పట్టుదలే పరకాయ ప్రవేశం చేసిందేమో అన్నట్టు ఉంటుంది ఆ వీరున్ని చూస్తే. అతని పిడికిలి నుండే పోరాటం పురుడు పోసుకుందేమో అనిపిస్తుంది. ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టిన ఆంగ్లేయునికి ఎదురుగా వెళ్లి వారి ఎదను చీల్చి.. దేశంలో స్వతంత్ర ఉద్యమం ఊపిరి పుట్టకముందే తెలంగాణలో తెల్ల దొరల తిత్తి తీసిన ధీరుడు ఆయన. ఆత్మ అభిమానమే ఆస్తిగా భావించి, బతికున్న తన జాతిపై ఆటవికులు అనే అవహేళన చేసి ఆస్తిత్వాన్ని కొల్లగొట్టిన ఆంగ్లేయులపై పోరాట పంజా విసిరిన గిరిజన వీరుడు అతడు. తన తెగపై అన్యాయాన్ని అణచివేతని సహించని తెగువతో తెలంగాణకు పోరాట రుచిని చూపించిన గోండ్వాన గర్జన ఆయనే రాంజీకొండు.
భారతదేశంలో గిరిజన తెగల స్వయంపాలన ప్రత్యేకమైనది. తమను తాము పరిపాలించుకున్న స్వయంపాలన చరిత్ర గిరిజనులది. తమ చరిత్రను, చారిత్రక మూలాన్ని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆదివాసి గిరిజన తెగల కృషి అనన్య సామాన్యం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలలో గిరిజన తెగలు తమను తాము పరిపాలించుకున్నారు. వీరి పాలన 1240- 1750 వరకు ఉన్నట్లు చరిత్ర చెబుతోం.ది అంటే ఐదు శతాబ్దాల పాటు గిరిజన తెగల పాలన నడిచింది. గోండు రాజులలో నీల్ కంటష 1735- 40 మధ్య పరిపాలన చేశాడు. అయితే గోండు రాజులలో చివరివాడు ఆయన. ఆయన పరిపాలన చేస్తున్న చంద్రపూర్ రాజ్యం మరాఠీ రాజుల చేతిలోకి వెళ్ళింది. క్రమంగా గోండ్వాన రాజ్యం తెల్ల దొరల చేతుల్లోకి వెళ్ళింది.
గోండ్వాన రాజులలో భాగమైన హైదరాబాద్ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. 1769 రాజధాని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కు మారింది. అప్పటికి హైదరాబాదును పాలించే రాజు అప్పటికి హైదరాబాదును పరిపాలించే రాజులను ఆసఫ్ జాహీలు అని పిలిచేవారు. నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా బేరార్ శుభాలో ఉండేది. అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ తదితర ప్రాంతాలలో గోండులుగా పిలవబడే గిరిజనులు అడవులలోనే స్థిరనివాసులుగా ఏర్పరచుకొని జీవించేవారు. అడవులతో మమేకమై జీవనం సాగించేవారు. కొన్ని రోజులకు గోండు రాజుల రాజధాని లాంటి సిర్పూర్ ప్రత్యక్షంగా అసఫ్జాహీ పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి 1858లో నిజాం ప్రభుత్వానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన సంధి ఒప్పందం ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలు బేరార్సుభ పూర్తిగా బ్రిటిష్ పాలకుల చేతులకు వెళ్లింది. దీంతో గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ ప్రాంతాలపై బ్రిటిష్ వారు పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు.
అడవులలో సంపదపై కన్నేసి అడ్డంగా ఉన్న గిరిజనులపై ఆధిపత్యం చెలాయించేవారు. అడవులపై పడి దోచుకోవడం మూలంగా గిరిజనుల ఆత్మ అభిమానం దెబ్బతింది. ఆంగ్లేయుల అరాచకాలు మితిమీరి పోయాయి. మరోవైపు అప్పటికే ఔరంగాబాద్, బీదర్, దర్బాని ప్రాంతాల నుంచి బ్రిటిష్ పాలకులను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న యోధులు ఆదిలాబాద్ అడవుల్లోకి వచ్చారు. అలా వచ్చినవారే రోహిల్లా సిపాయిలు. రోహిల్లా ప్రవేశంతో బ్రిటిష్ ప్రెసిడెంట్ డేవిడ్సన్ సైన్యాన్ని అప్రమత్తం చేశాడు. రోహిల్లాలకు నాయకత్వం వహిస్తున్న రంగారావు బ్రిటిష్ అధికారులకు చిక్కి అండమాన్ జైల్లో ప్రాణాలు విడిచాడు. రోహిల్లా సిపాయిల ప్రవేశం తోనే గిరిజన ఉద్యమం మలుపు తిరిగింది. స్థానికంగా గొండులకు రాజ్యాధిపతిగా ఉన్న రాంజీ సారధ్యంలో ఆ పోరాటం నడిచింది. బ్రిటిష్ పాలకులు, గిరిజనుల శ్రమను దోచుకోవడమే కాక అటవీ సంపదను దోచుకుంటున్న వైనాన్ని రాంజీ గమనించాడు.
కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరిగా అని ప్రశ్నించాడు. గిరిజనులు అంటే పాలకులకు హేళన భావం ఉండేది. కనీసం మనుషులుగా కూడా గుర్తించేవారు కాదు. కట్టు బానిసలుగా చూస్తూ వేధిస్తూ సర్వం దోచుకునేవారు. గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు. మానప్రాణాలకు రక్షణ లేనప్పుడు తిరుగుబాటే శరణ్యమని రాంజీ భావించాడు. తెల్లదొరల అరాచకాలతో చితికి రాంజీ నాయకత్వం వారిలో ప్రశ్నించే తత్వాన్ని రేకెత్తించింది. క్రమంగా తెల్ల దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. చేసిన శ్రమకు ఫలితం ఆశించారు. తెల్లదొరల ఆగడాలు పెరిగిన నేపథ్యంలో గిరిజనులలో చైతన్యం నిండుకొని ప్రాణాలు అర్పించేందుకు వెనకాడ లేదు. వారి చైతన్యాన్ని తిరుగుబాటును అణిచివేసేందుకు బ్రిటిష్ అధికారులు కుట్రలు చేశారు. బ్రిటిష్ పాలకులను వెళ్ళగొట్టేందుకు స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఉట్నూర్, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్, లక్సెట్టిపేట ఏజెన్సీ ప్రాంతాలు పోరాట కేంద్రాలుగా మారాయి.
బ్రిటిష్ ఆపడానికి వ్యతిరేకంగా మరాఠా తెలుగు రోహిల్లా గుండు సైన్యాలను తయారుచేసి వారికి సాయిధ శిక్షణ ఇచ్చి ఆదిలాబాద్ దాని చుట్టుపక్క ప్రాంతాలను విముక్తి చేసి నిర్మల్ రాజధానిగా కొద్ది కాలం పాటు స్వతంత్రంగా పరిపాలించారు. ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం 300 మంది గిరిజన గొండు సైనికులు, 200 మంది రోహిల్లా, ముస్లిం సైనికులు, 500 మంది తెలుగు మరాఠా సైనికులతో పటిష్టమైన సైన్యాన్ని ఏర్పరచుకున్నారు. ప్రాణ రక్షణ కోసం వారి వద్ద ఉండే విల్లంబులు, బరిసెలు, కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు కారంపొడులు, రాళ్లు రప్పలే వారి ఆయుధాలు అయ్యాయి. బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు అందిన ప్రతి వస్తువును ఆయుధంగా ఉపయోగించేవారు.. ఆయుధాలు కన్నా ఆత్మవిశ్వాసమే గొప్ప ఆయుధంగా మలిచి తెగించి నిలిచిన ఓ గొప్ప పోరాటానికి నడుము బిగించారు. ఆ ప్రాంతంలోని గుట్టలను కేంద్రాలుగా చేసుకున్నారు. రాంజి గోండు సారథ్యంలో పోరాటం బ్రిటిష్ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
1860 మార్చి, ఏప్రిల్ నెలలో పోరాటం రణరంగంలో మారింది. ఒకపక్క నిజాం సేనలను ఎదిరించారు. మరోపక్క బ్రిటిష్ పాలకులను ఎదుర్కొన్నారు. గిరిజనుల ఆత్మవిశ్వాసం ముందు బ్రిటిష్ సైన్యం ఉపయోగించిన ఆయుధాలు చిన్న బోయాయి. రాంజీ నాయకత్వంలో సాయిధ శిక్షణ పోరాట ఉధృతానికి కారణమైంది. బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని నిజాం సైన్యంతో కలుపుకొని కల్నల్ రాబర్ట్ అనే సైనిక అధికారి నాయకత్వంలో పోరాటానికి సిద్ధమయింది. ఈ సైన్యం నిర్మల్ ప్రాంతానికి వెళ్లి గోండులను రోహిల్లాలను వేధించడం వేటాడడం లాంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. కానీ అంతకంటే భీకరంగా ఉన్న రాంజీ సైన్యాలు గేరిల్ల యుద్ధ నైపుణ్యంతో కొంతమంది బ్రిటిష్ సైన్యాలను పలుచోట్ల ఓడించారు.
కొన్నిచోట్ల చంపేశారు. ఎదురుగా పోరాడే బ్రిటిష్ సైన్యం ఎంత బలాన్ని బలగాన్ని చూపెట్టిన ఏమాత్రం బెదరక రాంజీ సైన్యం తిరగబడింది. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించారు. గిరిజనులు, రోహిల్లాలు సాయిధ శిక్షణతో బ్రిటిష్ సైన్యంతో తలబడుతుండడం పాలకులను కలవరపరిచింది. దీంతో 1860 ఏప్రిల్ 8న బ్రిటిష్ సైనిక అధికారి రాబర్ట్ నాయకత్వంలో గిరిజనుల పైకి యుద్ధం తీవ్రతరం చేశారు. ఇంగ్లాండు నుంచి నూతన ఆయుధాలను తెప్పించారు. రాక్షసంగా దాడులకు తెగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు కాల్చి చంపారు. భయంకరమైన యుద్ధ వాతావరణము సృష్టించారు. అయినా రాంజీ సైన్యం వెనకడుగు వేయలేదు. వెన్ను చూపించలేదు. ఉన్న ఆయుధాలతో తెగించి కొట్లాడుతున్నారు. ఇక బ్రిటిష్ సైన్యం చేసేదేమి లేక కుట్రలతో దొడ్డిదారిని అనుసరించారు. పూర్తిస్థాయిలో పోటీ పడలేకపోయారు బ్రిటిష్ సైన్యం. దొడ్డిదారిన భయభ్రాంతులకు గురిచేసి రాంజీ సైన్యాన్ని చల్ల చదురు చేశారు.
దొరికిన సైన్యాన్ని దొరికినట్లు ప్రాణాలతో వధించారు. బ్రిటిష్ అధికారుల నయవంచన కుట్రలు, కుతంత్రాలతో రాంజీ గోండును ప్రాణాలతో బంధించారు. రాంజిగొండు తిరుగుబాటుకు చెదిరిన బ్రిటిష్ అధికారులు మరో తిరుగుబాటు పుట్టకుండా ఉండడానికి రాంజీని, అతని సైన్యం దాదాపు 1000 మందిని నిర్మల్లోని పురాణపేట నుండి చతిస్గడ్ వెళ్లే దారిలో ఖజానా చెరువు గట్టునున్న మర్రిచెట్టుకు కర్కషంగా ఉరి తీశారు. గిరిజన పోరాట సారధి రాంజీతో పాటు వేయి మందిని ఉరితీసి ప్రాణాలు బలి కొన్న ఘటనకు అటవీ ప్రాంతం అంతా ఆ వీరుల వీరమరణంతో దుక్కించింది. ఏ స్వార్థం లేని అడవి బిడ్డలు తమ హక్కుల కోసం ప్రాణాలు విడిచారు. 1000 మంది వీరుల త్యాగంతో ఆ మర్రిచెట్టు ఉరిల మర్రిగా మారింది. ఆనాటి దురాగతానికి సాక్ష్యంగా నిలిచింది మర్రిచెట్టు. వేలమంది ప్రాణాలను త్యాగం చేసిన ఈ పోరాటాన్ని గిరిజన ఉద్యమంగానే కాక స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచింది.
తెల్లదొరలను ఎదిరించిన ఈ పోరాటం సామ్రాజ్యవాద వ్యతిరేకంగా గిరిజన వీరుల త్యాగాలను స్మరించుకునేలా రాంజీ గోండు పేరును చరిత్రలో నిలిపింది.. రాంజీ గోండు తిరుగుబాటు విజయానికి గుర్తుగా నిర్మల్ కోటలో అతని స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. శత్రువు తమకన్నా బలవంతుడు అని తెలిసిన ఆత్మ గౌరవం కోసం అస్తిత్వం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన రాంజీ గోండు పోరాటం అనితర సాధ్యం. భారతదేశ చరిత్రలో జలియన్వాలాబాగ్ ఘటన జరగకముందే తెలంగాణలో జరిగిన మారణ హోమంలో రాంజీ గోండు చూపిన పోరాట పటిమ వెలకట్టలేనిది. చరిత్ర తన కడుపులో దాచలేకపోయిన తొలి స్వాతంత్ర సంగ్రామం తెలంగాణలో పుట్టింది అనేది నగ్న సత్యం.