
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. ఫాలోవర్లను మోసం చేసి కొంత మంది అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. దీని ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లడం, చివరికి ప్రాణాలు తీసుకోవడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో దీనికి వ్యతిరేకంగా కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు యద్ధం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్? ఇవి ఎలా పనిచేస్తాయి? వీటి ఊబిలో నుంచి ఎలా బయట పడాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసే వాళ్లు వివిధ రకాలుగా వాటిని సృష్టిస్తారు. అందులో మొదటిది ఫేక్ గేమ్ యాప్స్. వీటిలో ఆటను ముందే ప్రోగ్రామింగ్ చేసి ఉంటారు. ఆ కారణంగా యూజర్లు ఎవరూ ఆటను గెలవలేరు. కాబట్టి పెట్టిన డబ్బంతా వెళ్లిపోతుంది. రెండోది బోనస్ మాయాజాలం. ఇందులో పెద్ద మొత్తంలో బోనస్ వస్తుందని ఊరిస్తారు. ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేయాలని కోరతారు. డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత వివిధ కారణాలతో బోనస్ ఇవ్వకుండా అసలుకే మోసం చేస్తారు. మూడోది డేటా దుర్వినియోగం. యాప్స్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం మన సమాచారాన్ని మొత్తం అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మెయిల్, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్.. ఇలాంటివన్నీ ఇచ్చిన తర్వాత వాటిని హ్యాక్ చేసి మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు.
* నియంత్రణ చట్టాలు ఉన్నాయా..?
ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్.. నా అన్వేషణ అనే యూట్యూబర్‌తో మాట్లాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరు ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీటిపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే సందేహం చాలామందిలో ఉంది. అంతేకాదు వీటికి చట్టబద్ధత ఉందా అనే సందేహం కూడా వచ్చే ఉంటుంది. నిజానికి మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తే.. కొన్ని రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది.
ఇక ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పూర్తిగా నిషేధం అమలులో ఉంది. అయితే సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత బెట్టింగ్ సేవలు అమలులో ఉన్నాయి. అయినా కూడా వీటిని పట్టించుకోకుండా కొంతమంది గుట్టుగా బెట్టింగ్ యాప్స్‌ని నిర్వహిస్తున్నారు. వీటికి బహిరంగంగానే కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేయడంతో.. ఎంతోమంది అమాయకుల చావుకు కారణం అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసినా.. వారికి ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎదో రకంగా కేసుల నుంచి బయట పడుతున్నారు.
* ఆడినా శిక్షతప్పదు గురూ..!
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్‌ల్లో.. పాల్గొన్న, నిర్వహించిన జరిమానాతో పాటు జైలు శిక్షలు అమలులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్స్ అడ్డుకునేందుకు ఐటీ చట్టం 2000, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్ఏ) నిబంధనల ద్వారా కేసులు నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ అక్రమ జూదం నిర్వహించే వెబ్‌సైట్ల వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,00,000 జరిమానా ఉంటుంది. దీంతోపాటు ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వారికి కూడా అదే విధమైన జరిమానా, శిక్ష పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక వీటిని నియంత్రించడానికి రాష్ట్ర పభుత్వాలు మరింత కఠిన చట్టాలు తీసుకోవాలని కొంతమంది తీవ్రంగా వాదనలు చేస్తున్నారు.
* నచ్చినట్టు ఆట ఆడగలరు, గెలవగలరు..!
ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి బయట పడాలంటే అప్రమత్తంగా ఉండడం ఒక్కటే మార్గం. ఆన్‌లైన్ యాప్స్ మనకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వవు. ఎందుకంటే ఆ యాప్స్‌లో వాళ్లకు కావాల్సినట్టుగా ఆట ఆడగలరు, గెలవగరు. కాబట్టి అదొక సాప్టువేర్ అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా అత్యాశకు పోయి ఇలాంటి యాప్స్ ద్వారా మోసపోవద్దు. మీ జీవితాలను పోగొట్టుకోవద్దు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది.. ఈ యాప్స్‌లో గేమ్స్ ఆడిన వారు కూడా జైలుకు వెళ్లడం తప్పదు. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది.