
ప్రపంచ కథా రచయితలలో ప్రముఖ స్థానం సంపాదించిన వారు శరత్ చంద్ర చటర్జీ. “దేవదాసు” అనే పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పేరు శరత్ చంద్ర చటర్జీ. ఈయనను శరత్ చంద్ర చటోపాధ్యాయ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో పలు భాషల్లో అత్యధిక సంఖ్యలో పునర్నిర్మించబడిన చలనచిత్రం “దేవదాసు”, ఈయన వ్రాసిన దేవదాసు అనే బెంగాళీ నవల ఆధారంగా తెరకెక్కించారు. తన మాటలతో, తన రచనలతో మాయాజాలం అల్లిన వ్యక్తి శరత్ చంద్ర.
ఆయన రచనలు లోతుగా పాతుకుపోయిన సామాజిక మరియు సాంస్కృతిక సమస్యలను పరిష్కరించాయి. అలాగే సామాజిక సవాళ్లపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. కేవలం బెంగాల్లోనే కాకుండా సమస్త భారతదేశంలో తన కథా రచన, నవలా రచనల ద్వారా ఆయన విప్లవాన్ని లేవదీశారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రైతు వర్గము, దానికి సంబంధించిన సమస్యలను హిందీలో ప్రేమ్ చంద్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తే, సమాజంలో శిక్షిత, అర్థశిక్షిత వర్గములలో పేరుకుపోయిన అంధ విశ్వాసాలను, కుల సాంప్రదాయాలను బెంగాలీలో స్పష్టంగా శరత్ చంద్ర చిత్రించారు.
శరత్ చంద్ర చటర్జీ అనేక రచనలు చేశారు. ఆయన పూరి గుడిసె తగలబడిపోయినప్పుడు దురదృష్టవశాత్తు తాను వ్రాసిన రచనలనలో చాలావరకు కాలిపోయాయి. ఆయన రచనలు ఇంచుమించు భారతీయ అన్ని భాషలలో అనువదించబడ్డాయి. ఇలా అనువదించే విషయంలో తెలుగు వారు ముందుగానే మేల్కొన్నారు. వాటిల్లో “దేవదాసు”, “బడదీదీ”, “బిందుగారబ్బాయి”, “పరిణీత”, “విరాజ్ బహు”, “రాముని బుద్ధిమంతనం”, “పల్లీ సమాజ్”, “చరిత్రహీనులు”, “శ్రీకాంత్” (4 భాగాలు), “దత్త”, “గృహదహనం”, “శేష ప్రశ్న”, “విప్రదాసు”, “నిష్కృతి”, “చంద్రకాంత్”, “పండిత మహాశయులు”, “నవవిధాన్”, “వైకుంఠుని వీలునామా”, “శుభద”, “స్వామి”, “ఏకాదశి బైరాగి”, “అనురాధ”, “హరిలక్ష్మి”, “కాశీనాథ్” మొదలగు రచనలు ఉన్నాయి. శరత్ చంద్ర రచనలలో ప్రతీ పాత్ర ఒక మనోవైజ్ఞానిక సత్యం, ఒక మహోన్నత దర్శనం. తాను రచనలలో చిత్రించిన పాత్రల యొక్క వ్యక్తిత్వ చిత్రీకరణ అమోఘం. ఆ రచన పాఠకుని మనసును కలచివేస్తుంది. అతని సంవేదనా స్పందితుని చేస్తుంది.
శరత్ చంద్ర చటర్జీ నవలలు తెలుగునాట కూడా ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు దేవదాసు ఆయన కలం నుండి జాలువారిన నవలే. ప్రముఖ తెలుగు చలనచిత్ర రచయిత మరియు నిర్మాత అయిన చక్రపాణి మొదలైన అనువాదకులు శరత్ చంద్రను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు.
ఆఖరికి కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే, తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో మనం తెలుసుకోవచ్చు. ఆయన సమన్వయవాది. ధర్మము పేరుతో, సంప్రదాయం పేరుతో, మానవత్వాన్ని మంటగలిపే రౌడీ వాదులంటే ఆయనకు మహా చెడ్డ చిరాకు. అన్ని మతాలు ఒకే విధమైన దైవసమాన విశ్వజనితాలుగా భావించారు. అందువలననే ఆయన మహ్మదీయులను తన ఇంటికి పిలిపించుకుని నమాజ్ చదివించుకునేవారు. ముస్లిం సమాజ పరిస్థితులకు సంబంధించిన నవలను ఒక దానిని వ్రాయవలెనని తన ఆఖరి దినములలో ఆయన అభిలాషించాడు. కానీ మృత్యుదేవత అందుకు అంగీకరించలేదు. అందువలన వ్రాయడం కుదరలేదు.
నేపథ్యం…
జమీందారుల ప్రాబల్యం బాగా ఉన్న రోజులవి. అమాయకులైన గ్రామీణ ప్రజలను జమీందారులు దోచుకునేవారు. అందువలన బెంగాల్ లోని గ్రామాలలో చాలావరకు రైతు కుటుంబాలు జమీందారుల అమానుష కృత్యాలకు, దోపిడీకి గురైపోతుండేవి. జమీందారుల మితిమీరిన అత్యాచారాలకు విసిగి విసిగి చివరికి జమిందారులకు ఎదురు నిలిచారు ప్రజలు. అలాంటి ప్రజలకు శరత్ చంద్రుని తాత నాయకత్వం వహించారు. అయితే జమీందారులు ఆయనపై కుట్రలు పన్ని ఆయన తల నరికి గంగా నదికి సమర్పించారు. ఇంతటి భయంకర దుర్ఘటనకు భయపడి శరచ్చంద్రుని నాయనమ్మ తన ఏకైక పుత్రుడు మోతీలాల్ ను, దేవానందపురంలో గల తన దగ్గర బంధువు ఇంట విడిచిపెట్టింది. ఆ బంధువే మోతిలాల్ ను పెంచి పెద్దచేశారు.
మోతీలాల్ యొక్క మంచి నడవడిక, చక్కటి గుణగణాలను చూసి పెంచి పెద్దవానిగా చేసిన బంధువు తన మనవరాలునిచ్చి మోతీలాల్ తో వివాహం జరిపించాడు. ఆమె గర్భమున మోతీలాల్ కు కలిగిన పుత్రుడే మన సుప్రసిద్ధ నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ. అతి చిన్న గ్రామమైన దేవానందపురంలో 15 సెప్టెంబరు 1876 నాడు శరత్ చంద్ర చటర్జీ జన్మించారు. ఆర్థికంగా పేద కుటుంబంలో జన్మించినప్పటికీ సాహిత్యంగా మాత్రం వారిది ఉన్నత కుటుంబమనే చెప్పాలి. శరత్ చంద్ర తండ్రి మోతీలాల్ కథలు, కవిత్వాలు వ్రాస్తుండేవారు. కానీ ఆయన తన రచనలను ఏనాడూ ప్రచురించాలనే అభిలాష పడేవారు కాదు. కానీ వాటిని తన మిత్రులతో చదివి వినిపించి, వారి ప్రశంసలతో ఆనందపడుతూ ఉండేవారు. అలా మోతీలాల్ ఇంట్లో సాహిత్యగోష్ఠులు జరుగుతుండేవి. ఆ ప్రభావం శరత్ చంద్రపై ప్రసరించింది.
బాల్యం లో ఆకతాయి పనులు చేస్తూ…
శరత్ చంద్ర తండ్రి మోతీలాల్ 25 రూపాయల నెల జీతం పై జైలులో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. శరత్ చంద్రను దేవానందపురంలో గల ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. శరత్ చంద్రకు గురువుల పట్ల భక్తిశ్రద్ధలు ఉండేవి కాదు. మిత్రులతో కలిసి కొంటె పనులు చేయడం ఆయనకు మహా సరదా. ఆయన చేసే కొంటె పనులతో పాఠశాలలో ఉపాధ్యాయుడు, ఇంట్లో వారు, బయటి వారు విసుగు చెందేవారు. ఇంతలో దురదృష్టవశాత్తు తండ్రి మోతీలాల్ ఉద్యోగం కూడా పోయింది. అందువలన కుటుంబ దుస్థితి గమనించిన శరత్ చంద్రను తన మేనమామ భాగల్పూర్ తీసుకెళ్లాడు. భాగల్పూర్ వెళ్లిన తరువాత కూడా శరత్ తన కొంటె స్వభావాన్ని విడనాడలేదు. తన వయసున్న తన మిత్రులను ఒక సంఘముగా ఏర్పరిచి వారితో ఆకతాయి పనులు చేయించేవారు.
చెట్లెక్కడం, కోతికొమ్మచ్చిలాడడం, తోటలో పండ్లు కోయడం, తినగలిగినవి తిని మిగతా వాటిని పారవేయడం, తోటమాలిని ఎగతాళి చేసి పారిపోవడం లాంటివి స్నేహితులతో కలిసి చేసేవారు శరత్ చంద్ర. చేపలు పట్టే వారిని నుండి చేపలను దొంగిలించడం, ఇతరుల చెలమలలో రాత్రివేళ గాలాలతో చేపలను పట్టడం ఇలా ఎన్నో ఆకతాయి పనులు శరత్ చంద్ర చేసేవారు. ఒకవైపు ఆకతాయి పనులు చేసినా గానీ, మరోవైపు తాను దయార్థ హృదయుడు కూడా. చిన్న వయస్సులోనే కష్టాలు పడ్డ శరత్ చంద్ర, ఇతరుల కష్టాలను చూడలేకపోయేవారు. తన స్నేహితులతో ఆకతాయితనంగా తిరుగుతూ సంపాదించే వస్తువులను అమ్మేసి, వచ్చిన డబ్బును పేదరికంతో కష్టపడే ప్రజలకు, ధన సహాయం చేసేవారు. రాత్రి సమయంలో దొంగిలించిన చేపలను, తోటలో తస్కరించిన పండ్లను బజారులో అమ్మి ఆ ధనాన్ని రోగులకు సహాయాలకు పంచుతూ ఉండేవారు. అంతే తప్ప ఆ డబ్బును చిరుతిళ్ళకు, గాలితిరుగుడులకు, జూదములకు మాత్రం శరత్ చంద్ర ఖర్చు చేసేవారు కాదు.
ఇంటర్మీడియట్ తరువాత చదువుకు స్వస్తి..
ఒకవైపు ఆకతాయి స్నేహాలతో, అల్లరి పనులతో తిరిగే శరత్ చంద్రకు పుస్తకాలు చదివే సరదా ఉండేది. ప్రతిరోజు ఏదోవిధంగా తీరిక చేసుకుని గ్రంథపఠనానికి కొంత సమయాన్ని వెచ్చించేవారు. ఇది తన శ్రద్ధ, పట్టుదల, జిజ్ఞాసను తెలియపరుస్తుంది. ఆయన చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద పుస్తకాలు చదివారు. చిన్నతనంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకాలను చదువుతూ ఉండేవారు. వాటితో పాటు తన తండ్రి వ్రాసిన కొన్ని పుస్తకాలను కూడా శరత్ చంద్ర చాలా శ్రద్ధతో చదివేవారు. చదవడమే కాకుండా ఆయన స్వయంగా చిన్నచిన్న కథలను కూడా వ్రాస్తుండేవారు.
పాఠశాలలో తన తోటి విద్యార్థుల కన్నా చదువులో వెనుకబడి ఉండేవారు. తరగతి పుస్తకాలు అంటే ఆయనకు తలనొప్పిగా ఉండేది. ఎంతసేపటికీ తాను ఇతర పుస్తకాలు, నవలలు, కథలు చదువుతుండేవారు. పరీక్షలకు ముందు మాత్రం పట్టుదలతో తన తరగతి పుస్తకాలు చదువుతుండేవారు. అందువలన ఆయన ఏనాడూ పరీక్షలు ఉత్తీర్ణులయ్యేవారు కానీ, ఏనాడూ పరీక్షలలో విఫలం కాలేదు. ఆయనకున్న ఆర్థిక ఇబ్బందుల వలన తన చదువు అంతగా సాగలేదు, కొన్ని ప్రతిబంధకాల వలన ఇంటర్ పూర్తి చేసి తన చదువుకు స్వస్తిచెప్పడంతో శరత్ చంద్ర విద్యార్థి జీవితం ముగిసింది.
బాల్యం నుండే సాహిత్యాభిలాష…
శరత్ చంద్రునికి బాల్యం నుండే కథలు వ్రాయాలనే అభిలాష ఉండేది. అందువలన ఎప్పుడూ ఏదో ఒకటి వ్రాస్తూనే ఉండేవారు. ఒకసారి తన తండ్రి దినచర్య పుస్తకం (డైరీ) లో ఒక పర్యాయము ఆయన ఈ విధంగా వ్రాసారు “నేను ఇంటి నుండి బయలుదేరితిని. రోడ్డుపై సతీషుడు కలిశాడు. మేమిరువురము ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ పోతున్నాము. దబ్బ పండు వంటి శరీరచ్ఛాయ, చంద్రుని వంటి మోము, మృగ నయనాలో అన్నట్లు కండ్లు, కానీ పాపమా కండ్లలో వేడిమికు బదులు చల్లదనమే కనిపిస్తూ ఉంది. ముఖంపై ఆశకు బదులు నిరాశ ప్రస్ఫుటితమవుతూ ఉంది. ఆ శరీరచ్ఛాయలో కాంతికి శాంతి తోడైంది. సంఘంలో జరిగే ఉత్సవ వినోదాలకు, గౌరవ మర్యాదలకు ఆమె దూరంగా ఉంచబడుతూ ఉంది. సుఖం అనేది ఆమెకందని పండు. క్లిష్ట పరిస్థితులే ఆమెకు నివాసస్థానము. మానసిక క్లేశమే ఆమెకు ముఖ్య స్నేహితురాలు. ఘోరము, మహా అన్యాయము. మానవత్వానికే తీరని అపరాధమది”. ఇది తండ్రి డైరీలో శరత్ చంద్ర వ్రాసినది. మరునాడు తన డైరీలోని వ్రాతలు చూసి తండ్రి మొదట్లో కంగారుపడ్డా, తరువాత అర్థం చేసుకున్నారు. శరత్ చంద్రుని మనసులో అంకురించబోతున్న త్యాగనిరతి, న్యాయపరత, కార్యదీక్షలకు లోలోపల ఆయన సంతోషించారు. ఏ కాగితం కనపడినా ఇలా దానిపై శరత్ చంద్ర ఏదో ఒకటి వ్రాసేవారు. అలా ఆయన రచన అభిలాష క్రమేపి పెరుగుతూ వచ్చింది.
ముజప్ఫరపురం చేరిన శరత్ చంద్ర…
తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబ ఆర్థిక దుస్థితి వలన శరత్ చంద్ర ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఆయన ఒక షావుకారి దగ్గర చిన్న గుమస్తాగా చేరారు. ఒకరి చేతి క్రింద నౌకరు చేయడం ఇష్టం లేని ఆయనకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఆయనకు తప్పలేదు. ఇంతలోనే శరత్ తల్లి ఒక ఆడ శిశువును ప్రసవించి చనిపోయింది. పిల్లల పోషణ నిమిత్తం మోతీలాల్ ఒక దాదీని నియమించాడు. మొదట్లో పిల్లలను బాగానే సాకిన ఆమె కొంత కాలం తరువాత స్వార్థబుద్ధితో ప్రవర్తించేది. ఆమె ప్రవర్తన బాధాకరంగా పరిణమించిన శరత్ చంద్ర అనేకసార్లు తన తండ్రికి ఫిర్యాదు చేశారు. కానీ ఆయన తండ్రి, దాది ప్రభావానికి లోనయ్యాడు. ఆయన శరత్ ఫిర్యాదులను లక్ష్య పెట్టలేదు. తండ్రి అనుచిత చర్యను సహించలేని శరత్ చంద్ర, అందుకు నిరసనగా ఇంటి నుండి వెళ్లిపోయారు. అలా వెళ్ళిపోయిన శరత్ చంద్ర చివరికి బీహార్ ముఖ్య పట్టణం పాట్నాకు ఉత్తరంగా పాతిక మైళ్ళ దూరంలో ఉన్న ముజప్ఫరపురం చేరుకున్నారు. ముజప్ఫరపురం అనేది జనక మహారాజు పాలించిన మిథిలకు సరిహద్దులలో ఉన్నది.
ముజప్ఫరపురంలో “శ్రీకాంత” అనే నవల రచన…
ముజప్ఫరపురంలో శరత్ చంద్రకు సంగీతం నేర్చుకొనవలెననే అభిలాష ఏర్పడింది. దాంతో సాధన ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఆయన ప్రసిద్ధ గాయకుడిగా పేరుపొందారు. ఆయన సంగీతానికి ప్రభావితుడైన సుప్రసిద్ధ గాయకులు మహాదేవ సాహు, ఆయనను తన ఇంటికి ఆహ్వానించి ఆశ్రయమివ్వగా కొన్ని సంవత్సరాలు అక్కడే గడిపారు. సాహు సహచర్యంతో సంగీతంలో కూడా శరత్ ప్రావీణ్యం సంపాదించారు. శరత్ చంద్ర జీవితము ముజప్ఫరపురంలో సంతోషంగానే గడిచింది. అక్కడ ఆయన “శ్రీకాంత” అనే నవలను రచించారు. ఆ నవల ముజప్ఫరపురంలో అతని జీవితానికి, ఆచార పరిస్థితులకు ప్రతిరూపంగానే ఉంది. అది 1917 నుండి 1933 మధ్య నాలుగు భాగాలుగా ప్రచురించబడింది. దీనిని శరత్ చంద్ర “ఉత్కృష్ట రచన” (అద్భుతమైన రచన) గా అభివర్ణిస్తారు. శరత్ చంద్ర ముజప్ఫరపురంలో ఉన్న రోజులలో ఆయన తండ్రి మరణించారు.
తండ్రి మరణించడంతో ఇన్ని సంవత్సరములు తనకు ఎంతో గౌరవం తీసుకువచ్చిన ముజప్ఫరపురం వదిలి మళ్ళీ భాగల్పూర్ కు చేరుకోవలసి వచ్చింది. అక్కడ ఆయన మరలా దుర్భరమైన జీవితాన్ని ప్రారంభించారు. అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. కుటుంబ భారమంతా ఆయన పైన పడడంతో, కుటుంబ నిర్వహణ కష్టంగా తోచింది. అందుకొరకు ఒక ఆంగ్ల కంపెనీలో ఆంగ్ల ఉత్తరాలను హిందీలోకి అనువదించే ఉద్యోగంలో చేరారు. మాములుగా శరత్ చంద్ర మాతృభాష బెంగాలీ అయినా కూడా ఆయన హిందీని రెండో భాషగా అభ్యసించారు. ఆ ఉద్యోగంలో కూడా శరత్ చంద్ర ఎక్కువ కాలం ఉండలేకపోయారు. బర్మాలో ఉంటూ సజ్జనులుగా ఉన్న కొందరు ఆయనకు మిత్రులుగా ఉండటం వలన బర్మాను వెళ్ళవలసి అని అభిలాష కలిగింది. అసలే స్వచ్ఛంద ప్రకృతి కలవాడు ఒకచోట నిలకడగా ఉద్యోగం చేయలేక తాను కూడా బర్మా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.
కష్టాల్లో ఉన్న యువతిని కాపాడి, వివాహం చేసుకుని…
శరత్ చంద్ర మిత్రుల ప్రోత్సాహంతో బర్మా వెళ్ళారు. అక్కడ ఆయన అడుగడుగునా కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొద్దిరోజులు స్నేహితుల ఇంట్లో కాలం గడిపిన తాను, ఎక్కువ రోజులు సోమరిపోతులా వారింట ఉండటానికి ఇష్టపడక స్వతంత్రంగా జీవించడం ప్రారంభించారు. అక్కడ ఆయనకు ఉద్యోగం దొరకక కూలి వారి మధ్య కూలి చేసుకుంటూ కాలం గడిపారు. కూలీల జీవితాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. వారి పట్ల ఆయనకు సానుభూతి కలిగింది. తన కొద్ది సంపాదనలోనే ఆయన తోటి పేదలకు డబ్బులు సహాయం చేసేవారు. వారి కష్టనష్టాలను పంచుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితులలో కూడా ఆయన తన స్వగృహంలో ఉన్న తన సోదరికి ప్రతి నెలా కొంత డబ్బు పంపించే ప్రయత్నం చేసేవారు.
అతి కష్టంపై ఆయనకు ఒక ఇంజనీర్ కార్యాలయంలో గుమస్తా ఉద్యోగం దొరికింది. ఒక దినం రంగూన్ లోని ఒక హోటల్ నుంచి భోజనం చేసి బయటకు వస్తూండగా ఆపదలో ఉన్న ఒక బెంగాలీ యువతి ఆయనకి ఎదురుగా వచ్చి తనను రక్షించమని కోరింది. ఆయన అంతకుముందు ఆమెను కలకత్తాలోని ఒక సంగీత సభలో చూశారు. నేర ప్రవృత్తి గల ఆమె తండ్రి కూడా ఆమెను బర్మాలో ఒక దుర్మార్గుడైన ముస్లిం యువకుడికి అమ్మేశాడు. ఏడు రోజుల నుండి నరకతుల్యమైన బందిఖానాలో ఉన్న ఆమెను రక్షించి, ఆమె జీవిత సమస్యకు పరిష్కారం తీవ్రంగా అలోచించి, ఆమె జీవితాన్ని చక్కబెట్టుటకు ఆమె తండ్రికి కొంత ధనం ఇచ్చి ఆమెను శరత్ చంద్ర వివాహమాడారు.
మంటల్లో కాలిపోయిన నవలలు..
బర్మాలో ఉండే రోజులలో శరత్ చంద్ర చాలా కథలు, నవలలు వ్రాశారు. వ్రాయడం తప్ప వాటిని ప్రచురించాలనే కోరిక అంత బలంగా ఉండేది కాదు. ఆ రోజులలో శరత్ చంద్ర బసచేస్తున్న ఇంటికి అనుకోకుండా నిప్పంటుకుంది. భారతజాతి దురదృష్టవశాత్తు ఆయన రచించిన కథలు, నవలలు చాలా వరకు అగ్నిదేవునికి ఆహుతైపోయాయి. ఆ నవలలలో అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ అతి కొద్ది రచనల్లో ప్రసిద్ధ నవల అయిన “దేవదాసు” ఉంది. అవే కాకుండా ఆయన రచించిన చాలా రచనలు కలకత్తాలో ఆయన మిత్రుల ఇళ్ళల్లో ఉండిపోయినవి. ఆయన రచనలను మాస పత్రికలు, వార పత్రికలకు పంపించేవారు. భారతి అనే సుప్రసిద్ధ బెంగాలీ మాస పత్రికలో శరత్ చంద్ర నవల “దీదీ” ప్రచురించబడింది. నలువైపుల నుంచి నవలలపై ప్రశంసల వర్షం కురిసింది.
శరత్ చంద్ర మిత్రులు ఆయన రచనలు “హరిచరణ్”, “బాల్య స్మృతి”, “కాశీనాథ్” లను “సాహిత్య” అనే పత్రికకు పంపారు. ఈ రచనలతో కథా ప్రపంచంలో శరత్ చంద్ర తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. “యమున” అనే బెంగాళీ సాహితీ పత్రికకు పంపించిన “రామేర సుమతి” అనే కథతో పత్రిక ప్రసరణ (సర్క్యూలేషన్) 50 నుండి 100కు పెరిగింది. ఆ తరువాత “పదనిర్దేశ్”, “బిందురఛేలే” చేయలేని కథలు ప్రచురించారు. దాంతో ఆయన పేరు ప్రసిద్ధ నవలా రచయితగా నలువైపులా వ్యాపించిపోయింది. బర్మాలో ఉంటూ కంపెనీలో ఉద్యోగం చేసే శరత్ చంద్రను ఆంగ్ల ఉద్యోగి అవమానపరిచాడు. ఆత్మాభిమానం ఉన్న శరత్ చంద్ర తన గుమస్తాగిరికి రాజీనామా చేసి, భార్యతో కలిసి రంగూన్ వదిలి కలకత్తా వచ్చి, పత్రిక కార్యాలయంలో మిత్రులు చూసిన ఉద్యోగంలో చేరారు శరత్ చంద్ర.
నవలల ప్రచురణకు పోటీపడిన ప్రకాశకులు…
నవలా రచయితగా శరత్ చంద్ర ఖ్యాతి నలుమూలల ప్రాకడంతో ఆయన రచనలను అచ్చు వేయించడానికి పోటీపడి ప్రచురణకర్తలు ఆయన రచనలు “బిరాజ్ బాహు”, “బిందుర ఛేలే” నవలల ప్రకాశనాధికారాన్ని ఆరు వేల రూపాయలకు కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు ప్రకాశకులు ఆయన అన్ని పుస్తకాలను అచ్చు వేయించాలని భావించి అందుకు పారితోషికం ఎనిమిది వేల రూపాయల వరకు పెంచారు. రాను రాను ఆయన రాబడి 14000 రూపాయల వరకు పెరిగింది. ఆ రోజుల్లోనే ఆయన రచనలు “చరిత్ర హీనులు”, “శ్రీకాంత”, “దత్తా”, “గృహ దహనం”, “శేష ప్రశ్న”, “విప్రదాసు”, “పధేర దావీ” మొదలగు నవలలు అచ్చుపడడంతో ఆయన పేరు నలుమూలలా ప్రతిధ్వనించింది. సమాజం ఆయన నవలను కళ్ళకద్దుకుంది.
వంగ దేశంలో ఆ రోజులలో ప్రముఖ రాజకీయ దురంధరుడు చిత్తరంజన్ దాసు నడిపే మాస పత్రికకు దాసు కోరిక మేరకు ఒక కథ వ్రాశారు శరత్ చంద్ర. అలా చిత్తరంజన్ దాసుతో మైత్రి ఏర్పడింది. ఆ రోజులలో ఆయన రచించిన “పతేర ధావీ” అనే విప్లవపూరితమైన నవలను ప్రభుత్వం జప్తుచేయించింది. విప్లవకారులంటే శరత్ చంద్రకు అమితమైన సంతోషం. వారికి ఆశ్రమం ఇవ్వడం, ధన సాయం చేయడం వంటివి చేసేవారు. ఒకసారి ప్రముఖ విప్లవకారుడు “రాస బిహారీ బోస్” అనే ఖైదీకి కూడా ఆయన ధన సాయం చేశారు. విప్లవకారుడైన ఒక ఖైదీ హౌరా జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వస్తే శరత్ చంద్ర ఆశ్రయము ఇచ్చారు. అతనిని కొన్ని దినముల తరువాత తన నౌకరుగా శరత్ చంద్ర నియమించుకున్నారు.
పంచ భూతాలలో కలిసిన పాంచ భౌతిక శరీరం…
శరత్ చంద్రకు తన జీవితమంతా సంఘర్షణలతో నిండి ఉంది. విభిన్నమైన పరిస్థితులతో ఆయన జరిపిన పోరాటం, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలపై అమితమైన పోరాటం చేశారు. ఆయన శ్రీమంతుడు కాకపోవచ్చు, కానీ కష్టజీవి. కష్టించారు, సృష్టించారు, ఎంతో దూరం పయనించారు. ఆయన పడ్డ శ్రమ యొక్క ఫలితాన్ని ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. జీవితాన్ని పదహారణాలతో పోలిస్తే, శరత్ చంద్రకు పదిహేను అణాలు కష్టాలు అయితే ఒక వంతు సుఖం అనుభవించారు. ఆయన రచనల ప్రచురణల పుస్తకాలపై వచ్చిన ఆదాయం ఆయన అట్టిపెట్టుకోలేదు, కూడపెట్టుకోలేదు. దానిలో అధిక భాగం దానధర్మాలకే ఖర్చు చేశారు. దాని ప్రతిఫలితంగా చివరి రోజులలో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆయనకున్న మద్యం అలవాటు వల్ల, ఆయన ఆరోగ్యం ఎప్పుడూ సంతోషంగా ఉండేది కాదు.
సమాజానికి ఏదో చేయాలనే బలమైన కాంక్ష వలన ఆయన తన ఆరోగ్యాన్ని మర్చిపోయారు. కానీ తన శరీరం అరవయ్యో సంవత్సరంలో వచ్చేసరికి అశ్వస్వస్థకు లొంగుతూ వచ్చారు. క్రమ క్రమంగా మంచం పట్టారు. ఊపిరితిత్తులు చెడిపోయాయి. ప్రచురణకర్తలు శరత్ చంద్రకు ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వనందున ఆయన ఆర్థికంగా ఇరుకునపడ్డాడు. తన మిత్రులు ధనం సమాకుర్చి ఆయనకు “పార్కు నర్సింగ్ హోమ్” లో చేర్పించారు.ఊపిరితిత్తులు కుళ్ళిపోయి, పరిస్థితి విషమించింది. చివరికి 01 జనవరి 1938 నాడు ఉదయం 10 గంటలకు ఆయన తన భౌతిక దేహాన్ని చాలించారు. ఆయనకు వైభవంగా దహన సంస్కారం జరుపబడింది. ఆ సమయంలో ఆయన పాంచ భౌతిక శరీరం పంచభూతాలలో లీనమైపోయింది. సాహిత్య ప్రపంచం స్థంభించింది, సమాజం విలపించింది. ఆయన కలం బావురుమంది. కానీ ఏం లాభం? మరణం అనేది ఆ సృష్టి నియమం.










