HISTORY CULTURE AND LITERATURE

అపమృత్యుభయంపోగొట్టే. దివ్యమైన రోజుధన త్రయోదశి.నేడే.!

దీపావళికి ముందు వచ్చే రోజునే ‘ధన్ తేరాస్’/ ‘ధన త్రయోదశి’/ ‘ఛోటీ దివాలీ’ అని పిలుస్తాం. ఈరోజున ప్రత్యేకంగా బంగారం, వెండి, వస్త్రాల్లాంటి ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అదేరోజు సాయంత్రం దీపాలు వెలిగించి, లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.

హిందూ సంప్రదాయంలో ధన త్రయోదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వెలుగుల పండగ దీపావళికి ముందు వచ్చే ఈ పర్వదినాన్ని ‘ధంతేరాస్’​ అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి రోజున.. ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి అక్టోబర్​ 29న, మంగళవారం రోజున వచ్చింది.

ధన త్రయోదశి తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజన ఉదయం లక్ష్మీదేవికి పూజ చేస్తే ఇంట్లో సిరిసంపదలకు ఎలాంటి లోటూ కలగదని, అలాగే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారని భక్తులు నమ్ముతారు. 

ధనత్రయోదశి ప్రాశస్త్యం…

పూర్వం హేమరాజు అనే ప్రభువుకు పుత్రుడు జన్మిస్తాడు. అతడికి పదహరేళ్ల వయసు రాగానే చనిపోతాడనే విషయాన్ని జోష్యం చెబుతారు పండితులు. ఇందుకు పరిష్కారంగా సుమంగళి యోగం ఉన్న ఒక రాకుమారితో వివాహం జరిపిస్తారు. కుమారుడికి ప్రాణగండం ఉన్నట్లు కోడలికి తెలుస్తుంది. అది తెలిసి పెళ్లైన మూడోరోజునుంచే తన భర్తను మృత్యువు నుంచి కాపాడుకోవడానికంటూ ఆమె లక్ష్మిదేవిని పూజించి, జాగారం చేసింది. ఆపై ఒక పెట్టెలో బంగారం, ఇతర వజ్రభారణలను వేసి, దానిని గుమ్మం ముందు ఉంచింది. దాని చుట్టూ దీపాలు వెలిగించి దేవుణ్ణి ప్రార్థిస్తూ తన భర్త నిద్రపోకుండా చూసుకుంది. ఆ తర్వాతి రోజునే యమధర్మరాజు పాము రూపంలో ఆ ఇంటికి వస్తాడు. కానీ అక్కడ ఉన్న దీపాల వెలుగులో చూపు మసకబారిపోవడంతో లోపలికి వెళ్లలేక తిరిగి వెనక్కి వెళ్లిపోతాడు. తెలివిగా వ్యవహరించి రాకుమారి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇది సరిగ్గా దీపావళికి ముందురోజు అంటే త్రయోదశి నాడు జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ‘ధన త్రయోదశి’గా మనం నేటికి జరుపుకుంటున్నాం.

*ధన త్రయోదశిని ‘ధన్వంతరి త్రయోదశి’, ‘త్రివిక్రమ త్రయోదశి’, ‘కుబేర త్రయోదశి’, ‘ఐశ్వర్య త్రయోదశి’ ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. 

*ఈరోజున లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో పూజించాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి, వారికి బహుమతులు ఇవ్వాలి. 

*ఈరోజు త్రయోదశి వేళ యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యుభయం ఉండదనీ అంటారు.

*ఇవాళ ఆదివైద్యుడైన ధన్వంతరి జయంతి కూడా కాబట్టే.. ‘ధన్వంతరి త్రయోదశి’గానూ భావిస్తారు. అందుకే వైద్యులు ఈరోజున ధన్వంతరిని ఘనంగా పూజిస్తారు. 

*మహావిష్ణువు వామనావతారం ధరించి, బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిందీ ఈరోజేనని ప్రతీతి. అందుకే ‘త్రివిక్రమ త్రయోదశి’గా పిలవడమూ పరిపాటి. 

*ఈరోజుకు కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని ఇతర పేర్లూ ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ధన త్రయోదశిని మూడురోజుల పండుగగా ఆచరిస్తారు. లక్ష్మీదేవిని ధనాధిదేవతగా విష్ణువు ప్రకటించడాన్ని నరకాసురుడు భరించలేకపోతాడు. ఆమెను బంధిస్తాడు. అతడి ఆగడాల్ని అరికట్టడానికి అప్పటికే సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు బయలుదేరతాడు. నరకుణ్ని వారు సంహరించి, లోకానికి ఆ రాక్షస బాధ లేకుండా చేస్తారు. లక్ష్మీదేవి బంధవిముక్తురాలవుతుంది. అందువల్ల అందరూ ఆమెను ఘనంగా అర్చిస్తారు. ఆరోజు ఆశ్వయుజ బహుళ (దీపావళి) అమావాస్య. భక్తులు ముందుగా లక్ష్మీపూజ చేయడంలోని ఆంతర్యం ఇదే!

*గుజరాత్, మహారాష్ట్రలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాన్ని విశేషంగా జరుపుతారు.

*సూర్యాస్తమయ సమయంలో, మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వాటిని ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా ‘యమ దీపాలు’గా ఉంచుతారు. ఈ రోజున చేసే దానాలు, జపాలు, పూజలు అనేక ఉత్తమ ఫలితాలనిస్తాయని భక్తులు నమ్ముతారు!

Show More
Back to top button