
తెలుగు వారు పదిరోజులపాటు అట్టహాసంగా నిర్వహించే “దసరా వేడుకలు”, పూజల గురించి అనుకుంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నడిబొడ్డులో ప్రవహిస్తున్న కృష్ణానదికి ఆనుకుని ఉన్న “ఇంద్రకీలాద్రి పర్వతం” పై కొలువై వున్న “శ్రీ కనకదుర్గ దేవాలయం”. దసరా పండుగ సందర్భంగా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత రెండవ పెద్ద దేవాలయంగా కనకదుర్గ దేవాలయం ఖ్యాతిగాంచింది. మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయి వనవాసానికి దారుకావనానికి వచ్చిన సమయంలో వేద వ్యాసుని సలహామేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. “శ్రీ కనకదుర్గ దేవాలయం” లో శివలీలలు, శక్తి మహిమలు అక్కడక్కడ కనిపిస్తాయి.
బెజవాడగా మారిన “బెజ్జంవాడ”…
ఇంద్రకీలాద్రి పర్వతం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో ఉంది. ఈ పర్వతం మీద శివుని కొరకు అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడని ప్రతీతి. ఇక్కడే శివపార్వతులతో అర్జునుడు యుధ్దం చేసాడని నమ్మకం. ఈ యుధ్దం చేసిన స్థలంలోనే కనకదుర్గ ఆలయం వెలసిందని నమ్మకం. కానీ స్ధానికంగా వాడుకలో ఉన్న కథనం ప్రకారం, అసలు ఆలయం కొండ పైన ఉన్నదని, ఆ ఆలయం సామాన్య మానవులకు కనిపించదని, ప్రస్తుతం ఉన్న ఆలయం కేవలం మానవుల కోసం నిర్మించబడిందని అంటుంటారు. నిజానికి అప్పట్లో ఇంద్రకీలాద్రి కొండ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకూ విస్తరించి ఉండేదనీ, చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల మేర దండకారణ్యం ఉండేదనీ కూడా ఓ కథనం.
కొన్నేండ్ల తరువాత మధ్యలోకి కృష్ణానదికి వరద ప్రవాహం రావడంతో కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందనీ, ఆ తదుపరి రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందనీ చరిత్రకారులు చెబుతుంటారు. అందువలననే కాబోలు “బెజవాడ”ను మొదట్లో “బెజ్జంవాడ” అని పిలిచేవారట. ఆ రోజులలో “ఇంద్రకీలాద్రి” కి వెళ్లడానికి కనీసం నడకదారి కూడా ఉండేది కాదట. 1906 సంవత్సరం నాటికి అక్కడ చిన్నగుడి ఉండేదట. దీపం మాత్రం వెలిగించేవారు, అభిషేకాలూ, అర్చనలూ లేవు. క్రూరమృగాల బారిన పడతారేమోననే భయంతో అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఇంద్రకీలాద్రికి వచ్చేవారట. ఇంద్రకీలాద్రి కొండపైకి 1992 ప్రాంతంలో రహదారి ఏర్పాటైంది. ఆ ఆలయం చుట్టూరా కూడా రాతికట్టడం నిర్మించారు. ఆ తరువాత 2002లో ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగారు. గత సంవత్సరాలతో పోలిస్తే, 1990 నుండి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
మహిషాసుర మర్ధిని…
అసురుల రాజైన రంభుడు మహిషుని తండ్రి. ఆయన ఒకనాడు “మహిషం” (గేదె) తో కలిసిన మూలంగా “మహిషాసురుడు” జన్మించాడు. అందువలన “మహిషాసురుడు” మనిషి లాగా, దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలిగినవాడు. ఆ మహిషుడు “బ్రహ్మ” గురించి తపస్సు చేసి మానవుల చేత, అలాగే దేవతల వలన మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరప్రభావం అనంతరం అతడు స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందర్నీ తరిమికొడతాడు. “బ్రహ్మ” శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి “సుందరమైన, నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలి” గా సృష్టిస్తారు. అలాంటి దుర్గాదేవి అసురుడైన మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవికి “మహిషాసుర మర్ధిని” అనే నామాంతరం కలిగింది.
జగదాంబగా అవతరణ…
వరబలం వల్ల కలిగిన మదగర్వంతో మహిషుడు అనే రాక్షసుడు మరియు అతని అనుచరగణం చతుర్దశ భువనాలలో అల్లకల్లోలం సృష్టించసాగారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి “ఆదిపరాశక్తి” తనలోని వివిధ అంశలకు చెందిన కాళిక, తరిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, భగళ, మాతంగి, కామాక్షి తుల్జ, జంబిని, మోహిని, ఛిన్నమస్తా, గుహ్యకాళి, దశసహస్ర బహుక, వింధ్యవాసిని, మలయవాసిని, శూలిని, గిరిజ, దుర్గ తదితర శక్తులన్నింటిని ఒకటిగా చేర్చి జగదంబగా అవతరించింది.
త్రిమూర్తులు సహా అష్టదిక్పాలకులు తదితర దేవతలందరూ తమ ఆయుధాలు అయిన త్రిశూలం, శారఙ్గం, ధనస్సు, ఖడ్గం, బాణం, శంఖం, చక్రం, గద, పద్మం, స్పటికమాల, కమండలం, వజ్రం, అంకుశం, పాశం, భుశుండి, దండం, తోమరం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, రౌద్రాస్తం, పాశుపతాస్త్రం, వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం వంటి ఆయుధాలను ఆమెకు అందించారు. వాటిని ఆసరాగా చేసుకుని అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి చండి వలె, చాముండి వలె, కాళిక వలె, దుర్గవలె, మహిషాసురమర్దిని వలె, మహాలక్ష్మి సరస్వతుల వలె, రాజరాజేశ్వరి వలె వివిధ అవతారాలను ధరించి ఆ దుష్ట రాక్షసులందరినీ దునుమాడింది.
ఆ రాక్షసులందరినీ సంహరించడం వలన ఆమెకు వారి పేర్లే చిరకీర్తినామాలుగా సుస్థిరమయ్యాయి. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందువల్ల ఆమెకు దుర్గ అనే పేరు స్థిరపడింది. దుర్గ అంటే దుర్గతులు అనే విశేషార్థం. అంటే ఎవరిని అర్పిస్తే మానవుడు దుర్గతులన్నీ దూరం అవుతాయో ఆమెకే దుర్గ అని పేరు. పంచ మహాశక్తులలో ఒకటైన దుర్గాదేవి స్వరూపాన్ని తలచుకున్న వెంటనే దుస్సాధ్యములైన కోరికలు (దుర్గములు) తీరి, దుష్కర్మలన్నీ (దుర్గతులు) పటాపంచలవుతాయి.
మహిషాసురుడిని అంతమొందించినది దుర్గాదేవి కాదు…
నిజానికి మహిషాసురుడిని సంహరించింది దుర్గాదేవి అని అందరూ భావిస్తుంటారు. కానీ ఆ ఘనకార్యాన్ని సాధించినది “శ్రీ మహాలక్ష్మి దేవి”. దేవగణాన్నంతటినీ ఓడించి సర్వత్రా దానవత్వాన్ని వ్యాపింపజేసిన మహిషాసురుడి బారి నుండి తమను రక్షించవలసిందిగా దేవతలందరూ కలిసి ఈశ్వరుడికి విన్నవించుకున్నారు. మహిషాసురుడి ఆగడాలను త్రిమూర్తులకు చెబుతుండగా అతని పట్ల వారిలో ఆగ్రహావేశాలు కలిగాయి. దేవతల ఆగ్రహావేశాల తేజస్సు నుండి సౌందర్యాన్ని అంతా సంతరించుకున్న “శ్రీ మహాలక్ష్మి దేవి” అంశగా మహోన్నతమైన లావణ్యరాశి తామరాకుపై ఆసీనురాలైన ఉదయించి వారికి నమస్కరించి తన కర్తవ్యం ఏమిటో తెలుపవలసిందిగా వినయంగా అడిగింది.
త్రిమూర్తులు, త్రిశక్తులు సహా దేవదేవులందరూ వివిధ ఆయుధాలను ఆమెకు అందించి మహిషాసురుడిని సంహరించడమే ప్రధాన కర్తవ్యంగా గుర్తుచేసి ఆశీర్వదించి పంపించారు. వారందరి సంకల్పబలంతో ఆమె అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, కమలం, ధనస్సు, కలశం, దండం, శక్తి, ఖడ్గం, ఢాలు, శంఖం, ఘంట, సురా పాత్ర, శూలం, పాశం, సుదర్శన చక్రం అనే అష్టాదశ ఆయుధాలలో రణరంగానికేగి మహిషాసురుడితో అరివీర భయంకరంగా పోరు సలిపింది. కామరూపి అయిన వాడి ప్రతీరూపాన్ని అంతమొందిస్తూ చివరికి మహిషాసురుడైన వాడిని “శ్రీ మహాలక్ష్మి దేవి” తన వాహనమైన దుర్జన వినాశ సహాకారిణి సింహంతోను, తన చేతనున్న అష్టాదశ ఆయుధాలతోనూ సంహరించింది. అందుకే దసరా నవరాత్రులలో ఒకనాడు “శ్రీ మహాలక్ష్మి దేవి” అలంకరణను, మరొకనాడు మహిషాసురమర్దిని అలంకరణ చేస్తారు.
ఇంద్రకీలాద్రి పేరు వెనుక చరిత్ర…
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మ వారు కీలుని పర్వతంగా నిలబడమని కృత యుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మ వారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మ వారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి కాస్త “ఇంద్రకీలాద్రి”గా మారింది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన త్రైలోక్య మాత మహిషాసురమర్ధిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. పురాణ కథనం ప్రకారం ఆదిశంకరాచార్యులవారు తమ పర్యటనలలో అమ్మవారిని దర్శించి ఉగ్రస్వరూపిణిగా వున్న అమ్మవారికి శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని చరిత్రకారులు చెబుతుంటారు. ఇక్కడే “విష్ణువర్ధన మహారాజు” 12వ శతాబ్దంలో అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు కూడా చరిత్రలో ఉంది. ఇంద్రకీలాద్రికి ప్రతీ సంవత్సరం కొన్ని లక్షలమంది వచ్చి దర్శనం చేసుకొంటారు. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఉప ఆలయాలు (ఉపాలయాలు)…
ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి ఆలయంతో పాటు “మల్లేశ్వరాలయం”, “క్షేత్రపాలకుడు”, “ఆంజనేయస్వామి ఆలయం”, “సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం”, “నటరాజస్వామి ఆలయం” ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను కూడా దర్శించుకుని పూజలు చేస్తారు. విజయదశమి పండుగ రోజు తెల్లవారుఝాము నుండి అమ్మవారు “శ్రీ రాజరాజేశ్వరి”గా దర్శనమిస్తారు. అనంతరం అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అన్నదానంతోపాటు ఉచితంగా పులిహోర, కదంబం, అప్పం ప్రసాదం ఉచితంగా అందిస్తారు.
అమ్మవారి అవతారాలు – నైవేద్యాలు…
దసరా నవరాత్రుల్లో శ్రీకనకదుర్గాదేవిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలంకరణ రూపాల్లో భక్తులు దర్శనం చేసుకుంటారు. అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు శరన్నవ రాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. మహా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు. ఒక్కోప్రాంతంలో అమ్మవారికి ఒక్కో పేర్లు ఉన్నాయి. ఆమె అవతారాలు, నామాలు, రూపాలు అనేకం. ఆమెను ఏ రూపంలో కొలిచినా కూడా ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడితే మాత్రం పూజకి మరింత ఫలితం దక్కుతుందని అంటుంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనం ఇస్తారో మనం ఒక్కసారి తెలుసుకుందాం.
పాడ్యమి నాడు (మొదటి రోజు)..
మొదటిరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు “స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి” గా దర్శనమిస్తుంది. ఆమె అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు.
విదియ నాడు (రెండవ రోజు)..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ “బాలాత్రిపుర సుందరీదేవి” రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం “శ్రీ బాల త్రిపురసుందరీ దేవి” ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి వారికి కొత్త బట్టలను పెడతారు. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. “శ్రీ బాల త్రిపుర సుందరీదేవి” ని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని అర్చకులు చెబుతుంటారు.
తదియ నాడు (మూడవ రోజు)..
దుర్గగుడిలో తదియ నాడు (మూడో రోజున) అమ్మవారు భక్తులకు “గాయత్రీదేవి” రూపంలో దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో ఉన్న గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మదేవుడు, హృదయంలో శ్రీమహా విష్ణువు, శిఖలో రుద్రదేవుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.
చవితి నాడు (నాలుగవ రోజు)
ఉత్సవాలు ప్రారంభమైన నాలుగవ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో, తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవనేది భక్తుల అచంచల ఆత్మ విశ్వాసం.
పంచమి నాడు (అయిదవ రోజు)..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున అమ్మవారు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అను త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుండి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాధనలు ముమ్మరమవుతాయి.
షష్టి నాడు (ఆరవ రోజు)…
దసరా వేడుకల్లో అమ్మవారు ఆరవ రోజున “శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి” రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా, చిరుమందహాసంతో చెరుగడను చేతపట్టుకుని, పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
సప్తమి నాడు (ఏడో రోజు)…
విజయదశమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడో రోజున అమ్మవారు “శ్రీ మహాలక్ష్మీదేవి” అవతారంలో భక్తులను కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అష్టమి నాడు (ఎనిమిదవ రోజు)…
విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమివ్వనున్నారు. అమ్మవారు “దుర్గాదేవి” రూపంలో, “మహిషాసురమర్ధిని దేవి” గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే “దుర్గాదేవి” అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుష్టుడైన మహిషాసురుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు, అష్ట ఆయుధాలు, సింహ వాహినిగా, రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే, భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని, అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి.
నవమి నాడు (తొమ్మిదవ రోజు)..
విజయదశమి నవరాత్రి వేడుకల ముగింపు విజయదశమి నాడు ఆఖరి అవతారంగా “శ్రీ రాజరాజేశ్వరీ దేవి” రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.
ఇలా విజయదశమి నవ రాత్రులలో వివిధ ప్రాంతాలలో అమ్మవారిని వివిధ పేర్లతో అలంకారాలు చేసి పూజిస్తారు. అమ్మవారి పేర్లు వేరైనా భక్తుల భక్తి ఒక్కటే. నమ్మి కొలిచేవారికి అమ్మవారి అనుగ్రహం ఒక్కటే.