
ప్రకృతినే దేవతగా కొలిచే పండుగ ఇది. దేశంలోనే రెండేళ్లకొకసారి మాఘమాసంలో నాలుగు రోజులపాటు వైభవంగా జరిగే అద్వితీయమైన గిరిజన జాతర.. తమ కష్టాలను సమూలంగా రూపుమాపే వనదేవతలుగా సమ్మక్క, సారలమ్మలను ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
ఈ సందర్భంగా ఇద్దరమ్మల చరిత్ర, పండుగ వెనుక గల విశిష్టతలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
చరిత్ర…
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని మేడారం.. ఈ వేడుకకు ఆలవాలం..
ఇక్కడ ప్రధానంగా కొలిచే సమ్మక్క, సారలమ్మల గురుంచి పురాణాల్లో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువగా వినిపించే కథ గురుంచి…
అప్పటి ఓరుగల్లు, నేటి జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర అయిన మేడరాజు పాలించేవాడు. ఒకసారి అతడు వేటకి వెళ్లినప్పుడు ఓ చిన్నారి దొరికిందట. తనతోపాటు ఆ పాపను వెంట తెచ్చుకున్నాడు. తనకు ‘సమ్మక్క’ అని పేరు పెట్టుకున్నాడు. అయితే అక్కడి గ్రామస్థులు కరువు సమయంలో తమకు తోడుగా వచ్చింది కాబట్టి వనదేవతగా ఈ సమ్మక్కను భావించేవారట. సమ్మక్క హస్తవాసి మీద ఊరి ప్రజలకు అపార నమ్మకం ఉండేది. కొన్నాళ్లు గడిచాక దొరకు మేనల్లుడు అయిన పగిడిద్ద రాజుతో సమ్మక్కకు వివాహం చేశాడు. అనంతరం పెళ్లయ్యాక కాకతీయుల వద్ద సామంతరాజుగా ఉన్నాడు పగిడిద్ద. వీరివురికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం.
ఓసారి కరువు పరిస్థితుల వల్ల కప్పం కట్టకపోవడంతో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తాడు. దీంతో సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్నలు వేరువేరు ప్రాంతాల నుంచి ఎదురెళ్లి కాకతీయ సైన్యాలపై ఆయుధాలతో పోరాడారు. ఆ యుద్ధంలో పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ మరణించారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. అప్పట్నుంచి అది జంపన్న వాగుగా స్థిరపడిపోయింది. సమ్మక్క మాత్రం కాకతీయ సైన్యంతో విరోచితంగా పోరాడిందట. యుద్ధం ముగిశాక చిలుకలగట్టువైపు వెళ్తూ వెళ్తూ అంతర్థానమైందట. ఆమె జాడ కోసం ఊరి ప్రజలు వెతకే క్రమంలో.. ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించిందట. దానినే గ్రామస్తులు సమ్మక్క ప్రతిమగా భావించారు. అప్పటినుంచి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను నిర్వహించడం తరతరాలుగా వస్తోంది. అదే ఆనవాయితీలా మారింది.
సారలమ్మ ప్రస్థానం…

బస్తర్‌లోని కాటమయ్య ఇంట్లో ఈ సారలమ్మ
పుట్టింది. అతడిది నిరుపేద కుటుంబం. సారలమ్మ పుట్టగానే అదృష్టం కలిసి వచ్చి ధనవంతుడైపోయాడట. ఒకరోజు ‘తినడానికి కూర అంటూ ఏమీ లేదని’ బాధపడుతుంటే.. సారలమ్మ పులి అవతారమెత్తి దుప్పిని చంపి, కాటమయ్యతో ‘నువ్వు అడవికి వెళ్లి, ఫలానచోట ఓ దుప్పిని పులి చంపింది. పోయి ఆ దుప్పిమాంసం తెచ్చుకో’ అంటుందట. కాటమయ్య వెళ్ళగానే అక్కడ దుప్పి కనిపిస్తుంది. దాన్ని ఇంటికి తెచ్చుకొని కోసి, తినే అత్రంలో రక్తం పోకుండానే స్నానం త్వరగా చేస్తాడు. అలానే సారలమ్మకు మొక్కుతాడు. దీంతో సారలమ్మ ఆగ్రహించి, అహంకారం పెరిగి ‘రక్తం పోకుండానే స్నానం చేసి నన్ను మొక్కుతావా? ఇక ఇక్కడ నేనుండను.. వెళ్లి పోతాను’ అని పోరుపెట్టిందట. దాంతో సారలమ్మను కాటమయ్య బస్తర్ నుంచి ఖమ్మం జిల్లాలోని తాళ్లపల్లి అనే గ్రామ పొలిమేరల్లో వదిలిపెట్టాడట. అక్కడ సారలమ్మను చూసిన ఓ గొర్లకాపరి ఈమె ఎవరో దేవత అయి ఉంటుందనుకుని, ఆమె జన్మ వృత్తాంతం గురుంచి తెలుసుకుంటాడు. సారలమ్మ కోరిక మేరకు ఆమెను గంగ(ఇప్పటి గోదావరి) దాటించి ఏటూరు నాగారం మండలం ‘దొడ్ల’ అనే గ్రామంలో వదిలిపెడతాడు. ఈ గ్రామంలో కోయ తెగవారు కొన్ని రోజులు కొలిచిన తర్వాత, సారలమ్మ కోరిక మేరకు ఆమెను కన్నెపల్లి గ్రామంలో వదిలి పెడతారు. దీంతో ఆనాటి నుంచి నేటివరకు పూజాధికాలు వారే చేస్తూ వస్తున్నారు. ఆ ఊర్లో సారలమ్మకు ప్రత్యేకంగా గుడి ఉంది. గద్దె మాత్రం మేడారంలో ఉంటుంది. జాతర సమయంలో సమ్మక్క కంటే ఒకరోజు ముందు సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. మళ్ళీ సమ్మక్క పోయిన తర్వాత సారలమ్మను తిరిగి కన్నెపల్లికి తీసుకువెళ్తారు.
నాలుగురోజుల జాతర..
మొదటిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె మీదికి తీసుకురావడం, చిలుకలగుట్టలో భరణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై రెండోరోజు ప్రతిష్టిస్తారు. మూడోరోజు ఇద్దరూ కొలువుదీరుతారు. నాలుగోరోజు సాయంత్రం ఇద్దరు దేవతలను యుద్ధస్థానానికి పంపిస్తారు.
తొలిరోజు…
సమ్మక్క కూతురైన సారలమ్మ నివాస గ్రామం కన్నెపల్లి కావడం.. మేడారం గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. అక్కడ ఒక చిన్న ఆలయంలో సారలమ్మ కొలువై ఉంది. జాతర సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సారలమ్మను మేడారానికి తీసుకొస్తారు.
రెండోరోజు..
ఈరోజున అధికార లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. పూజారులు వనానికి వెళ్లి ప్రత్యేకించి వెదురుకర్రలు తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. తర్వాత సమ్మక్క ఆలయం నుంచి వడ్డెలు, పసిడికుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. మేడారానికి ఈశాన్యాన చిలుకలగుట్టపై ఉన్న నారచెట్టు కిందనున్న కుంకుమభరిణె రూపంలోని సమ్మక్కను తీసుకొస్తారు. ఈ సమయంలో సమ్మక్క రాక కోసం లక్షలాది మంది ఎదురుచూడటం, ఆ తల్లిని దర్శించుకోవడం విశేషం.
మూడో రోజు…
ఈరోజున సమ్మక్క, సారలమ్మలు ఒకేసారి దర్శనమిస్తారు. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతే ఈ తల్లులను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని కోరుతూ కానుకలు, మొక్కులు చెల్లించుకుంటారు. వీటితోపాటు తలనీలాలు, తులాభారాలు జరిపిస్తారు. ఆడపడుచులుగా భావించిన తల్లులకు మహిళలు ఒడిబియ్యం పోస్తారు, చీరసారెలు పెట్టి ప్రత్యేకంగా పూజిస్తారు.
నాలుగో రోజు…
భక్తుల దర్శనం అనంతరం తిరిగి సమ్మక్క, సారలమ్మలు ఈరోజున వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది. పచ్చని వనం ఈ జాతరతో పట్నాన్ని తలపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది.
ఇతరాంశాలు…
1940ల వరకు చిలుకలగుట్టపై గిరిజనులు మాత్రమే ఈ జాతరను జరుపుకునేవారు. దాదాపు తొమ్మిది శతాబ్దాల నాటిది. 1940 తర్వాత తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు. అంతేకాక మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలిరావడం విశేషం.
మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మలకు ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు. కేవలం గద్దెలు నిర్మించి, వాటికి ఒక కర్ర నాటి ఉంటుంది. వీటిని ‘సమ్మక్క, సారలమ్మల గద్దెలు’గా భావిస్తారు.
వంశపారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే ఈ పూజలను నిర్వహిస్తారు.
స్త్రీ దేవతలను కొలిచే బతుకమ్మ, కోలాటం ఆటపాటల్లోనూ ఈ తల్లుల వీరత్వం గురించి ప్రస్తావన ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో మేడారం జాతరను.. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.
సమ్మక్క రాక కోసం ఎన్నో రోజులు నిద్రాహారాలు మాని ఎదురుచూశారట ఆ ఊరి ప్రజలు. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుంకుమ భరిణె లభించిన ప్రాంతంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున ముత్తయిదువలు పండుగను జరుపుకునేవారు. కాలక్రమేణా ఈ ముత్తయిదువుల పండుగే జాతరగా మారిపోయింది. సమ్మక్క భరిణె రూపంలో ప్రతీ రెండేళ్లకోసారి సాక్షాత్కరిస్తుందని వారు గట్టిగా నమ్ముతారు. ఆ తల్లుల పేరు తలిస్తేనే.. కష్టాలు పోతాయని ఎంతోమంది విశ్వాసం!