
ధీరులకు, ధీరవనితలకు, వీరులకు, పౌరుష పరాక్రమానికి భారతదేశం పెట్టింది పేరు. ఎంతటి కష్టం వచ్చినా తట్టుకొని బానిస సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛ, స్వాతంత్రాలను ధర్మంగా గెలుచుకున్న దేశం మనది. ఎంతో మంది వీర వనితలు పరాక్రమం, వాళ్ళ త్యాగం మరిచిపోలేనిది. చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వీర వనితలు ఎందరో. సీతాదేవి, ద్రౌపతి దేవి, కుంతీ మాత, మండోదరి, చంద్రమతి, సతీ సావిత్రి, అరుంధతి, మురాదేవి ఇలా ఎందరో ధీర వనితల త్యాగం వెలకట్టలేనిది. దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ఎప్పటికప్పుడు భరతమాత వీర వనితలు పుట్టిస్తూనే ఉంటుంది.
జీవన పర్యంతం వారు అనేక బాధలు పడినా.. వారి యొక్క జీవితం మొత్తం భారత దేశానికే కాకుండా, ప్రపంచం అంతా ఆదర్శంగా తీసుకునేలా వాళ్ళ కీర్తి ప్రతిభింబిస్తుంది. గొప్ప వీరనారులు జాన్సీరాణి లక్ష్మి బాబు, రాణి రుద్రమదేవి, గిరిజన వీరనారి సమ్మక్క – సారలమ్మల త్యాగం అజరామరం. ఇలాంటి గొప్ప వీరులను కన్న భారతమాత మరో గొప్ప స్త్రీ మూర్తిని సృష్టించి బానిస సంకెళ్ళ నుంచి సమాజాన్ని విముక్తి చేపించింది.
గిరిజన మహిళలను, నిమ్న కులాల మహిళలకు దారుణమైన శిక్షలు వేస్తూ వెట్టిచాకిరీ చేస్తూ, నిత్యం మానభంగాలకు గురిచేస్తూ పాలించే దుర్మార్గపు పాలకులను అంతం చేయడానికి పుట్టిన వీర నారే ‘నంగేళి’. క్షణ క్షణం అనుక్షణం చస్తూ బతుకుతు, నిత్యం మానభంగాలు చేసే నీచుల నడుమ మహిళలు విసుగుపోయి.. చావలేక బ్రతుకలేక చిత్రవధ అనుభవిస్తున్న సమాజాన్ని ఉద్ధరించిన ధీర వనిత నంగేళి. ఈమె త్యాగం, తీసుకున్న నిర్ణయం ఇప్పటికి గుండెల్లో నిప్పు రగిలేలా చేస్తుంది. ఈమె నిమ్న వర్ణాలను దుర్మార్గపు పాలకుల నుండి కాపాడిన తీరు ఎప్పటికి అజరామరం.
మన దేశంలో అనేక రకాల యుద్దాలు, ఉద్యమాలు రాజ్యాలను జయించడానికి, లేదా ధనాన్ని దోచుకోవడానికి జరిగేవి. కానీ ఈ ఉద్యమం దుర్మార్గులు, పీడితుల నుండి తమను తాము రక్షించుకోవడానికి పుట్టింది.కేరళలో జరిగిన ఉద్యమం రాష్ట్రం మాత్రమే కాదు.. దేశమే ఉలిక్కిపడేలా చేసింది. రాజులు పాలించే కాలంలో పేద ప్రజలు ఎన్నో సమస్యలను దారుణాలను ఎదుర్కొనేవారు. ముఖ్యంగా రాజులు విధించే పన్నులు కట్టలేక కూలీలుగా, బానిసలుగా జీవనం సాగించేవారు. ఇలా దారుణమైన శిక్షలు అనుభవిస్తూ వెట్టిచాకిరీ చేసేవారు. దీనికి గల కారణం ఒక్కటే. పేద ధనికుల మధ్య ఉండే తేడానే. పేదలు, నిమ్న కులాలు, గిరిజనులు సంపన్నులు కావడం అగ్రవర్ణాలకు ఇష్టం ఉండేది కాదు.
పేదవాళ్ళు అలాగే ఉండాలని.. వారు ధనికులుగా ఎదిగితే తమ మాట విన్నారని, తమకు బానిసలుగా ఉండరని భావించి పేదల రక్తాన్ని దోపిడీ చేసేవారు. కేరళలో కూడా ఒకప్పుడు ఇవే పరిస్థితులు ఉండేవి. అప్పట్లో అక్కడి సమాజంలో దారుణమైన కులగజ్జి అందరి జీవితాల్ని చిదిమేసింది. నిమ్న కులాలను అణగదొక్కడానికే రాజులు పనిచేసేవారు. పేదలకు వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని కూడా వారికి అందకుండా లాక్కొనేందుకు అధిక పన్నుల భారం విధించేవారు. ముఖ్యంగా ట్రావెన్కో సంస్థాన పాలనలో దారుణమైన పన్నుల విధానం ఉండేది. వీరి క్రూరత్వం సమాజంలో పేరుకొనిపోయి.. దారుణమైన అకృత్యాలు చేస్తూ అనేక పన్నులు విధించేవారు. ఇందులో అతి క్రూరమైంది ‘రొమ్ము పరిమాణ పన్ను’.
నిజానికి పన్నులకు వ్యక్తి శరీరానికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ అప్పట్లో కేరళలోని ట్రావెన్కో సంస్థానంలో ఏకంగా మహిళ రొమ్ము పరిమాణాలను చూసి మరీ పన్ను విధించేవారు. అంటే, మహిళల రొమ్ములు ఎంత పెద్దగా ఉంటే అంత పన్ను చెల్లించాలి. ఇలాంటి దారుణ అకృత్య నిర్ణయానికి పాలకులు పూనుకున్నారు. అంతేకాదు.. మహిళల తమ రొమ్ములను వస్త్రంతో కప్పకూడదు. కేవలం అగ్రకులాల వారు, ధనిక కులాలకు చెందిన మహిళలు మాత్రమే వారి రొమ్ములను వస్త్రాలతో కప్పుకొనే హక్కు ఉంది.
గిరిజనులు, ఇతరత్ర నిమ్న కులాల మహిళలు పైవస్త్రం లేకుండా బయట తిరిగాలి. ఇంతటి దారిద్ర పన్నుతో అక్కడి మహిళలు రోదించిన తీరు వర్ణనాతీతం. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇక చేసేది ఏం లేక రొమ్ములపై వస్త్రాలు లేకుండానే వీధుల్లో తిరిగేవారు. అంతేకాదు అధికారులు వచ్చినప్పుడల్లా వారికి చూపించాలి. దీంతో మహిళ భయంతో పైవస్త్రాలు ధరించకుండా తిరిగేవారు. దీన్ని ఆసరగా తీసుకుని సైనికులు, అధికారులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు. మహిళలకు నరకం అంటే ఎంటో చూపించేవారు.
అధికారులు నెలకు ఒకసారి ప్రజల ఇళ్లకు వచ్చి మహిళల రొమ్ముల పరిమాణం, వాటి బరువును కొలిచేవారు. దాని ప్రకారం పన్నులు విధించేవారు. ఈ పన్ను విధానాన్ని ‘ముళక్కరం’ అనేవారు. రొమ్ము పరిమాణం ఎంత ఎక్కువ ఉంటె అంతగా డబ్బులు లేక పన్ను చెల్లించలేమని చెప్పేవారు. ఎదురిస్తే మహిళలను భర్త ఎదుటే అధికారులు అత్యాచారాలు చేసేవారు. కొందరు ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు. భర్తలకు తమ ముఖాలను చూపించకుండా దూరమయ్యేవారు. కొందరు అధికారులు పన్ను మినహాయింపు పేరుతో మహిళలను లోబరుచుకొని లైంగిక వాంఛ తీర్చుకునేవారు. ఆ కాలంలో అక్కడ అగ్రవర్ణాలదే పైచేయి. వారిని ఎదిరించలేక గిరిజన ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే పాలకులు హింసించి దారుణంగా చంపేసేవారు. ఇంతటి దుర్మార్గాన్ని తట్టుకోలేక పోయిన నంగేలీ అనే మహిళ అన్యాయాన్ని, తమపై జరుగుతున్న అకృత్యాలను ఎదురించింది.
ఆమె చేసిన త్యాగం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది.
ట్రావెన్కోర్ సంస్థానంలోని ఆంక్షలను వ్యతిరేకించిన ధీర వనిత, ఏకైక మహిళ నంగేలి. అధికారుల తీరుపై ఎదురుతిరిగి ఆడవారికి సహజంగా పెరిగే రొమ్ములపై పన్నులు వేయడం ఏమిటని నిలదీసేది. అంతేకాదు, అగ్రకులాల స్త్రీల వలె తాము ఎందుకు రొమ్ములు కనిపించకుండా వస్త్రాలను ధరించకూడదని ఎదురుతిరిగి పోరాడేది. అధికారులకు దడ పుట్టించి, తాను అర్థనగ్నంగా తిరగనంటూ తన రొమ్ములను ఎప్పుడూ కప్పి ఉంచేది. అందరిలాగే నువ్వు చూపించాలని, అధికారులు పన్ను కోసం ఇంటికి వస్తే.. తాను తన రొమ్ములను చూపించనని మొండికేసేది. అయితే నంగేళి పోరాట పటిమకు ఆమె భర్త కూడా మద్దతు తెలపడంతో ఆమె ధైర్యంగా పన్ను విధానాన్ని ఎదుర్కోగలిగింది.
నంగేళిని ఆదర్శంగా తీసుకొని చిత్తు చిత్తు అయిన నిమ్నవర్ణ మహిళలు తమ రొమ్ములను బట్టతో కప్పి ఉంచి వీధుల్లో తెరిగేవారు. అధికారులు ప్రశ్నిస్తే.. దీటుగా సమాధానం ఇచ్చేవారు. సమాజానికి వీరి పీడ పోవాలని భావించిన నంగేళి.. ఒంటరి పోరాటం వల్ల ఫలితం ఉండదని భావించింది. చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో కూడా వస్త్రాలు ధరించి తిరిగేది. బానిసత్వం నుండి విముక్తి చేయడానికి బాధిత మహిళలను అక్కున చేర్చుకొని పోరాటం సాగించింది. అయితే మహిళలు వస్త్రాలు ధరించి వీధుల్లోకి రావడాన్ని చూసిన అధికారులు వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోయారు. నంగేలీకి తగిన శిక్ష విధించడం ద్వారా ప్రజల్లో మళ్లీ భయాన్ని పెంచాలని భావించి భారీ సైన్యంతో ఆమె ఇంటిని చుట్టుముట్టారు.
అధికారులు దౌర్జన్యంగా నంగేలీని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని పన్ను వసూలు చేసే ప్రయత్నం చేశారు. నీకు ఎందుకు కట్టాలిరా శిస్తు? నా శరీరంపై నీ పెత్తనం ఏందిరా? అని ఆమె పోరాడింది. ఇక అధికారులు పాశవికంగా ప్రవర్తిస్తూ.. ఆమె పైవస్త్రాలను తొలగించి అత్యాచారానికి సిద్ధమయ్యారు. దీంతో ఆమె వారిని పక్కకు నెట్టి.. పన్ను కడతానని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. పదునైన కొడవలితో తన రొమ్ములను కోసింది. అరిటాకులు వాటిని పెట్టి.. రక్తమోడుతున్న చాతితో అధికారుల వద్దకు వచ్చింది. ఈ రక్తపు ముద్దలను పన్నుగా తీసుకోండి అంటూ కోసిన రొమ్ము భాగాలను అధికారుల ముఖం మీదకు విసిరేసింది.
ఒక్క క్షణం అక్కడి వారంతా నిచ్ఛేస్టుపై అలాగే చూడ సాగారు. ఆమె చర్యకు భయపడిన అధికారులు తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో చాలా నొప్పిని భరిస్తూ నంగేలీ అక్కడికక్కడే ప్రాణం విడించింది. నంగేళికి అన్ని విధాలా స్పూర్తినిస్తూ తనకు ధైర్యంగా నిలిచిన ఆమె భర్త.. ప్రాణం కంటే ఎక్కువగా భావించిన ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఆమె భౌతిక కాయాన్ని దహనం చేస్తుండగా చితిలోకి దూకి ఆమెతోపాటే ఆ జ్వాల్లల్లో కాలిపోయి చనిపోయాడు.
ఈ ఆగ్రహ జ్వాలలు చూసిన ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. నంగేలీ, ఆమె భర్త మరణాలు వృథా పోకూడదని, పాలకుల ఆగడాలపై పోరాడితేనే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావించి ప్రాణాలకు తెగించి పోరాటానికి సిద్ధమయ్యారు. అగ్రవర్ణాలపై తిరగబడ్డారు. దీక్షలు, పోరాటాలతో పాలకుల వెన్నులో వణుకు పుట్టించారు. నంగేళి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తిరుగుబాటు చేశారు. దీంతో అధికారులు భయపడిపోయారు. ఈ తిరుగుబాటు వల్ల ప్రజలకు అమానుష చట్టాల నుంచి విముక్తి లభించింది. నంగేలీ త్యాగం కేరళలో నవ సమాజ స్థాపనకు మార్గం చూపింది. దుర్మార్గపు పాలనను అంతం చేస్తూ.. మంచి మర్యాదలతో బ్రతికే సమాజం అవతరించింది. నంగేళి చితిలోని మంటలు ఇప్పటికి కేరళ ప్రజల్లో స్వాభిమాన జ్వాలలు రగిలిస్తూనే ఉన్నాయి.