కన్ను కెమెరా వంటి నిర్మాణం. కంట్లో కార్నియా పొర, దాని వెనుక సహజ కటకం ఉంటుంది. ఈ రెండూ బయట చూసిన దృశ్యాలు సరిగ్గా రెటీనాపై పడేట్లు చేస్తాయి. అప్పుడు వస్తువులు సరిగ్గా చూడగలం. కంట్లో ఉండే సహజ కటకం కీలకం. వయసు పెరగడం, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కటకంపై తెల్ల పొర వస్తుంది. దీన్నే కంటిశుక్లం అంటారు. శుక్లం వచ్చిన వారిలో క్రమంగా చూపు మందగిస్తుంది. ప్రారంభంలోనే దీన్ని గుర్తించి తగిన చికిత్స చేయించుకోకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కంటి శుక్లాల గురించి మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి చెందిన కంటి వైద్యులు పుల్లారావు Way2news ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
కంటి శుక్లాలు ఎక్కువగా ఎండలో పని చేసే వారికి వస్తాయి.
లక్షణాలు:
నొప్పి లేకుండా చూపు మందగించడం, మసకబారడం.
రంగులు సరిగా గుర్తించలేకపోవడం.
రెండు వస్తువులు మూడుగా కనబడటం.
ఎక్కువ కాంతిలో చూపు కష్టం కావడం.
ఎందుకిలా..
కంట్లో కటకం దళసరిగా అయినా శుక్లాలు వస్తాయి. 50ఏళ్లు పైబడిన వారిలోనే కాకుండా పిల్లలకు జన్యు, వంశ పారంపర్య కారణాలతో ఇవి వస్తాయని, షుగర్ బాధితుల్లో రక్తంలో చక్కెర కటకంలోకి వెళ్లడం వల్ల శుక్లం వస్తుందని డాక్టర్ చెబుతున్నారు.
కారణాలు:
వయసు పెరగడం
అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా కంట్లో పడటం
సహజ కటకానికి గాయాలైనప్పుడు
మధుమేహం వంటి వ్యాధులు
స్టెరాయిడ్లు వంటి మందులు ఎక్కువగా వాడటం.
శుక్లానికి మందులు లేవు. కొందరు యాంటీ క్యాటరాక్ట్ చుక్కలు వాడతారు. కానీ, దీంతో ఉపయోగం ఉండదు. ఆపరేషన్ ద్వారా శుక్లాలు తొలగిస్తారు. సహజ కటకం స్థానంలో కృత్రిమంగా(ఇంట్రా ఆక్యులార్ లెన్స్) అమర్చుతారు. ముందుగా గుర్తించి చికిత్స చేసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. అశ్రద్ధతో ఆలస్యం చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని డా.పుల్లారావు అంటున్నారు. తీవ్రతను బట్టి ఇమ్మెచ్యూర్, మెచ్యూర్, హైపర్ మెచ్యూర్ క్యాటరాక్ట్ దశలుగా గుర్తిస్తారు.
చికిత్స ఉందా..?
శుక్లం ముదిరితే ఆపరేషన్ సులభంగా అవుతుందనుకుంటారు. కానీ, అది కేవలం అపోహ మాత్రమేనట. పాత కాలంలో ఈ శస్త్ర చికిత్స నాటు పద్ధతిలో కన్ను కోసి కుట్లు వేసేవారట. ప్రస్తుతం ఆల్ట్రాసౌండ్ వేవ్స్ టెక్నాలజీతో ‘ఫేకో ఎమల్సిఫికేషన్’ పద్ధతిలో శుక్లాన్ని తొలగించి దాని స్థానంలో కృత్రిమంగా ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అమర్చుతారు. ఈ ప్రక్రియ కత్తి వాడకుండా ఒక గంటలో అయిపోతుంది. కొంత మందిలో 5, 10 ఏళ్లకు కృత్రిమంగా వేసిన కటకంపై పూత వచ్చి చూపు సన్నగిల్లుతుంది. దీంతో వైద్యులను సంప్రదిస్తే పూతను తొలగిస్తారు.
జాగ్రత్తలు:
శుక్లాల సర్జరీకి ముందు షుగర్, హైబీపీ నియంత్రించుకోవాలి. లేదంటే ఆపరేషన్ టైంలో అధిక రక్తపోటు, రక్తస్రావం అవుతుంది.
కంట్లో అమర్చే కృత్రిమ కటకం ఫోల్డబుల్, ఎక్రిలిక్ హైడ్రోఫోబిక్ పదార్ధాలతో చేసినవైతే మన్నికగా ఉంటాయని వైద్యులు సూచిస్తారు.
ఆపరేషన్ తర్వాత నెల రోజుల వరకు గట్టి పదార్థాలు నమలకూడదు.