HISTORY CULTURE AND LITERATURE

యాగంటి నంది అంతకంతకు పెరిగి రంకెలేస్తాడా?.. సైన్స్ ఏం చెబుతుంది?

మనదేశంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలల్లో యాగంటి ఉమామహేశ్వరాలయం ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ దివ్యక్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు ఏకశిలలో దర్శనం ఇస్తారు. పచ్చని ప్రకృతితో అలరాలే కొండలు అడవుల మధ్య ఉన్న ఈ దివ్యక్షేత్రం ఏపీలోని కర్నూలు పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉమామహేశ్వర స్వామి వారి లీలావిశేషాలతో పునీతమవుతున్న యాగంటి దివ్యక్షేత్ర వైభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా బనగానపల్లికి సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వరస్వామి వార్లు కొలువైయున్నారు. గుహాలయాలతో ఎంతో ప్రాచీనతను సంతరించుకున్న ఈ క్షేత్రం శైవ, వైష్ణవ సంప్రదాయాల మేరు కలయికగా విరాజిల్లుతోంది. పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరాలుతున్న ఈ దివ్యక్షేత్రం దట్టమైన అడవిలో ఎత్తయిన కొండల మధ్య కొలువైఉంది. 

యాగంటి దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల దివ్యచరిత్ర ఉంది. పురాణ మరియు చారిత్రక ప్రాశస్యం గల ఈ క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామివార్ల ఆలయాన్ని చోళులు, పల్లవులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఆయా రాజులు అసంపూర్తిగా ఉంచిన కట్టడాలను నిర్మాణాలను హరిహర రాయలు, బుక్కరాయలు అభివృద్ధి చేశారని ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ మానసిక ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులకు మనోహరంగా దర్శనమిస్తాయి.

ఆలయ కోనేరు వద్ద ప్రకార కుఢ్యాన్ని అనుకోని లోపలివైపు 52 రాతి స్తంబాలతో కూడిన సాలు మండపం ఒకటి భక్తులకు దర్శనం ఇస్తుంది.ఇక్కడ ఒక స్తంభం గాలిలో తెలియాడటం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. కోనేటి మధ్య భాగంలో నాలుగు స్తంభాలతో కూడిన మండపం ఒకటి నిర్మింపబడింది. అందులో నందీశ్వరుని శిలారూపం భక్తులకు దర్శనం ఇస్తుంది. అలాగే కోనేటి నీరు నిల్వఉండే గోడలకు లోపలివైపున అనేక శిల్పాలు భక్తులకు దర్శనం ఇస్తాయి. విజయనగర శైలిని పోలిన ఈ శిల్పాలను ఉమామహేశ్వర మూర్తి, నందీశ్వర మూర్తి, శివతాండవం, కిరాతార్జునీయం, శ్రీకాళహస్తి మహత్యం, వీరభద్ర మూర్తి, శ్రీమహావిష్ణువు, నారసింహుడు, లక్ష్మినారాయణుడు, తదితర శిల్పాలు భక్తులకు కనువిందు చేస్తాయి. 

యాగంటి మహిమోపేత క్షేత్రం మహాపురుషులు, శివభక్తుల పాదస్పర్శతో పునీతమైంది. శివభక్తులలో అగ్రగణ్యుడైనటువంటి బృంగి మహర్షి భూలోకాన్ని సందర్శిస్తూ యాగంటి ఆలయాన్ని కూడా సందర్శించాడని చరిత్ర చెబుతోంది. విశాలంగా ఉంది అలనాటి రాజుల వైభవాన్ని కళ్ళకు కట్టినటువండి ఈ ప్రాంతంలో భక్తులకు ముందుగా మెట్లు దర్శనం ఇస్తాయి. ఈ మెట్ల మీదుగా ఆలయ ప్రాంగణంలోకి భక్తులు చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ముందు భాగాన దీప స్తంభం దర్శనం ఇస్తుంది. ఈ స్తంభాన్ని నమస్కరించుకుని కొంచెం ముందుకు వెళ్తే ఆలయ గాలి గోపురం కనిపిస్తుంది.

దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఈ గాలిగోపురం అలనాటి రాజుల శిల్ప కళాసృష్టికి నిదర్శనం. గోపురంపై వివిధ దేవి దేవతల మూర్తులు భక్తులకు దర్శనం ఇస్తూ ఆధ్యాత్మిక చింతనను ఇనుమడింపజేస్తాయి. ఆలయం లోపల కుడివైపున శిలాశాసనం ఒకటి దర్శనం ఇస్తుంది. ఈ శిలాశాసనం ఆలయ వైశిష్ట్యాన్ని అవగతం చేస్తుంది. గర్భాలయానికి ఎదురుగా భక్తులకు దృష్టి మండపం దర్శనం ఇస్తుంది. పూర్వం ఇది వైష్ణవం ఆలయంగా రూపొందటం వల్లే ఈ దృష్టి మండపం ఏర్పాటు చేసినట్లు చెబుతారు. 

విశాలమైన ప్రాగణంలో సుందర కళాకృతులు మేడితమైన స్తంబాలు, ప్రాకారాలతో అలరాలే ఈ ప్రాంగణం భక్తులను మైమరచిపోయేలా చేస్తాయి. నందిని అధిరోహించిన పరమేశ్వరులు, ఉమామహేశ్వరులు, శ్రీరాముని యాగ సంరక్షణ, తాటకి సంహారం తదితర శిల్పాలు ఈ స్తంభాలపై భక్తులకు దర్శనం ఇస్తాయి. ఈ మండపం పై కప్పు మధ్య భాగంలో పద్మశిలతో కూడిన అష్టకోణం భక్తులకు దర్శనం ఇస్తుంది. యాగంటి దివ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర స్వామివార్ల లీలలతో పునీతమైంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు.. ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న నంది మండపానికి చేరుకుంటారు. మూల విరాట్టులైన ఉమా మహేశ్వరులు స్వయం ప్రతిష్టం కనుక వారు చిన్న పర్వతాన్ని చూసి నందీశ్వరులుగా కల్పించి స్వయంభువుగా ప్రతిష్ఠితం కమ్మని ఆఙ్ఞాపించాడట. ఆ ప్రకారం శ్రీ నందీశ్వరుడు చిరు పర్వతాకార నందీశ్వర రూపుడై వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. 

గర్భాలయానికి ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని తెలుస్తోంది. అలాగే యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతాన రంకెలు వేస్తాడని వీరబహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అందువల్ల ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెందింది. ఈ నంది రోజురోజుకి పెరుగుతుందని చెబుతారు. సుమారు 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడేల్పు, 8 అడుగుల ఎత్తు కలిగిన ఈ నంది ఇప్పటికి పెరుగుతుందని చెబుతారు. మహామండపం మూలలో నాలుగు స్తంభాల నడుమ ఉన్న ఈ నందికి 80-90 ఏళ్ళ క్రితం కూడా నందికి ప్రదక్షిణం చేసుకోవడానికి వీలుగా నందికి స్తంభానికి మధ్య కాళీ స్థలం ఉండేదట. కానీ ప్రస్తుతం ఈ నంది మండప స్తంభాలను అనుకోని ఉన్న కారణంగా నంది చుట్టూ తిరిగేందుకు ఏ మాత్రం అవకాశం కనిపించదు. దీనికి బట్టి ఈ నంది పెరిగిందని స్పష్టంగా అవగతం అవుతుంది. పార్వతి పరమేశ్వరుల అభీష్టం మేరకే ఇక్కడ ఇలా నందీశ్వరుడు వెలిశాడని చెబుతారు. 

యాగంటి క్షేత్రాన ఉమామహేశ్వర స్వామివారు కొలువుతీరి ఉండటానికి ఒక పురాణ గాధ ప్రచారంలో ఉంది. పూర్వం ఒకానొక సమయాన అగస్య మాహాముని భారతదేశాన్ని పర్యటిస్తూ యాగంటి క్షేత్రాన గల ప్రకృతి శోభకు పులకించి ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని నిర్మించి అందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టించబోగా విగ్రహం కాలి బొటన వేలు శిథిలం అయిందట. ఈ విఘ్నం జరిగిందని బాధపడుతూ అగస్య మహాముని శివుని గురించి ఘోర తపస్సు చేసి విగ్నం కలగటానికి గల కారణం అడుగగా ఈ క్షేత్రం శివ క్షేత్రానికి ఎక్కువ ప్రాధాన్యం కలిగివుందని మహాదేవుడు చెప్పాడట. అంతట అగస్య మహాముని యాగంటి క్షేత్రాన శివ పార్వతులను ఏక శిలలో కొలువై ఉండమని కోరాడట. అగస్య మహాముని కోరిక మేరకు శివ పార్వతులు ఏకశిలలో ఇక్కడ కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. 

అద్వితీయమైన అనుభూతికి లోను చేసే గర్భాలయం వెలుపల ఎడమవైపు భాగంలో వినాయకుడి ప్రతిమ ఒక్కటి భక్తులకు దర్శనం ఇస్తుంది. అత్యంత రమణీయంగా దర్శనం ఇచ్చే ఈ వినాయకుడి దర్శనం వలన సర్వ విజ్ఞాలు తొలగిపోతాయని భావిస్తారు. విగ్నేశ్వరున్ని దర్శించుకున్న భక్తులు.. అనంతరం గర్భాలయంలో కొలువైన ఉమామహేశ్వర స్వామివార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని ఆనందానికి గురవుతారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం అక్కడి ఉపాలయాలను దర్శించుకుంటారు. మూల మూర్తి దర్శనం అనంతరం ఆలయం వెలుపలి ప్రాంగణంలో కొలువైయున్న శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా వీరభద్ర స్వామివారు విరాజిల్లుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి, విశ్వనాథేశ్వర స్వామి వార్లను కూడా దర్శించుకొని పునీతులవుతారు. 

దేవతామూర్తులను దర్శించుకున్న భక్తులు దేవాలయానికి అనుకోని ఉన్న అగస్య పుష్కరిణికి చేరుకుంటారు. ఈ పుష్కరిణిలో ప్రవహించే జలం అత్యంత మహిమాన్వితమైందిగా చెబుతారు. ఈ పుష్కరిణికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల అనే పుణ్యక్షేత్రం నుంచి పర్వత సానువుల గుండా అదృశ్యంగా నీరు వస్తుందని చెబుతారు. ఈ రహస్యాన్ని అగస్య మహాముని శోధించాడు కాబట్టి ఈ పుష్కరిణిని అగస్య పుష్కరిణి అని పిలవటం జరుగుతుంది.

స్వామి వారి అర్చన అభిషేకాల కోసం ఈ నీటిని వినియోగిస్తారు. ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న గుహలకు చేరుకుంటారు. ఈ గుహలలో ఎందరో తపోధనులు తపస్సు చేశారని పురాణల ద్వారా తెలుస్తోంది. భక్తులు ఆలయానికి ఆనుకొని ఉన్న అగస్య గుహలకు చేరుకుంటారు. దీనికి రోకళ్ల గుహ, ముక్కంటి గుహ అని కూడా పిలుస్తారు. అత్యంత పురాతనమైన ఈ గులలోనే అగస్య మహర్షి తపస్సు చేశారని చెబుతారు. ఈ గుహలో ఉన్న శివలింగాన్ని అగస్యుడు ప్రతిష్టించాడని చెబుతారు. 

అగస్య గుహను దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న వెంకటేశ్వర గుహకు చేరుకుంటారు. ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కరించే ఈ గుహ భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి ఈ గుహలో వెంకటేశ్వర స్వామి వారు పూజలందుకుంటున్నారు. అగస్యుడు ప్రధానాలయంలో ప్రతిష్టించేందుకు విష్ణుమూర్తి విగ్రహం భిన్నం కావడంతో ఆ విగ్రహాన్ని ఈ గుహలోనే నెలకొల్పారని చెబుతారు. ఈ గుహలో పూజలందుకుంటున్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడికాలు బొటన వేలు గోరు విరిగి ఉండటాన్ని భక్తులు దర్శించుకుంటారు.

మహిమాన్వితమైన ఈ గుహలో కొలువైన శ్రీ వేంకటేశ్వరున్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అనంతరం భక్తులు ఆలయానికి ఈశాన్యం భాగాన ఉన్న శంకర గుహకు చేరుకుంటారు. ఈ గుహలో శివలింగాన్ని కూడా అగస్యుడే ప్రతిష్టించాడని చెబుతారు. శ్రీ పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి తమ కాలజ్ఞానంలోని కొంత భాగాన్ని ఈ గుహలోనే రాశాడని చెబుతారు. అలాగే బ్రహ్మం గారు వారు శిష్యురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మకు ఆమె భర్తకు ఈ గుహలనే జ్ఞానోపదేశం చేశారని చెప్తారు. 

యాగంటి క్షేతంలో కొలువైన ఉమామహేశ్వర స్వామి వారి లీలలు.. అమితమైనవి, అనన్యసామాన్యమైనవి. ఇక్కడి స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో ఏటా చేసే కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు నయనానంధకరం. ఇంతటి అద్భుతమైన శిల్పకళా కట్టడానికి ప్రతీక అయిన యాగంటి క్షేత్రాన్ని మీరుకూడా దర్శించుకొని పునీతులవ్వండి. సర్వేజనా సుఖినోభవంతు..!!

యాగంటి నంది పెరగటంపై మిస్టరీ.. సైన్స్ ఏం చెబుతుంది? 

యాగంటి నంది రోజురోజుకు పెరుగుతుందా? అనేది అసలు ప్రశ్న. నంది చిన్నగా ఉన్నప్పుడు ఒక్కఫొటో ప్రూఫ్ లేదు. ఇలా ఆధారం లేదని ఈ విషయాన్ని ఇక్కడితో కొట్టిపాడేయటం వీలుకాదు. అందరూ అనుకుంటున్నటుగా ఈ నంది సైజు పెరుగుతుందా అనుకుంటే పెరుగుతుందనే చెప్పాలి. ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారు చెప్పినదాని ప్రకారం దాదాపు 20 సంవత్సరాల వ్యవధికి కేవలం ఒక్క అంగుళం మాత్రమే ఆ నంది పరిమాణం పెరుగుతుంది. సంవత్సరానికి కేవలం ఒక్క మిల్లీ మీటర్ మాత్రమే పెరుగుతుంది. అయితే రాళ్లు నిజంగా పెరుగుతాయా? అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. యూరప్ లోని రోమానియా దేశంలో ఏకంగా జీవించే రాళ్లు ఉన్నాయి. అవి పిల్లలు కూడా పెడతాయి. ఆ రాయి చూడటానికి కొంచెం వింత ఆకారంలో ఉంటాయి. ఎండాకాలం అవి మామూలుగానే ఉంటాయి. కానీ ఒక్కసారి వర్షాకాలం వస్తే.. ఆ రాళ్ల చుట్టూ చిన్నచిన్న ఉండలుగా ఏర్పడి అవి పెరిగి కొన్ని రోజుల తర్వాత తల్లి రాళ్ళనుండి విడిపోయాయి. అవి కిందపడి మళ్ళీ పెరగటం మొదలుపెడుతాయి. 

అయితే ఇలా జరగడానికి గల కారణం రాళ్ళలో జీవం ఉండటం కాదు. ఆ రాళ్ళలో ఎక్కువ శాతం కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్ ఇంకా కొన్ని మినరల్స్ ఉండటం వల్ల. వర్షం పడ్డప్పుడు ఆ రాళ్లలోని మినరల్స్ నీటిని గ్రహించి ఆ లోపటి మూలకాలతో చర్యనొంది లోపల చిన్న చిన్న ఎయిర్ స్పేసేస్ (గాలి బుగ్గలు) ఏర్పడుతాయి. ఆ ఒత్తిడి వల్ల రాళ్లు పెరుగుతాయి. అలా రోమానియా లో రాళ్లు అయితే 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగాయి. అలాగే సేమ్ మినరల్సే మన యాగంటి నందిలో కూడా ఉన్నాయి. అయితే రోమానియాలో ఉన్న రాళ్లకు యాగంటి నంది నిర్మింపబడ్డ రాళ్లుకు మధ్య తేడా ఏంటంటే..

అక్కడి రాళ్ళల్లో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండటం వలన అవి చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. కానీ యాగంటి నంది విగ్రహంలో కాల్షియం  కార్బోనేట్ ఎక్కువగా ఉండి సోడియం సిలికేట్ తక్కువగా ఉండటం వలన ఆ విగ్రహం గాలిలోని తేమను గ్రహిస్తూ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇలా నెమ్మదిగా సంవత్సరానికి ఒక మిల్లి మీటర్ పెరిగే రాళ్లు మన చుట్టూ చాలా ఉన్నాయి. కానీ, మనం వాటి ఎదుగుదలను పట్టించుకోము. అయితే యాగంటి నంది విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాల వల్ల  కొన్ని వందల సంవత్సరాల నుండి దానిని మనం చూస్తూ ఉండటం వలన ఆ విగ్రహం పెరుగుతున్న సంగతి అర్ధం అయింది. ఇదే యాగంటి నంది వెనకున్న మిస్టరీ. మీకు ఈ కథనం నచ్చినట్లైతే SHARE చేయండి.

Show More
Back to top button