TRAVEL ATTRACTIONS

తెలంగాణలో ప్రముఖ కోట.. గాంధారి ఖిల్లా అందాలు చూసేద్దామా!

తెలంగాణ అంటేనే పచ్చదనం, ప్రకృతిని సెలయేర్లు, కొండలు, గుట్టలు, అడవులు, కట్టడాలు, జలపాతాలు, కళలు, ఆచారాలు, ఆలయాలకు ప్రసిద్ధి. నాగరిక జనంతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం. అయితే ఎక్కువగా అడవులు ఉన్న జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో గిరిజనుల ఆటవిక సంప్రదాయం  అందర్నీ మంత్రముగ్ధులను చేస్తుంది. సెలయేర్లు, జాలపాతాలు, కొండలు, గుట్టలు ఈ జిల్లా స్వంతం. ఈ జిల్లాలోని మరొక అద్భుతమైన కోట గురించి చదివేద్దామా.  

గాంధారి ఖిల్లా.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కల గుట్ట గ్రామానికి దగ్గరగా ఉన్న కొండ మీద ఉంది. గోండు గిరిజన జాతి కోసం చివరి వరకు పోరాటం చేసిన రాజు గొండ్లు ఈ కోటను నిర్మించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మించబడిన ఈఖిల్లాలో ఉన్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు గిరిజనులు భక్తి శ్రద్దలతో  పూజిస్తారు. గిరిజనుల ఇష్ట దైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఎక్కువగా వస్తుంటారు.

గోండు గిరిజన శిల్పులు ఈ గాంధారి ఖిల్లాను ఒక గుట్టలోనే చెక్కారు అని చెప్తారు. ఇక్కడ గాంధారి మైసమ్మ ఆలయం కూడా ఉంది. గాంధారి మైసమ్మ దేవాలయం ఉన్న ఈ కోటలో రాతితో చెక్కబడిన కోటకు మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. గాంధారి ఖిల్లాపై మరో ప్రధానమైన ఆకర్షణ కొండపై నిర్మించిన నాగ శేషుని ఆలయం. 8 అడుగుల ఎత్తైన నాగశేషుని విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది అక్కడే నాగ విగ్రహానికి ఎదురుగా శిలా శాసనం ఉంటుంది. 

ఈ ఆలయం పక్కన మూడు బావులు ఉన్నాయి. వీటిని స్థానికులు సవతుల బావులు అని పిలుస్తారు. చాల పురాతనమైన బావులు అయినప్పటికీ కూడా ఇంకా అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ గాంధారి కోట ఆనాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఖిల్లాలో అనేక కళారూపాలు శిల్ప సంపద, విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. గిరిజన రాజుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ దేవాలయంతో పాటు కాలభైరవుడు శివుడు వెంకటేశ్వర స్వామిఆంజనేయుని విగ్రహాలు రాళ్లపై చెక్కబడి ఉంటాయి. దేవాలయాలే కాకుండా కొండపైకి దండెత్తే శత్రువులను పసిగట్టేందుకు ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేశారు. 

గాంధారి ఖిల్లాపై మరో ప్రధాన ఆకర్షణ కొండపై నిర్మించిన నాగశేషుని ఆలయం. 8 అడుగుల ఎత్తైన నాగశేషుని విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది. ఈ గాంధారి మైసమ్మ ఆలయంలో గాంధారి మైసమ్మ జాతర ప్రధాన ఘట్టం మైసమ్మ పటం కొలుపు. ఆరోజు అర్ధరాత్రి దాటినా తర్వాత పద్మనాయక పూజారి కోటలోని ఎడమ దర్వాజా పట్టికి చెక్కివున్న విగ్రహం దగ్గర మైసమ్మ ఆకారంలో పసుపు కుంకుమలతో పట్నం గీసి గాజులు గంధం నిమ్మకాయలతో పూజలు చేస్తారు.

చారిత్రక ఆధారాలను బట్టి ఈ కోట సుమారు 1000 సంవత్సరాల పురాతనమని చెప్తారు. గోండు రాజులు ఈ కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించారని చెబుతారు. ఇక్కడున్న గుట్టల మధ్య అప్పట్లో 2 ఎకరాల చెరువును నిర్మించారు. ఆ చెరువు ఇంకా ఉపయోగ పడుతుంది. కొండల మధ్య ఎత్తులో నిర్మించిన అద్భుతం ఈ గాంధారి ఖిల్లా. 

ఖిల్లా రక్షణ కోసం ఏర్పాటు చేసిన కట్టడాలతో ఒకటి నగారా గుండు. అది అప్పటి నిర్మాణ అద్భుతానికి ఒక ఉదాహరణ. శత్రువులు వచ్చినప్పుడు కోటలో వారిని అప్రమత్తం చేసేందుకు దీనిని నిర్మించారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన మెట్లు కూడా ఇప్పటికి చెక్కు చెదరలేదు. కొండపైకి గుర్రాలు ఏనుగులు వెళ్లడం కోసం ఏర్పరచిన మార్గం కూడా అలాగే ఉంది.

గుట్టల మధ్య వైద్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ మొక్కలను కూడా పెంచారు. యెర్ర గురిగింజల చెట్లు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. ఈ అద్భుత మైన కోట బొక్కల గుట్ట గ్రామానికి సుమారు 4 కిమీ దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ కు ఈశాన్యంగా 270 కిమీ దూరంలో ఉంది. తెలంగాణలో ఉన్న అద్భుతమైన గాంధారి కోటను మీరూ సందర్శించండి.

Show More
Back to top button