HEALTH & LIFESTYLE

వేసవిలో అద్భుతమైన ఆహారాలు..

వేసవిలో తీసుకునే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డిహైడ్రేషన్, విరోచనాలు, వాంతులు, బలహీనత, తల తిరగడం వంటి అనేక సమస్యలు వేసవిలో తలెత్తుతాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి నీటి శాతం తగ్గుతుంది. వేసవిలో ప్రజలు ఎక్కువగా కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఇన్ఫెక్షన్, లూస్ మోషన్, ఆసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేలా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

కొబ్బరి నీరు..

వేసవికాలంలో ఉష్ణోగ్రతలు  పెరిగినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి అంతర్గతంగా తేమ అందుతుంది. కొబ్బరినీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్ళలో శరీరాన్ని నిర్విషీకరణ చేసే గుణాలు కూడా ఉన్నాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే ఫైబర్ కొబ్బరి నీటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి లోపాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. వేసవిలో కొబ్బరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

పెరుగు…

వేసవిలో పాల ఉత్పత్తులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యంగా పెరుగు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి సమస్య తొలగిపోతుంది. వేసవిలో ప్రతిరోజు పెరుగు తినడం వల్ల శరీరానికి శక్తి లభించడంతోపాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. పెరుగులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది పేగు ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే వేసవిలో పెరుగుతో పాటు మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎండ వేడిమికి అలసటగా మారిన శరీరం పెరుగు, మజ్జిగ వల్ల చల్లదనంగా మారుతుంది.

పుచ్చకాయ…

వేసవి స్పెషల్ ఫ్రూట్ పుచ్చకాయ. రుచికరంగా ఉండే ఈ పుచ్చకాయను తినడానికి చాలామంది ఇష్టపడతారు. పుచ్చకాయను వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాలి. పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్,  ఫైబర్ యాసిడ్ రిఫ్లెక్స్ వంటి లక్షణాలు ఉంటాయి. పుచ్చకాయను తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక రకాల పదార్థాలు అందుతాయి. ఈ పండులో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. శరీరంలో నీటి కొరతను తొలగించి, వేసవి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అరటిపండు…

అరటి పండులో పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో వేడి పెరిగినప్పుడు లేదా సాధారణ సమయంలో కూడా రోజు ఒక అరటిపండును తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొటాషియం ఆమ్లతను నియంత్రిస్తుంది. దీని ద్వారా వేసవిలో వచ్చే శరీర సమస్యలకు అరటిపండు చెక్ పెడుతుంది.

షర్బత్…

వేసవిలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తాగే పానీయం షర్బత్. దీనిని నిమ్మకాయ, పంచదారతో తయారుచేస్తారు. శరీరంలో వేడిని తొలగించడానికి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పానీయం రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరం. వేసవిలో కూల్డ్రింకులకు బదులుగా పిల్లలకు ఈ షర్బత్ ను ఇవ్వాలి. ఈ పానీయం సేవిస్తే శరీరం చల్లగా ఉంటుంది. అంతేకాకుండా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వెలగపండు…

ఎంతో రుచికరంగా ఉండే వెలగపండును సమ్మర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. వెలగపండులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండులో ఉండే పీచు, విటమిన్లు, ఖనిజాలు ఎండ వేడి నుండి, అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతాయి. ఈ పండులో ఉండే గుజ్జు ఎంతో రుచికరంగా ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే ఈ పండును తినడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే వెలగపండును తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.

తాటి ముంజలు…

వేసవిలో విరివిగా దొరికే తాటి ముంజలను చూస్తేనే నోరూరుతుంది. తాటి ముంజలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. దీనిలో విటమిన్ ఏ, బి, సి, జింక్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి విలువైన పోషకాలు ఉంటాయి. తాటి ముంజలు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు మలబద్దకాన్ని తరిమికొడుతుంది. శరీరాన్ని చల్ల పరుస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి అనుకునే వారికి కూడా తాటి ముంజలు చక్కని ఫలితాన్ని ఇస్తాయి. మూడు తాటి ముంజలు తిన్నట్లయితే ఒక కొబ్బరి బోండాన్ని తాగినంత ఫలితం. చాలామంది చుట్టూ ఉండే పొట్టు తీసి ముంజలను తింటారు. అయితే ఆ పొట్టుతోనే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చెరుకు రసం…

వేసవిలో స్పెషల్ పానీయం చెరుకు రసం. చెరుకు రసంలో కృత్రిమ చక్కెరలు కలపవలసిన అవసరం లేదు.  రుచికరంగా ఉండే ఈ రసం  వేసవిలో ఎండ నుండి రక్షిస్తుంది. చెరుకు రసంలో ఫాస్పరస్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ రసంలో ఉండే సుక్రోచ్ శక్తి స్థాయిలు వేగంగా పెరిగేలా చేస్తాయి. ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చెరుకు రసం తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

వీటితోపాటు వేసవిలో సగ్గుబియ్యం కాచిన నీరు తాగడం కూడా శరీరానికి ఎండ వేడి నుండి స్వాంతన లభిస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా చిన్నారులను బయట తిరగకుండా వారికి ఈ పదార్థాలను అందించినట్లయితే పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో బయట తిరగరాదని అత్యవసరమైతే ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత బయటికి వెళ్లాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేడ్ గా ఉంచుకునేందుకు ఎక్కువగా మంచినీరు తాగితే డిహైడ్రేడ్ బారిన పడకుండా ఉంటామని సూచిస్తున్నారు. వేసవిలో పైన చెప్పిన ఆహారాలన్నీ తీసుకోవడం వల్ల ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు అని అంటున్నారు.

Show More
Back to top button