HISTORY CULTURE AND LITERATURE

లేపాక్షి ఆలయ ప్రత్యేకత.. విశేషాలు ఏంటో మీకు తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన నందీశ్వర క్షేత్రం లేపాక్షి దేవాలయం.  ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురానికి సమీపంలో లేపాక్షి మండలంలో కూర్మద్రి అనే కొండమీద వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. ఈ ఆలయం వీరభద్రేశ్వర స్వామివారి ఆలయంగా ప్రసిద్ధి చెందినా.. ఇక్కడ శ్రీ రామునిచే ప్రతిష్టించబడినట్లు చెప్పబడే శ్రీ రామేశ్వర స్వామి శివలింగం, ఆంజనేయునిచే ప్రతిష్టింపబడినట్లు చెప్పబడే హనుమలింగం, స్వయంభువుగా వెలసినదని చెప్పబడే పాపనాశేశ్వర లింగం మొదలగు శివలింగమూర్తులు వెలసిన గోప్ప క్షేత్రం ఈ లేపాక్షి.  ప్రకృతి సోయగాల నడుమ 108 దివ్య శైవక్షేత్రాల్లో ఒకటిగా లేపాక్షి అని స్కాందపురాణం చెప్పబడింది. ఇక్కడి నంది ఏపీ, తెలంగాణలోనే అతిపెద్ద నంది. జిల్లాలోని హిందూపురం పట్టణం నుండి 14 కి. మీ. దూరంలో ఈ దేవాలయం ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. 

రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని ఈ ప్రాంతం మీదుగ  వెళుతుండగా ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. సీతమ్మ తల్లిని విడిచిపెట్టాలని కోరుకుంటుంది. దీంతో కోపోద్రిక్తుడైన రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది. అనంతరం  సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును చూసి హృదయమును ద్రవింపజేసుకున్నాడు. ఏమి జరిగినది అనిజటాయువును అడగగా.. జరిగిన విషయాన్ని జటాయువు శ్రీ రామునికి వివరించింది. అనంతరం పక్షి అక్కడే ప్రాణం విడిచి పుణ్యలోకాలకు చేరింది. జటాయువు మరణాన్ని చూసి బాధాతప్తుడైన రఘురాముడు.. లే పక్షి అని అన్ని దుఃఖిస్తాడు. అందువల్ల ఈ దివ్యక్షేత్రానికి లేపక్షి అను పదము నుంచి క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి వారు చెబుతారు.  

అనంతపురం జిల్లాలో సుందరమైన ప్రకృతి హొయగాల నడుమ  హృదయం పులకించి విధంగా  అద్భుతమైన శిల్పకళా కట్టడమతొ మహానంది క్షేత్రమైన లేపాక్షి దేవాలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అచ్యుత దేవరాయల వద్ద కోశాధికారిగా ఉన్న విరూపణ్ణ కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం అలనాటి విజయ నగర సామ్రాజ్య కళాకారులచే అత్యంత శిల్పకళాకట్టడంతో నిర్మించబడింది.  108 శైవక్షేత్రాలలో ఒకటిగా చెప్పే లేపాక్షి ఆలయంలో ముందుగా వినాయకుడిని దర్శించి ఆ తరువాత వీరభద్ర స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుంటారు.

ఈ ఆలయంలో పానవట్టం మీద శ్రీరాముని ప్రతిష్టించబడి  ఉండటం ప్రత్యేక విశేషంగా చెప్పవచ్చు.ఈ విచిత్రం ఒక్క ఈ ఆలయం లో తప్ప మరెక్కడా కూడా ఉండదు. ఇంకా వీరభద్రుడు, శ్రీరాముడు, దుర్గాదేవి, పాపనాశేశ్వరులను కలిపి ఆరాధించే ఏకైక ఆలయం కూడా ఇదే కావడం విశేషం. ఇక్కడ 30 అడుగుల ఎత్తు గల ఏడు తలల నాగేంద్రుడు చుట్టుకొని ఉన్నట్లుగా మధ్యలో అద్భుత శివలింగం చూపరులను ఆకట్టుకుంటుంది.

లేపాక్షికి కొంత దూరంలో 8.23 మీటర్ల పొడవూ, 4.5 మీటర్ల ఎత్తులో మలిచిన ఏకశిలా రూపంలో అద్భుత నంది విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. దేశంలోనే ఎత్తైన నంది విగ్రహం ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత అంతరిక్ష స్థంభం. దీనినే ఆకాశ స్థంభం అని కూడా అంటారు. ఈశాన్యమూలలో ఉన్నఈ అంతరిక్ష స్తంభం నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభం పై కప్పు నుంచి వేలాడుతూ ఉంది. దీనికింద ఏదైనా బట్టను పెట్టి పరీక్షించవచ్చు. ఈ ఒక్క స్తంభం పైనే దేవాలయ నిర్మాణం మొత్తం ఆధారపడి ఉందని చెప్తారు. 

దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ సుందమైన దివ్యక్షేత్రంలో ఉన్న నాగలింగం వెనుక భాగంలో అసంపూర్తిగా ఉన్న పార్వతి పరమేశ్వరుల కల్యాణ మండపం ఉంది. ఇక్కడ ఉన్న శిల్పకళ చాతుర్యం అద్భుతం అనే చెప్పాలి. సాధారణంగా ఆలయంలోని మండపంలో, స్థంభాలన్నీ కిందిభాగాన, పైభాగాన కూడా సమాన దూరంలో ఉండి, పై కప్పు బరువుని సమానంగా మోస్తుంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ గుడిని విజయనగరం రాజుల కాలం నాటిదికాగా, కోశాధికారిగా పనిచేసే విరూపణ్ణ అనే అతడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి చరిత్ర చెబుతుంది.

ఖజానా అధికారైనా విరూపణ్ణ ఆలయాన్ని నిర్మిస్తూ రాజు ఖజానా వృధా చేస్తున్నాడని రాజు విరూపణ్ణ కళ్లని పొడిచివేయాలని ఆదేశించగా, మనస్థాపం చెందిన విరూపణ్ణ తన కళ్లని తానే పొడుచుకున్నాడు. అందుకే ఈ ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందంటారు. ఇప్పటికి ఈ ఆలయంలో గోడపై ఎర్రటి రక్తం మరకలను మనం వీక్షించవచ్చు.

సనాతన హైందవ ధర్మంలో ఒక సంప్రదాయం ఉంటుంది. మన దేశంలో కొన్ని ప్రసిద్ధ ఆలయాలు దేవతలకు ఆతిధ్యం ఇచ్చే నివాసాలుగా చెబుతారు. అలాంటి అతికొద్ది ఆలయాలలో లేపాక్షి ఆలయం ఒకటిగా వర్ణిస్తారు. ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ రామేశ్వరస్వామి శివలింగం, హనుమంతుడు ప్రతిష్టించిన హనుమ లింగం, స్వయంభువుగా వెలసిన పాపనాశేశ్వర లింగాలను భక్తులు దర్శనం చేసుకొని పునీతులవుతారు.  ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసమంతా శివనామ స్మరణతో ఆలయం వెలిగిపోతుంది. ఆ సమయంలో ఈ ఆలయానికి కొన్ని లక్షల మంది భక్తులు పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు.

Show More
Back to top button