలం పరిపాలించాలని, వెయ్యి సంవత్సరాల పాటు పరిపాలించే వరాన్ని కాళీమాత అనుగ్రహిస్తుంది. విక్రమార్కుడి మంత్రి పేరు భట్టి. అతడు విక్రమార్కుడికి సోదరుడు. భట్టి తన తెలివితేటలతో రాజు విక్రమార్కుడి ఆయుష్షును రెండు వేల సంవత్సరాలకు పెంచుతాడు. భట్టి యుక్తితో విక్రమార్కుడు ఆరు నెలల రాజ్యపాలన, ఆరు నెలల దేశ సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు.
సన్యాసి వృత్తాంతం…
ఉజ్జయినీ రాజ్యానికి కొంత దూరంలో ఒక సన్యాసి ఘోర తపస్సు చేస్తుంటాడు. తన కఠోర దీక్షతో అతడు దివ్యానుగ్రహం సంపాదిస్తాడు. భూలోకంలో ఉన్న రాజులందరూ తనకు సామంతులవ్వాలనేది ఆ సన్యాసి కోరిక. తనకు చావు లేకుండా తలచిందల్లా జరిగేటట్టు చూడమని కాళీమాతను కోరుతాడు. తన దురాశను మన్నిస్తూ భూత ప్రేతాదులకు అధిపతి అయిన బేతాళుని వశం చేసుకుంటే సన్యాసి కోరిక తీరుతుందని కాళీమాత చెబుతుంది. ఆ బేతాళుని వశం చేసుకోవడానికి వంద మంది రాజకుమారులను యజ్ఞంలో బలిచ్చి తనకు సంతుష్ఠి కలిగించమంటుంది. వారిలో వందో వాడు బహు పరాక్రమవంతుడై ఉండాలని కాళిక చెబుతుంది. ఆ సన్యాసి హోమం ప్రారంభించి మాయమాటలతో రాజకుమారులను భద్రకాళి ఆలయానికి తీసుకొచ్చి బలిస్తూ ఉంటాడు. అలా తొంభై తొమ్మిది మంది బలిచ్చేస్తాడు. ఆ వందవ అన్వేషనలో ఉన్న సన్యాసికి విక్రమార్కుడి గురించి తెలుస్తుంది.
విక్రమార్కుని గురించి తెలుసుకున్న మాంత్రికుడు తన మకాం ఉజ్జయినీకి మారుస్తాడు. దేశ సౌభాగ్యం కోసం తాను యాగం చేస్తున్నానని, దానికి ఒక వేరుని సహాయం అవసరం అని, అందువలన అది నీనుంచే ఆశిస్తున్నామని విక్రమార్కుని కోరుతారు. దాంతో విక్రమార్కుడు ఆ సన్యాసికి అభయం ఇస్తాడు. తన యాగం పూర్తి కావాలంటే భూతప్రేతాలకు నిలయమైన మఱ్ఱిచెట్టుపై శవాకారంలో ఉన్న బేతాళుడిని హోమం వద్దకు తీసుకురావాలని సన్యాసి కోరతాడు. విక్రమార్కుడు దీనికి సమ్మతిస్తాడు. బేతాళుడిని తీసుకెళ్లడానికి వచ్చిన విక్రమార్కుడిని చూసి మర్రిచెట్టు చుట్టూ ఉన్న భూతప్రేతాలన్నీ యుద్ధం మొదలుపెడతాయి. వాటి నుంచి ఎంతో పోరాటం ఎదురైనా పట్టు వదలకుండా చెట్టుపై ఉన్న బేతాళుడిని భుజాలపై వేసుకుంటాడు విక్రమార్కుడు.
బేతాళుడి నేపథ్యం…
కైలాసంలో పార్వతీదేవి తనకు కథలు చెప్పమని మహా శివుడిని ఒక కోరిక కోరుతుంది. ఆ కథలు ఇంతవరకు ఎవ్వరికీ తెలియనివి, ఎవ్వరూ ఎవ్వరికీ చెప్పుకోనివి, చెప్పనివి అయ్యి ఉండాలని నాథుడిని పార్వతీదేవి కోరుతుంది. సఖి కోరిందని కొన్ని అద్భుతమైన కథలను చెబుతాడు శివుడు. శాపం కారణంగా శవం రూపంలో చెట్టుపై ఉండిపోయిన బేతాళుడు పూర్వజన్మలో సంపన్నులైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటున్న ఈ సంవాదాన్ని ఆ బ్రాహ్మణుడు చాటుగా వింటాడు. ఎంతో ఉత్కంఠతను కలిగించే అద్భుతమైన కథలను విన్న ఆ బ్రాహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి లోనై, ఆ కథలను తన మనసులో దాచుకోలేక తన భార్యకు చెప్పేస్తాడు. ఆమెకు చెప్పడమే కాదు ఎవ్వరికీ చెప్పవద్దు అనే షరత్తు కూడా పెడతాడు.
సాధారణంగానే ఆడవాళ్లు మనసులో మాటలను దాచుకోలేరు. అదేవిధంగా బ్రాహ్మణుడి భార్య కూడా ఆ కథలను తన తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది. అలా ఒకరినుండి మరొకరికి, వారి నుంచి అనేక మందికి చేరి, ఈ కథలకు అత్యంత ప్రాచుర్యం వస్తుంది. ఆ నోట ఈ నోట పడి ఆ కథలు చివరికి పార్వతీదేవి చెవిన పడతాయి. దాంతో పరమ శివుడిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. భూలోకంలో బహుళ ప్రాచుర్యం పొందిన ఆ కథలను తనకు చెప్పి అవమానపరిచాడని శివుడిని నిందిస్తుంది. పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలన చేసిన శివుడు బ్రాహ్మణ వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. తమ ఏకాంత సంవాదన విన్నాడనే కోపంతో, బ్రాహ్మణుడు విన్న కథలు ఎవరైనా ఒక మేధావికి చెప్పి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే వరకు అతడిని బేతాళుడిగానే ఉండిపొమ్మని శపిస్తాడు. ఆవిధంగా బ్రాహ్మణుడు బేతాళుడిగా మారి విక్రమార్కుడి కోసం ఎదురు చూస్తుంటాడు.
విక్రమార్కుడు గుహలోని మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లడానికి బేతాళుడిని తన భుజం మీద వేసుకోగానే “రాజా నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను, ఆలకించిన నా సందేహాన్ని నివారించు. నీకు తెలియకపోతే సమాధానం ఇవ్వనక్కర్లేదు. కానీ తెలిసి కూడా సమాధానం ఇవ్వకపోతే, నీ తల పగిలి నూరు ముక్కలవుతుందని” హెచ్చరికతో కథలు మొదలుపెడతారు. ఇక్కడ ఇంకో షరత్తు కూడా ఉంది. మాంత్రికుడు కోరిక మేరకు బేతాళుడిని భుజం మీద వేసుకున్నాక విక్రమార్కుడు మౌనంగా ఉంటేనే ఆ శవాన్ని గుహ వద్దకు చేర్చగలడు. అయితే బేతాళుడు అడిగే ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానం చెప్పగలడు. దాంతో నోరు తెరవక తప్పదు. దీనిని అవకాశంగా తీసుకొని బేతాళుడు తనకు శాపంగా ఉన్న కథలన్నింటిని విక్రమార్కుడికి చెప్పేస్తాడు. ఎందుకంటే మాంత్రికుడి నిజస్వరూపం బేతాళుడికి మాత్రమే తెలుసు.
శీర్షికగా బేతాళ కథలు…
నిజానికి బేతాళ కథలు 25 మాత్రమే. కానీ వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా మార్చి చందమామ శీర్షికలో ప్రచురించారు. సాధారణమైన కథల నుండి, కథ చివర ప్రతి నెలా ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం చేసేవారు. తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంథాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు (పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం, తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా చందమామ వారు అందచేశారు. బేతాళ కథలు ధారావాహికగా మొదలైనా, చివరకు ఒక కథాశీర్షికగా స్థిరపడినాయి. ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు (చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన వారు) కృషి ఉంది. అలాగే “బొమ్మరిల్లు” వంటి కొన్ని పిల్లల పత్రికలు ఇదే పద్ధతిలో కథలను (కరాళ కథలు) సృష్టించటానికి పయత్నించాయి. కానీ అవి అంతగా విజయం సాధించలేక పోయాయి.
ముగింపు కథ…
విక్రమార్కుడిని బలి ఇచ్చే కుటిల పన్నాగంతో సన్యాసి సిద్ధంగా ఉన్నాడని, సన్యాసి కుట్రను భేతాళుడు విక్రమార్కుడికి తెలియపరచి, దానికి తరుణోపాయం కూడా చెప్పి అదృశ్యమవుతాడు. కపట బిక్షువు (సన్యాసి) సాక్షాత్తు క్షుద్రుడే అని గ్రహించిన రాజు విక్రమార్కుడు శవాన్ని తీసుకొని భిక్షువు (సన్యాసి) వద్దకు వస్తాడు. అతని రాక కోసమే ఎదురుచూస్తున్న బిక్షువు భేతాళుని శవంలో ఆవాహన చేసి, ఆ శవానికి పూజలు పూర్తి చేసి విక్రమార్కుడిని సాష్టాంగ నమస్కారం చేయమని కోరతాడు. దానికి బదులుగా రాజు విక్రమార్కుడు ప్రణామం చేసే విధం తనకు తెలీదని, అది ఎలానో నీవే చేసి చూపమని కోరతాడు. నమస్కారం ఎలా చేయాలో చూపడానికి ఆ బిక్షువు నేలమీద సాక్షాంగ పడగానే విక్రమార్కుడు కత్తి దూసి ఆ కపట తాంత్రికుని శిరస్సును ఖండిస్తాడు.
ఈ విధంగా రాబోయే ముప్పు నుండి విక్రమార్కుడు తప్పించుకోవడమే కాకుండా ఆ సన్యాసి బలితోనే భేతాళుని అర్చిస్తాడు. ప్రసన్నుడైన ఆ భేతాళుడు విక్రమార్కుడు భవిష్యత్తులో భూమండలానికే గాక విద్యాదర లోకాలకు చక్రవర్తి కాగలడని దీవించడమే కాకుండా, విక్రమార్కుని అభీష్టం మేరకు ఈ మొత్తం 25 కథలు “భేతాళ పంచవింశతి” పేరుతో విశ్వ విఖ్యాతమవుతాయని, ఈ భేతాళ పంచవింశతి ప్రసంగ, శ్రవణాలు జరిగేచోట “యక్ష”, “భేతాళ”, “పిశాచ”, “రాక్షసులు” ప్రవేశించలేరని వరమిచ్చి అదృశ్యమవుతాడు. ఆ తరువాత శివుడు ప్రత్యక్షమై అపరాజితమనే దివ్య ఖడ్గాన్ని రాజు విక్రమార్కుడికి ప్రసాదించి త్వరలో విద్యాధరులకు అధిరాజువు కాగలవని ఆశీర్వదిస్తాడు.