Telugu Featured NewsTelugu Politics

వైసీపీ వ్యూహం ఫలించేనా..

ప్రస్తుతం వైసీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ సందడి బాగా పెరిగింది. రాజకీయ పార్టీలన్నీ వాటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో ఎన్నికలకు తొమ్మిది నెలలు మాత్రమే ఉండడంతో పార్టీలు ప్రచారం చేయడమే కాకుండా… తమ ప్రత్యర్థి పార్టీలను కూడా తూర్పూర పడుతున్నాయి. కానీ వైసీపీ చూస్తే.. ఈ తరహా సభలు సమావేశాలు చేయడం లేదు. దీంతో ఇది బలంగా ఇస్తుందా, రాజకీయంగా మేలు జరిగేలా చూసుకుంటుందా అన్న చర్చగా ఉంది. అయితే, వైసీపీలో చూస్తే జగన్ ఒక్కరే స్టార్ కాంపెనియర్. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి జగన్ అధికారంలో ఉన్నారు. విపక్షాల మాదిరిగా జనంలోకి పాదయాత్రలనో.. మరోటి అనో వెళ్లలేరు. పైగా పాలన కూడా చూసుకోవాలి.

ఇక గత ఎన్నికల్లో అయితే జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ బాగా జనంలో ఉంటూ విస్తారంగా ప్రచారాన్ని చేశారు. దానికి తోడు ఏడాదిన్నర పాటు జగన్ చేసిన పాదయాత్ర కూడా బాగా కలిసి వచ్చింది. ఈసారి అలా ఉంటుందా అన్నదే ఒక సందేహం.


ఎందుకంటే ప్రభుత్వం అన్నాక ఎంత బాగా పాలించినా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. చాలా మంది ఆశలకు అవకాశాలకు మధ్య అంతరాయం అయితే కచ్చితంగా ఉంటుంది.

దాంతో ప్రభుత్వం వ్యతిరేకతను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు వైసీపీ కూడా అతీతం కాదు. ఈ యాంటీ ఇంకెంబెన్సీని పెంచేందుకు నిరంతరం జనంలో ఉంటూ విపక్షాలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఓటు బ్యాంక్‌కి భారీగా గండి..!

గతానికి భిన్నంగా ఆంధ్రాలో ముగ్గురు కీలక నాయకులు వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని పలుమార్లు చుట్టేస్తున్నారు. ప్రతి రోజూ మూడు విభిన్న ప్రదేశాలలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీటిని ఎంతలా కొట్టి పారేయాలని వైసీపీ చూసినా.. ఎంతో కొంత జనాలకు కూడా ఎక్కుతాయని అంటున్నారు. పదే పదే అదే మాటను చెబితే నమ్మే వాళ్ళూ ఉంటారు. దానికి తోడు ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదు అన్న భావన ఉన్న వర్గాలు సులువుగా ఆ వైపునకు మళ్ళుతారు. దాంతో ఓటు బ్యాంక్‌కి భారీగా గండి పడుతుంది. అలాగే విపక్షాల ఓటు బ్యాంక్ పెరుగుతూ ఉంటుంది. మరి దీని కట్టడి చేయాలంటే ఈ రోజు నుంచే జగన్ జనంలో ఉండాలన్న మాట అయితే వైసీపీలో కూడా వినిపిస్తోంది. కానీ జగన్ ఆలోచనలు చూస్తే తాను మాట్లాడనవసరం లేదు, తమ తరఫున ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతాయని భావిస్తున్నారు.

అయితే, కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా పదే పదే జనాల్లోకి వెళ్తంది.

పార్టీలో కీలక నాయకులు కూడా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు. అలా ఎప్పటికప్పుడు విపక్షాల వైపు జనాలు మళ్లకుండా చూసుకుంటూ ఉంటారు.

తెలంగాణలో కేసీఆర్ అంతలా తిరగకపోయినా మంత్రులు, కేటీఆర్, హరీష్ రావు నిరంతరం ప్రజలలో ఉంటూ విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతూ ఉంటారు.

ఆంధ్రాలో మాత్రం ఆ రకమైన ప్రచార యంత్రాగం అయితే.. వైసీపీ వద్ద కనిపించడం లేదు అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

మంత్రివర్గంలో పాతిక మంది మంత్రులు ఉన్నా విపక్షాల మీద మీడియా ముఖంగా అయినా ఎప్పటికప్పుడు స్పందిస్తున్న వారు అంటే తక్కువే అని అంటున్నారు.

అలాగే 22 మంది ఎంపీలు 152 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సమర్ధంగా విపక్షాల ప్రచారాని తిప్పికొట్టడంలేదన్న భావన అయితే ఉంది. దీంతో వైసిపికి ఈ డోస్ ఏ మాత్రం సరిపోదు అనే అంటున్నారు.

అదే విధంగా ఎన్నికలు దగ్గర చేస్తూ విపక్షాలు తమ మ్యానిఫేస్టోలకు పదును పెడుతున్నా యి. అనేక హామీలను ఇస్తున్నాయి.

వైసీపీ అయితే 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఈ నాలుగున్నరేళ్లలో చెప్పనివి కూడా చేశామని అంటోంది.

దాంతో కొత్తగా హామీలు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీ భావిస్తోందా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.

మరి కొత్త హామీలు ఇవ్వక వైసీపీ నుంచి స్టార్ క్యాంపెయినర్లు పెద్దగా ప్రచారం చేయకుండా ఉంటే వచ్చే ఎన్నికల యుద్ధాన్ని వైసీపీ ఎలా గెలుస్తుంది అన్న సందేహాలు వస్తున్నాయి.

అయితే విపక్షాలను జనాలు నమ్మరని, ప్రతీ ఇంట్లో తమ పథకాలు ఉన్నాయి.

కాబట్టి ఓట్లు కచ్చితంగా పడతాయని వైసీపీ భావిస్తే అది అతి ధీమాగా చూడాలా లేక కచ్చితమైన వ్యూహంగా చూడాలా అన్నది కూడా ఇప్పటికైతే తెలియడంలేదనే అంటున్నారు.

ఏది ఏమైనా జనాలు ఇదివరకూ మాదిరిగా లేరు. వారు చైతన్యవంతులు అయ్యారు.

హామీలు నెరవేర్చాం, పథకాలు సవ్యంగా ఇస్తున్నామని చెబితే ప్రజల నుంచి ఓట్లు రాలుతాయా అన్నది ఒక కీలకమైన చర్చగా ఉంది.

ప్రజలు ఎప్పటికపుడు కొత్త కోరికలతో సిద్ధంగా ఉంటారు.

ప్రజాస్వామ్యం అంటేనే మార్పునకు సంకేతం. అందువల్ల పాతని పక్కన పెట్టి కొత్త వైపుగా జనాలు నడవాలి అనుకుంటే మాత్రం తీర్పులు మారిపోతాయి.

ఆంధ్రా జనాలు అనుకోని తీర్పులే ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. 2024 వారి తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది

Show More
Back to top button