వేల మందిశిష్యులను సంగీతజ్ఞులుగా మలిచిన విద్వాంసుడు.గరికిపర్తి కోటయ్య దేవర

అది రక్తాక్షి నామ సంవత్సరం 01 నవంబరు 1864 బందరులో సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తు ఎగిసిపడి 780 చదరపు మైళ్ళ పరిధిలో వచ్చిన ఆ ఉప్పెన తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించింది. సముద్రం పొంగి, ఊరు మునిగిపోయిందని చెప్పుకుంటారు. “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా మునిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. వివరాలకి ఇప్పుడు సాక్షులను ప్రవేశపెట్టలేకపోవచ్చు. కానీ ఆ వినికిడి కబుర్లే నిజం అయితే సుమారు 30,000 మంది చనిపోయారట.
బందరు సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట. దీనిని “బందరు ఉప్పెన” అని ప్రజలు అభివర్ణిస్తారు. సరిగ్గా అదే ఉప్పెన సమయంలో మచిలీపట్నంకు చెందిన ఇంగ్లీషుపాలెంలో కూడా తాడెత్తు సముద్రపు అలలు విలయతాండవం చేస్తుంటే పెద్ద పెద్ద చెట్లు పెళ పెళ విరిగి పడిపోతున్నాయి. పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి, పెంకుటిళ్ళు నేల కూలిపోతున్నాయి, గుడిసెలు నీటిలో తేలిపోతున్నాయి. ఆ ప్రవాహంలో పశువులు కొట్టికుపోతున్నాయి, మనుషులు కూడా కొట్టుకుపోతున్నారు. ప్రాణభీతి, ప్రకృతి బీభత్సం.
ఆ బందరు ఉప్పెన ప్రవాహంలో ప్రతీ ఒక్కరు ప్రాణభీతితో పరుగెత్తుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు పారిపోతున్నారు. అదే ప్రవాహంలో ఒక చెక్క ఉయ్యాల తేలుతూ వెళుతుంది. ఆ తేలుతున్న ఉయ్యాలలో ఏడుస్తున్న ఒక పసిపిల్లాడు ఉన్నాడు. ఆ పసిపిల్లాడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు. ఆ వరద ఉధృతికి ఉయ్యాల కొట్టుకుపోతూనే వుంది. ఆ ఎదురుగుండా ఒక పెద్ద లోయ ఉంది. ఉయ్యాల అందులో పడిందా అంతే సంగతులు. కానీ అదృష్టవశాత్తు ఆ ఉయ్యాల వెళ్లి ఓ కుంకుడు చెట్టు కొమ్మకు తట్టి, అక్కడే చిక్కుకుపోయింది. ప్రకృతికి కోపం చల్లారిందేమో కాబోలు, శాంతించింది. ఉప్పెన తగ్గిపోయింది. చెట్టు కొమ్మకు చిక్కుకున్న ఉయ్యాలలో ఉన్న పిల్లాడు కెవ్వున కేకపెట్టి ఏడ్చాడు. వరద ఉధృతి తగ్గిన దగ్గరి నుండి ఊరంతా వెతుకుతూ గుండెలు బాదుకుంటున్న తల్లికి ఆ కుంకుడుచెట్టుకు తట్టుకున్న ఉయ్యాలలో ఏడుపు వినిపించింది. పరుగు పరుగున వచ్చి ఆ ఉయ్యాలలోంచి ఆ పిల్లాడిని తీసుకుని గుండెలకి హత్తుకుంది. ముద్దుల మీద ముద్దులు పెట్టింది. కోటి దేవతలకు దండాలు పెట్టింది. అలా ఉప్పెన నుండి బ్రతికి బయటపడ్డ పిల్లవాడే గరికపర్తి కోటయ్య దేవర.
గరికిపర్తి కోటయ్య దేవర 19 – 20వ శతాబ్దాలకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు. ఆయన వేలాది మంది శిష్యులను సంగీతజ్ఞులుగా తయారు చేశారు. వీరశైవ జంగమ కులంలో జన్మించిన కోటయ్య దేవర చిన్న వయస్సు నుండే సంగీతం నేర్చుకున్నారు. ఇతడు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు బందరుకు ఉప్పెన వచ్చిన కారణంగా కరువు ఏర్పడి ఆర్థికంగా జరుగుబాటు కాకపోవడంతో వారు బందరు నుండి హైదరాబాదుకు మకాంను మార్చారు. కోటయ్య దేవర వాయులీన వాద్యాన్ని స్వయంగా విని ముగ్ధుడైన సాలార్ జంగ్ (హైదరాబాద్ నవాబు గారి వద్ద దివానుగా పనిచేస్తున్నారు) కోటయ్య దేవర తల్లిదండ్రుల అనుమతితో చేరదీసుకుని విద్య చెప్పించాడు. 1896లో బందరులో 300 మంది విద్యార్థులతో ఒక సంగీత పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్య, భోజన, నివాస సౌకర్యాలను కల్పించారు. 1907 లో గవర్నర్ కె.డి.యాంషైర్ ను మెప్పించి విజయవాడ నుండి మచిలీపట్నానికి రైలు మార్గం నిర్మాణానికి కారణం అయ్యారు. కోటయ్య దేవరను సంగీతం కోటయ్య దేవర, జంగం కోటయ్య దేవర అని కూడా పిలిచేవారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : గరికిపర్తి కోటయ్య దేవర
ఇతర పేర్లు : కోటయ్య
జననం : 1861
స్వస్థలం : ఇంగ్లీషుపాలెం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : సంగీత విద్వాంసుడు, సంగీత శిక్షకుడు
తండ్రి : లక్ష్మయ్య
తల్లి : బసవమ్మ
పిల్లలు : పాపయ్య నాగం దేవర, సుబ్రహ్మణ్యం దేవర, చంద్రమౌళి దేవర, రాజమౌళి దేవర
మరణం : 1924
నేపథ్యం…
ఆంధ్ర గాయక పితామహుడుగా పేరున్న గరికిపర్తి కోటయ్య దేవర ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం దగ్గరలో గల ఇంగ్లీషుపాలెం లో 1861 వ సంవత్సరంలో జన్మించారు. వీరశైవ జంగమ కులానికి చెందిన లక్ష్మయ్య, బసవమ్మ దంపతుల కుమారుడే గరికిపర్తి కోటయ్య దేవర. ఇతడి తండ్రి ఫిడేలు బాగా వాయించేవారు. ఇతడు చిన్న వయస్సు నుండే తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఇతడు తనకు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు బందరుకు ఉప్పెన వచ్చిన కారణంగా కరువు ఏర్పడి, జీవనం కొనసాగడం కష్టం అవుతుండడంతో ఇతని తండ్రి తన మకాంను బందరు నుండి హైదరాబాదుకు మార్చాడు. ప్రతీ మనిషికి ఏ విద్య అబ్బాలన్నా పూర్వజన్మ సుకృతంతో పాటు పరిసరాల ప్రభావం, ఆ విద్యకి సంబంధించిన వాతావరణం ఉండాలి లేదా ఆ విద్య మీద అభిమానంతో దాని పొందాలనే ఆశతో ప్రయత్నించాలి.
నిజానికి కోటయ్య జంగమ కులంలో సంగీత వాతావరణంలోనే పుట్టారు. ఆయన తన తండ్రి వయోలిన్ వాయిస్తే తప్ప నిద్రపోయేవారు కాదు. ఆయన అన్నప్రాసన చేసినప్పుడు వస్తువులన్నీ వదిలేసి వయోలిన్ తీగలు మీటడం సంగీతాభ్యాసానికి మరింత ప్రోత్సాకాలయ్యాయి. కోటయ్య దేవరకి అయిదేళ్లు నిండాయి. తనని చదువు కోసం బడిలో చేర్పించారు. కానీ కోటయ్యకు చదువు అబ్బడంలేదు. ఒక కొబ్బరి చిప్పకు తీగలను కట్టి, గుర్రపు వెంట్రుకలు కట్టి కమానుతో వాయించడం మొదలుపెట్టారు. అందులో నుండి అప్రయత్నం గానే అద్భుతమైన నాదం పుట్టింది. పిల్లనగ్రోవి మీద పెదవి ఆనిచ్చి జగత్తునంతా మత్తులో ముంచి పరవశింపజేసిన మురళీకృష్ణుడి లాగా కోటయ్య కొబ్బరిచిప్ప మీదనే కోటి రాగాలు పలికించేవారు. నిజానికి కోటయ్య దేవరకు సంగీతం గురించి తెలియదు, సంగీత నేర్పించే గురువు కూడా లేడు. అయినా కూడా ఆయన వాయించే సంగీతం విన్నవారంతా మంత్రముగ్ధులైపోయేవారు.
గాయకుడు చిన్నన్న వద్ద శిక్షణ…
గరికిపర్తి కోటయ్య దేవర కుటుంబం స్వతహాగా జంగమ వారవ్వడం, కోటయ్య దేవర తండ్రి లక్ష్మయ్యకు అంతో ఇంతో సంగీతం వచ్చి ఉండడంతో కొడుకు కోటయ్యకి సరళీ స్వరాలు నేర్పాడు లక్ష్మయ్య. దాంతో తాను నేర్చుకున్న సంగీత సరళీ స్వరాలు, జంట స్వరాలు, కీర్తనలు అన్నీ కూడా కొబ్బరి చిప్పమీదనే వాయించేవారు. ఒకరకంగా చెప్పాలంటే సంగీత సరస్వతికి కొబ్బరి చిప్పలోనే నైవేద్యం పెట్టేవారు. సంగీత విద్య వచ్చి వుండాలే కానీ ఏ వాయిద్యం మీద అయినా సంగీతం పలికించగలరు. కోటయ్య దేవర వాయించే స్వరాలను నెమ్మది నెమ్మదిగా శృతిబద్ధంగా, లయబద్ధంగా తానే స్వయంగా నేర్చుకున్నారు.
కాలం గడుస్తున్నా కొద్దీ జీవనం కోసం కోటయ్య దేవర తల్లిదండ్రులు హైదరాబాదుకు వచ్చేశారు. అప్పుడు కోటయ్య స్థాయి కొబ్బరి చిప్ప నుంచి వాయులీనం దాకా వచ్చింది. హైదరాబాదు వచ్చిన కోటయ్య దేవరకు వాయిద్యంతో బాటు గానం కూడా వంటబట్టింది. రోజూ అరుగు మీద కూర్చుని అద్భుతంగా వాయిస్తూ ఉండేవాడు. ఒకరోజు హైదరాబాద్ సంస్థానం మంత్రి సాలార్జంగ్ బహద్దర్ వ్యాహ్యాళికెళ్తూ ఆ కుర్రాడు వాయించే వాయిద్యం మీద ముచ్చట పడిపోయి, కుర్రాడు భుజాలు తట్టి తనతో తీసుకెళ్లి చిన్నన్న అనే గాయకుడికి అప్పజెప్పి సంగీతం నేర్పమన్నాడు. ఆయన వద్ద పదేళ్ళ పాటు సంగీతం నేర్చుకున్నారు కోటయ్య దేవర. ఆ పదేళ్లలో ఇటు హిందుస్తానీ, అటు కర్ణాటక సంగీతాన్ని జుర్రేశారు.
హైదరాబాదు సంస్థానంలో గవాయిగా…
1885 వరకు నిజాం దేవిడీలో జరిగే సంగీత సభల్లో, ప్రముఖ హిందుస్తానీ గాయకుల గానాన్ని వింటూ ప్రత్యేకించి తన వాద్యానికి ఒక ప్రత్యేక బాణీని శోభాయమానంగా చేసుకున్నారు కోటయ్య దేవర. ఆయనను సంగీత ప్రవీణుడైన, గాయకుడిగా తయారుచేసిన రాజగోపాల చారి అనే జాగీరుదారు నవాబ్ జఫ్ఫర్ జంగ్ దేవిడీలో గవాయిగా (గాయకుడిగా) నియమించారు. ఆ తరువాత హైదరాబాదు సంస్థానంలో గవాయిగా నియమితుడయ్యారు. గవాయిగా తనని నియమించినందుకు కృతజ్ఞతగా రాజగోపాలచారి పేరు మీద ఒక వర్ణాన్ని వ్రాశారు కోటయ్య దేవర. కోటయ్య దేవర అన్న గారు అతనికి అత్యంత చేదోడు వాదోడుగా ఉంటూ అతడి సంగీతజ్ఞతకు మరింత మెరుగులు దిద్దుకోవడానికి అతడిని తంజావూరు పంపించాడు.
1894 సంవత్సరంలో దక్షిణాది పర్యటనలో కోటయ్య దేవర సియాల నారాయణస్వామి అయ్యర్, తిరుక్కోడికావై కృష్ణయ్యర్ తో కలిసి తంజావూరు హెచ్.ఎస్.పకారా మహారాజా ఆస్థానానికి వెళ్ళాడు. గవాయి వేశంలో ఉన్న కోటయ్య దేవరను చూస్తూ మహమ్మదీయుడు అనుకున్నాడు ఆ మహారాజు. అతను కర్ణాటక శాస్త్రీయ సంగీతం పాడుతారంటే ఆ మహారాజు మరింత ఆశ్చర్యపోయాడు. అంతకుముందే హైదరాబాదు విద్వాంసుడిగా అతనికి కీర్తి రాజా వారు వినే ఉన్నారు. అందువలన రాజా వారు కోటయ్య దేవర పాటను విని తన ఆస్థాన విద్వాంసుడిగా ఉండమని కోరాడు. ఆ రాజుకు మాట ఇవ్వలేక కోటయ్య దేవర సున్నితంగా తిరస్కరించారు. అతడిని రాజా వారు ఘనంగా సన్మానించారు.
పెంపుడు కుక్కలచే ఆర్గాన్ తొక్కించి…
1869 వరకు దక్షిణాది పర్యటన ముగించుకున్న కోటయ్య దేవర తిరిగి బందరు వచ్చేసారు. బందరు లోనే ఒక సంగీత పాఠశాల ఏర్పాటు చేసి తాను ఆర్జించిన ధనంతోనే అనేకమంది విద్యార్థులకు సంగీత బోధన చేశారు కోటయ్య దేవర. ఆ విద్యార్థులకు ఉచితంగా భోజన వసతులు కూడా కల్పించారు. వారికి విద్యాదానం, ఇతర సౌకర్యాల కోసం అయ్యే ఖర్చులు వల్లూరు చల్లపల్లి సంస్థానాధిపతులు ఇచ్చేవారు. ఆ విధంగా జమీందారులు తమ కళాభిమానాన్ని నిలబెట్టుకున్నారు. కోటయ్యకు ఉండే లోకానుభవం వల్ల ఏర్పరచుకున్న బాణీ, దేవర బాణీగా ప్రసిద్ధి పొందింది.
ఒకసారి వల్లూరు సంస్థానంలో ఒక సంగీత కచేరి జరిగింది. ఆ సభలో తన పెంపుడు కుక్కలు ఆర్గాను వాయించాయి. కోటయ్య దేవర తన పెంపుడు కుక్కలకి ఆర్గాను తొక్కడం నేర్పించి ఆరోజు సభను రంజింప చేయగలిగారు. గరికిపర్తి కోటయ్య దేవర దక్షిణాది సంస్థానంలో సన్మానితులై సంగీత విద్య వ్యాప్తికి కృషి చేశారు. పశుర్వేత్తి, శిశుర్వేత్తి అని అంటారు. శిశుర్వేత్తి అనగానే మనకు మళ్ళీ బందరు ఉప్పెన, ఆ ప్రళయం, అందులో ఉయ్యాల, ఆ ఉయ్యాలలో వటపత్రశాయిలా కోటయ్య దేవర కుంకుడు చెట్టు గుర్తోస్తున్నాయి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా! అందుకే కదా ఆరోజు ఉయ్యాల కుంకుడు చెట్టుకు చిక్కుకుంది.
బందరు కు రైలు మార్గం…
గవర్నర్ కె.డి.యాంషైర్ 1903 వ సంవత్సరంలో ఒకసారి బందరు పర్యటనకు విచ్చేశారు. ఆ సమయంలో కోటయ్య దేవర పాట కచ్చేరీ ఏర్పాటు చేశారు. కోటయ్య దేవర స్వయంగా ఇంగ్లీషు ట్యూనులో ఒక పాట కట్టి గవర్నరుకు వినిపించారు. బందరు నుండి విజయవాడకు వెళ్ళాలంటే కాలి నడకనో, లేక పడవల మీదనో భయాందోళనలతో ప్రయాణం చేయవలసి వస్తుంది. బందరు నుండి బెజవాడకు రైలు మార్గాన్ని నిర్మించమని తన పాటతో గవర్నరును కోరారు కోటయ్య దేవర. ఆ పాటను విని గవర్నరు ఎంతో ఆనందించి విజయవాడ నుండి మచిలీపట్నానికి రైలు మార్గం నిర్మాణం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 1907 వ సంవత్సరంలో విజయవాడ నుండి మచిలీపట్నానికి రైలు మార్గం నిర్మాణం పూర్తి చేయించారు. ఈ రైలు మార్గం ఏర్పడటానికి ప్రత్యక్షంగా కోటయ్య దేవర కారణభూతుడయ్యారు.
మరణం…
కోటయ్య దేవరకు వివాహం తరువాత నలుగురు కుమారులు కలిగారు. వారు పాపయ్య నాగం దేవర, సుబ్రహ్మణ్యం దేవర, చంద్రమౌళి దేవర, రాజమౌళి దేవర. వీరిలో పాపయ్య నాగం దేవర ఫ్లూట్ వాయిద్యంలోను, సుబ్రహ్మణ్యం దేవర వయోలిన్ వాయిద్యంలోను ప్రతిభావంతులైనారు. చంద్రమౌళి దేవర, రాజమౌళి దేవరలు హార్మోనియం, తబలా, ఫ్లూట్, ఫిడేల్, ఆర్గన్, పియానోలు తయారు చేయడంలో సిద్ధహస్తులైనారు. ఆంధ్రగాయక పితామహుడు, గాంధర్వ కళాతపస్వి అనే బిరుదులు పొందిన కోటయ్య దేవర 1924 లో తన 63 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇతడు మరణించే నాటికి ఆరు వందల మంది శిష్యులు అతని చెంతనే ఉన్నారు.