GREAT PERSONALITIESHISTORY CULTURE AND LITERATURE

బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన బ్రహ్మర్షి…రఘుపతి వెంకటరత్నం నాయుడు!

బ్రహ్మ సమాజాన్ని విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, బ్రహ్మర్షిగా, అత్యుత్తమ అధ్యాపకుడిగా, వక్తగా.. ఆంధ్రదేశసమాజ ఉద్దరణయే ధ్యేయంగా…

అంటరానితనాన్ని రూపుమాపి, దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి సలిపారు.

ప్రబలంగా వ్యాప్తిలో ఉన్న దేవదాసి వ్యవ్యస్థను నిర్మూలించి..

వితంతు పునర్వివాహాలను, స్త్రీ విద్యను ఎంతగానో ప్రోత్సహించారు. 

బ్రహ్మ సమాజాన్ని స్థాపనకు ఆద్యులై ‘బ్రహ్మర్షి’గా బిరుదాంకితులయ్యారు. 

సుదీర్ఘకాలం పాటు అధ్యాపకుడిగా.. అత్యుత్తమ విద్యార్థులను సమాజానికి అందించడమే లక్ష్యంగా విశిష్ట సేవలందించారు. 

విద్యావ్యాప్తికై పాటుపడిన మహనీయులు..

ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి ఈ నెల(మే) 26న కావడంతో, ఈ సందర్బంగా ఆయన జీవిత, సంఘసేవా విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం.

బాల్యం, చదువు

1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో సుప్రసిద్దులైన ఓ తెలుగు నాయుడు కుటుంబంలో జన్మించారు రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు. తండ్రి రఘుపతి అప్పయ్య నాయుడు, తాతగారు వెంకటరత్నంగారి పేరునే.. మనకు తెలిసిన ఆచార్య రఘుపతి వెంకటరత్నంగారికి పెట్టడం జరిగింది. ఈయన తాతగారు అప్పటి మద్రాసు సైన్యంలో అధికారులుగా పని చేసేవారు. తల్లి శేషమ్మ.. విష్ణు భక్తురాలు. పవిత్రమైన మానవుడి విషయంలో కుల, మతాలను పట్టించుకోకూడదని హితబోధ చేస్తుండేవారు. తండ్రి సుబేదారుగా పని చేసేవారు. ఉద్యోగరీత్యా చాలాకాలం పాటు ఉత్తర భారతదేశంలోనే ఉన్నారట.

నాయుడుగారి బాల్యం మొత్తం అదే ప్రాంతంలో గడిచింది. అందువల్ల తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషల్లో ప్రావీణ్యం పొందగలిగారు. ప్రాథమిక విద్య ఇక్కడే సాగినా.. తండ్రికి తిరిగి హైదరాబాద్ కు బదిలీ కావడంతో వీరి కుటుంబం హైదరాబాద్ కు చేరుకుంది. ఆ విధంగా వెంకటరత్నంగారు చాదర్ ఘాట్ లోని నిజాం ఉన్నత పాఠశాలలో తిరిగి చదువును కొనసాగించారు. చిత్రంగా అదే పాఠశాలలో సరోజినీ నాయుడు తండ్రిగారైన అఘోర చటోపాధ్యాయగారి వద్ద శిష్యరికం చేశారు. అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో డా. మిల్లర్ అంతేవాసిగను అధ్యయనం చేశారు. సంఘం ఎల్లప్పుడూ అధ్యాత్మికంగా ముందంజలో ఉండాలని నాయుడుగారు సూఫీ వేదాంతాన్ని, హిందూ క్రైస్తవ మత సిద్ధాంతాలను బాగా ఆకళింపు చేసుకున్నారు.

1884లో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే శేషమాంబను వివాహమాడారు. ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చి, ప్రసవ వేదనతోనే మరణించింది. ఆమె చనిపోయాక మరలా పెళ్లి చేసుకోలేదు నాయుడుగారు. ఆనాటి నుంచి తెల్ల వస్త్రాలనే ధరించడం మొదలుపెట్టారు. అందువల్లనే నాయుడుగారిని ‘ఆంధ్రదేశ శ్వేతాంబర రుషి’ అని పిలుస్తారు.

సహావిద్యకు తోడ్పాటు..

చదువయ్యాక.. ఏలూరు సి.ఎం.ఎస్ హై స్కూల్ లోనూ, రాజమండ్రి, బందరు పట్టణాల్లోని హై స్కూళ్ళలో ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులుగా విశేష సేవలందించారు.

1891లో ఎం.ఏ(ఆంగ్ల సాహిత్యం)పై పట్టా పొందారు. కొంత కాలానికి మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఆంత్రోపాలజీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.

1904లో పిఠాపురం రాజావారి(పి.ఆర్ కళాశాల) ప్రిన్సిపాల్ గా పని చేశారు.

ఆ సమయంలో స్త్రీలకు, దళిత విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పించాలని సంకల్పించారు.

1911లో మొట్టమొదటిసారిగా స్త్రీలను కళాశాలలో చేర్చి, సహావిద్యకు మార్గదర్శకులయ్యారు.

ఆయన చేసిన కృషికి గానూ 1924లో బ్రిటిష్ ప్రభుత్వం చేత ‘నైట్ హుడ్’ పురస్కారాన్ని అందుకున్నారు.

1925లో నాయుడుగారు మద్రాసు విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ బిల్లును రూపొందించి శాసనమండలిచేత ఆమోదింపజేశారు.

1927లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి మొట్టమొదటి పట్టా ప్రదానోత్సవంలో భాగంగా తొలి డాక్టరేట్ ను ఈయనే అందుకోవడం విశేషం.  

1929 వరకు పి.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గానే కొనసాగారు. అనంతరం రాణిగారు కళాశాలకు కావాల్సిన భవనాలకు, లక్షల్లో విరాళం అందజేశారంటే.. దానికి కారణం వెంకటరత్నం నాయుడే.. అంతేకాక 35 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం దానమిచ్చారట.

కందుకూరి వీరేశలింగం సహచర్యంతో..  

బ్రహ్మ సమాజాన్ని సిద్ధాంతాల పట్ల ఎంతో ఆకర్షితులై, ఒక్కింత విశ్వైక మత ప్రచారానికి, మానవతా ప్రబోధానికి కృషి చేశారు. ఇదే సమయంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి సహచర్యం తోడైంది. దీంతో వితంతు పునర్వివాహలను మరింత బలోపేతం చేశారు.

బ్రహ్మ సమాజా సిద్ధాంతాలలో ప్రధానమైన కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తూ, వర్ణాంతర వివాహాలను జరిపించారు. అస్పృశ్యత నివారణ కోసం ఏకంగా ఉద్యమాన్నే నడిపించారు.

ఆనాడు ఆంధ్రదేశంలో ప్రబలంగా ఉన్న వేశ్యావృత్తి నిర్మూలనకు అవిరళ కృషి జరిపారు. భోగమేళాలను సమూలంగా అంతరింపజేశారు. ఈ ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం సైతం ఈ వృత్తిని నిషేధించే చట్టాన్ని అమలుపరిచింది.

మద్య నిషేధ ఉద్యమాన్ని సైతం స్థాపించారు. 1923లో మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు మధ్య నిషేధ బిల్లును ప్రవేశపెట్టనందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఉపాధ్యాయుడు అందరికన్నా ముందుగానే చైతన్యవంతుడు కావాలని విమోచన సేనగా ఉద్యమించాలని ఉద్బోధించారు.  

ఇతర విశేషాలు..

*నాటి ఆంగ్ల ప్రభుత్వం నాయుడుగారిని ‘దివాన్ బహదూర్’, ‘కైజర్ ఇ హింద్ సర్’.. వంటి బిరుదులతో గౌరవించింది.

బ్రహ్మర్షి, అపర సోక్రటీసు, కులపతి ఇతర బిరుదులు..  

*ఆంగ్ల భాషపై విశిష్టమైన పట్టు సాధించడం వల్లే ‘పీపుల్స్ ఫ్రెండ్’, ‘ఫెలో వర్కర్స్’ అనే ఆంగ్ల పత్రికలకు సంపాదకత్వం వహించారు. అంతేకాక సామాజిక సమస్యల మీద ఉత్తేజితమయ్యేలా వ్యాసాలు రాశారు.

*ఆంగ్లభాషలో అనర్గళమైన ఉపన్యాసాలు సైతం  చేసేవారట.

*ఆయన తన ఆదాయంలో సొంత ఖర్చులకు తక్కువగా, బీద విద్యార్థుల సంక్షేమం కోసం మిగతా మొత్తాన్ని అందించేవారట. ఎంతోమంది అనాథ బాలబాలికలకు ఉచితంగా విద్యను అందించిన విద్యావేత్త.

*తన ఆరాధ్య గురువుగా భావించే డా. మిల్లర్ పేరున మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా విజ్ఞాన ప్రచారానికి పదివేల రూపాయల నిధిని ఏర్పాటు చేసిన మహనీయులు. అటువంటి నాయుడుగారిని ఆంధ్రప్రముఖులైన ముట్నూరు కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, గోరా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చలం వంటి వారంతా తమ గురువుగా భావించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. 

అపర సోక్రటీసుగా ఆంధ్ర ప్రజల మన్ననలను అందుకున్న వెంకటరత్నం నాయుడుగారు 1939 మే 26న దివంగతులయ్యారు. 

Show More
Back to top button