Telugu Featured NewsTelugu Politics

నాల్గవసారి సీఎంగా చంద్రబాబు.. మొదటి నుండి ఇప్పటికి వరకు రాజకీయ ప్రస్థానం ఇదే! 

చంద్రబాబు నాయుడు  ఒక విజనరీ మ్యాన్, దూరదృష్టి కలవాడు, ఎన్టీఆర్ తర్వాత తెలుగు దేశం పార్టీని శిఖరాగ్ర స్థానంలో నిలిపిన వ్యక్తి. నిరంతరం రాజకీయాల్లో ఉంటూ.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దే తన ధ్యేయమని తపించే వ్యక్తి. సుదీర్ఘ ప్రస్థానం, అనేక ఆటుపోట్లు, గెలుపు ఓటములు, జైలు జీవితం ఇలా అనేకం ఆయన రుచిచూశారు. తెలుగు రాష్ట్రం అవతరించి 10 ఏళ్ళ తర్వాత మరొక్కసారి జూన్ 12, 2024న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం. 

ఏపీలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న వ్యవసాయ కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు జన్మించారు. నారావారిపల్లెలో బడి లేకపోవడంతో శేషాపురంలో అయిదో తరగతి వరకు, ఆ తరవాత చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివారు. ఉన్నత విద్య కోసం అప్పట్లో ప్రముఖ పట్టణం అయిన తిరుపతికి వెళ్లారు. పదో తరగతి నుంచి ఎంఏ దాకా తిరుపతిలోనే చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు చదువుకుంటుండగానే రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. యువజన కాంగ్రెస్‌లో ఉండేవారు. ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు ఆయన  సంజయ్ గాంధీని సమర్థించేవారు.  సంజయ్ గాంధీ తరఫున నిలబడి పోరాడేవారు.  విద్యార్ధి దశలోనే తన లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాడు.  

“నాకు జీవితంలో ఓ ప్రధానమైన లక్ష్యం ఉంది” ఈ మాట  తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న రోజుల్లో తన సహచరుల దగ్గర ఓ సాయంత్రం అన్న మాట. అది సరిగ్గా 20 ఏళ్ళ తరువాత నెరవేరింది.1995 సెప్టెంబర్‌లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. విద్యార్థి దశలోనే తన విజనరీని, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చంద్రబాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు.  తన  లక్ష్యం నెరవేరడం కోసం అనుసరించాల్సిన మార్గాన్ని ఎంచుకోవడంలో, వ్యూహాన్ని రచించుకోవడంలోనే విజయం ఆధారపడి ఉంటుంది. అటువంటి విజేతలు చాలా కొద్ది మంది ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడు ఒకరు.

చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం:

తొలుత 1978లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి అసెంబ్లీ సభ్యుడిగా  ఎన్నికల్లో గెలుపొందారు. ఆ సమయంలో యువకులకు 20 శాతం టికెట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ విధానం చంద్రబాబు జీవితంలో మొదటి అడుగు వేయడంలో సహకరించింది. ఆ తరవాత కొద్ది రోజులకే 28వ ఏట అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా చంద్రబాబును నియమించారు. 1980లో ప్రసిద్ధ సినీ నటుడు ఎన్టీ రామారావు రెండో కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.1982 మార్చి 29న ఆంధ్రుల హక్కును కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న రామారావు.. 9 నెలల్లో 1983 జనవరి 9 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న చంద్రబాబు చంద్రగిరి నుంచి శాసనసభకు పోటీ చేసి తెలుగు దేశం ప్రభంజనంలో ఆ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తరవాత కొద్ది కాలానికే చంద్రబాబు తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

అయితే ఈ క్రమంలోనే 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు దొడ్డిదారిన ఎన్టీఆర్‌ను గద్దె దించి ముఖ్యమంత్రి అయిపోయారు. నాదెండ్లకు ఆ సంతోషం కేవలం నెలరోజుల్లోనే తీరిపోయింది. నాదెండ్లను గద్దె దించడానికి ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. అప్పుడే చంద్రబాబు రాజకీయ కుశలత ఏంతో తెలుగు జాతికి తెలిసింది. చంద్రబాబు పేరు మారుమ్రోగింది. టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి వారిని రాష్ట్రపతి ఎదుట పరేడ్ చేయించారు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమ ప్రభావానికి నాదెండ్ల భాస్కర్ రావు పాలన 31 రోజుల్లోనే అంతమై మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేశారు. చంద్రబాబు చాకచక్యానికి ముగ్ధుడైన ఎన్టీఆర్ ఆయనను టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నాదెండ్ల చాప్తర్ అయిపోయాక చంద్రబాబు పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించి రాజకీయాలు నడిపించారు.

ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు!

ఆతరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 1989లో చంద్రబాబు కుప్పం నుంచి అసెంబ్లీకి  ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన చంద్రబాబు.. కాంగ్రెస్ విజయం సాధించడంతో ప్రతిపక్షంలో ఉండిపోవలసి వచ్చింది. ప్రతిపక్షంలో ఉంటూనే టీడీపీ కార్యకలాపాలను ఆయనే సమన్వయం చేసేవారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ సమర్థంగా పనిచేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించేవారు.శాసన సభలోనూ, వెలుపలా ఆయన వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ కు దీటైన, సాటైన వ్యక్తి చంద్రబాబు అని నిరూపించుకున్నారు. తరవాత తెలుగుదేశం మళ్లీ అధికారం చేపట్టడానికి దోహదం చేసింది.

లక్ష్మీపార్వతిని ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్న తరవాత టీడీపీలో అంతర్గత  రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.1995 సెప్టెంబర్ ఒకటిన తన చాతుర్యాన్నంతటినీ ప్రయోగించి ఎన్టీఆర్‌ను గద్దె దింపి చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిణామ క్రమంలో తన పరిస్థితి మొగల్ చక్రవర్తి షాజహాన్‌లా తయారైందని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను “వెన్నుపోటు” పొడిచిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటానని కూడా ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. షాజహాన్ కుమారుడు తండ్రిని ఖైదు చేసి రాజ్యాధికారం దక్కించుకున్నారు. ఇక్కడ చంద్రబాబు ఎన్టీఆర్ ను ఖైదు చేసి తాను రాజ్యాన్ని దక్కించుకున్నాడు. అంటే చంద్రబాన్ తనను వెన్నుపోటు పొడిచారని పరోక్షంగా ఎన్టీఆర్ చెప్పకనే చెప్పారు. 

టీడీపీ అధికార పగ్గాలు చేపట్టి 1995 నుంచి 2004 వరకూ తొమ్మిదేళ్లకు పైగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలనా చేశారు. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేశారు. అయితే ఎన్టీఆర్‌ను గద్దె దించడంతో పాటు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని రద్దు చేశారు. రాష్ట్రములో విద్యుత్ చార్జీలు పెంచారు. అనంతరం 1999లో బాబు నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో 185 కైవసం చేసుకుంది. 42 లోకసభ నియోజకవర్గాలు ఉంటే 29 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు.

అందువల్ల అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమిలో టీడీపీ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాన్ని తన తొమ్మిదేళ్ల పైచిలుకు కాలంలో అభివృద్ధి బాట పట్టించారనుకున్నా 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చవిచూశారు. శాసనసభలో 47 సీట్లకు, లోక్‌సభలో అయిదు సీట్లకు పరిమితం కావలసి వచ్చింది. 2009లో తెలుగు దేశం పార్టీ అనూహ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడైన కె.చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినా చంద్రబాబుకు పరాజయం తప్పలేదు.

2014లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో  పొత్తు పెట్టుకుని ఆంధ్రా ప్రాంతంలోని 175 స్థానాలలో 102 సీట్లు సాధించగలిగారు. తెలంగాణ ఉద్యమం ఉదృతం అవడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. దీంతో తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. అటు ఆంధ్ర ప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. దీంతో రాష్ట్ర బాధ్యతలు,సమస్యలు చక్కదిద్దుతూనే.. కొత్త రాజధాని నిర్మాణానికి అమరావతి దగ్గరలోని ఉద్దండరాయని పాలెంలో 2015 అక్టోబర్ 22న జరిగిన శంకుస్థాపన సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో పాటు జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యొసుకె తకగి, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ హాజరయ్యారు. అయితే చంద్రబాబు చిన్న వయసులోనే ఎమ్మెల్యే, మంత్రిగా చంద్రబాబు అయ్యారు. అటు ఏపీ సీఎంగా ఆయనే ఇప్పటివరకు ఎక్కువ సంవత్సరాలు ఉండటం గమనార్హం.

 2014 నుంచి ఆంధ్ర ప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టి రాష్టాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలోనే దివంగత. వై ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రల పేరిట ఊరూరా, గ్రామగ్రామాన.. పల్లెలు పట్టణాలు తిరుగుతో ప్రజల్లో అభిమానం సంపాదించారు. ఈ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ఆర్ పార్టీ 151 స్థానాలలో, తెలుగుదేశం 23 స్థానాలలో, జనసేన 1 స్థానంలో గెలుపొందాయి. మిగతా పార్టీలేవీ ఖాతా తెరవలేదు. దీంతో 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉంది. 2024లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈ పోటీల్లో వైసీపీ పార్టీ పోటీలో నిలిచింది. అధికార వైసీపీని ఎలాగైనా ఓడించాలని తలపెట్టిన చంద్రబాబు.. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది.

టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి సంచలనం సృష్టించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. టీడీపీ 144కు గానూ 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 88 స్థానాల కంటే దాదాపు డబుల్ స్థానాలు టీడీపీ గెలిచింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70 వేల మెజార్టీతో గెలిచారు. నారా లోకేశ్ మంగళగిరిలో అత్యధికంగా 91 వేల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. జూన్ 12, 2024న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరొక్కసారి ప్రమాణ స్వీకారం చేశారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణం చేశారు.

Show More
Back to top button