తెలుగువారు ప్రపంచస్థాయి లీడర్ లుగా ఎదగాలి.!ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాల అమలుకు రూపకల్పన.

ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) లో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో ‘స్విస్ తెలుగు డయాస్పోరా’ నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐరోపాలోని 12 దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఈ సమావేశంలో హాజరయ్యారు.
తెలుగువారు కష్టపడి ఈ స్థాయికి చేరారు. ఇక్కడి నుంచి మీరంతా ప్రపంచస్థాయి నాయకులుగా ఎదగాలన్నదే నా ఆకాంక్ష. మీరున్న చోటు కర్మ భూమి. అలాగే జన్మభూమి అభివృద్ధికీ మీ వంతు సహకారం అందించాలి. ఇక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఫిజికల్‌గా, వర్చువల్‌గా మేం అందిస్తాం. తెలుగు ప్రజలను గ్లోబల్ లీడర్లుగా ఎదిగేలా తీర్చిదిద్దేందుకు ఒక ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని ఆయన పేర్కొన్నారు.
*పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘జాబ్స్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ, యూరప్ లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు.
*ఇప్పటివరకు పశ్చిమాసియా, అమెరికా దేశాలకు పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు తరలివెళ్లారని, ఇప్పుడు యూరప్ లోనూ విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. వర్కర్లకు ఇమ్మిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు.
కాగా యూరప్ లో క్రిప్టో తరహా ఆర్థిక వ్యవస్థను స్టార్టప్ గా మొదలుపెట్టామని అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలు వివరించారు. ఏపీని క్రిప్టోజోన్, క్రిప్టో ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దే అవకాశముందని వారు తెలిపారు. ఈ సందర్భంగా యూరప్ తెలుగు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించడం విశేషం!
ఏపీలో గత ప్రభుత్వం ప్రజావేదికతో మొదలుపెట్టి.. రాజధాని అమరావతివరకు ధ్వంసం చేసుకుంటూ పోయింది. వాటిని పునర్నిర్మించే చర్యలు చేపట్టాం. 2047నాటికి తెలుగుజాతి ప్రపంచంలో బలమైనదిగా ఉండాలన్నది మనందరి సంకల్పం కావాలి. దీనికి పది ప్రాధాన్య లక్ష్యాలను నిర్దేశించాం. వాటి సాధనకు మీరంతా సహకరించాలన్నారు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమైన నేపథ్యంలో..
దశాబ్దాలపాటు తెదేపా అధికారంలో ఉండేలా..
వరుస ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచాలని భావిస్తున్నారు.
స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం ద్వారా తెలుగు జాతి ప్రపంచంలో ముందు వరుసలో ఉండేలా చేయాలన్నదే నా ఆలోచన. దీనికి మీ నుంచి వచ్చే సూచనలపై తదుపరి అధ్యయనం చేసి, అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నేను జైల్లో ఉన్నప్పుడు సంఘీభావంగా పలు దేశాల్లో నిరసనలు తెలిపారు. ఇన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారా అని ఆశ్చర్యపోయా. వ్యక్తి మరణించిన తర్వాత గుర్తుపెట్టుకోవడం సహజం. నా విషయంలో మాత్రం జీవించి ఉన్నప్పుడే మీరంతా గుర్తు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో సొంత ఖర్చులతో వచ్చి, పనిచేసి కూటమిని గెలిపించారు. నేను తెలుగుజాతిలో ఉండటం నా అదృష్టం. మళ్లీ జన్మ ఉంటే తెలుగుజాతిలోనే పుట్టాలని భగవంతుణ్ని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
*ఒక మత్స్యకార గ్రామాన్ని అత్యాధునిక ప్రాంతంగా తీర్చిదిద్దిన సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని.. 1995లో నేను సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయాధారిత రాష్ట్రాన్ని సాంకేతికంగా ఎదిగేందుకు చేసిన ఒక ఆలోచన ఫలించిందని గుర్తుచేశారు.
*ద్వితీయస్థాయి సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఐటీని తీసుకొచ్చాం. అప్పట్లో నేను చెప్పినట్లు గ్రామాల నుంచి చాలామంది పట్టణాలకు వచ్చి పిల్లలను చదివించారు. వారంతా అవకాశాలను అందిపుచ్చుకుని, ఇప్పుడు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మనవాళ్లు ఇంతమంది ద్వితీయశ్రేణి పారిశ్రామికవేత్తలుగా ఉన్నారంటే.. దానికి తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో వేసిన పునాదే కారణం అవ్వడం విశేషం!
*ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డీ, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నారా లోకేశ్ కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు.
*మా ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. అనుమతులన్నీ 15 రోజుల్లో ఇచ్చేలా ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశాం.
*పైగా ఏపీలో తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉన్నాయి. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్ట్, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.