Telugu Special Stories

కళావాచస్పతి.. కంచు కంఠీరవ.. కొంగర జగ్గయ్య

కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 – మార్చి 5, 2004)

సుమధుర కంఠస్వరంతో గాయకులుగా గుర్తింపు పొంది గుర్తుండిపోయేవారు కొందరైతే, గంభీర స్వరంతో గర్జించేగళం మరికొందరి స్వంతం. కంచు కంఠంతో కలకాలం గుర్తుండిపోయే కొద్దిమందిలో కొంగర జగ్గయ్య ఒకరు. జగ్గయ్యకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ కంఠస్వరం ఒక్కటే కాదు. అది ఒక పార్శ్వం మాత్రమే. ఆయన ఒక నటుడు, కవి, రచయిత, పండితుడు, చిత్రకారుడు, అధ్యాపకుడు, రాజకీయ ఖని, పాత్రికేయుడు..

కళ వాచస్పతి జగ్గయ్య, కంచు కంఠం జగ్గయ్య, నాటకాల జగ్గయ్య, సినీ నటుడు జగ్గయ్య, రాజకీయ వేత్త జగ్గయ్య, సాహిత్య కారుడు  జగ్గయ్య, ఒక జగ్గయ్యకు ఎన్ని కార్యరంగాలు. ఎన్ని కార్యక్షేత్రాలు.

ఆయన నటన విలక్షణం. ఆయన స్వరమే ఆయన సంతకం. ధరించే పాత్ర ఏదైనా విలనైనా, హీరో అయినా, అన్న అయినా, బాబాయి అయినా, పాత్రకు ఒక ప్రత్యేకతను, హుందాతనాన్ని, నిండుతనాన్ని సంతరింపజేయడం జగ్గయ్య గారి నటనలోని విశిష్టకోణం. నలభై సంవత్సరాలు పైబడిన నటనా జీవితంలో 500 పైబడి చిత్రాల్లో నటించారు. అన్ని చిత్రాల్లోని విభిన్నమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనమైన చరిత్ర జగ్గయ్య గారిది.ఆయనతో నటించిన సమకాలిక నటులతో పోలిస్తే ఏ నటుడికి లేని ప్రత్యేకతలు నింపుకున్న వ్యక్తిత్వం జగ్గయ్య గారిది. సినీరంగ ప్రవేశం జరుగక ముందే దాదాపు దశాబ్దం పాటు రంగస్థలం పై నాటకాలలో విశిష్టమైన అనుభవం సంపాదించిన నటుడు జగ్గయ్య గారు.

ఎన్టీఆర్ గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు, జమున గారు  జగ్గయ్య గారితో రంగస్థలం పైన నటించిన వారే. అప్పటివరకు నృత్యాలకే పరిమితమైన సావిత్రి గారు నాటకాల నటిగా మారింది జగ్గయ్య గారు వ్రాసిన “బలిదానం” అనే నాటకంతోనే. సినీరంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా కళాశాల విద్యార్థుల సమావేశాలకు వెళ్లి “సౌందరనందం”,  “పారిజాతాపహరణం” లాంటి ప్రాచీన కావ్యాల గురించి ప్రసంగాలు చేసిన పాండిత్యం జగ్గయ్య గారి సొంతం. ఒక సినిమా హీరో సాహిత్య ప్రసంగాలు చేయడం జగ్గయ్య గారికి మాత్రమే సాధ్యమైంది. జగ్గయ్య గారికి ఢిల్లీలోని సంస్కృత విశ్వవిద్యాలయం వారు “కళావాచస్పతి” అనే గౌరవ డాక్టరేటును ప్రధానం చేశారు. కళావాచస్పతి గౌరవ డాక్టరేట్ పొందిన ఏకైక సినీ నటుడు జగ్గయ్య గారే. భారతదేశంలో ఏ సినీ నటుడికి కూడా ఇలాంటి గౌరవ డాక్టరేట్ లేదు.

జగ్గయ్య గారు రచయితలలో నటుడు, నటులలో రచయిత. పాఠశాల నాటి నుండే చిత్రికళను కూడా అభ్యసించారు. కళాశాలలో చదువుకునే రోజులలో అడవిబాపిరాజు గారి దగ్గర చిత్రలేఖనంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. చిన్నతనం నుండే రాజకీయాల్లో పాల్గొనేవారు. అదీగాక దక్షిణ భారతదేశం నుండి పార్లమెంటుకు అడుగుపెట్టిన తొలి సినీ నటుడు కొంగర జగ్గయ్య గారే. జగ్గయ్య గారు అధ్యాపకులు, పాత్రికేయులు. ఆయన ఆంగ్ల పత్రికలకు కూడా సంపాదకత్వం వహించారు. వాస్తుశాస్త్రం, హిప్నాటిజం వంటి వాటిల్లో కూడా ప్రావీణ్యం ఉంది. నటీనటుల పరంగా చూస్తే జగ్గయ్య గారింట్లో ఉన్న విస్తృత గ్రంథాలయం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారూ మరియు రాజునాల గార్ల ఇంట్లో మాత్రమే ఉండేదట. జగ్గయ్య గారు నటన మాత్రమే కాదు, ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత, కృషి కూడా ఆయన బహుముఖ ప్రజ్ఞత్వానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుండి ఇన్ని రంగాల పట్ల జగ్గయ్య గారికి ఆసక్తి కలగడానికి, ప్రోత్సాహం లభించడానికి మొదటి కారణం జగ్గయ్య గారి నాన్నగారు కొంగర సీతారామయ్య గారు.

కొంగర జగ్గయ్య గారూ 31 డిసెంబర్ 1926 నాడు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా లోని దుగ్గిరాల ప్రక్కన ఉన్న మోరంపూడి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి పేరు కొంగరి సీతారామయ్య గారు, తల్లి రాజ్య లక్ష్మమ్మ గారు. సీతారామయ్య గారి నాన్నగారి పేరు కూడా కొంగర జగ్గయ్య నే. తన తండ్రి పేరునే తన కొడుకుకు పెట్టుకున్నారు సీతారామయ్య గారు. 1894లో కొంగర సీతారామయ్య గారు జన్మించారు. వ్యవసాయం చేస్తూనే సంస్కృత ఆంధ్రాలలో పాండిత్యం సంపాదించారు జగ్గయ్య నాన్నగారు. సంగీతంలో కూడా విశిష్టమైన కృషి చేశారు. ఆయుర్వేద వైద్యాన్ని కూడా క్షుణ్ణంగా అభ్యసించారు. సీతారామయ్య గారు సీతారామ విలాస నాట్యమండలి అనే ఒక నాటక సంస్థను ప్రారంభించి, ఔత్సాహిక నటులను ప్రోత్సహించడమే కాకుండా అనుభవం ఉన్న నటులతో నాటకాలు వేయించేవారు.

నాటకాల కోసం తెనాలిలో శ్రీకృష్ణ సౌందర్య భవనం అనే థియేటర్ ను నిర్మించారు. తర్వాత రోజులలో శ్రీకృష్ణ భవనమే రత్న టాకీస్ గా మారిపోయింది. సీతారామయ్య గారికి దేశభక్తి కూడా ఎక్కువే. అజ్ఞాత దేశభక్తులకు ఆశ్రయమిచ్చే వారు కొంగర సీతారామయ్య గారు. ఈ వ్యాసాంగాలన్నింటి వల్ల సీతారామయ్య గారు చాలా ఆస్తి నష్టపోయారు. వీరిలోని కళా ప్రతిభనే  జగ్గయ్య గారికి వారసత్వంగా అబ్బింది. జగ్గయ్య గారిని వారి తల్లి ఎంతో గారాబంగా పెంచినా, మంచితనాన్ని, మానవత్వాన్ని కూడా నూరిపోసేది. జగ్గయ్య గారు కళాకారుడు కావడానికి వాళ్ళ నాన్న గారూ కారణమైతే, ఒక విశిష్ట వ్యక్తిత్వం సంతరించుకోవడానికి వాళ్ళ అమ్మ గారూ కూడా ఒక కారణం.

జగ్గయ్య గారూ పదకొండేళ్ల వయస్సులో పాఠశాలలో చదివే రోజులలో నాటకాలు వేయడం ప్రారంభించారు. ద్విజేంద్రలాల్ రాయ్ అనే సుప్రసిద్ధ రచయిత గారూ వ్రాసిన “సీత” అనే హిందీ నాటకంలో, తన హిందీ మాస్టారు ప్రోద్భలంతో లవుని పాత్ర వేశారు జగ్గయ్య గారూ. చిన్నతనం నుండి జగ్గయ్య గారూ వాళ్ళ నాన్న గారి వద్ద సంస్కృతాంధ్రాలను నేర్చుకున్నారు. వారి నాన్నగారి శిక్షణలోనే ప్రాచీన కావ్యాలన్నింటినీ పఠించడం అలవరుచుకున్నారు. తన 14 ఏటి నుండే కవిత్వం రాయడం ప్రారంభించారు. గాంధీజీ నిర్మాణ కార్యక్రమాల్లోనూ, గ్రంథాలయ ఉద్యమాలలోను చురుగ్గా పాల్గొనేవారు. రాత్రి వేళలో హరిజనవాడలో వార్తాపత్రికలు చదివి వినిపించి వారిలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు కూడా నడిపేవారు. పాఠశాల దశలోనే డ్రాయింగ్ టీచర్ సుబ్బారావు గారి ప్రోత్సాహంతో చిత్రకళ కూడా అభ్యాసం చేశారు. ఆ ఉత్సాహమే గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరినప్పుడు గొప్ప కవి, మహా శిల్పి అయిన అడవి బాపిరాజు గారి వద్ద చిత్రకళలో మెలకువలు నేర్చుకున్నారు. ఇప్పటికే జగ్గయ్య గారు వ్రాసిన పద్యాలు పత్రికలలో వచ్చాయి. జగ్గయ్య గారికి కొంత సాహిత్య పరమైన గుర్తింపును తీసుకువచ్చాయి.

జగ్గయ్య గారి కళాశాల చదువు మొత్తం ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులోనే సాగింది. వారికున్న సాహిత్య అభిరుచితో వారు వ్రాసిన సాహిత్య కళా వ్యాసాంగాలకు మంచి అవకాశాలు లభించాయి. “నవ్య సాహిత్య పరిషత్” లో సభ్యత్వం లభించడంతో ఎందరో మహానుభావులతో పరిచయాలకు దారితీసింది. లెక్చరర్ల ప్రోత్సాహంతో తరుచూ తెలుగు, ఆంగ్ల నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు పి.ఏ.చౌదరి గారూ వీరికి సహచరులు. ఎన్టీఆర్ గారు కూడా జగ్గయ్య గారికి కళాశాల మిత్రులే. వీరిద్దరూ కలిసి కళాశాల నాటకాలలో నటించేవారు. షేక్ స్పీయర్ నాటకాలను కూడా కళాశాల రోజులలో ప్రదర్శించేవాళ్ళు. గుంటూరులో ఉన్న ఔత్సహిక నాటక సంస్థ నవజ్యోతి ఆర్టిస్ట్స్ ద్వారా ప్రసిద్ధ నటులు ముక్కామల కృష్ణమూర్తి గారితోనూ, వల్లభజ్యోతుల శివరాం గారితోను పరిచయాలు ఏర్పడ్డాయి.

కేవలం కళాశాలలోనే కాకుండా బయట ప్రజానాట్య మండలి లాంటి సంస్థతో కలిసి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు జగ్గయ్య గారూ. కొంతకాలం గుంటూరులో ఉన్న ఆంధ్రా విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ గోపాలస్వామి నాయుడు గారూ ప్రతీ సంవత్సరం నిర్వహించే ఇంటర్ కాలేజ్ మేట్ నాటక పోటీలలో వరుసగా మూడు సంవత్సరాలు జగ్గయ్య గారే మొదటి బహుమతి గెలుచుకోవడం విశేషం. విజయవాడలో 1944లో జరిగిన ఆంధ్రనాటక పరిషత్ పోటీలలో ఎన్టీఆర్ గారు మరియు జగ్గయ్య గారూ కలిసి నటించిన చేసినపాపం అనే నాటికకు ప్రథమ బహుమతి లభించింది. “తెలంగాణ స్వాతంత్ర ఘోష” అనే మరొక నాటకంలో జగ్గయ్య గారికి ఉత్తమ నటుడి బహుమతి లభించింది.

ఎంతోకాలంగా జగ్గయ్య గారూ నాటకాలు వేస్తున్నావున్నా కూడా వారికి సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అనుకోకుండా ఒకరోజు జగ్గయ్య గారికి మద్రాసులోని త్రిపురనేని గోపీచంద్ నుంచి ఉత్తరం వచ్చింది. తొలిసారి తను దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్న ‘పేరంటాలు’ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించేందుకు మద్రాసు రమ్మని ఆ వుత్తరం యొక్క సారాంశం. అప్పటిదాకా సినిమా నటనమీద పెద్దగా ఆసక్తి చూపని జగ్గయ్య గారూ గోపీచంద్ మాటను త్రోసిరాజనలేక మద్రాసు ప్రయాణం కట్టారు. అక్కడ జగ్గయ్యకు స్క్రీన్ టెస్ట్ చేశారు. వారం రోజులు తరువాత, పిలుస్తామని చెప్పడంతో జగ్గయ్య గారు తిరిగి ఢిల్లీ  వెళ్ళారు. అయితే ‘పేరంటాలు’ చిత్రంలో జగ్గయ్య గారు కథానాయకుడుగా నటిస్తాడనుకున్న పాత్ర చదలవాడ నారాయణరావు (సి.హెచ్.నారాయణరావు) గారికి దక్కింది. 1951 లో విడుదలైన ఈ సినిమాకు కథ, మాటలు సమకూర్చిన గోపీచంద్ గారే దర్శకత్వం వహించారు.

‘ప్రియురాలు’ లో కథానాయకుడుగా..

‘పేరంటాలు’ చిత్రం విడుదలైన కొద్ది కాలానికి మరలా గోపీచంద్ నుంచి జగ్గయ్యకు వుత్తరం వచ్చింది. “అనివార్య కారణాలచేత ‘పేరంటాలు’ చిత్రంలో మీకు అవకాశం కల్పించలేక పోయాను. ప్రస్తుతం భారతలక్ష్మి ప్రొడక్షన్స్ నిర్మాత దోనేపూడి కృష్ణమూర్తి గారూ నిర్మించబోతున్న ‘ప్రియురాలు’ చిత్రంలో మిమ్మల్ని కథానాయకుడిగా తీసుకుంటున్నాను. మీరు దీర్ఘకారం సెలవులపై మద్రాసు రావలసింది” అనేది ఆ వుత్తరంలోని సారాంశం. గోపీచంద్ మాటను మరలా కాదనలేక ఆకాశవాణిలో ఉద్యోగానికి దీర్ఘకాల సెలవు పెట్టి జగ్గయ్య గారూ మద్రాసు చేరుకున్నారు. మాట ఇచ్చినప్రకారమే గోపీచంద్ గారూ జగ్గయ్య గారిని కథానాయకుడిగా నిర్మాత దోనేపూడి గారకి పరిచయం చేసి చిత్ర నిర్మాణం మొదలు పెట్టారు. ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం గోపీచంద్ గారూ నిర్వహించగా, సాలూరు రాజేశ్వరరావు గారూ సంగీతం సమకూర్చారు. ఇందులో జగ్గయ్య (శ్యామ్) గారికి జోడీగా కృష్ణకుమారి(పద్మిని) గారూ, లక్ష్మీకాంత(మోహిని) గారూ నటించగా రేలంగి (కోదండం) గారికి కూతురుగా సావిత్రి (సరోజ) గారూ నటించారు. అనివార్య కారణాల చేత చిత్ర నిర్మాణం సంవత్సరం పాటు సాగటంతో జగయ్య సెలవు పొడిగించమని ఆకాశవాణికి దరఖాస్తు పెట్టుకున్నా కూడా వారు అంగీకరించలేదు. ఈలోగా జగ్గయ్య గారికి శుభోదయా వారి ‘ఆదర్శం’, మరో చిత్రం ‘పాలేరు’ (నిర్మాణం కాలేదు) అనే సినిమాల్లో నటించే అవకాశం రావడంతో ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు.

20-02-1952న విడుదలైన జగ్గయ్య తొలిచిత్రం ‘ప్రియురాలు’ సరిగ్గా ఆడలేదు. తరవాత విడుదలైన చిత్రం ‘ఆదర్శం’లో జానకి గారూ, సావిత్రి గారూ నటించగా, అది కూడా విజయం సాధించలేదు. పరాజయాలతో మొదలైన వెండితెర ప్రస్థానం జగ్గయ్య గారిని సందిగ్ధంలో పడేసింది. ఈ సమయంలో సుప్రసిద్ధ దర్శక నిర్మాత హెచ్.ఎం.రెడ్డి జగ్గయ్యకు కబురెట్టి ‘బీదలఆస్తి’ అనే చిత్రంను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నానని, అందులో అవకాశం ఇస్తానని చెప్పారు. జగ్గయ్య గారూ అందులో నటిస్తూ వుండగా 1954లో ఆయన నటజీవితం కొత్త మలుపు తిరిగింది. అదే ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్. రెడ్డి వాహినీ పిక్చర్స్ పతాకం మీద నిర్మించిన ‘బంగారు పాప’ (19-03-1955)లో జగ్గయ్య గారూ కథానాయకుడిగా (మనోహర్)గా నటించారు. జార్జి ఇలియట్ గారూ వ్రాసిన నవల ‘సైలాస్ మార్నర్’ ఆధారంగా పాలగుమ్మి పద్మరాజు గారు రచనచేసిన ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు గారిది ప్రధానపాత్ర. జమున గారూ జగ్గయ్య గారికి జంటగా నటించారు. ఈచిత్రాన్ని చూసిన ప్రసిద్ధ బెంగాలి దర్శకుడు దేవకీబోస్ గారూ ఈ చిత్రాన్ని బెంగాలీ భాషలో పునర్నిర్మించారు.

‘బంగారుపాప’ చిత్రానికి జాతీయస్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం లభించింది. జగ్గయ్య గారికి సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. రాగిణీ పిక్చర్స్ వారి ‘అర్థాంగి'(1955), అన్నపూర్ణా వారి తొలిచిత్రం ‘దొంగరాముడు'(1955), చిత్రాలలో ప్రతినాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించారు. ఉత్తమ ప్రాంతీయ బహుమతిగా “అర్థాంగి” కి జాతీయ పురస్కారం లభించింది. అదే సమయంలోనే జగ్గయ్య గారికి మరో మహత్తర అవకాశం వచ్చింది. ఎల్.వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో 1954లో తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘మనోహర’ చిత్రం విడుదలై విజయవంతం కాగా, దానిని తెలుగులోకి అనువదించేశారు. అందులో శివాజీ గణేశన్ గారికి తన కంచు కంఠంతో జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పారు. తమిళ చిత్రంలో శివాజీ గణేశన్ గారికి దీటుగా జగ్గయ్య గారూ డబ్బింగ్ చెప్పడంతో ఆ చిత్రం తెలుగులో కూడా బాగా ఆడింది. జగ్గయ్య కంఠ స్వరం తెలుగు ప్రేక్షకుణ్ణి కట్టిపడేసింది. తర్వాతి కాలంలో శివాజీ గణేశన్ గారూ నటించిన చిత్రాలు తెలుగులోకి అనువదించిన అన్ని సందర్భాల్లో కూడా జగ్గయ్య గారే అతనికి తన కంఠం అరువిచ్చారు.

అప్పుచేసి పప్పుకూడు, పూజాఫలం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, మేఘసందేశం, బొబ్బిలి పులి ఇలా సుమారు 500 చిత్రాల్లో రకరకాల పాత్రలు పోషించారు. జగ్గయ్య గారూ దాదాపు వంద చిత్రాల్లో కథనాయకుడిగా నటించారు. మరో వంద చిత్రాల్లో సహాకథానాయకుడిగా నటించారు. రెండు వందల చిత్రాల్లో క్యారక్టర్ నటుడుగా రాణించారు. ఆ రోజుల్లో అగ్రశ్రేణి నటులు ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర రంగంలో వేగంగా దూసుకుపోతుండగా జగ్గయ్య గారూ మాత్రం తనదైన శైలిలో, స్థిరమైన వేగంతో నటజీవితాన్ని సాగించారు. జగ్గయ్య గారూ ఎక్కువగా నాగేశ్వరరావు గారి చిత్రాల్లో సహ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించారు. ఆయన ఏ హీరో ప్రక్కన నటించినా హీరోకన్నా జగ్గయ్య గారికే ఎక్కువ పేరువచ్చేది.

1962లో పదండి ముందుకు సినిమాను నిర్మించారు జగ్గయ్య గారు. ఆ తర్వాత శభాష్ పాపన్న చిత్రాన్ని అందించారు. చలన చిత్రాల్లో ప్రముఖ నటుడిగా రాణించడమే కాదు, ఆంధ్రులు ఏనాటికి మరువని ఇద్దరు నటీమణులను రంగస్థలం, చిత్ర రంగానికి పరిచయం చేసింది జగ్గయ్య గారే. ఆ నటీమణులు ఎవరో కాదు సావిత్రి గారు మరియు జమున గార్లు. “తుకారం” చిత్రంలో ఛత్రపతి శివాజీగా శివాజీ గణేషన్ నటిస్తే దానికి అద్భుతమైన కంఠ స్వరాన్ని అందించి మన ముందు ఛత్రపతిని సాక్షాత్కరింపజేసిన ఘనతలో సగం జగ్గయ్య గారిదే. మోహన్ బాబు నిర్మించిన ‘కుంతీపుత్రుడు’ లో జగ్గయ్య చివరిసారిగా నటించారు.

ఇంటర్మీడియట్ అయిపోగానే 1944లో జగ్గయ్య గారూ ఒక సంవత్సరం చదువు ఆపేశారు. ఆ సమయంలో కొద్దిరోజులు శోభ అనే మాసపత్రికను నడిపారు. గుంటూరు నుండి వెలువడే దేశాభిమాని అనే దినపత్రికలో సబ్-ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు కూడా సంపాదకత్వం కూడా వహించారు. ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గానికి కూడా జగ్గయ్య గారూ ఎన్నికైన్నారు.

“వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య” అని తెలుగు వారికి పరిచయమైంది ఆ గొంతు. ఆల్ ఇండియా రేడియో విభాగంలో జగ్గయ్య గారికి ఉద్యోగం లభించింది. సుమారు మూడు సంవత్సరాలు వారు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారకులుగా పనిచేశారు. ఆ సమయంలో జగ్గయ్య గారికి తనదైన ముద్రగా మారిన కంచు కంఠం వారికి శ్రోతలలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించిపెట్టింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ గొంతు నిరంతరాయంగా తెలుగువారి జ్ఞాపకాలను పెనవేసుకుంటూనే ఉండిపోయింది.

జగ్గయ్య గారూ పాఠశాల చదివే రోజులలో అంటే 1940లోనే రాజకీయాలపై మక్కువ చూపుతోనే కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయం తెనాలిలో ఉండేది. ముసునూరి బాలకృష్ణ గారూ రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. జగ్గయ్య గారూ అక్కడ కార్యాలయ కార్యదర్శిగా కొన్నాళ్ళు కొనసాగారు.  కొన్నిరోజుల తరువాత సోషలిస్టు సభ్యులతో ప్రజా సోషలిస్టు పార్టీ ఏర్పరిచినప్పుడు అందులో సభ్యుడిగా చేరారు. జగ్గయ్య గారూ. అప్పుడే జయప్రకాశ్ నారాయణ్ లాంటి నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. సోషలిస్టు నాయకుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారితో కూడా పరిచయం ఉండేది.

కళాశాల రోజులలో యువజనోద్యమాలలో జగ్గయ్య గారూ చురుకుగా పాల్గొనేవారు. ప్రజా సోషలిస్టు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని జయప్రకాశ్ నారాయణ్ లాంటి వాళ్ళు నిర్ణయించినప్పుడు జగ్గయ్య గారూ కాంగ్రెస్ లో చేరారు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తగా పనిచేస్తూనే వచ్చారు జగ్గయ్య గారూ. రాష్ట్ర నాయకుల కోరికమేరకు 1967లో ఒంగోలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి లోక్ సభ సభ్యునిగా గెలుపొందారు. లోక్ సభ సభ్యుడిగా పార్లమెంటులో  అడుగుపెట్టిన తొలి భారతీయ నటుడు జగ్గయ్య గారే. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండే ఒంగోలులో కాంగ్రెస్ తరుపునుండి జగ్గయ్య గారూ విజయకేతనం ఎగురవేయడం ఒక విశేషం. జగ్గయ్య అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని తెలిసిన చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఎంతో ఆనందించారు.

బి. విఠలాచార్య, ఎన్. త్రివిక్రమరావు, ఏ.ఎస్.ఆర్. ఆంజనేయులు, డి.వి.ఎస్. రాజు, ఎన్. రామబ్రహ్మం, రామానాయుడు, ఎస్. భావనారాయణ,  పి. గంగాధరరావు, ఎం. జగన్నాథరావు, యు. విశ్వేశ్వరరావు, తోట సుబ్బారావు,  పుండరీకాక్షయ్య, కె. సోమశేఖరరావు మొదలగు చిత్ర నిర్మాతలంతా కలిసి 1967 మార్చి 4వ తేదీన మద్రాసులోని న్యూ ఉడ్ లాండ్స్ హోటల్ లో జగ్గయ్య గారిని సన్మానించారు. ఈ సభకు ఎన్టీఆర్ గారూ అధ్యక్షత వహించగా, చిత్తూరు నాగయ్య, డి.వి.ఎస్. రాజు, బి.ఎన్. రెడ్డి, సి.ఎస్. రావు, జమున, రేలంగి, ఇంటూరి మొదలైన వారు తమ హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు.

ఢిల్లీలోని అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు “కళావాచస్పతి” అనే గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. కళావాచస్పతి గౌరవ డాక్టరేట్ పొందిన ఏకైక సినీ నటుడు జగ్గయ్య గారు

భారతదేశంలో ఏ చలనచిత్ర నటుడికి కూడా గౌరవ డాక్టరేట్ రాలేదు.

1992లో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ పురస్కారంను ఇచ్చి సత్కరించింది.

తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, వారు జగ్గయ్య గారిని గౌరవ డాక్టరేటుతో సత్కరించారు.

కలైమామణి బిరుదును తమిళనాడు ప్రభుత్వం జగ్గయ్య గారికి ప్రదానం చేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు జగ్గయ్య గారికి కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది.

జగ్గయ్య గారూ నిర్మించిన పదండి ముందుకు అనే సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి 50,000 రూపాయల ప్రోత్సాహకం లభించింది.

తొంటి నొప్పితో కొంతకాలంగా బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న జగ్గయ్య గారూ చికిత్సానంతరం ఇబ్బందులు తలెత్తాయి. 5 మార్చి 2004 సాయంకాలం చెన్నైలో తన 76 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button