HEALTH & LIFESTYLE

మంకీపాక్స్‌..పొరుగు దేశాల్లో పెరుగుతున్న కేసులు..?! భారత్ లోనూ ఆందోళన..!?

యావత్ ప్రపంచాన్ని మొన్నటిదాకా కరోనా కుదిపేస్తే.. ఇప్పుడు అదే తరహాలో మరో వ్యాధి  భయపెడుతోంది.. అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఆఫ్రికాలో మొదలై.. ఇప్పుడు ఐరోపా దేశాలకు చేరింది. తాజాగా పొరుగునున్న పాకిస్థాన్‌లో కూడా ఓ కేసు నమోదైంది. కరోనా చేసిన కల్లోలం ఇంకా మరువక ముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి దడిపిస్తుంది. ఇప్పటికే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ ఓ) అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి.. ఎలా వ్యాపిస్తుంది..? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం…

2022-23లో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ ప్రకటించింది. ఎక్కడో కదా మనకేం కాదులే అనే నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని ఈ వ్యాధి వ్యాప్తి విజృంభణ మనకు చెబుతోంది. 

మంకీపాక్స్‌ను గుర్తించడం, చికిత్స, నివారణకు సంబంధించిన వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు ఈపాటికే హెచ్చరికలు వచ్చాయి. అసలుకైతే 1958లో మంకీపాక్స్ ను తొలిసారి గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఓ వ్యక్తికి సోకింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఈ వ్యాధిని గుర్తించడంతో.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. కొంత విస్మరించాయి.. మళ్లీ తిరిగి తొలిసారి 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టాయి. 

అసలు మంకీపాక్స్ అంటే..

మంకీపాక్స్‌లో ప్రధానంగా రెండు వేరియంట్ లు ఉన్నాయి. క్లాడ్‌-1(కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌).  వీటిల్లో క్లాడ్‌-1 తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలను కలుగజేస్తుంది.. దీని బారిన పడినవారికి న్యూమోనియా, బ్యాక్టిరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలా వచ్చిన వారి మరణాల రేటు 1-10శాతం వరకు ఉంది. ఇక క్లాడ్‌-2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై  పొక్కులు రావడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపించడమే ఇప్పుడు అంతటా ఆందోళనకు కారణమైంది. లైంగిక సంబంధాల కారణంగా కూడా ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుందిట. ప్రస్తుతం నాలుగు దేశాల్లో క్లాడ్‌-1లోని వేరియంట్లు సోకిన 100 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 15,600. వీటిల్లో 537 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో 96 శాతం కాంగోలోనే చోటుచేసుకున్నాయి. 

ఇకపోతే మన భారత్‌ విషయానికొస్తే.. 2022లో మంకీపాక్స్‌ 27 మందికి సోకినట్లు సమాచారం. 

వ్యాప్తి ఎలా..?

నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోటి ద్వారా లేదా ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, టాటూస్(పచ్చబొట్టు) ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం వల్ల మనుషుల్లోకి వైరస్‌ నేరుగా ప్రవేశించవచ్చు. 

ఈ వైరస్‌ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. చర్మం మీద పొక్కులు, జ్వరం, గొంతు పొడిబారడం, తల, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, నీరసం, శక్తి సన్నగిల్లడం వంటివి. ఈ లక్షణాలు దాదాపు 2 నుంచి 4 వారాలపాటు ఉంటాయి. 

నివారణ.. సాధ్యమా..?!

సాధ్యమే.. ప్రస్తుతం మంకీపాక్స్‌ నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి. వీటిని గత వారమే డబ్ల్యూహెచ్ ఓ స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ అత్యవసర వినియోగానికి లిస్టింగ్‌ చేసింది. దీంతో గావీ, యూనిసెఫ్‌ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు మార్గం సులభమైంది. ఈ టీకాలను ఇతర దేశాల్లో ఆయా ఆరోగ్య విభాగాలు ఇంకా అనుమతులు జారీ చేయకపోవడం వల్ల వినియోగంలోకి రాలేదు. కానీ డబ్ల్యూ హెచ్ ఓ జారీ చేసిన మార్గదర్శకాల వల్ల స్పీడ్ పెరిగింది. ఏదేమైనా.. మన దేశంలోనూ వ్యాధి తీవ్రత పట్ల కనీస అవగాహన ప్రజల్లో విస్తృతంగా కల్పించాలి. అప్రమత్తతతో పాటు జాగ్రత్త అవసరం.

Show More
Back to top button