
రాజుకు ఆగ్రహం వస్తే తల తీస్తాడు, అనుగ్రహం అయితే ఆసనమిచ్చేస్తాడు”. ఇది అక్షరాలా నిజం.
17వ శతాబ్దములో కార్వేటి నగర సంస్థానంలో ఒకనాటి సంధ్యా సమయంలో ప్రభువును శ్రీ మన్మహామండలేశ్వర కఠారి “సాల్వరాజు పెరుమాళ్ళు” తన దర్బారులో ఆసీనులై ఉన్నారు. చప్పట్లు మ్రోగాయి. నాట్యానికి తెర తొలగింది, నాట్యం ప్రారంభమైంది. “క్షీరసాగర మథనం” అనే నాట్యం. అమృత కలశం చేతబూనిన ఒక మోహినీ ఒకవైపు, రాక్షసులు మరోవైపు ఉన్నారు. మోహినీ అపూర్వంగా నవరసాల్ని కురిపిస్తూ నాట్యం చేస్తోంది. ఆమెలో ఎంత వయ్యారం? ఏమి లావణ్య? ఆమె రూపం దేవలోకం నుండి నిజంగానే దిగివచ్చిన జగన్మోహినిని తలపింపజేస్తుంది. ఆ మోహినీ వయ్యారంగా నడుస్తూ అమృతం పంచుతోంది. ఆమెను చూసిన రాజు సమ్మోహనం చెందారు. చూపు త్రిప్పుకోలేకున్నాడు. మనసంతా ఏవేవో ఆలోచనలు, అంతటి లావణ్యమూర్తిని ఎలాగైనా పొందాలనే కోరికలతో, ఊహలలో తేలియాడుతుండగానే నాట్యం అయిపోయింది. ఆమె వెళ్ళిపోయింది.
“సాల్వరాజు పెరుమాళ్ళు” కు అంతా అయోమయంగా వుంది. ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఆకలి అనిపించడం లేదు, సురాపానం కూడా ముట్టడం లేదు. ఆమె పాదం రాజుగారి గుండెల మీద నర్తిస్తూనే వుంది. తీవ్రమైన విరహవేదనను అనుభవిస్తున్నారు. “రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా”! ఆమె అంతఃపురానికి రావలసిందిగా భటులతో కబురు పంపించారు. కానీ తాను మాత్రం క్షణమొక యుగంలా నిరీక్షిస్తున్నారు. అంతలోనే గజ్జెల చప్పుడు వినిపించింది దాంతో సాల్వరాజు పెరుమాళ్ళుకు గుండె ఆగినంత పనైంది. ఏమి అందం, ఏమి అందం. తన కళ్ళను తాను నమ్మలేకపోతున్నారు.
ఆ కళ్ళతోనే రాజు, ఆమె అందం త్రాగేస్తున్నారు. తాను అనుభవిస్తున్న విరహవేదనను రాజు ఆమెకు వివరించారు. ఆమెపై తాను పెంచుకున్న కోరికను తెలియపరిచారు. ఇప్పటికివరకు నీలాంటి అపురూప సౌందర్యవతిని ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నాడు ఆమెతో. ఇకముందు కూడా చూడలేరు ప్రభూ అంటూ తన సవరం తీసేసింది మోహినీ. తన వేషం విడిచేసింది. రాజు నిర్ఘాంతపోయారు. తేరుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆమె మోహినీ కాదు. సారంగపాణి, మగవాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నారు
ముందు దెబ్బతిన్నారు రాజా వారు. ఆ తరువాత చకితులైపోయారు. మీరు మగవారా? శభాష్.. శభాష్.. ఇంత భ్రాంతిని కలిగించిన మీరు మహానటులు అంటూ తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని సారంగపాణికి బహుకరించారు. రాణీ వారిని పిలిపించి “చూశారా మహారాణీ, ఆయన మోహినీగా మారిపోయి మా మనసును దోచుకున్నారు. మా జీవితంలో ఇదో మధుర ఘట్టం” అన్నారు. నాజీవితంలో ఇదో మధుర ఘట్టమే అని తన మనసులో అనుకుంది మహారాణి. రాజు, రాణిలకు నమస్కరించి సారంగపాణి వారిద్దరి వద్ద సెలవు పుచ్చుకున్నారు. సారంగపాణి 18 వ శతాబ్దపు ప్రముఖ తెలుగు వాగ్గేయకారులు.
“అన్నమాచార్యునితో ఆరంభమైన శృంగార ఆధ్యాత్మ పదాలుగా రూపుదిద్దుకొని పెద, చిన తిరుమలాచార్యులతో కొనసాగి క్షేత్రయ్యతో సుస్థిరపడిన సంకీర్తన కవిత” ను విస్తృత పరిచినవారు సారంగపాణి. ఆయన 17వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లోని కార్వేటినగరం గ్రామంలో నివసించిన కర్ణాటక సంగీత స్వరకర్త. భరతనాట్య ప్రదర్శనల సమయంలో పాడే కర్ణాటక పాటల రకం, పదంల కూర్పుకు ఆయన బాగా ప్రసిద్ధి చెందారు. స్థానిక రాజు వెంకట పెరుమాళ్ ఆస్థానంలో సారంగపాణి విద్యా మంత్రిగా కూడా ఉండేవారు.
సారంగపాణి నేపథ్యం…
సారంగపాణి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కార్వేటినగరం సంస్థానంలో ప్రసిద్ధి చెందిన పదకర్త. ఈయన చెన్నపురి సమీపంలోని పొన్నేరులో 1680 వ సంవత్సరంలో జన్మించారు. తరువాత కార్వేటి నగరం చేరి ఆస్థానంలో స్థిరపడ్డాడు. వేణుగోపాల స్వామి ముద్రతో అనేక పదాలు రచించార. 1917-1732 సంవత్సరాలలో రాజుగా పరిపాలన చేసిన నూకరాజు వేంకట పెరుమాళ్ళరాజు మరియు అతడి అతని సోదర పుత్రుడు నూకరాజు కార్వేటి రాజు పరిపాలించిన 1733-1752 సంవత్సరాలలో “కార్వేటి నగర” ఆస్థాన విద్వాంసుడిగా ప్రసిద్ధికెక్కారు. తాను సంస్కృతాంధ్ర భాషా కోవిదుడనీ, సంగీతాభినయాల్లో పరిపూర్ణ జ్ఞానం కలవాడని అతను వ్రాసిన పదాల ఆధారంగా తెలుస్తుంది. ఇప్పటివరకు తాను రచించిన 201 రచనలు లభించాయి. అందులో క్షేత్రయ్య పదాలు 06 లభించగా, మిగిలిన 195 పదాలు సారంగపాణివి లభించాయి.
వాటిలో ప్రథమ భాగం, ద్వితీయ భాగం, శృంగార పదాలు, దేశీయ పదాలు అను నాలుగు రకాల పదాలున్నాయి. వీటిలో వేశ్యావిలాస, చూషణలు వివరించబడ్డాయి. తృతీయ భాగం జాతీయ పదాలు. వీటిలో జానపద భాషాధోరణి స్పష్టమవుతుంది. ఆయన రచించిన పదాలలో నాల్గవ భాగం కీర్తనలు. ఇవి నీతి, వైరాగ్య, తత్వ ప్రబోధాలు. వీటిలో మూడు పదాలు నూకరాజు కార్వేటి రాజుకు అంకితమై ఉన్నాయి. మిగిలినవి కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామి వారికి అంకితమైనవి. మాములుగానే సారంగపాణి వైణీకులు. అతని పదాల్లో సంగీత సాహిత్యాలకు సమ ప్రాధాన్యతనిచ్చారు. నూకరాజు వేంకట పెరుమాళ రాజు 1731 సంవత్సరంలో సారంగపాణికి “దుర్గ రాజపురం” అనే అగ్రహారం దానమిచ్చారు. కానీ రాణి చేసిన పొరపాటు వలన చివరి కాలంలో రాజు యొక్క ఆశ్రయం కోల్పోయి నిరుపేదతనంతో అష్టకష్టాలు అనుభవించారు. చివరలో సారంగపాణి వ్రాసిన పదాలు ముద్రణకు నోచుకోలేదు.
సారంగపాణికి బహుమానంగా దుర్గరాజపురం..
శ్రీకృష్ణదేవరాయ కాలంలో విజయనగరంలో విజయ రాఘవడు, రఘునాథ భూపాలుని కాలాల్లో, తంజావూరు రాజ్యాల్లో నాట్యానికి అధిష్టానవర్గం నర్తకీమణులు దేవదాసీలు. సామ్రాజ్యాలు పోయినా కూడా ఆ సంప్రదాయపు ఛాయలు మనుష్యుల నుండి వస్తూనే ఉన్నాయి. అలా వచ్చిన సాంప్రదాయ బిందువులో అణువు నాట్యానికి సంబంధించిన పదంగా చెప్పవచ్చు. సారంగపాణి చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరాధీశుడి ఆస్థాన వైణికుడిడు మాత్రమే కాదు, తాను పదకర్త, నాట్యాచార్యుడు, నటుడు. తాను పరీక్షాధికారిగా కూడా ఉన్నారు. గోవింద సామయ్య, కూవన సామయ్యలకు సమకాలీనడు సారంగపాణి.
రాజా శహాజీ మహారాజుకు సమకాలీనులు కార్వేటి నగర ప్రభువు మాకరాజు పెరుమళ్ళ. ఆయన సారంగపాణిని ఆదరించి తన ఆస్థాన విద్వాంసులుగా నియమించుకున్నారు. ఆ కార్వేటి నగర ప్రభువులైన శ్రీ మన్మహామండలేశ్వర కఠారి సాళ్వరాజు పెరుమాళ్ళు ఆస్థానపు వైణిక పండితుడిగా ఉన్న సారంగపాణినికి 18 వ శాతబ్దంలో తన సంస్థానంలోని దుర్గరాజపురం అనే గ్రామాన్ని సారంగపాణికి దానం చేయించారు. దాంతో సారంగపాణికి గ్రాసవాసాలకు లోటు లేకుండా పోయింది. గ్రామాన్ని దానంగా పొందాడు గనుక కార్వేటి నగర ప్రభువు కోరిక మన్నించి మహారాజు మీద కొన్ని పదాలు, వేణుగోపాలస్వామి మీద కొన్ని పదాలు వ్రాశారు సారంగపాణి. అవి సారంగపాణి పదములుగా అచ్చయ్యాయి.
సారంగపాణి పదాలను ముద్రించిన గరిమెళ్ళ…
కర్ర నూనుకుని దిరుగక మునుపే కంఠధ్వని తగ్గిపోక మునుపే అర్రు ముందరికి వంగకమునుపే
అంగము, తల, వణుకెత్తక మునుపే అప్పుల కాపులు కదియక మునుపే అన్నమొకరు దినిపించక మునుపే
దోప్పలోన చేయి కడగక మునుపే దోవతి బరువై తోచక మునుపే హరినామ స్మరణ సేకుంటే
అవతల గతి ఏమి?
ఇవి ఒకప్పుడు బిచ్చగాళ్ళు, సాతానులు పాడే వేదాంతపు పాటలు. ఇవి బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవాలయంలో భక్తులు పాడే పాటలు. ఇవి కార్వేటి నగర వేణుగోపాలస్వామి మీద సారంగపాణి వ్రాసిన పదాలు. ఈయన వ్రాసిన పదాలు చెన్నపురిలో 1867 అచ్చువేశారు. సారంగపాణి దౌహిత్రుడు గరిమెళ్ళ వెంకటసుబ్బయ్య చేత వేలటూరు సుబ్రహ్మణ్యం “విద్యా విలాస ముద్రాక్షర శాల” లో ముద్రించబడ్డాయి. ఆ పుస్తకం లోని పదాలను బొబ్బిలిలో ఉండే ముసలమ్మలు, బిచ్చగాళ్ళు పాడుతుండేవారు. ఎక్కడ బొబ్బిలి? ఎక్కడి కార్వేటి నగరం? సంగీత కళ అనేది ప్రజలకు అనుకూలమై, ప్రజల ఆమోదం పొంది, పరిసరాలపై ప్రభావం చూపిస్తూ వ్యాప్తి చెందుతుంది. ఎక్కడో పుట్టిన నది ఎక్కడెక్కడో మలుపులు తిరుగుతూ ఊరకలేసే జీవనదీయానం లాగా సారంగపాణి వ్రాసిన “పదాలు” కూడా జనాల పెదవుల మీద ప్రయాణం చేస్తూ అలా ప్రాంతాలు దాటి వెళ్లిపోయాయి. ప్రజల భావాలను అర్థం చేసుకొని, వారి భావాన్ని కవిత్వంలో, పదకీర్తనలో ప్రతిబింబింప చేయడం వాగ్గేయకారుడిగా సారంగపాణి సఫలీకృతులయ్యారు.
సారంగపాణిని మోహించిన మహారాణి…
సారంగపాణి అద్భుతమైన ప్రజ్ఞాపాటవాలు గలవారు. దానితో పాటు మంచి రూప లావణ్యాలు కూడా ఉన్నవాడు. ఆయన నాట్యం నేర్పేవారు. తాను స్వయంగా నాట్యం కూడా చేసేవారు. సారంగపాణి ఒకసారి స్త్రీ వేషం వేసుకొని రాజదర్బారులో నాట్యం చేస్తున్నారు. ఆ రాజదర్బారులో నాట్యాన్ని చూస్తున్న వారు నాట్యం చేస్తున్న సారంగపాణి స్త్రీ కాదు పురుషుడు అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆఖరుకు రాజు సాల్వరాజు పెరుమాళ్ళు కూడా నమ్మలేదు అంటే ఆశ్చర్యం కలుగకపోదు. ఆడ వేషంలో ఉన్నారు. సారంగపాణిని చూసి స్త్రీ అనే సంగతి తెలియక మహారాజు కూడా సమ్మోహితుడై వ్యామోహం పెంచుకున్నారు. సారంగపాణి గురించి తెలిసిన మహారాణి కూడా అతని మీద వ్యామోహం పెంచుకుంది. రాణి వారి అంతఃపురంలో రాణికి నిద్ర లేదు.
ఏమి లావణ్య రూపం? ఏమి తేజోవంతమైన కళ్ళు? ఏమి మగటిమి? మహారాణికి కలగకూడని కోరిక కలిగింది. తన అంతరంగిక చెలికత్తెతో కబురు పెట్టింది. రాజావారు మళ్లీ పిలిపించారని తెలియగానే అమాయకంగా అంతఃపురానికి అడుగుపెట్టారు సారంగపాణి. ఎదురుగా రాణి విరహవేదనతో, కోర్కెతో కాగిపోతుంది. ఆమె కాటుక, కామం కలిసి కళ్ళు విచిత్రంగా మండుతున్నాయి. కోర్కె తీర్చమని చేయిపట్టుకోబోయింది. తనను అనుభవించమంది. తనని పెళ్లాడమని కోరింది మహారాణి. సారంగపాణి మహారాణి కాళ్ళ మీద పడ్డాడు. తల్లీ.. నీవు రాజు గారి భార్యవి. నాకు అమ్మతో సమానం. మీకిది తగదు అని బ్రతిమాలాడు, వాపోయాడు కూడా.
పై విధంగా మహారాణి మరియు సారంగపాణిల మధ్య చర్చ జరుగుతుండగా సాళ్వరాజు పెరుమాళ్ళు వారు అక్కడికి రానే వచ్చారు. సారంగపాణి తనను తిరస్కరించారని కోపంతో, రాణి వారు గారు తనను సారంగా పని రాజు గారికి తన మీద అనుమానం వస్తుందన్న భయంతో, తన తప్పు కప్పిపుచ్చుకోవాలని తపనతో మహారాణి మాట మార్చేసింది. సారంగపాణి తనను అనుభవించాలనే ఉద్దేశ్యంతో వచ్చాడని, ఇలాంటి వాళ్లకు మనం ఆశ్రయం ఇవ్వకూడదు అని, అలాంటి వారిని చంపినా పాపం లేదని రాణి గారు అబద్ధం చెప్పి రోదించింది. నిశ్చలంగా, నిర్మల వదనంతో నిలబడి ఉన్న సారంగపాణిని చూసిన రాజుకు మహారాణి అబద్ధం చెప్పిందని అనిపించింది. సారంగపాణిని బయటకు పంపించేసి, అతని దగ్గర ఉన్న అస్తినంతా తీసుకున్నాడు మహారాజు. సారంగపాణిని చంపడానికి మనసు రాక వదిలిపెట్టాడు.
ఊంఛవృత్తిని చేసుకుంటూ…
తనను బలవంతం చేయడానికి వచ్చారని మహారాణి లేని నేరము సారంగపాణిపై మోపడంతో విచక్షణా రహితుడైన రాజు ముందు వెనక ఆలోచించకుండా కళాకారులను చంపకూడదు అనే ఒక సదుద్దేశ్యం నాకు ఉన్నది కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నానని చెప్పి సారంగపాణి యావదాస్తులు లాక్కొని, కట్టుబట్టలతో దేశ బహిష్కరణ విధించాడు మహారాజు. రాజావారి ఆగ్రహానికి గురై తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్న సారంగపాణి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ చేసేది ఏమీ లేక పద్యాలు పాడుకుంటూ ఊంఛవృత్తిని చేసుకునేవారు. కలికాలంలో కళాకారుడు అయిన సారంగపాణి మరోసారి దరిద్రుడయ్యారు.
అసలు సారంగపాణి అనే నామంలోనే ఏదో దోషం ఉన్నది కాబోలు. ఇంచుమించు “సారంగదరుడు కథ” కూడా ఇదేవిధంగా ఉంటుంది. సారంగపాణి బిక్షం ఎత్తి బ్రతికినా కూడా మన తెలుగుజాతికి అక్షర బిక్ష పెట్టి సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులు. సారంగపాణి పదాలు జీవిత సత్యాలను తెలుపుతాయి. మొదటి భాగంలో యవ్వన జీవితపు శృంగారం, రెండు మూడు భాగాల్లో సామాజిక స్పృహ, నాలుగో భాగంలో వృద్ధాప్యపు వైరాగ్యాన్ని సారంగపాణి తన పదాలలో ఇనుమడింపజేశారు.