HISTORY CULTURE AND LITERATURE

కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలు ఇవే.. ఓ లుక్కేద్దామా..?

తెలంగాణలోని ప్రసిద్ధ నగరాల్లో కరీంనగర్ ఒకటి. రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరంగా కరీంనగర్ పిలువబడుతుంది. హైదరాబాద్ తర్వాత 2వ స్థానంలో వరంగల్ ఉండగా.. 3వ స్థానంలో కరీంనగర్ ఉంది. మరి మన కరీంనర్ లోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. మొదటగా కరీంనగర్ అనగానే ఎలగందల్ కోట గుర్తుకు వస్తుంది. అలాగే వేములవాడ ఆలయం, సిరిసిల్ల చీరలు, నాంపల్లి ఆలయం, కొండగట్టు దేవాలయం, ధర్మపురి శ్రీ నృసింహస్వామి దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, ఇల్లందకుంట రామాలయం, అలాగే కరీంనగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇలా అనేక దేవాలయాలు, చారిత్రక కట్టడాలు ఈ జిల్లా స్వంతం. ఈ స్టోరీలో ఆలయాలు, కట్టడాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఎలగందల్ కోట..

కరీంనగర్ జిల్లాకు తలమానికమైన ఎలగందల్  కరీంనర్ జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలోని ఎలగందల్ గ్రామంలో ఉంది. కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఉన్న ఈ కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశము, మొఘల్ సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఈ కోట ఉండేదని చరిత్ర చెబుతుంది. నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత ఎలగందల్ కోట పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్ – దౌలా చేత నిర్మించబడింది. కోటపైనున్న చార్మినార్ లాంటి కట్టడాన్ని చూసి హైదరాబాద్ లో చార్మినార్ ని నిర్మించాలని చెబుతారు. దీనిని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తే.. చాలామంది సందర్శించే అవకాశం ఉంది. అలాగే కరీంనగర్ పట్టణంలోని జూ పార్క్ పట్టణ ప్రేమికుల్ని ఆహ్లాద పరుస్తుంది. కరీంనగర్ కు తలమానికమైన ఎల్ఎండీ డ్యాంకు నిత్యం ప్రజలు వస్తుంటారు. 

వేములవాడ…

తెలంగాణలో ప్రసిద్ధ దేవాలయం, రాష్ట్రానికి వన్నె తెచ్చే శివాలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో ఉంది. చరిత్ర ప్రకారం..  కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత మహాశివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, తెలంగాణ ప్రజలు భక్తితో రాజన్న అని పిలుస్తారు. మూల విరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి. శ్రీ రాజరాజనరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. వేములవాడ రాజేశ్వరుని దర్శనం తర్వాత.. బద్దిపోచమ్మను, భీమేశ్వరాలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. 

శివరాత్రి రోజున జరిగే ఉత్సవాలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తునారు. రాష్ట్రం నలుమూలన మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా సమ్మక్క – సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ముందు వేములవాడ రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

త్రిలింగేశ్వర ఆలయం

వేములవాడకు దగ్గరలోని బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివుడు కోపోద్రిక్తుడై.. వేములవాడలో స్థిరపడ్డాడని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో 3 శివలింగాలు దర్శనం ఇస్తాయి. కాకతీయ కళావైభవంతో త్రిలింగేశ్వరుని ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. 

వస్త్ర కలకు7 ప్రసిద్ధి సిరిసిల్ల..

సిరిసిల్ల పట్టణం వస్త్ర కళలకు ప్రసిద్ధి.1987లో సిరిసిల్ల పురపాలకసంఘంగా ఏర్పడింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూమ్‌లు, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఉన్నందున దీనిని టెక్స్‌టైల్ టౌన్ అని కూడా పిలుస్తారు. 40,000 పవర్ లూమ్‌లతో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్ గా ఉంది. విశాలాంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ సిరిసిల్లలోనే జరిగింది. అగ్గిపెట్టలో పట్టె చీరను ఇక్కడ నేయడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రముఖ ఒగ్గు కథా కళాకారుడు మిద్దె రాములు హన్మాజీపేట గ్రామానికి చెందిన వారే.  అలాగే గేయ రచయిత, తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత  సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ జిల్లాకు చెందిన వారే. 

నాంపల్లి గుట్ట…

వేములవాడ – కరీంనగర్ హైవేపై ఒక చిన్న కొండపై నాంపల్లి గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం ఉంది. ఇది విష్ణువు అవతారమైన లక్ష్మీ నరసింహ స్వామికి అంకితం చేయబడిన దేవాలయం ఇది. ఇక్కడ స్వామివారు గుట్టకు వెలిచాడని అంటారు.  సంతానం లేని వారికి సంతానం ఇచ్చే మహాత్యం గల క్షేత్రంగా నాంపల్లి ఆలయం ప్రసిద్ధికెక్కింది. చోళుల కాలంలో క్రీ.శ 11వ శతాబ్దంలో ఈ ఆలయానికి శ్రీ రాజ రాజ నరేంద్రుడు అనే రాజు కోనేటికి మెట్లు నిర్మించారని చరిత్ర కథనం చెబుతోంది. సందర్శకులు దిగువ పార్కింగ్ ప్రాంతం దగ్గర నుండి పైకి రావాలంటే కొన్ని వందల మెట్లు ఎక్కాలి.  నరసింహ ఆలయానికి వెళ్లే దారిలో పాముల గుడి ఉంది. ఈ ఆలయం పాము ఆకారంలో నిర్మించబడింది. ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుని కథను తెలిపే విగ్రహాలు ఈ పాము లోపల ఉంటాయి. సొరంగం చివరలో హిరణ్యకశిపుని రాక్షసుడిని సంహరించిన నరసింహుని విగ్రహం ఉంది. కొన్ని పురాతన నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహంలో స్తంభం నుండి నరసింహ స్వామిని చూడవచ్చు.

కొండగట్టు…

రామభక్తుడు హనుమంతుడు స్వయంభువుగా వెలిసిన దేవాలయం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. తెలంగాణలోనే ప్రసిద్ధ హనుమాన్ ఆలయాల్లో ఇది ప్రథమ స్థానంలో ఉంది. ప్రకృతి రమణీయత మధ్య అలరాలుతున్న ఈ ఆలయానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కొండగట్టు మీద ఉన్న ఆజనేయుని ఆలయం నిర్మణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయం భూ గా వెలిశాడని.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం.. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది. ఆ అవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు.

 అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాను. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా హనుమంతుడు కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని అక్కడి గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. హనుమాన్ మాల విరమణ సమయంలో వేలాది భక్తులు ఆలయానికి చేరుకోవడంతో దేవాలయం కిక్కిరిసిపోతుంది. 

ధర్మపురి…

పరమ పవిత్రమైన శ్రీ ధర్మపురి క్షేత్రం పవిత్ర గోదావరి నది తీరాన వెలసి శివకేశవుల నిలయమైనది.ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వరాలయం పక్కపక్కనే ఉంటాయి. ఆనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ధర్మపురి క్షేత్రం.ఇక్కడ స్వామి వారు యోగానంద నరసింహ స్వామి భక్తుల కోరికలను నేరవేరుస్తున్నాడు. ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం రాష్ట్రంలోని వేద బ్రాహ్మణుల ముఖ్యమైన స్థావరాలలో ఒకటి. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మాసాల్లో ధర్మపురిలో జాతర సాగుతుంది. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ధర్మపురిలో యమ ధర్మరాజుకు ఆలయం. ధర్మపురి దర్శనం తర్వాత యమపురి సందర్శన ఉండదని పండితులు చెబుతారు. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ తీరిక లేకుండా గడిపే యముడు… ఒకరోజు ధర్మపురికి వచ్చి సమీపంలోని గోదావరిలో స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నాడని అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడని పురాణగాథల్లో రచించి ఉంది. పుష్కరాల సమయాల్లో వేదభూమి అయిన ధర్మపురి కిక్కిరిసిపోతుంది. 

కాళేశ్వరం…

పవిత్ర గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు నిత్యం వేలాది సంఖ్యలో వస్తుంటారు. కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది.  ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.  కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా .. మన దేశంలో ఎక్కడా కనిపించదేమో.

చరిత్ర ప్రకారం..  దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మ రాజు కి పనిలేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్ళి వేడుకోగా.. పరమేశ్వరుడు యమున్ని తనవద్దే పక్కన లింగరూపంలో కొలువైఉండమన్నాడట. తనని దర్శించుకొన్న వారు అతనిని దర్శించుకోనట్లయితే మోక్షప్రాప్తి లభించదని అన్నాడు. అలాంటి వారికి కాలం దగ్గరపడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. అందుకే భక్తులు స్వామి వారిని దర్శించుకొని (శివుణ్ని), కాళేశ్వరుణ్ణి (యమున్ని) కూడా దర్శించుకుంటారు.

ఇల్లంతకుంట…

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తర్వాత..రెండో అతిపెద్ద దేవాలయంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామంలోని ఆలయం పేరుగాంచింది. స్వయంభుగా వెలిసిన ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి వారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే రామయ్యగా దర్శనం ఇస్తుంటాడు. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే.. కరీంనగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడి వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలిచాడు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఆలయం కొలువై ఉంటుంది. స్వామి వారి దివ్యామోహన రూపం ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో పండుగ సమయంలో విశేషపూజలు, వేంకటేశ్వరునికి విశేష పూజలు నిర్వహిస్తారు.

Show More
Back to top button