HISTORY CULTURE AND LITERATURE

వరంగల్ నగరంలోని ప్రముఖ దేవాలయాలు, కట్టడాలు మీకోసం..!!

తెలంగాణలో రాజదాని నగరం హైదరాబాద్ తరువాత.. అత్యంత చారిత్రక నేపథ్యం ఉన్న నగరం వరంగల్. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు. ఈ నగరం 406 km2 (157 sq mi) విస్తీర్ణంలో ఉంది. 1163లో స్థాపించబడిన కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ రాజధానిగా ఉండేది. కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ప్రస్తుతం నగరం ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారడానికి దోహదపడ్డాయి. వరంగల్ లో కాకతీయులు నిర్మించిన కాకతీయ కళా తోరణం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చిహ్నంలో చేర్చబడింది.

తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా కూడా వరంగల్ కు స్థానం కలిపించబడింది. మూడు పట్టణ నగరాలు కాజీపేట, హన్మకొండ, వరంగల్లు కలిసి వరంగల్ ట్రై-సిటీ అని పిలుస్తారు. మూడు నగరాలు 163వ జాతీయ రహదారికి (హైదరాబాద్ – భువనగిరి – వరంగల్ – భూపాలపట్నం) కలుపబడ్డాయి. ప్రధాన స్టేషన్లు కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్లు నగరంలో ఉన్నాయి. 

 ఎన్నో విద్యాలయాలు, కాకతీయ విశ్వవిద్యాలయం,NIT-వరంగల్, కాకతీయ మెడికల్ కాలేజీ, అతిపెద్ద వైద్యశాల MGM (మహాత్మగాంధీ స్మారక వైద్యశాల), ఖాజీపేట,వరంగల్ రైల్వే జంక్షన్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, జూ పార్క్  నగరం స్వంతం. ఆధునికతనే కాకుండా చరిత్రక కట్టడాలు కూడా ఈ ఓరుగల్లు స్వంతం. అందమైన సరస్సులు, అద్భుతమైన శిల్పకళతో కూడిన దేవాలయాలతో ఓరుగల్లు ప్రశస్తాన్ని చాటే విశేషమైన కట్టడాలు, ఆలయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

కాకతీయ రాజవంశీకుల పురాతన రాజధానిగా వరంగల్ ఉండేది. ఈ నగరాన్ని బీటా రాజా I, ప్రోలా రాజా I, బీటా రాజా II, ప్రోలా రాజా II, రుద్రదేవ, మహాదేవ, గణపతిదేవ, ప్రతాపురుద్ర, రాణి రుద్రమ దేవి వంటి వారు పరిపాలించారు. బీటా రాజా I కాకతీయ రాజవంశం స్థాపకుడు, 30 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తరువాత అతని కుమారుడు ప్రోలా రాజా I తన రాజధానిని హన్మకొండకు మార్చాడు. గణపతి దేవా పాలనలో రాజధాని హన్మకొండ నుండి వరంగల్‌కు మార్చబడింది. ఆకట్టుకునే కోట, నాలుగు భారీ రాతి ద్వారాలు, శివుడికి అంకితం చేసిన స్వయంభూ ఆలయం, రామప్ప సరస్సు సమీపంలో ఉన్న రామప్ప ఆలయం వంటి అనేక స్మారక చిహ్నాలను కాకతీయులు నిర్మించారు. కాకతీయులు సాంస్కృతిక, పరిపాలనా వ్యత్యాసాన్ని మార్కో పోలో పేర్కొన్నారు. ప్రతాపరుద్ర II ఓటమి తరువాత, ముసునూరి నాయకులు 72 నాయక అధిపతులను ఏకం చేసి, ఢిల్లీ సుల్తానేట్ నుండి వరంగల్ ను స్వాధీనం చేసుకుని యాభై సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు, చారిత్రక కట్టడాలు, చెరువులు, జలపాతాలు మొదలైనవాన్నీ ఇక్కడ తెలుసుకుందాం. వరంగల్ అనగానే మనకు మొట్టమొదటగా గుర్తుకు వచ్చేసి.. వేయి స్తంభాల శ్రీ రుద్రేశ్వర ఆలయం, ఓరుగల్లు భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్, రామప్ప దేవాలయం, పాకాల సరస్సు, లక్నవరం చెరువు నగరానికి వన్నె తెచ్చేవిగా ఉన్నాయి.

వేయి స్తంభాల గుడి: 

వరంగల్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు వేయి స్తంభాల రుద్రేశ్వర దేవాలయం . వరంగల్‌కు 5 కిలో మీటర్ల దూరంలో హన్మకొండ నడిబొడ్డున ఈ ఆలయం ఉంటుంది. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా చాటి చెప్పింది ఈ ఆలయం. వేయిస్థంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానుల కొలువైనారు. ప్రతి స్థంభానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆలయానికి ఉత్తర దిక్కున మండపానికి ఆలయానికి మధ్యలో నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. భక్తులు మొదట నందిని దర్శించుకున్నాకే రుద్రేశ్వరుని దర్శనం చేస్తారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజున దేవాలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది.

ఓరుగల్లు భద్రకాళి ఆలయం: 

ఆంధ్ర ప్రదేశ్ లో బెజవాడ కనకదుర్గమ్మ ఎంత ప్రసిద్ధి చెందినతో తెలంగాణలో భక్తులకు కాపాడే దేవత ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు అంత ప్రసిద్ధి.తొమ్మిదడుగుల ఎత్తు, ఎనిమిది చేతులతో గంభీరమైన రూపంతో భక్తులకు దర్శనమిచ్చే భద్రకాళి మాత ఎంతో మహిమాన్వితమైన దేవిగా పూజలందుకుంటోంది. ఓరుగల్లు, హన్మకొండలకు సరిగ్గా మధ్యలో ఓ కొండమీద కొలువైన భద్రకాళి ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. క్రీ.శ. 625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న భద్రకాళి ఆలయం కాకతీయుల కాలం నాటికే ఎంతో ప్రాభవాన్ని సంతరించుకొందని చెబుతారు. చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి భద్రకాళి మాతను దర్శించుకున్నాకే వేంగీని జయించాడని శాసనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు రౌద్రరూపంగా ఉన్న భద్రకాళీదేవి తర్వాత శాంతస్వరూపిణిగా మారడం ఇక్కడి మరో ప్రత్యేకత. అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు, పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఖిలా వరంగల్: 

ఓరుగల్లు చరిత్ర 8 వ శతాబ్దం నుంచి 13 వ శాతాబ్దం వరకు కొనసాగింది. ఈ కోట వరంగల్ రైల్వే స్టేషన్ కు 2 కిమీ దూరంలోను హన్మకొండ నుండి 12 కిమీ దూరంలో ఉంది. ప్రస్తుతం నాటి చెరిత్రకు ఆనవాలుగా మిగిలిచిన అవశేషాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ కాకతీయ కళా తోరణం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో వాడుకలో ఉంది. ఈ కోట 15 మంది 

కాకతీయ చక్రవర్తుల పాలనలో క్రమక్రమంగా దుర్బేధ్యమైన కోటగా  అద్భుత నిర్మాణాలతో నిర్మించబడి కొని వందల ఏళ్ళ పాటు ఎంతో వైభవంగా కొనసాగింది. చివరికి ప్రతాప రుద్రుడు 1289 నుంచి 1323 తో ఉన్న ఈ కోట చరిత్ర అంతమైంది. ఈ కోట విశిష్టత ఎంతంటే.. శత్రువుల నుండి వారిని కాపాడుకోవడానికి 7 కోటలను నిర్మించారు. 

రామప్ప రుద్రేశ్వరాలయం:

తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, వరంగల్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైనది. దీంతో ఈ ఆలయాన్ని తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో. కాకతీయులు క్రీస్తు శకం 1123–1323 మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయింది. నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి. రేచర్ల రుద్రుడినే రుద్ర సేనాని, రుద్ర దేవుడని, రుద్ర రెడ్డి అని రాశారు. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. అద్భుతంగా రామప్ప శిల్పనిర్మాణం చేయడంతో అతని పేరుమీదుగానే ఈ ఆలయానికి రామప్ప అని పేరు పెట్టారు.  నేల నుంచి ఆరు అడుగులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై ఈ గుడి నిర్మించారు. నీటి మీద తేలియాడుతాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం, విమానం నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత.  గుడిలో పలు ఉపాలయాలు, నంది విగ్రహం ఉన్నాయి. పక్కనే ఉన్న రామప్ప చెరువు, అందమైన తోటలు ఈ ప్రదేశానికి అత్యంత వన్నె తెచ్చాయి. 

పాకాల సరస్సు: 

నింగిని తాకే గిరులపైనుంచి జాలువారే జలపాతాలు ఈ సరస్సు స్వంతం. సెలయేటి గలగలల మధ్య అతిథులను ఆహ్వానించే పక్షుల కిలకిలారవాలు మనసును ఆనందింపజేస్తాయి. చూపు తిప్పుకోనివ్వని హరితసొబగులతో ప్రకృతి సోయగాన్ని ఒడిలో నింపుకొని పర్యాటకుల స్వర్గధామంగా నిలుస్తోంది.. వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు. కాకతీయుల పాలనా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఆ సరస్సు.. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రకృతి ప్రేమికులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతోంది.

లక్నవరం చెరువు: 

దట్టమైన అటవీ ప్రాంతం… చుట్టూ కొండలు మధ్యలో లక్నవరం సరస్సు ఉంది. కాకతీయులు సాగునీటి కోసం నిర్మించిన సరస్సు నేడు తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయరాజు రెండో ప్రతాపరుద్రుడు లక్నవరం తవ్వించాడు. నాటి నుంచి నేటి వరకు లక్నవరం సరస్సు రైతులపాలిట వర్రపదాయినిగా ఉంటోంది. ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లాలోని గోవిందరావుపేట మండలం లోని బుస్సాపూర్ గ్రామం దగ్గరలో ఉంది.

Show More
Back to top button