HISTORY CULTURE AND LITERATURE

తెలంగాణ తిరుమల యాదాద్రి.. అద్భుత శిల్పకళానగరి “స్వర్ణగిరి”

తెలంగాణలో యద్రాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి దేవాలయం తర్వాత అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం స్వర్ణగిరి  శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయము.  ఏపీలోని తిరుమల ఆలయాన్ని పోలున్న ఈ దేవాలయం.. దక్షిణ భారత దేశంలో చిన్న తిరుమలగా,  యాదాద్రి తిరుమల దేవస్థానముగా పేరుగాంచింది. అద్భుత శిల్పకళా కట్టడంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు చేరుకుంటున్నారు. మహిమంవోపేతమైన ఈ ఆలయం యాదాద్రికి సమీపంలో మానేపల్లి హిల్స్ లో నిర్మించబడింది. 

అఖిలభువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం  పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పంతో వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణం లో “స్వర్ణగిరి” అని నామకరణం చే సికొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “యాదాద్రి తిరుమల దేవస్థానం” పేరుతో నిర్మించడం జరిగింది.  

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, వారి కరకమలముల మీదుగా 

ఈ ఆలయం ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవాలు 2024 మార్చ్ 1 వ తేదీనుండి 6 వ తేది వరకు జరిగాయి.  6 వ తేదీ ఉదయం గం 11-06 నిమిషములకు దేవతా మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠా చేశారు. తదుపరి శ్రీవారి శాంతికల్యాణముతో కార్యక్రమాలు సుసంపన్నము చేశారు. భక్తులు అందరూ విచ్చేసి, ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. దివ్యమైన స్వర్ణగిరి దేవాలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన ఉంటారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదా దేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు మంగళకర రూపంలో దర్శనమిచ్చేట్లుగా ఏర్పాటు చేశారు.

ఈ  మహాక్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంగా పిలువబడుతుంది. పల్లవ, చోళ , చాళుక్య హొయసల, విజయ నగర, నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డీయెన్వీ  ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో దేవాలయ నిర్మాణం చేశారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు. శ్రీమాన్ DNV ప్రసాద్ స్థపతి గతం లో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య, 108 దివ్యదేశ ఆలయాల రూపశిల్పి. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలని ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము.  మొత్తం 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా నిర్మించారు.

స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం ఆలయానికి మకుటాయమానంగా నిర్మించారు. విజయ నగర, నాయక శిల్ప శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంఖు, చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు  విగ్రహాలతో ద్వారం నిర్మాణము చేశారు. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి “రామానుజ మార్గం” అని పేరు పెట్టారు. ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు “బ్రహ్మ రథం” శిల్ప సంపదతో గోచరిస్తుంది. విశిష్ఠమైన స్వాగతాన్ని వర్ణిచేటప్పుడు “ బ్రహ్మరథం” పట్టారు అని అంటారు. స్వర్ణ గిరీశుని దర్శించడానికై వచ్చే భక్తులకు స్వాగతం పలికుతున్నట్లు గా ఇక్కడ “బ్రహ్మ రథం” ఉంది. ప్రాచీన రథనిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలా మాయం గా నిర్మితమైనది. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు భక్తులకు సాక్షాత్కరిస్తాయి.  

ఏపీలోని తిరుమల దేవస్థానంలో మొదటి మెట్టు అలిరిపిలో మనక శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవద్ రామానుజాచార్యుల వారిగురువుగారైన శ్రీ తిరుమలనంబి గారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబి గారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీనివాసుడు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటున్నాము. ఆ విశేషసందర్భానికి గుర్తు చేసుకునేందుకు వీలుగా  స్వర్ణగిరి మొదటిమెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్టించుకున్నాము.

ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచీ హస్త ముద్రతో శ్రీవారి క్షేత్రం లోనికి పవిత్రమైన భక్తీ భావం తో ప్రవేశించమని సూచిస్తూఉన్నారు. పక్కనే రోడ్డుమార్గం వద్ద శ్రీ రామానుజాచార్యస్వామి వారి అద్భుత శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్టితమై ఉంటుంది. ఆ రోడ్డు మార్గానికి ఆళ్వార్ మార్గము అనిపేరు.ఆ ముందుకు ప్రవేశిస్తే శిలామాయ తోరణాలు గోచరిస్తాయి. వాటిపైనా బ్రహ్మ , శివుడు సతీ సమేతం గా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఆముందు మనకుబ్మట్ల దారి కనిపిస్తుంది. దానికి వైకుంఠ మార్గము అనిపేరు. శ్రీవారి భక్తులు, శ్రీహరి దాసులు తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు. ఈ మార్గం లో మనకు దశావతార విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

మానేపల్లి విజయ స్తంభ వైశిష్టం:

క్రిందినుండి మెట్ల మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు పెడతారు. ఈ  కాలంలో  శ్రీనివాసుని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించియావన్మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి, దాతృత్వానికి, ఔదార్యానికి ప్రతీకగా దీనికి “ మానేపల్లి విజయ స్తంభము” అనే పేరుతో ఈ విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. లత అలంకార పూర్ణమయిన ఈ స్తంభ పీఠం మంగళ ప్రదమైన గజరాజములు, సింహాలు, వృషభములతో పాటుగా, శ్రీవారు, శ్రీదేవి భూదేవి మరియు గరుడాల్వారు విగ్రహాలు అద్భుత శిల్పకళా కట్టడంతో నిర్మించడం జరిగింది.  

 ఈ ప్రదేశం నుంచి చూస్తే.. ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం భక్తులకు సాక్షాత్కరిస్తుంది. 

పురాణం ప్రకారం శ్రీ వైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భవ్యమైన ఆలయానికి కూడా ఒకే పొడవైనా ప్రాకారము దానికి నాల్గువైపులా నాలుగు రాజ గోపురాలు నిర్మితమై చూపరులను ఆకట్టుకునేందుగా నిర్మించారు.  గో అంటే రక్షించునది అని పేరు. పురమును రక్షించునది అని అర్థము. పిడుగుపాట్ల నుండి పురమును రక్షించునది కనుక గోపురము అనిపేరు పెట్టారు. గో అంటే ఆవు, వేదములు, దేవతలు అని అర్థం. సకల వేద స్వరూపము, దేవతానిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చెయ్య వలెను. పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజ గోపురాలను మన చూడవచ్చు. శ్రీ శైలంలో శివాజీ గోపురం, శ్రీ కృష్ణ దేవరాయ గోపురం, మొదలైనవి. ఇవన్ని ఒక చారిత్రక సందర్భాన్ని ముందుతరాల వాళ్లు గుర్తుకు తెచ్చుకునేలా ఏర్పడ్డాయి. అయితే ఈ దేవాలయ గోపురాలు నాలిగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని, ఆ కనిపించే భువనగిరి కోటనుండి ఈ తెలంగాణా ప్రాంతాన్ని పరిపాలించిన కల్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజ గోపురాలకు పేరు పెట్టడం విశేషంగా చెప్పవచ్చు.

పరిపాలన దక్షతకు.. ధైర్య సాహసాలను ప్రతిరూపం భువనగిరి ఖిల్లా:

తెలంగాణలోని భువనగిరి ప్రాంతం ఒక చారిత్రక ప్రాధాన్యత గలిగిన ప్రాంతం. తెలంగాణా పౌరుషానికి, ప్రతాపానికీ ప్రతీక భువనగిరి కోట. కల్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీశ 1041 – 1068 వరకు ‘త్రైలోక్య మల్ల’ అనే బిరుదమును ధరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత “భువనైక మల్ల” అనే బిరుదాంకితుడైన రెండో సోమేశ్వరుడు 1068 – 76 వరకు ఈ ప్రాంతాన్ని అద్భుతరీతిలో పాలించాడు. ఆ తర్వాత “ త్రిభువన మల్ల” బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు తన పేర “త్రిభువనగిరి” అనే సుందరమైన నగరాన్ని నిర్మించి.. అక్కడి కొండపైన శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు. ఆ త్రిభువన గిరి కాలక్రమం లో భువనగిరి గాను, భోన్ గిరి గానూ పేరుగాంచింది. కల్యాణి చాళుక్యుల తర్వాత ఈ  భువనగిరి కోట, కాకతీయులు, ముసునూరి వంశీకులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, అజం షాహీల పాలనలను చవిచూసింది. ఉమ్మడి ఏపీలోనూ, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్ర కూడా చరిత్రను ధైర్య,సాహసాలను గుర్తుచేసే విధంగా ఇప్పటికి భువనగిరి కోట ఒక ఐకాన్ గా వెలుగొందుతుంది.  

ఇదే భువనగిరి ప్రాకృతిక అందాల మధ్య బహు సుందరముగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి – శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూసగా అభివర్ణింపవచ్చు. దేవలోకాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులనిస్తోంది. ఆకాశ హర్మ్యాలు గా వెలుగొందుతున్న ఈ నాలుగు రాజ గోపురాలు వైకుంఠ లోకాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణా గత వైభవ ప్రాభావాలని ప్రసరింపచేస్తున్నాయి. అందువల్లే ఈ గోపురాలు “భువనైక మల్ల”, “ త్రైలోక్య మల్ల” , “ త్రిభువన మల్ల”, “ రాయగజకేసరి “ అనే పేర్లను పెట్టడం జరిగింది. ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి – “త్రైలోక్య మల్ల రాజ గోపురము” , దక్షిణ రాజగోపురానికి – “త్రిభువన మల్ల రాజ గోపురము”, పశ్చిమ రాజగోపురానికి – “భువనైక మల్ల రాజ గోపురము”, ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదముతో – “రాయ గజకేసరి రాజ గోపురము” అనే పేరు పెట్టడం జరిగింది. ఇది భవిష్యత్ తరాల వారికి చరిత్రను గుర్తు చేసేలా ఉంటుంది.

వైకుంఠనాధుని మూలావిరాట్టు వైశిష్టం:

దేవాలయ ప్రకారం దర్శనం చేసిఆలయ గర్భగుడిలోకి వెళ్తే.. కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుమారి 12 అడుగులకు మించిన ఎత్తులో శంఖ చక్రాలతో, వరద కటి హస్తాలతో భక్తులకు దివ్యరూపాన్ని సాక్షాత్కరిస్తారు.  ఈ రూపము వేదాంత వేత్తల్లెల్ల వెదికేటి రూపము, ఆదిఅంతము లేని ఆ బృహత్ రూపము. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించమే మహద్భాగ్యము కదా…! ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయఎం గడపగా నన్ను అనుగ్రహించు అని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకు గాను అక్కడి గర్భాలయ గడపకి “కులశేఖర ప్పడి” అని పిలుస్తారు. అదే విధం గా శ్రీ మానేపల్లి రామారావు, శ్రీమతి విజయలక్ష్మీ పుణ్య దంపతులు నిరంతరమైన నీ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుని ఈ స్వర్ణగిరిలో శ్రీవారినీ ఆచార్యుల ద్వారా ఆహానించుకున్నారు. అందువల్ల ఆ గర్భాలయ గడపకి “విజయరామప్పడి” అని అని పేరు పెట్టారు. అక్కడ నుండి బయటకు వస్తే ప్రక్కనే శ్రీ ఆండాళ్ – గోదాదేవి అమ్మవారి సన్నిధి సాక్షాత్కరిస్తుంది. శ్రీ గోదా అమ్మవారిని దర్శించి ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురువైన భగవద్రామానుజాచార్య సన్నిధి భక్తులకు దర్శనమిస్తుంది. 

ఈ సన్నిధిలో శ్రీ నమ్మల్వార్, శ్రీ మనవాళమహాముని పన్నిద్దరు ఆళ్వార్లు కొలువుదీరి ఉంటారు. ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళా శోభితమైన ఒక “ మురళీ గోపాల మండపం” అనే మహా మండపం ఉంటుంది. ఈ మండపంలో విజయ నగర శైలిలో 22 స్తంభాలతో కూడిన ఈ మహా మండపం చూపరులను నిశ్చేష్టులను చేస్తుంది. చుట్టూ అనివెట్టి స్తంభాలు, మధ్యలో విష్ణు కాంత, రుద్రకాంత, బ్రహ్మకాంత, ఇంద్రక్రాంతా లనే బాలపాదాలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు. ఆ మధ్యలో పైకిచూస్తే వేసర శైలి లోని ఒక గుమ్మటం కనిపిస్తుంది. అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలుగా భక్తులను కటాక్షిస్తుంటుంది. మహిమాన్వోపేత మైన శ్రీవేంకటేశ్వరుని సన్నిధానం.. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోదగ్గ ప్రదేశం. మీరు కూడా వీలుచూసుకొని శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలని.. వైకుంఠ నాధుని మీకు దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

Show More
Back to top button