
మనదేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో అలంపురంలో ఉన్న శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం ఒకటి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్రా నదీ తీరాన శ్రీ జోగులాంబ అమ్మవారు ఉగ్రరూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అతిపురాతనమైన ఈ ఆలయంలో శ్రీ జోగులాంబ అమ్మవారు బాల బ్రహ్మశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. శాస్త్రం ప్రకారం అమ్మవారి రూపం పెద్ద పెద్ద స్తన్యాలతో వికృతమైన రూపంతో భయంకరమైన రూపంతో అత్యంత శక్తివంతమైన తేజంతో శవాన్ని ఆసనం చేసుకొని శవం మీద కూర్చొని ఉంటుంది. మహిమంవోపేతమైన ఆ ఆలయ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఓం లంకాయాం శాంకరీదేవి కామాక్షీ కాంచికాపురీ ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహలక్ష్మీ మహురే ఏకదేవికా ఉజ్జయిన్యం మహాకాళే… అని అష్టాదశేషు కీటేశు శక్తయో సంస్థితా అంటూ అష్టాదశ శక్తుల నామాల స్మరణతో పునీతమౌతున్న పుణ్యక్షేత్రం అలంపురం.
దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా.. ఐదవ శక్తిపీఠంగా ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జోగులాంబ అమ్మవారు -బాల బ్రహ్మశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. విశృంఖల అనే పేరుతో విరాజిల్లుతున్న ఈ పేరుతో జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్న అలంపురం క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. అలంపురం ప్రాంతం క్రీస్తు శకం 66 నుండి 757 వరకు బాదామి చాళిక్యుల యేలుబడిలో ఉండేది. అనంతరం అనేకమంది రాజులు ఈ క్షేత్ర అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. అలంపురంలోని అమ్మవారి పీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతుంది. ఇక్కడ అమ్మవారు రౌద్ర స్వరూపిణి. ఒకప్పుడు ఈ క్షేత్రం ప్రసిద్ధ విద్యాపీఠంగా విరాజిల్లిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
పూర్వం ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు తపసు చేసి శివలింగాన్ని ప్రతిష్టించుట వలన ఆ లింగానికి బ్రహ్మశ్వరుడు అని పేరు వచ్చింది. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ అనేక బ్రాహ్మ మూర్తులు దర్శనం ఇస్తాయి. శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ బాల బ్రహ్మశ్వర స్వామివారిని దర్శిస్తారు. ఈ లింగం జ్యోతి జ్వాలామయం. దీనిని అర్చించిన వారు అనేక పుణ్యాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. బాదామి చాళిక్యుల శిల్పకళాభిరుచికి ఆనాటి శిల్పుల నేర్పరితనానికి ఈ ఆలయం ఓ నిదర్శనంగా నిలుస్తుంది. ఎర్ర రాతితో నిర్మించిన ఈ ఆలయం వివిధ శిల్ప చిత్ర రాజాలతో మండపాలతో ప్రాకారాలతో మనోహరంగా ఉంది భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడిభాగాన షమీ వృక్షం దర్శనం ఇస్తుంది.
ఈ షమీ వృక్షానికి సమీపంలో షమీశ్వరుడి ఆలయం దర్శనం ఇస్తుంది. భక్తులు ప్రధానాలయంలోని రెండవ మండపంలోకి చేరుకుంటారు. ఈ మండపంలో త్రిమూర్తులు విగ్నేశ్వరుడు వీరభద్ర స్వామి కాలభైరవుడు అర్ధనారీశ్వరుడు సూర్యనారాయణ స్వామి మహిషాసుర మర్దిని పార్వతీ పరమేశ్వరులు ఆ నాటి శిల్పకళా మూర్తులు దర్శనం ఇచ్చి అలనాటి శిల్ప కళాసంపదను మన కళ్ళముందు ఉంచుతాయి. ఇక్కడికి సమీపంలో జోగులాంబ అమ్మవారి గర్భాలయం దర్శనం ఇస్తుంది. పునః ప్రతిష్టకు ముందు అమ్మవారు ఇక్కడే ఉండేవారు. ఇదే మండపంలో ఎడమ భాగానికి వెళ్తే నవగ్రహాలయం దర్శనం ఇస్తుంది. గర్భాలయంలో ఎడమ భాగాన పార్వతి అమ్మవారి దివ్యమంగళ శిలారూపం దర్శనం ఇస్తుంది. గర్భాలయం ప్రాంగణం అంతా ప్రాచీనత్వానికి వేదికల అనిపిస్తుంది. ప్రాచీనమైన రాతిస్తంబాలతో నిండియున్న గర్భాలయంలో ఒకవైపున సైకత గణపతి శిలారూపం దర్శనమిస్తుంది. ఇసుకతో చేసిన ఈ గణపతి విగ్రహం దాదాపు శితిలావస్తకు చేరుకుంది. అలాగే గర్భాలయం చుట్టూ కొంచెం ముందుకు వెళితే ప్రదోష మూర్తుల రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల శిలారూపాలు దర్శనం ఇస్తాయి.
ఇదే ప్రాంగణంలో ద్విసింహవాహినిగా దుర్గామాత దర్శనం ఇస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే హరిహరాత్మక జ్వాలా నరసింహ స్వామి వారు విగ్రహం దర్శనం ఇస్తుంది. పక్కనే ఉగ్రనరసింహస్వామి తన గోళ్ళతో హిరణ్య కశిపుని సంహరిస్తున్న విగ్రహం భక్తులకు దర్శనం ఇస్తుంది. అలంపురం దేవాలయాలను రససిద్దుడు కట్టించాడని పురాణాల ద్వారా అవగతం అవుతుంది. కాశి విశ్వేశ్వర స్వామి ప్రేరణచే ఈ క్షేత్రానికి వచ్చిన సిద్ధుడు.. క్షేత్ర పాలకుల గురించి తపస్సు చేశాడట. భ్రమేశ్వరుడి తలపైనుండి, శ్రీ జోగులాంబ నోటిపై నుండి గణపతి నాభినుంచి రసము నిచ్చారట. కొన్ని రసతంత్ర గ్రంథాలలో క్షేత్ర ప్రస్తావన ఉంది. ఇక్కడున్న నవబ్రాహ్మ ఆలయాలను సైతం బాదామి చాణిక్య రాజైన రెండవ పులకేశి నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ ఆలయం అంతా బాదామి చాళిక్యుల శిల్పకళా కట్టడాలను ప్రతిభింబిస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన ద్వారం సమీపంలో కామాక్షి అమ్మవారి ఆలయం దర్శనం ఇస్తుంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం దర్శనం ఇస్తుంది. ప్రధానాలయం వెలుపలి భాగంలో రేణుకాదేవి ఆలయం దర్శనం ఇస్తుంది. పిల్లలు లేని మహిళలు సంతాన ప్రాప్తికోసం ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ ఉన్న విశ్వేశ్వరుడు, ఆగ్నేయేశ్వరుడు పంచాయతనేశ్వరుడు, మార్కండేశ్వరుడు, పాతాళేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, సీతారామ లక్ష్మణులు, మోక్ష గుండేశ్వరుడు, రామలక్ష్మణేశ్వరుల శివలింగ రూపాలను దర్శిస్తారు.
ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయం ఎంతో మహిమంవోపేతమైంది. ఇక్కడున్న శ్రీ జోగులాంబ అమ్మవారు, బాల బ్రహ్మశ్వరుల స్వామివార్లు భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. మీరు కూడా ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.