Telugu News

టాలీవుడ్ సెంటిమెంట్ ఆ మహావృక్షం.. ఇక లేదు

ఎన్నో చిత్రాలకు నిలయంగా మారిన ఆ మహావృక్షం నేలకొరిగింది. 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వృక్షం భారీ వరదలకు నేలకొరిగి సినీ ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు ఆవేదనలను మిగిల్చింది. ఎన్నో పక్షులకు ఆవాసంగా మారినటువంటి ఆ మహావృక్షం నేలకొరవడంతో ఆ పక్షులన్నీ విలవిల్లాడుతూ తలో దిక్కుకు ఎగిరిపోయాయి. ఆ మహావృక్షం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలోని  గోదావరి నది ఒడ్డున ఉండేది  మహావృక్షం ‘నిదర గన్నేరు’. ఎన్నో చిత్రాల షూటింగ్లకు నిలయంగా మారిన ఈ మహావృక్షం భారీ వర్షాలు నేపథ్యంలో వరదలు తాకిడికి నేలకొరిగింది. తెలుగు చిత్ర సీమతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వృక్షం నేలకొరగడంతో ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, సినిమా ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 150 ఏళ్ల వయసున్న ఆ చెట్టు 1975 సంవత్సరంలో విడుదలైన పాడిపంటలు సినిమా ద్వారా సినిమా చెట్టుగా గుర్తింపు పొందింది. అప్పటినుండి ఈ నిద్ర గన్నేరు వృక్షాన్ని సినిమా చెట్టుగా భావించేవారు.

పాడిపంటలు సినిమా నుంచి 2018 లో విడుదలైన రంగస్థలం సినిమా వరకు ఈ చెట్టు ఐకాన్ సింబల్ గా చెప్పుకోవచ్చు. ఈ వృక్షం వద్ద సీన్స్ ఉన్న ఏ సినిమా అయినా సూపర్ హిట్ గా నిలిచేదని దర్శకులు భావించేవారట. అందువల్ల ఈ చెట్టు వద్ద సీన్స్ తీస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఈ వృక్షాన్ని సెంటిమెంటుగా భావించేవారట దర్శకులు. ‘మూగమనసులు, పద్మవ్యూహం, ఆపద్బాంధవుడు, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు’ ఇలా అనేక సినిమాలు ఈ మహావృక్షం వద్ద చిత్రీకరించారట. దర్శకులు వంశీ, కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావులకు ఈ మహావృక్షం ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు.

ఈ వృక్షం వద్ద దాదాపు 300 కు పైగానే సినిమా షూటింగులు జరిగాయట. మూగమనసులు సినిమాలో అలనాటి సీనియర్ నటి జమున.. ‘గోదారి గట్టుంది గట్టుమీనా సెట్టుంది.. సెట్టు కొమ్మన పిట్టుంది. పిట్ట మనసులో ఏముంది’ అనే పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపిస్తుంది. ఆ పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు. ఆ పాట డ్యాన్స్ ను కూడా ఆ వృక్షం వద్దే చిత్రీకరించారు. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మహావృక్షం ఇప్పుడు నేలకొరగడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వలస పక్షులు చేరి ఈ వృక్షం పై నివసించేవనని, ఎన్నో రకాల పక్షులకు, జీవాలకు నిలయంగా మారినటువంటి ఆవృక్షం నేలకొరకడంతో ఆ మూగ జీవాలు విలవిల్లాడుతూ తలో దిక్కుకు ఎగిరిపోయాయని కుమారదేవం గ్రామస్తులు అంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో గోదావరికి వరద తాకిడి పెరగడంతో ఈ మహావృక్షం నేలకొరిగింది. అయితే ఈ వృక్షం గురించి ఇంత చరిత్ర ఉన్నప్పటికీ దానిని అధికారులు బాధ్యతగా తీసుకోకపోవడం బాధాకరమని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.

అధికారులు ముందస్తు చర్యగా భావించి వృక్షం నేలకొరకకుండా చర్యలు తీసుకుంటే బాగుండేదని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. సినీ రంగం వారైనా సరైన చర్యలు తీసుకుని ఉంటే వృక్షాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదని గ్రామస్తులు  అంటున్నారు. ఇకనుండి ఈ వృక్షాన్ని పాత సినిమాల్లో మాత్రమే చూసే పరిస్థితి వచ్చిందని బాధగా చెబుతున్నారు. ఎంతో మందిని స్టార్స్ ని చేసిన ఆ చెట్టు ఇక లేదని, వృక్షం లేకపోవడంతో తమ ఇంటి సభ్యుని కోల్పోయినట్టు ఉందని..  తమ ఊరికి అందమే ఆ భారీ వృక్షమని కుమారదేవం గ్రామస్తులు  తమ బాధను వ్యక్తం చేశారు.

Show More
Back to top button