Telugu News

2025లో ప్రపంచ మానవాళిని కుదిపేయనున్న పెను సవాళ్లు

ప్రపంచ జనాభా 2024కు విడ్కోలు పలుకుతూ రానున్న 2025లోకి కోటి ఆశలతో ప్రవేశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడానికి ఎదురు చూస్తున్నది. ఐక్యరాజ్యసమితి 80వ వ్యవస్థాపక సంవత్సరం-2025లోకి అడుగిడుతున్న సంధికాలంలో ఉన్న ప్రపంచ మానవాళిని పలు ప్రమాదకర విపత్తులు, సంక్షోభాలు వేధించనున్నాయని ఊహించడమే అతి కష్టంగా కనిపిస్తున్నది. 2025 ఏడాదిలో కోప్‌-30 సదస్సుకు బ్రెజిల్‌ ముస్తాబు అవుతున్నది. మరో వైపు ఉక్రెయిన్‌- రష్యా, ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధాలతో పాటు సిరియా, సుడాన్‌ సంక్షోభాలు ప్రపంచ జనాభాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ 2025లోనైనా కాల్పుల విరమణలతో చక్కటి పరిష్కారాలు దొరకాలని ఆశ పడుతున్నది. సుస్థిరాభివృద్ధికి అవసర పెట్టుబడులు, వాతావరణ ప్రతికూల మార్పుల సాధికారత చర్చల వేదికగా కోప్‌-30 సదస్సు ఏర్పాట్లు, లింగ సమానత్వ సమస్యలను చర్చించే 4వ ప్రపంచ మహిళా సదస్సుకు 2025 నాటికి మూడు దశాబ్దాలు పూర్తి కావడం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన ఐరాసకు 80 ఏండ్లు పూర్తి కావడం 2025 ఏడాది ప్రత్యేకతగా పేర్కొన వచ్చును. 

ప్రపంచ శాంతి, భద్రతల సంక్షోభాల పరిష్కారాలు:

అత్యంత ప్రమాదకర మానవ హక్కుల హననాలను పరిచయం చేస్తున్న యుద్ధాలతో గాజాపై ఇజ్రాయిల్‌ మూకుమ్మడి దాడి, ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకు పడడంతో పాటు సూడాన్‌, సిరియా లాంటి దేశాల్లో హృదయవిదారక దుస్థితులు నెలకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో 6.2 మిలియన్లు, గాజా దాడుల్లో 1.4 మిలియన్ల మహిళలు/పిల్లలు/వృద్ధులు శరణార్థులుగా మారడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల బలవంతపు మానవ వలసలు జరిగాయి. శరణార్థుల్లో 50 శాతం వరకు ఉక్రెయిన్‌, సిరియా, అఫ్ఘానిస్థాన్‌ అభాగ్యుల ఉన్నట్లు తేలింది.

ఈ ప్రాంతాల్లో మానవాళి, ముఖ్యంగా పిల్లలు, మహిళలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని కొన ఊపిరితో బతుకులు ఈడుస్తున్నారు. ఈ సంక్షోభాలతో ప్రపంచ జనాభా గత కొన్ని ఏండ్లు/మాసాలుగా ప్రభావితం కావడం, చమురు/ఆహార ధాన్యాలు/వంట నూనెల ధరలు చుక్కల్లోకి చేరడం గమనిస్తున్నాం. కనీసం 2025లోనైనా ఈ యుద్ధాలు, సంక్షోభాలకు సమాధానాలు దొరికి, ప్రభావిత జనాభా తిరిగి పూర్వపు స్థితికి చేరాలని కోరుకుంటున్నాం. సిరియాలో ఇటీవల అరాచక పాలన అంతం కావడంతో సత్వరమే ఆ దేశంలో న్యాయం, పునర్నిర్మాణం, వ్యక్తిగత స్వేచ్ఛ, సమాన అవకాశాల కల్పన జరగాలని ఎదురు చూస్తున్నాం. 2024లో హైతీ, మయన్మార్‌, యెమన్‌లలో ఏర్పడిన అస్థిరత్వానికి అంతర్జాతీయ చొరవతో పాటు 2025 చక్కటి పరిష్కారాలు చూపాలి. 

వాతావరణ మార్పులకు విరుగుడు చర్యలు – 2025లో కోప్‌ 30 సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు :

వాతావరణ ప్రతికూల మార్పుల కట్టడికి సంబంధించిన కోప్‌-30 సదస్సును 2025లో బ్రెజిల్‌, బేలెమ్‌లో నిర్వహించనున్న వేళ ప్రపంచ మానవాళి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నది. కార్బన్‌ ఉద్గారాల కట్టడి, హరిత గృహ వాయువులను తగ్గించడం, భూతాపాన్ని పరిమితుల్లో అదుపు చేయడం,పర్యావరణ హిత వ్యవసాయ పద్దతులను అనుసరించడం, ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని 1.5 డిగ్రీల లోపు కట్టడి చేయడం, అత్యధిక కార్బన్‌ ఉద్గారకాలకు కారణమైన దేశాలపై అదుపు బాధ్యతలను పెంచడం, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ విద్యుత్‌ వాహనాలను ఉపయోగానికి ప్రాధాన్యం ఇవ్వడం లాంటి అంశాల అమలుకు 2025 వేదిక కావాలి. కలుషిత నీటితో 2.1 బిలియన్ల పేదలు బతుకులు ఈడుస్తున్నట్లు తేలింది. 

లింగ సమానత్వ సాధనకు 2025 వేదిక కాగలదా:

పురుషులతో సమానంగా మహిళలు, బాలికలకు ఉచిత నిర్భంధ విద్య, మాతాశిశు బాలికల ఆరోగ్య సంరక్షణ చర్యలు, మహిళలు/బాలికల కదలికలకు సమాన స్వేచ్ఛ ఇవ్వడం, బాలికలను కార్మికులుగా మార్చడాన్ని నిరోధించడం, బాలికలు/మహిళల అక్రమ రవాణాతో పాటు వేశ్య వృత్తిలోకి నెట్టడం, ఉద్యోగ ఉపాధుల్లో లింగ సమానత్వ వేతనాలు చెల్లించడం, మహిళలకు నిర్ణయాధికారాలు ఇవ్వడం, వంటింటి కుందేలును బయటకు రప్పించడం, మహిళా లోకానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం లాంటి ప్రధాన అంశాల్లో చొరవ చూపడానికి 2025 వేదిక కావాలి. 

80 ఏండ్ల ఐరాస చరిత్ర:

రెండవ ప్రపంచ యుద్ధం నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేయడం చూసాం. నాటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక వాంఛనీయ, అవాంఛనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి ప్రపంచ మానవాళి అవసరాలకు అనుగుణంగా ఐరాస తన పంథాను మార్చుకొని ప్రపంచ శాంతికి బాటలు వేయడానికి 2025లో నాంది పలకాలి. ఇప్పటి వరకు ఐరాస పాత్ర చాలా పరిమితంగానే ఉందని, రానున్న రోజుల్లో అయినా సకారాత్మక మార్పుల దిశగా తన పాత్రను నిర్వహించాల్సి ఉంది. నేడు జరుగుతున్న రెండు భీకర యుద్ధాలను అదుపు చేయడం, పలు దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన కట్టడి చేయడం లాంటివని తక్షణావసరాలుగా ఐరాస భావించి ముందడుగులు వేయాలి. 

ఏఐ, శాస్త్ర సాంకేతిక ప్రగతి:

 మనిషి స్థానాన్ని రోబోలు ఆక్రమించనున్నాయి. సాంప్రదాయ జీవనశైలి, వర్తక వ్యాపారాలను రానున్న రోజుల్లో కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఎంతో ప్రభావితం చేయనున్నది. పనిలో వేగం పెరగడానికి ఏఐ సాంకేతికలను సన్మార్గంలో వినియోగించాల్సి ఉన్నది. నేటి ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలో శాస్త్ర సాంకేతిక ఆయుధాలను దుర్వినియోగం చేస్తే మానవాళికి ఎంతో నష్టం వాటిల్లనున్నది. నేటి యుగంలో ఏఐ అనువర్తనాలు లేని రంగం లేదు. పొద్దున లేవగానే పళ్లు తోసుకోవడం నుంచి హుమనాయిడ్‌ రోబోటిక్స్‌తో ఇంటి పనులు చేయించే వరకు ఏఐ తన పనితనాన్ని చూపుతున్నది. మనిషి చేస్తున్న ప్రతి పనిని ఏఐ చేయడానికి సిద్ధం అయ్యింది. అమెజాన్‌ కంపెనీ ఇప్పటికే 7.5 లక్షల రోబోలనా వివిధ పనులకు పురికొల్పడం జరిగిందనే విషయం తెలుసుకోవాలి. 

కొరియా ప్రాంతం వేడెక్కడం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడం, దక్షణ చైనా సముద్రంలో పరిణామాలు, మిడిల్‌ ఈస్ట్‌లో చెలరేగుతున్న సంక్షోభాలలతో పాటు గత కొన్నేళ్లుగా మానవాళినా వెంటాజుతున్న పేదరికం, ఆకలి చావులు, ప్రజారోగ్య పరిరక్షణ, నీటి కాలుష్యం, నగరాల్లో గాలి కాలుష్యం, నేల ఎడారీకరణ, మానవ హక్కుల హననాలు, జీవ వైవిధ్య విధ్వంసాలు, అణ్వాయుధాల ప్రయోగాలు, దివ్యాంగుల సమస్యలు, ఆర్థిక అసమానతలు, అవిద్య, నిరుద్యోగం, హింస, విపత్తుల దాడి, మానవ వలసలు, బాలల హక్కులు, అవినీతి చెదలు, ఇస్లామిక్‌ తీవ్రవాదం లేదా ఉగ్రవాదం, వేర్పాటువాదం, సైబర్‌ నేరాల విష వలయాలు, అంటువ్యాధుల దాడి, కోవిడ్‌-19 లాంటి మహామ్మారుల ఆగమనాలు లాంటివి 2025లో తమ తీవ్ర ప్రతాపాన్ని చూపకముందే విశ్వ మానవాళి మేల్కొని, తమ కర్తవ్యాలను తెలుసుకొని, తమ సుస్థిర భవితను తామే రచించుకోవాలి. 2025 ఏడాదిని రానున్న చరిత్రలో గుర్తుంచుకునే విధంగా ప్రతి ఒక్కరి సాధికారత దిశగా పటిష్ట అడుగులు పడాలి. ఊహించిన సమస్యలతో పాటు ఊహించని విపత్తులు ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చని, అప్రమత్తతతో ఉంటూ మానవ శ్రేయస్సుకు పునాదులు వేయాలి. 

గుడ్‌ బై ఓల్డ్‌ ఇయర్‌ 2024 ; వెల్కమ్‌ టు న్యూ ఇయర్‌ 2025. 

Show More
Back to top button