Telugu Special Stories

సకల శుభాలను ప్రసాదించే.. అన్నవరం శ్రీ సత్యదేవుడు!

సత్యనారాయణ స్వామిని త్రియంభు(బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశ) స్వరూపంగా చెబుతారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ సత్యదేవుని కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు. కొత్తగా వివాహమైన వారు.. సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడమనేది మన హిందూవులు పాటిస్తున్న ఆచారాల్లో ఒకటి. ఇళ్లల్లో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచితే, అన్నవరం సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని కోరుకుంటారు కూడా. పిలిచినంతనే పలికే దైవంగా పేరుపొందిన.. సత్యదేవుడు..అనంతలక్ష్మీ సత్యవతీ సమేత వీరవేంకట సత్యనారాయణస్వామిగా కీర్తింపబడుతున్నాడు. మరి సత్యనారాయణ స్వామి చరిత్ర, స్థల పురాణం, ఇతర ప్రత్యేకతల గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

రత్నగిరి కొండపై వెలిసిన మూర్తి…

తూర్పుగోదావరి జిల్లా, అన్నవరంలోని రత్నగిరి కొండమీద కొలువై ఉంది  దేవాలయం. రత్నగిరి సత్రం నుంచి దేవస్థానం వారి ఫలహారశాల దాటగానే మనకు ప్రవేశద్వారం ఆహ్వానం పలుకుతుంది. అటునుంచి కొంతదూరం నడిస్తే చాలు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది. స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం.. ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఏర్పాటు చేయడమైనది. వేలాది సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు అగుపిస్తాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లున్నాయి.

ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, పైన గాలిగోపురం దేనికదే మహాసుందరంగా ఉంటుంది.

*పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరుపర్వతం, ఆయన భార్య మేనకలు కలిసి చేసిన శ్రీమహావిష్ణువు తపోఫలంగా ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు/ రత్నాకరుడు. తర్వాతి రోజుల్లో.. భద్రుడు విష్ణుమూర్తి గురుంచి తపస్సు చేసి, శ్రీరామచంద్రమూర్తికి నివాసస్థానమైన భద్రాచలంగా మారాడు. రత్నకుడు సైతం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారిపోయాడు.

*స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు.

*ఇతిహాసాల ప్రకారం చూసుకుంటే, అడిగిన(అనిన), (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి అనిన, వరం.. కలిపి అన్నవరం కావడంతో “అన్నవరం దేవుడు” అని ఆయన్ను పిలుస్తారు.

స్థల పురాణం…

పూర్వం అనరాజు అనే రాజు ఉండేవాడు. అతడి రాజ్యాన్ని ఓ బలవంతుడైన మరో రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన బాధలో అడవికి వెళ్ళిపోయాడు. అలా కొండలు దాటుకొని వెళ్తుండగా, రత్నగిరి కొండను చేరాడు. ఆపై అక్కడే ఉంటూ, సత్యనారాయణ స్వామిని నిష్ఠగా ఆరాధించసాగాడు. అనరాజు భక్తిభావనకు స్వామి ఎంతగానో సంతోషించాడు.

దీంతో ఒకనాడు రాజుకు కలలో కనిపించి… 

”బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది” అని చెప్పి, సత్యనారాయణస్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడట. 

కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతికి సైతం కలలో… ”రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని” కల వచ్చిందట. ఆ అధికారి తనకొచ్చిన కల.. దాని వెనుక ఆంతర్యమేంటో తెలుసుకునేందుకు… వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండకు చేరుకున్నాడట. అక్కడ ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణస్వామి వారి విగ్రహం దర్శనమిచ్చిందట. దీంతో ఆ అధిపతి తాత్సారం చేయలేదు సరి కదా.. వెంటనే రత్నగిరి కొండమీద ఆలయాన్ని నిర్మించాడు. తనకు లభించిన విగ్రహాన్ని ఆ కట్టించిన గుడిలో ప్రతిష్టించాడు. అదే ఇప్పుడు మనం ప్రతిగా కొలుస్తున్న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం.

క్షేత్ర ప్రాశస్త్యం…

*శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహం.. సుమారు 13 అడుగుల ఎత్తు(4 మీటర్లు)లో, స్థూపాకారంలో ఉంటుంది. స్వామివారి పీఠం పంచాయతనంలో అలకరించడం వల్ల.. ఆయన  కీర్తి ప్రతిష్టలు మరింత వృద్ధి చెందాయి. ఇక ప్రధాన ఆలయం ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం అత్యాధునిక శైలిలో ఉంటుంది. ఆలయం మొత్తం రెండు అంతస్తులుగా ఉంటుంది. కింది అంతస్తులో యంత్రం, స్వామివారి పీఠం ఉంటాయి. యంత్రం నాలుగువైపులా నలుగురు దేవత(గణపతి, సూర్యనారాయణస్వామి, బాలా త్రిపురసుందరి, మహేశ్వరస్వామి)ల పంచాయతనం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీ సత్యనారాయణ స్వామి మూల విరాట్ సరిగా మధ్యలో ఉంటుంది. 

శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు కుడివైపున, శివుడు ఎడమవైపున కొలువై ఉంటారు.

త్రిమూర్తుల రూపంలోని స్వామివిగ్రహాలన్నీ అందంగా తీర్చిదిద్ది, బంగారు కవచములతో అందంగా అలంకరించి ఉంటాయి. శ్రీ రాముడు శ్రీసత్యదేవస్వామికి క్షేత్ర పాలకులుగా ఉన్నారు. 

ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రమనీ కూడా పిలుస్తారు. ఎందుకంటే స్వామి మూల భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో మహేశ్వరుడు, పైభాగంలో విష్ణుమూర్తి కొలువై ఉండటం వల్ల.. ఆలయ నిర్మాణం మనకు రథాకారంలో కనిపించడం విశేషం.

*అన్నవరం.. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించబడి ఉంటుంది. శ్రీ సత్యదేవస్వామి కీర్తి, గొప్పతనాన్ని స్కందపురాణం రేవాఖండములోనూ విస్తృతంగా వర్ణించారు. 

అన్ని దివ్యక్షేత్రాలలానే అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి వారు వెలసిన కొండను తాకుతూ పంపానది ప్రవహిస్తోంది. ఇది సత్యదేవ స్వామి నిజాయితీకి ప్రతీకగా నిలుస్తోంది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా విష్ణు భక్తులు, శివ భక్తులు, వేలాది మంది ఇతర యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తులందరు సంపద, విద్య, శ్రేయస్సు, ఆరోగ్యం, వ్యాపారంలో విజయం సాధించడం కోసం శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తారు. 

* ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లున్నాయి. ప్రతీ ఏటా పదిలక్షల మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తారని అంచనా!

*అన్నవరం ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. స్వచ్చమైన నెయ్యి, ఎర్ర గోధుమలతో తయారుచేసే ప్రసాదాన్ని ఒక్కసారి తిన్నవారు.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు.

*ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.

*వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు మొదలుకొని.. శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణజయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీకమాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు. ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

సత్యదేవుని కళ్యాణానికి.. సీతారాములే పెళ్లి పెద్దలు…

వైశాఖమాసంలో శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ నిర్వహించే ఈ అన్నవరం కల్యాణోత్సవంలో.. ప్రతి ఘట్టం నయనానందకరంగా ఉంటుంది. మొదటిరోజు సాయంత్రం స్వామినీ, దేవేరినీ వధూవరులుగా అలంకరిస్తారు. అదేవిధంగా అర్చకులూ పండితుల బృందం రెండు వర్గాలుగా ఉండి, స్వామి – దేవేరుల కీర్తిప్రతిష్ఠలనూ, గుణగణాలనూ ఛలోక్తులతో కీర్తించడం… తాంబూలాలు మార్చుకుని శుభఘడియలను నిర్ణయించే వైనం జరుగుతుంది.

ఆ మరుసటి రోజు రాత్రి ఆనవాయితీ ప్రకారం, గ్రామంలోని విశ్వబ్రాహ్మణుని వద్దకు వెళ్లి స్వయంపాకం ఇచ్చి.. మంగళసూత్రాలూ, యజ్ఞోపవీతాన్ని తీసుకొచ్చి అంగరంగవైభవంగా కల్యాణాన్ని నిర్వహిస్తారు. అదయ్యాక అరుంధతీ నక్షత్ర దర్శనం, నవ దంపతులకు పండితుల చేత ఆశీర్వచనం, వనవిహారం, పుష్పయాగం వంటివన్నీ ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. 

ఈ ఘట్టంలోనే సత్యదేవునికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సీతారాముల్ని ఆంజనేయ వాహనంపైన, సత్యదేవుడిని గరుడవాహనంపైన, అమ్మవారిని గజవాహనంపైన ఊరేగించడం విశేషం.

అలాగే రావణబ్రహ్మ వాహనం, పొన్నవాహనంపైన దేవతా మూర్తులను ఊరేగించడం, రథోత్సవం వంటివీ ఈ కల్యాణంలో ప్రధాన ఘట్టాలు…

ఈ ఆలయం కాకినాడ జిల్లాలోని అన్నవరంలో ఉంటుంది. కావున  హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునేందుకు రైళ్లూ, బస్సులూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.

సత్యనారాయణ స్వామి వ్రతం కథలు

పూర్వం.. నారద మహర్షులవారు శ్రీమన్నారాయాణుని దర్శించి.. కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటికి తగిన నివారణోపాయం సూచించమని వేడుకున్నారట.

స్కంద పురాణంలో రేవా ఖండం ప్రకారం ఐదు అధ్యాయాలలో స్వామిని వేడుకున్న వారు, వ్రతం ఆచరించిన వారి గాథల సారాంశం ఉంటుంది.

తొలి అధ్యాయం, మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ.. వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది.

అందుకు తగ్గ భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం..

ఈ జన్మలో మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో..

వాటిని ఇటువంటి క్రతువుల మూలాన ఎంత తేలిగ్గా తీరుస్తాయో చెబుతుంది.

మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ,దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మఫలాలే.. 

నారదుడు ఈ విషయమై మన తరఫున స్వామివారికి నివేదించి.. పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.

రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను వ్రతంతో ఎలా గట్టెక్కించారో తెలియచేస్తారు.

ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు సైతం ఎలా బాగుపడతాడో వివరిస్తుంది ఈ కథ..

ధర్మాన్ని నమ్ముకున్న వారికి.. కష్టాలనుంచీ బయటపడేసెందుకు..స్వామివారే ఎలా వస్తారో చెబుతుంది. దేవుడు కేవలం కర్మసాక్షి.

కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో ఈ అధ్యాయం వల్లే తెలుస్తుంది.

ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తననుబట్టి మరుఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు స్వామి.

మూడవ అధ్యాయం.. ఒక రాజు సంతానం కోసం ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగిందో..

అది చూసిన మరో సాధు అనే వైశ్యుడు సైతం ఎలా సంతానవంతుడయ్యాడనేది ఈ అధ్యాయంలోని కథ.

ఒకరికి మాట ఇచ్చామంటే అంతే కట్టుబడి వుండాలి. అది మన తోటివారికైనా, దేవునికైనా…

నాలుగవ అధ్యాయంలో.. పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది.

ఒక పుణ్యకార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు కొందరు..

స్వామి తన లీల చూపించి అనంతరం వారికి జ్ఞానోదయం అయ్యాకే మరల వారికి మేలు చేస్తున్నాడు.

ఈ కథ ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాదరూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్యపరచకూడదని మనకు చెబుతోంది. 

ఐదవ అధ్యాయం.. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేస్తాడు.

దీంతో ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భావిస్తాడు. తిరిగి తప్పు తెలుసుకుని ప్రసాదస్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు.

వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి.

వ్రతం జరిపే వారి స్థాయిలను స్వామి చూడడు. భక్తి మాత్రమే ఆయనకు ప్రధానం. 

Show More
Back to top button