HISTORY CULTURE AND LITERATURE

ఏడుపాయల దుర్గాభవాని క్షేత్ర మహాత్యం.. తెలుసుకుందామా!

అమ్మలగన్న అమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ.. జగన్మాత దుర్గాదేవి. భక్తుల దుర్గతులను పోగొట్టి అనుగ్రహించే కరుణామూర్తి. అడిగిన వారికి అడిగినది అడిగినట్లుగా వరాలను ప్రసాదించే తల్లి దుర్గామాత. దుర్గాభవాని శరణాగతదీనాత్ర పరిత్రాయనియై విలసిల్లుతున్న క్షేత్రం శ్రీ ఏడుపాయల దుర్గాభవాని దేవస్థానం.  మెదక్ జిల్లాలో వనదుర్గగా, గరుడగంగగా ఖ్యాతిగడించిన భోగవతి నది పరిసరాల్లో అశేష భక్తులచే ఆరాదించబడుతున్న ఈ పవిత్ర తీర్థయాత్ర స్థల మహత్యాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. 

ఆస్తికుని ఉపదేశంతో సర్పయాగాన్ని నిలుపుదల చేసిన జనమేజయుడు.. అతని సూచన మేరకు పాతాళం నుంచి భోగవతి నదిని తెచ్చి ఈ ప్రాంతాన్ని పవిత్రం చేయాలని గరుత్మంతుని కోరగా తల్లి వినతి ఆనతితో శ్రీ మహావిష్ణువును తలచి భోగవతిని తెచ్చి విదుర భూములలో వదిలాడట. సమస్త లోకతాపములను శాంతిప జేస్తున్న ఆ నదిని గరుడుడు తేవడం వలన గరుడ గంగగా ప్రసిద్ధి చెందింది. ఈ నదీమ తల్లిని దండకారణ్యపు రాళ్లు రప్పలు గుట్టలు దాటుతూ సర్పయాగం జరిగిన ఈ ప్రదేశానికి తీసుకు వచ్చాడట. వచ్చే దారిలో వశిష్ఠ, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, కశ్యపుల ఆశ్రమాల మీదుగా పారుతూ వారిని సత్కరించి వశిష్ఠ  కౌశికి మధ్య గుహాంతరాళంలో సకల దుర్గతులు నశింపజేస్తూ దుర్గమ్మ తల్లి వెలసింది. శ్రీ దుర్గా మాత చరణ స్పర్శతో ఋషుల పరిచర్యలతో యజ్ఞ యాగాది నిర్వాహకులకు సద్గతులు కూర్చింది. ఈ గరుడ గంగ నదిని ఏడుగురు ఋషులు స్వాగతించడం వలన ఏడుపాయలుగా విడిపోయి వారి ఆశీస్సులతో పవిత్రమైంది.   

మహిమాన్వితమైన దివ్య భావాని క్షేత్రాలలో ఏడుపాయల దుర్గాభవాని ఒకటి. జనమేజయుడు సర్పయాగం తలపెట్టిన ప్రాంతం. ఆస్తిక మహర్షి ఆ యాగాన్ని మాన్పించి మహారాజుచే యజ్ఞ సద్గున్యం కోసం శ్రీ దుర్గ భావానిని మహా వైభవోపేతంగా ఆరాధించిన ప్రాంతం ఇదేనని స్థలపురాణం. మెదక్ జిల్లా పాపన్న పేట మండలం నక్షానిపల్లిలో శ్రీ ఏడుపాయల దుర్గాభవాని దేవాలయం ఉంది. ఏడుపాయలుగా గంగ చీలి ప్రవహిస్తున్న చోట ఆలయం ఉంటుంది. గర్భాలయంలో శ్రీ దుర్గామాతను భక్తులు దర్శించుకొని పునీతులవుతారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని భక్తి పారవశ్యంతో మునిగిపోతుంటారు. భక్తితో ప్రణమిల్లి నానావిధ అర్చనలు చేస్తారు. కొలుపులు జరుపుతారు. అలాగే అమ్మవారికి జాతరలు చేస్తారు. అమ్మవారికి ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తారు. గర్భాలయంలో దుర్గాదేవి స్వయంభువుగా వనదుర్గగా వెలసింది. అమ్మ దర్శనానికి ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం విశేషించి భక్తులు వస్తుంటారు. నిజానికి మహాశివరాత్రికి అమ్మవారికి పెద్ద ఎత్తున జాతర జరుపుతారు. 

తెలంగాణలో సమ్మక్క -సారలమ్మ జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతరగా ఏడుపాయల వనదుర్గ జాతరను పేర్కొంటారు. ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఏటా 9నుంచి 10 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అమ్మవారి పాదాల దగ్గర మహిషాసురమర్ధిని కనుక ఎనుబోతు తల కనిపిస్తుంది. ముందు పళ్లెంలో చిన్న దేవతామూర్తిగా ఉన్న విగ్రహానిని అర్చకులు కుంకుమార్చనలు నిర్వహిస్తారు.

మంజీరా నది 7 పాయలుగా ప్రవహిస్తున్న ఈ స్థలం మధ్యలోనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ముందు మూడుపాయలు వెనుక 4 పాయల నడుమ ఆలయం కొలువై ఉంటుంది. ఈ అమ్మవారును భక్తి శ్రద్దలతో నమ్మి పూజిస్తే ఏడుపాయల వనదుర్గా భవాని కోరిన కోర్కెలను తీరుస్తుందని భక్తుల విశ్వాసం. దుర్గాభవాని ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు, నిత్యహారతులు, పూజలు నిత్యం జరుగుతాయి. ఈ ఆలయంలో అమ్మవారికి ఒడి బియ్యలు పోయడం, అలాగే పిల్లలకు పుట్టెంట్రుకలు తీయడం వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు. 

సింహవాహినియై వీణావాణియై మాత దర్శనం ఇస్తుంది. భక్తులను అనుగ్రహించాడు వెలసిన వనదుర్గా భవానిని ఆరాధించిన వారికి సకల పాపాలు హరించి నవదుర్గల మహత్యాన్ని శక్తియుక్తులను భక్తులకు ప్రసాదిస్తుంది. గోపురం ఎదురుగా నదిలో ఉన్న దేవాలయాన్ని సహజ సుందర రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ ఆలయం ఎదురుగానే శివాలయం ఉంది. ఆదిపూజలందుకునే వినాయకునికి భక్తితో ప్రణమిల్లి మొదటగా పూజలు చేస్తాం. గర్భాలయంలో శివపార్వతుల విగ్రహాలు ముందు శివలింగం దర్శనమిస్తుంది. ఆస్తిక మహర్షి విగ్రహంగా కొందరు పేర్కొనే ఋషి విగ్రహం కానవస్తుంది. ఐదంతస్తుల గాలిగోపురానికి కుడివైపున ముత్యాలమ్మ గుడి ఉంది.

ముందు పోతరాజు బండ, ఆలయంలో ముత్యాలమ్మ తల్లి చిన్నవిగ్రహం దర్శనమిస్తుంది. దుర్గాలయం పైన మునిపుట్టగా పేర్కొనబడే విశేష స్థలం ఉంది. భృగుమహర్షి తపస్సు చేసిన స్థావరంగా దీనిని చెబుతారు. ఏడు పాయలుగా మాజీరానది గరుడ గంగగా ఇక్కడ ప్రఖ్యాతమైంది. మునిపుట్ట దగ్గర జై భవాని ఎల్లమ్మ గుడి ఉంది. ఎదురుగా ముందు నాగదేవత దర్శనం ఇస్తుంది. చేత సర్పాలను దాల్చి పడగల సర్పముఖియై దర్శనం ఇస్తుంది. ఇక్కడి ఎల్లమ్మ దేవతకు భక్తులు ముడుపులు కట్టి కొలుస్తారు. ఇలా వనదుర్గా దర్శనానికి వచ్చిన భక్తులు.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని పునీతులవుతారు.

Show More
Back to top button