
వర్షాలు రాకతో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో చల్లగా ఉన్న వాతావరణం వైరస్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు తీవ్రత ఎక్కువుగా ఉంటుంది. ప్రతి ఐదుగురులో ముగ్గురు- నలుగురికి జలుబు, ఇద్దరు-ముగ్గురికి జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇవి ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి సాధారణ జ్వరంలా వచ్చి కుటుంబంలో ఉన్న అందరికీ సోకుతుంది. దీని తీవ్రత మరీ ఎక్కువుగా ఉంటే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వైరల్ ఫీవర్‌గా కూడా మారతాయి. దీంతో ఒక్కసారిగా 102 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. అసలు వీటిని ముందుగా గుర్తించడం ఎలా? వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం..
వైరల్ ఫీవర్ సోకితే ముందుగా మనకు కనిపించే లక్షణాల్లో ఒంటి నొప్పులు, చలిజ్వరం, నీరసం, వికారం, తలనొప్పి, ఆకలి తగ్గడం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటివి కనిపిస్తాయి. తర్వాత మెల్లగా శరీరంలోని జీవకణాల మీద వైరస్ ఎటాక్ చేస్తుంది. ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, వైరస్ మరీ ఎక్కువగా ఉంటే నరాలు, శ్వాసవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ లక్షణాల తీవ్రత తగ్గడానికి, వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపయోగపడతాయి. తరువాత తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. డెంగ్యూ అని అనుమానం ఉంటే.. NS1 యాంటీజెన్ పరీక్ష, మలేరియాగా డౌట్ పడితే.. ర్యాపిడ్ డయోగ్నోస్టిక్ టెస్ట్ డాక్టర్ సమక్షంలో చేయించుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆహారం పంచుకోవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. జలుబు ఎక్కువ ఉంటే వేడి నీటిలో జండూబామ్ కలిపి, ఆవిరి పడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. వర్షంలో వెళ్లేటప్పుడు గొడుగు, రెయిన్ కోట్స్ తప్పనిసరిగా వాడాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్‌లో పండ్లు ఎక్కువగా ఉంచాలి. నూనె పదార్థాలు తక్కువగా ఉండేటట్లు చూడాలి. వేడిగా ఉన్నఆహారాన్ని తినాలి. గొంతునొప్పి మరీ ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకొని, తరుచు పుక్కిలించడం, మెడికల్ షాపులో దొరికే యాంటిసెప్టిక్ లోషన్లు నీటిలో వేసుకొని పుక్కిలిస్తే మంచిది.