Telugu Special Stories

“కృషితో నాస్తి దుర్భిక్షం” నానుడికి సజీవ సాక్ష్యం ప్రాచీ ఠాకూర్ జీవితం:

తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తూ, ఎలాంటి కష్టాలు వచ్చినా పిల్లలను ప్రయోజకులుగా తీర్చితిద్దాలనుకుంటారు. ఎంతటి కష్టతరమైన పనులైనా చేస్తూ తమ బిడ్డలు ఉన్నతోద్యోగాలలో స్థిరపడాలని, వారు సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొద్దిమంది మాత్రమే తమ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి వారి ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో ఎంతో అంకితభావంతో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. నేను సాధించిన ఉద్యోగం నా తల్లిదండ్రుల కష్టానికి ఫలితం అని గర్వంగా చెప్పుకునే వారు కొందరు. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ కూడా ఆ కోవకు చెందినవారే.

నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చిన ఆమె కుటుంబానికి పూటగడవడం కష్టంగా ఉండేది. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు పూరి గుడిసెలోనే జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి. పేదరికాన్ని శాశ్వతంగా పారద్రోలే ఏకైక ఆయుధం చదువు ఒక్కటే అని గ్రహించిన ప్రాచీ ఠాకూర్ తండ్రి తన బిడ్డను ఎలాగైనా చదివించాలని పట్టుదలతో గ్యాస్ స్టవ్‌లు, కుక్కర్‌లు బాగు చేసే పనిని ఎంచుకున్నారు. తండ్రి వృత్తి గురించి సహ విద్యార్థులు ఎగతాళి చేస్తున్నారని, తన తండ్రి చేస్తున్న పని గురించి చెప్పుకోవడానికి ఇష్టపడేది కాదు ప్రాచీ. తన తండ్రిలోని కళను, ఆయన పడుతున్న కష్టాలను చూసి చలించిపోయింది ఆమె. తన గ్రామంలోని ఇతర తల్లిదండ్రులు భవిష్యత్తులో ఆడపిల్ల కట్నం కోసం తమ సంపాదనను పొదుపు చేస్తుంటే, తన తండ్రి మాత్రం తన చదువు కోసం డబ్బు  ఖర్చు చేస్తున్నాడనే విషయాన్నీ తెలుసుకుంది.

తన చదువుకోసం తండ్రి తన జీవితాన్నే త్యాగం చేస్తున్నాడనే విషయాన్నీ గ్రహించి, మొదట్లో తన తండ్రి వృత్తి గురించి ప్రస్తావించడానికి ఆత్మన్యూనతాభావానికి గురయ్యే ప్రాచీ ఠాకూర్, డిగ్రీ, PhD పూర్తి చేసి ఇప్పుడు వరల్డ్ ఉమెన్స్ టూరిజంలో డైవర్సిటీ స్ట్రాటజిస్ట్ మరియు TEDx స్పీకర్‌గా పనిచేస్తున్నారు. తనను ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరి ముందు ఈ రోజు గర్వంగా తల ఎత్తుకుని నిలబడింది. ఇప్పుడు ఆమె తన తండ్రి వృత్తిని గౌరవంగా చూస్తూ గర్విస్తోంది. తన తల్లిదండ్రుల కృషి వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని చెబుతుంటే తల్లిదండ్రులకు ఇంతకంటే ఏం కావాలి?.

కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం:

ప్రాచి ఠాకూర్ బీహార్ లోని సుపాల్‌ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. కుటుంబ పోషణ కోసం తండ్రి రోడ్డు పక్కన గ్యాస్ స్టౌ లు రిపేరు చేస్తారు మరియు ఒక చిన్న పాన్ షాప్ నడిపిస్తారు. తండ్రి కి వచ్చే అరకొర సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నందున తల్లి కూడా బట్టలు కుడుతూ కుటుంబ అవసరాలను తీర్చడానికి అవిశ్రాంతంగా కష్టపడేవారు. ప్రాచీ సుపాల్‌లోని RSM పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న సమయంలో ఓరోజు టీచర్స్ ప్రాచీ ని తన కుటుంబం గురించి రాయమని అడిగినప్పుడు, ఆమె అమ్మ దర్జీ వృత్తి, నాన్న గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేవారని రాసింది. ఆ తర్వాత తోటి స్నేహితులు ఆమెను ఎగతాళి చేయడం జరిగింది. స్నేహితుల హేళనకు తట్టుకోలేక ఏడుస్తూ ఒకరోజు తండ్రిని అమాయకంగా అడిగింది, “అందరిలా నువ్వు కూడా ఆఫీస్ లో ఎందుకు పని చేయలేకపోతున్నావు, ఇస్త్రీ షర్టులు ఎందుకు వేసుకోలేకపోతున్నావు అని”. ఆ ప్రశ్నకు సమాధానంగా అతను ఆమె కన్నీళ్లు తుడిచి, “జీవితంలో డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు” అని చెప్పేవారు.

అయినప్పటికీ తండ్రి విలువ గుర్తించలేకపోయింది. కేవలం గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తే వచ్చే ఆదాయం సరిపోదని ప్రాచి తండ్రి వేరే పనులు చేసేవారు. అదే  ప్రాంతంలో అమ్మాయిలు వంట తరగతులకు వంట మాస్టర్ గా కూడా పనిచేసేవారు. అయితే ఒకరోజు ప్రాచీ అనుకోకుండా తన తండ్రి పని వద్దకు వచ్చి, తన తండ్రికి ఉన్న అద్భుతమైన వంట నైపుణ్యాలు తనకెందుకు లేవని ఆశ్చర్యపోయింది. చివరికి ఎవరి టాలెంట్ వారికి ఉంటుందనే విషయాన్ని గ్రహించింది. ఆరోజునుండీ ఆమె తండ్రిని చూసే విధానం మారిపోయింది. సుపాల్‌ పరిసర ప్రాంతాలలో సామాజిక కట్టుబాట్ల ప్రకారం 10వ తరగతి విద్యను పూర్తి చేసిన వెంటనే బాలికలకు వివాహం చేస్తుంటారు. ప్రాచి 10వ తరగతి పూర్తయిన తర్వాత ఆమెను తల్లిదండ్రులు పై చదువులు చదివిస్తుండగా ఇరుగుపొరుగు వారు మరియు బంధువులు డబ్బు ఎందుకు వృధా చేస్తారు, పెళ్లి చేయమని ఎంతోమంది వారిని నిరుత్సాహపరిచినప్పటికీ ఆమె తండ్రి  మాత్రం ఆమెకు చదువు పట్ల విశ్వాసం కలిగేలా విద్యలో రాణించడానికి అవకాశం ఉండేలా పూర్తి మద్దతు ఇచ్చారు.

ప్రాచీని వారి గ్రామంలో స్థానిక కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడానికి తన వెంట  తీసుకువెళ్ళేవాడు. మొదట్లో యాంకరింగ్ చేస్తున్నప్పుడు సహజంగా కలిగే భయాన్ని పారద్రోలడానికి తన ముందు కూర్చున్న వారిని కేవలం బంగాళదుంప బస్తాలా  పరిగణించమని తండ్రి ఆమెకు సలహా ఇచ్చాడు. ఆవిధంగా ఆమెలో ఉన్న భయం పూర్తిగా తొలిగిచపోయేలా చేసి విశ్వవిద్యాలయాల్లో అతిథి ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలలో అనర్గళంగా యాంకరింగ్ చేయడానికి సరైన మెళుకువలు నేర్పించారు. ఆమె ఆతర్వాత పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది. అయినా ఆమె ఈ ప్రయాణంలో ఎదురవుతున్న ఎన్నో అవరోధాలను దృఢ విశ్వాసంతో ఎదుర్కొంటూ మూస పద్ధతులను ధిక్కరిస్తూ, ఆమె  అకడమిక్ ఎక్సలెన్స్ ప్రయాణాన్ని కొనసాగించింది. ఆతర్వాత పాట్నా విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందింది.

ఆడపిల్ల చదువు అవనికి వెలుగు:

ఆడపిల్లలకు విద్యను అందించడం ఆ కుటుంబానికి మాత్రమే కాక యావత్ దేశానికి వెలుగునిస్తుందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ప్రపంచంలోనే జ్ఞాన భాండాగారాలుగా ప్రసిద్ధి చెందిన నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాలు బీహార్లోనే స్థాపించబడినప్పటికీ నేడు ఆ రాష్ట్రం భారతదేశంలోని అత్యంత పేద మరియు నిరక్షరాస్యులైన రాష్ట్రాలలో ఒకటిగా మారడం దురదృష్టకరం. అంతేకాకుండా, బీహార్లో మహిళా అక్షరాస్యతపై పేదరికం, బాల్య వివాహాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. సుపాల్ ప్రాంత ప్రజలు బాలికల విద్య కంటే బాలుర విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విచిత్రం. ప్రాచి తండ్రి ఆలోచన విధానం సుపాల్ ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం గర్వించదగిన విషయం. ప్రాచీ నేడు ఉన్నత స్థాయిలో ఉందనడానికి అదే నిదర్శనం.

ఆ ప్రాంతంలోని మిగతా తల్లిదండ్రులు కూడా ప్రాచీ తండ్రి లాగా తమ కుమార్తెల కట్నకానుకల కోసం కాకుండా ఉన్నత విద్య కోసం డబ్బు ఖర్చు చేసేలా ఆలోచించగలిగిన నాడు అక్కడి యువతులు కూడా తమ ప్రజ్ఞాపాటవాలతో సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఒకప్పుడు తన తండ్రి వృత్తి గురించి బహిరంగంగా చెప్పేందుకు సిగ్గుపడిన ప్రాచీ ఈరోజు తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. తన తల్లిదండ్రులు పెద్దగా చదువుకోనప్పటికీ ఎప్పుడూ తనను  చదువుకోమని ప్రోత్సహించేవారని ప్రాచీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక స్థోమత లేకపోయినా, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తనకు ఉత్తమ పాఠశాలలో నాణ్యమైన విద్యనందించారని తెలిపింది. “ఆడపిల్లలను చదివించడం వల్ల డబ్బు వృధా అని జనాలు అనుకుంటారు, కానీ మా నాన్న తన సంపాదనలో ఎక్కువ భాగం నా చదువుకే వెచ్చించాడు అందుకే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను” అని గర్వంగా చెప్పుకుంటుంది.

మనిషి ఏదైనా సాధించాలంటే కావాల్సింది పట్టుసడలని ప్రయత్నం, సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏదైనా పనిని మొదట ప్రారంభించినప్పుడు ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు పొందడం కంటే అవహేళనలు, అవరోధాలు ఎక్కువగా ఎదుర్కొంటాము. అవరోధాలకు భయపడి వెనుతిరిగితే లక్ష్యం చేరడం అసాధ్యం. అవరోధాలను అవకాశాలుగా మలచుకొని లక్ష్య సాధన కోసం ముందుకు సాగిన వారు మాత్రమే విజయం సాధిస్తారనడానికి ప్రాచి జీవితమే నిదర్శనం.

ధృఢ సంకల్పానికి తోడు నిర్విరామ కృషి తోడైతే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చని మరోసారి నిరూపించిన “ప్రాచి ఠాకూర్” జీవితం నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

Show More
Back to top button