మందలో ఉండకు.. వందలో ఉండటానికి ప్రయత్నించు.. ‘‘లేవండి.. మేల్కోండి, గమ్యం చేరేవరకూ విశ్రమించకండి… బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతే ఈ దేశానికి కావాలి” అంటూ యువతను ప్రభావితం చేసిన మహనీయుడు, యోగి, భారతీయ తత్వవేత్త, గొప్ప వక్త. అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, సంఘసంస్కర్త… స్వామి వివేకానందులు..
ఈ నెల(జనవరి 12న) జయంతి కావడంతో, అయన జీవిత విశేషాలను తెలుసుకుందాం:
నేపథ్యం..
1863, జనవరి 12న కలకత్తాలోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించారు స్వామి వివేకానంద. తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరీ దేవీలు. తండ్రి న్యాయవాది. కాగా కుటుంబసభ్యులంతా వివేకానందను నరేంద్రనాథ్ దత్తా, నరేన్ అని పిలిచేవారు. 8వ ఏటా.. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రో పాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చ్యాత, తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, జీవిత చరిత్రలు, అన్ని మతాల గ్రంథాల్ని క్షుణ్నంగా ఔపోసన పట్టాడు. వీరి కుటుంబం విద్యా, ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం. ఈయన తాతగారు దుర్గాచరణ్ దత్త సైతం సంస్కృతం, పర్షియన్ భాషల్లో అపార పాండిత్యాన్ని గడించినవారు, న్యాయవాది కూడా.
చిన్నతనంలో నరేంద్ర.. ఎంతో అల్లరి పిల్లవాడు. అయినప్పటికీ ఆధ్యాత్మిక అంశాలపట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవాడట. దేవుళ్ల ప్రతిమలను పూజిస్తూ, ఆడుకునేవాడట. తన తల్లి చెప్పిన రామాయణ, మహాభారతాలలోని కథలు అతడి చిన్ననాటి మనసుపై బలమైన ముద్ర వేశాయి. పెద్దవుతూనే ధైర్యం, నిక్కచ్చితనం, జాలి, దయ, తృష్ణ వంటి భావజాలాన్ని పెంపొందించుకున్నాడు. ఎవరు ఏది చెప్పినా.. రుజువు చేయమనే మనస్తత్వం ఆయనది. మదికి, మాటకి పొంతన ఉండాలంటారు.
*రామకృష్ణ పరమహంసను కలిసిన ఓ సందర్భంలో అందర్ని అడిగినట్లే, ఈయన్ను.. మీరు దేవుణ్ణి కళ్లారా చూశారా? అని అడగ్గా…
బదులుగా పరమహంస.. అవును చూశాను, నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుడ్ని కూడా చూశానని, మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడ్ని చూశానని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు నరేంద్రుడు నాకు దేవుడ్ని చూపించండి అంటాడు. అప్పుడు రామకృష్ణులు… ఆయన కాలును మెల్లిగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చవిచూశారు. దీంతో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా మారిపోయారు. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడంతో పాటు, సన్యాస మార్గంలోకి నడిచాడు.
*1884లో బి.ఏ పాస్ అయిన సమయంలో తండ్రి మరణిచారనే వార్త తెలుసుకొని తిరిగి వచ్చాడు. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది కుటుంబం. ఆస్తులన్నీ కోల్పోయి.. తినడానికి లేని పరిస్థితి ఏర్పడింది.
చివరకు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు సాగించారు. అలా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకి, ఆరోగ్యం క్షీణించిందని తెలిసి, ఉద్యోగం మానేసి, గురువు వద్దకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నారు. వారందరికీ నాయకుడిగా నరేంద్రుడు ఉన్నారు.
*కొన్నాళ్ళకు వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకుని.. భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. ఇక్కడ భారతీయులంతా పేదరికం, బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢనమ్మకాలే మూలకారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలను అవగతం చేసుకున్నారు. దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు. పాశాత్య దేశాలకు వెళ్లి భారతదేశపు గొప్పతనాన్ని చాటి చెప్పాలని, తిరిగి భారత్ కు వచ్చినప్పుడు… నిరాశ, నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని దృఢంగా నిర్ణయించుకున్నారు.
*ఇలా చికాగోలో జరగబోయే సర్వమత మహా సభలకు హజరవ్వాలని అనుకున్నంతలో.. విదేశాలకు వెళ్ళాకనే తెలిసింది సర్వ మత మహా సభలు మరో 3 నెలలకు వాయిదా పడ్డాయి.
స్వామిజికి చికాగోలో ఎవరూ తెలియదు. అలా వీధుల్లో తిరుగుతూ కాలం గడిపేవారు. ఆయన వేషధారణను అంతా వింతగా చూసేవారు. కొంతమంది గేలి చేసేవారు.
*విశ్వమత మహా సభల్లో పాల్గొనేందుకు చాలా ప్రయత్నాల తర్వాత ఆహ్వానం అందింది. ఆ తర్వాత 1893 సెప్టెంబర్ 11న సభలు ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ.. హుందాగా సూటు బూటుతో వస్తే, మన వివేకానంద స్వామి.. ధరించిన దుస్తులు, వేషధారణ చూసి.. ఎవరూ కూడా గౌరవించలేదు సరికదా చులకనగా చూశారు. సభలో ఒక్కొక్కరుగా వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. చివరగా స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది. స్వామిజీ నిల్చుని గంభీరమైన గొంతుతో ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అని అన్నారట. ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న 4000మందికి పైగా జనం లేచి, రెండు నిమిషాలపాటు ఆపకుండా చప్పట్లు కొట్టారట.
*ఇక భారతదేశంలోని ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంసృతి, సంప్రదాయాల గురించి ఏకధాటిగా ప్రసంగిస్తూనే ఉన్నారు. సభలో ఉన్న మేధావులు, గొప్ప ప్రముఖులంతా స్థాయిని మరిచి ఆయన కరచాలనం కోసం పోటీపడ్డారంటే అతిశయోక్తి కాదు. తరువాతి రోజు అక్కడి ప్రధాన పత్రికల్లో ఎటు చూసిన వివేకానందులవారి ఫోటోలు, ప్రసంగాలు హైలెట్ గా నిలిచాయి. ఇలా కేవలం చికాగోలోనే కాదు ప్రపంచమంతా ఈ భారతీయ సన్యాసి గురుంచి చర్చించుకుంది. ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. కొంతమంది ఆయనకి శిష్యులుగా మారిపోయారు కూడా.
భారతదేశపు స్థాయిని, ఖ్యాతిని అమాంతం పెంచారు. ఈ విశ్వమత సభలు కొన్నిరోజులపాటు జరిగాయి. జరిగినన్ని రోజులు.. ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివర్లో ఉంచేవారు. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివర్లో ఉండే వివేకానంద స్పీచ్ కోసమీ వేచి ఉండేవారు మరి.
తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగానూ, ఒక మహ్మదీయుడు మంచి మహ్మదీయుడిగా ఉంటే చాలు అని చెప్తారు. భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని.. మనం ఏ దారిలో వెళ్లిన అంతా ఒకేచోట ఆ భగవంతుడిని కలుసుకుంటామని ఆయన వివరించారు.
*చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ, రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ జీవితాన్నంతా ప్రజల కోసమే కేటాయించారు. అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్లకు
1902, జులై 4న రాత్రి 9 గంటల సమయంలో కొంత సేపు ధ్యానం చేసుకున్నారు. తరువాత మంచం మీద పడుకుని ఆయన తన శ్వాసని విడిచారు. అలా తాను ఏ రోజు మరణించాలో.. ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన మాటలు విన్నప్పుడు తెలియని ఒక ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్ధం తెలుస్తుంది. ఆయన ఉపన్యాసాలు, రచనలు, లేఖలు, కవితలు స్వామి వివేకానంద పూర్తి రచనలుగా ప్రచురించారు. అద్వితీయమైన ఆ రచనలు ఎల్లప్పుడూ మనకు జ్ఞానోదయాన్ని అందిస్తాయి.
స్వామి వివేకానంద యూత్ ఫుల్ కోట్స్..
భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని.. వారికోసం ఆయన ఎంతో తపించారు. ఆయన పుట్టినరోజు (జనవరి 12)ను పురస్కరించుకొని “నేషనల్ యూత్ డే”గా జరుపుకుంటున్నాం. ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో పుస్తకాలతో, యువతరాన్ని ఉత్తేజపరిచి, సరైన మార్గర్దర్శనం చేశారు.
“డబ్బులేని వాడు కాదు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు అసలైన పేదవాడు”
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు.. కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను”.
*నా దృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడని, హీనుడని భావించడమే అజ్ఞానం.
*లేవండి! మేల్కొండి! మిమ్మల్ని మీరు మేల్కొలుపుకొని ఇతరుల్ని మేల్కోల్పండి!
మీరు మరణించడానికి ముందే జీవిత పరమావధిని సాధించండి! లేవండి! మేల్కొండి! గమ్యం చేరేవరకు ఎక్కడా నిలవకండి!
*ఉన్నత స్థితికి చేరుకోవాలంటే… ఈ మూడు లక్షణాలు ముఖ్యం..
మంచితనం మీదున్న విశ్వాసం, అసూయ, అనుమానం లేకుండా ఉండటం, మంచికి సహకరించడం
*నువ్వేది కోరితే అదే అవుతావు.. దీనుడవని తలిస్తే దీనుడివే అవుతావు..
బలవంతుడని తలిస్తే బలవంతుడివవుతావు.. *అపార విశ్వాసం, అనంత శక్తి – ఇవే విజయసాధనకు మార్గం.
*మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించడమే మహాపాపం.
*అసత్యమైన దానికి దూరంగా ఉండు..
సత్యాన్నే అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరతాం.
*ధనం కాదు.. కీర్తి ప్రతిష్టలు కాదు.. పాండిత్యం కాదు..
సౌశీల్యం ఒక్కటే ముఖ్యం. *నీ ప్రతి పనిలో ఆచరణను పాటించు..
ఆచరణ కొరవడిన అనేక సిద్దాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది.
*మనకు కావాల్సింది స్పందించే హృదయం.. ఆలోచించే మెదడు, పనిచేసే బలమైన హస్తం.
కర్మ చేసే యోగ్యతను సంపాదించు. *సేవకుడిగా ఉండండి. నిస్వార్థంగా ఉండండి.
అనంత సహనం కలిగి ఉండండి. అప్పుడు విజయం మీదే!