మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరడంతో దాని ప్రభావం పాకిస్థాన్‌పై కోలుకోలేని దెబ్బ తీసింది. తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కోవడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన ‘ఇంధన పొదుపు’ చర్యలను ప్రకటించింది. ఏప్రిల్ 7 (నేటి) నుంచి పంజాబ్, బలూచిస్తాన్, ఇస్లామాబాద్‌తో సహా ప్రధాన ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లు, మ్యారేజ్ హాల్స్‌కు రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతినిస్తూ పాక్షిక లాక్‌డౌన్ తరహా నిబంధనలను అమలులోకి తెచ్చింది.
పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ రావడానికి ప్రధాన కారణాలేంటి?
ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో ఇరాన్ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్థాన్‌లో ఏప్రిల్ ప్రారంభంలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 458, డీజిల్ రూ. 520కి చేరడం ఆ దేశ ఆర్థిక వెన్నెముకను విరిచేసింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు లేకపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో అంత ఖరీదైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోలేక, ఉన్న దానిని పొదుపు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుత ఆర్థిక స్థితి – పీకల్లోతు కష్టాల్లో పాక్!
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం కేవలం పని గంటలను తగ్గించడమే కాకుండా, ప్రభుత్వ వ్యయాల్లో 20 శాతం కోత విధించింది. వారానికి నాలుగు రోజులు మాత్రమే పని దినాలుగా మార్చాలని ప్రతిపాదించింది. పెట్రోల్ ధరలను తాత్కాలికంగా తగ్గించినప్పటికీ, అది ప్రభుత్వ ఖజానాపై మరింత భారాన్ని పెంచుతోంది. సామాన్యులకు నిత్యావసర ధరలు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ఆ దేశానికి, ఈ యుద్ధం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఇంధన భత్యాలను తగ్గించడం ద్వారా ప్రజలపై పెను భారం పడింది.
ముంచుకొస్తున్న ముప్పు!
రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రమైతే పాకిస్థాన్ పూర్తిగా అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇంధనం లేక రవాణా వ్యవస్థ స్తంభించిపోతే ఆహార సంక్షోభం తలెత్తుతుంది. విద్యుత్ కోతలు పెరిగి పరిశ్రమలు మూతపడవచ్చు, దీనివల్ల నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) షరతులు ఒకవైపు, యుద్ధ ప్రభావం మరోవైపు పాకిస్థాన్‌ను దివాలా దిశగా నెట్టేస్తున్నాయి. పొరుగు దేశం పీకల్లోతు కష్టాల్లో ఉండటం దక్షిణ ఆసియా రాజకీయ సమీకరణాలను కూడా మార్చే అవకాశం ఉంది.
ఇతర కథనాలు:
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు.. కారణం ఏంటి?
కార్గిల్ విజయ్ దివస్ – త్యాగానికి ధైర్యానికి ప్రతీక










