HISTORY CULTURE AND LITERATURE

భారతదేశ చిట్టచివరి గ్రామం.. ఎక్కడుందంటే..?

రామాయణ మహాభారతం కాలనాటి ఆనవాళ్లు ఉన్న ప్రాంతం..

సరస్వతి దేవి జన్మించింది ఇక్కడే.. -భీముడు ద్రౌపది కోసం వంతెన కట్టింది ఇక్కడే..

సనాతన హిందూ ధర్మ శాస్త్రం, రామాయణ, మహాభారత కావ్యాలు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతదేశం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు, పల్లెలకు ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రత్యేక స్థానం కలిగినటువంటి పుణ్యభూమి మన భారతదేశం. అటువంటి మన భారతదేశంలోని చిట్టచివరి గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం దేశంలోనే చిట్టచివరి గ్రామమే కాకుండా దానికి ఒక ప్రత్యేకమైన స్థానం కలదు. ఆ గ్రామం ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలోని ఒకటైన రాష్ట్రం ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఒకప్పుడు ఉత్తరాంచల్ గా ఉన్న ఈ రాష్ట్రం పేరును ఉత్తరాఖండ్ గా మార్చారు. భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌ లోని హిమవాహినులలో పుట్టి  ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై ప్రవేశిస్తున్నాయి.

దట్టమైన అడవులు. ప్రత్యేకమైన జీవజాలాలు, వృక్ష సంపదతో ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. 

ఈ రాష్ట్రం లోని ముస్సోరీ, ఆల్మోరా, రాణీఖేత్‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి.  ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆర్థికవనరుగా చెప్పవచ్చు. బ్రిటిష్ కాలం నుండి  ప్రాచుర్యంలో ఉన్నాయి. అంతే కాకుండా హరిద్వార్, ఋషీకేశ్, బదరీనాధ్, కేదారనాధ్ వంటి అనేక పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరు పొందాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యాటకం దినదిన అభివృద్ధి చెందుతుంది.

భారతదేశంలోని చిట్టచివరి గ్రామం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉంది. చమౌళి జిల్లాలో ఉన్నటువంటి “మనా” అనే గ్రామం సముద్రమట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ మనా అనే గ్రామమే భారతదేశం యొక్క చిట్టచివరి ఊరు. ఈ అందమైన గ్రామం ఇండో-చైనా సరిహద్దు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇదే భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పేరు పొందింది. ఇక్కడ అద్భుతమైన వీక్షణలు, అందమైన లోయలు ఆకర్షిస్తాయి. ఈ గ్రామానికి చేరుకోవడానికి చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రముఖ హిందూ పుణ్యతీర్థం అయినటువంటి బద్రీనాథ్ ఆలయం దర్శించిన చాలామంది ఈ చివరి గ్రామంలో కూడా పర్యటిస్తారు.

బద్రీనాథ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని సరస్వతీ నదీ పరివాహక ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడే సరస్వతి దేవి జన్మించింది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలోనే సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో వ్యాస మహర్షి స్నానం చేయడం వల్ల మహాభారత ఇతిహాసం, పురాణాలు రచించాడని ప్రజల నమ్మకం. ఈ గ్రామ ప్రధాన ద్వారం పై “ది లాస్ట్ ఇండియన్ విలేజ్” అని రాసి ఉంటుంది. మనా అనే గ్రామం ఉండడం వల్ల రామాయణ, మహాభారత కాలం నాటి అనేక ఆనవాళ్లు ఉన్న రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం పేరొందింది. ఈ ప్రాంతంలో దుకాణదారుల వద్ద నుండి ఏ సామాగ్రిని విక్రయించిన వాటిపై చివరి గ్రామం అని ముద్రణలు కనిపిస్తాయి.

“భీముడు నిర్మించిన వంతెన”

మనా గ్రామానికి మహాభారత కాలానికి సంబంధం ఉన్నట్లుగా ఓ కథనం ప్రచారంలో ఉంది.  ఈ గ్రామంలోని శివారులో సరస్వతీ నదికి సమీపంలో ఓ రాతి వంతెన ఉంటుంది.  ఆ వంతెనను పాండవ సోదరులలో ఒకరైన భీముడు నిర్మించినట్లుగా చెబుతారు. సరస్వతీ నదిపై సహజరాళ్లతో ఈ వంతెను నిర్మించబడి ఉంటుంది. వంతెనను “బీమా ఫుల్” వంతెన అని పిలుస్తారు. పాండవులు ద్రౌపదితో కలిసి స్వర్గానికి వెళ్లడానికి తమ చివరి ప్రయాణం చేసినప్పుడు   మనా గ్రామం గుండా వెళ్లారట. అప్పుడు దారిలో ఈ నదిని చూశారు. అయితే ఈ నదిని దాటడానికి ద్రౌపదికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భీముడు ఒక పెద్ద రాయిని ఎత్తుకొని ఇక్కడ వంతెనను నిర్మించాడట. 20 అడుగుల పొడవైన పాదముద్రలు కూడా నది వద్ద కనిపిస్తాయి. ఇవి భీముని పాదాలు అని చెబుతారు.

“మనా” లో ఇతర ముఖ్యమైన ప్రదేశాలు

వసుధార…

బద్రీనాథ్ ఆలయం నుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన జలపాతం వసుధార. ఈ వసుధార జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు డీ జలపాతాన్ని చూసి మైమరచిపోతారు. ఎంతో సంతోషంతో వసుధార నీటిదారలను ఆహ్లాదంగా గడుపుతారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వసుధార జలపాతం వద్ద కూడా నివసించారని పురాణ గాథలు చెబుతున్నాయి. బద్రీనాథ్ ఆలయ దర్శనం కోసం వెళ్ళిన పర్యాటకులు వసుధార జలపాతాన్ని కూడా చూస్తారు.

నీలకంత్ శిఖరం…

ఉత్తరాఖండ్ ప్రధాన పర్యాటక ప్రాంతాలలో నీలకంత్ శిఖరం ఒకటి. ఈ శిఖరం పర్యాటకానికి ఆకర్షణగా నిలుస్తుంది. సముద్ర మట్టానికి 6597 అడుగుల ఎత్తులో ఉంటుంది. మంచుతో కప్పబడి ఉండే ఓ అందమైన పర్వత శిఖరం ఇది. దీనిని ‘క్వీన్ ఆఫ్ గర్హవాల్’ అని కూడా పిలుస్తారు. సాహసికులు, పర్వతారోహకులు ఈ శిఖరం పై పర్వతారోహణ చేస్తారు.

వ్యాస గుహ…

వేద వ్యాసునికి అంకితం చేయబడిన మందిరం వ్యాస గుహ. మహాభారతం వంటి గొప్ప ఇతి హసాన్ని రచించిన వేద వ్యాసుడు ఈ గుహలోపలే 4 వేదాలను రచించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ గుహలో ఉన్న చిన్న మందిరం దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నాటిదని ప్రజలు నమ్ముతారు. ఈ గుహను “వ్యాస్ పుస్తక్” అని కూడా పిలుస్తారు. చాలా ఏళ్లు గడిచిన తర్వాత ఈ పుస్తకం రాయిగా మారిందని ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది.

తప్త్ కుండ్…

తప్త్ కుండ్ అనేది ఒక నీటి గుండం మాదిరిగా ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం దీనిని అగ్ని పవిత్ర నివాసంగా చెబుతారు. ఈ కుండ్ నీటిలో మునకలు వేస్తే చర్మ వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఎంతో విలువైన ఔషధ సంపద ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ పర్యటకానికి వచ్చే ప్రజలు ఈ ప్రాంతానికి కూడా చేరుకొని నీటిలో మునకలు వేస్తారు.

గణేష్ గుహ…

గణేష్ గుహ వ్యాస గుహ నుండి కొంత దూరంలో ఉంటుంది. వ్యాస మహర్షి ఇక్కడ ఉన్న తన గుహ నుండి గణేషుడికి మహాభారతాన్ని వివరించాడట. అందుకే ఈ ప్రాంతానికి గణేష్ గుహ అనే పేరు వచ్చింది. మనా గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు ఈ ప్రాంతాలన్నింటినీ చూస్తారు.

పర్యాటకులను ఆకర్షించే చివరి దుకాణం…

మనా గ్రామ శివారులో ఓ టీ దుకాణం ఉంటుంది. ఇది భారతదేశంలోని చివరి టీ దుకాణం. ఇక్కడ చాయ్ తాగుతూ పర్యాటకులు ఆనందిస్తారు. పర్యాటకులను ఈ దుకాణం కూడా ఎంతో ఆకర్షిస్తుంది. దుకాణం వద్ద టీ తాగుతూ భారతదేశంలోని చివరి ప్రాంతంలో ఉన్నామంటూ చర్చించుకుంటారు.

‘మనా’ గ్రామానికి ఎలా వెళ్లాలంటే.. ?

మనా గ్రామాన్ని చేరుకోవాలంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని  రిషికేష్, హరిద్వార్ నుంచి ఈ ప్రాంతాన్ని సులభంగా చేరుకోవచ్చు. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి నిత్యం బస్సులు ఈ గ్రామానికి అందుబాటులో ఉంటాయి. బస్సు లేదా టాక్సీ ద్వారా కూడా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుంచి మనా కు 315 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలతో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనేకమంది పర్యాటకులు నిత్యం వెళుతూనే ఉంటారు. విదేశీయులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

Show More
Back to top button