Telugu News

తెరపైకి మళ్లీ కచ్చతీవు అంశం

గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కచ్చతీవు ద్వీపం అంశం మరోసారి రాజకీయం అయింది. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఈ వివాదాన్ని మళ్లీ లేవనెత్తారు. మైలాదుత్తురై సభలో మాట్లాడుతూ, “ఈ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మేము అన్నివిధాలా ప్రయత్నిస్తాం” అని హామీ ఇచ్చారు. కేంద్రం గత పదేళ్లలో దీని కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కచ్చతీవు అంశాన్ని ఎన్నికల కోసం మాత్రమే వాడుకుంటుందని ఆరోపించారు. ప్రతి తమిళనాడు ఎన్నికలో ఇది కీలకమయ్యే అంశమే.

అసలు ఈ సమస్య ఏమిటి?

కచ్చతీవు ద్వీపం పాక్ జలసంధిలో, రామేశ్వరానికి 10 నాటికల్ మైళ్లు, జాఫ్నాకు 10.5 మైళ్లు దూరంలో ఉంది. పొడవు 1.7 కిలోమీటర్లు, వెడల్పు 300 మీటర్లు మాత్రమే. నివాసాలు లేని ఈ ద్వీపంలో సెయింట్ ఆంథోనీ చర్చ్ ఉంది. ఈ దేవాలయ ఉత్సవాల్లో తమిళజాలర్లు ప్రతిసారి పాల్గొంటారు. 1974 ఒప్పందం ప్రకారం శ్రీలంకకు అప్పగించినా, జాలర్లు అక్కడ వేట కొనసాగించవచ్చని, చర్చ్ ఉత్సవాలు జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. కానీ, 1976లో మరో ఒప్పందం ద్వారా శ్రీలంక తమిళ జాలర్ల వేట నిషేధించింది. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి.

జాలర్ల కష్టానికి శాశ్వత పరిష్కారం అవసరం

శ్రీలంక నావికాదళం తరచూ భారత జాలర్లపై దాడులు చేస్తోంది. బోట్లు జప్తు చేయడం, జాలర్లను అరెస్ట్ చేయడం సాధారణమే అయిపోయింది. ఒప్పందం ప్రకారం ప్రవేశం ఉండినా శ్రీలంక వాటిని పాటించడం లేదు. తమిళనాడు రాజకీయ పక్షాలు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కచ్చతీవును తిరిగి భారత్‌ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ పెరుగుతోంది. పార్లమెంట్‌ ఆమోదం లేకుండా భూభాగం అప్పగించడాన్ని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. స్టాలిన్‌ ప్రధానికి పదేపదే వినతి చేస్తున్నప్పటికీ పరిష్కారం దూరమే. కచ్చతీవు వివాదం ఇప్పుడు న్యాయ, రాజకీయ, మానవ హక్కుల అంశంగా మారిపోయింది.

Show More
Back to top button