Telugu News

దక్షిణ కైలాసంగా అలరారుతున్న.. శ్రీకాళహస్తీశ్వరాలయం..!


ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో కొలువై ఉంది. భక్తులకు భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచిన ఈ క్షేత్రం.. పంచభూత లింగాల్లోని పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగంలు తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రమే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిందని ప్రశస్తి! రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా అక్కడ విరాజిల్లుతుండటం విశేషం. కావున ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురుంచి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం…

ఆలయ ప్రత్యేకతలు..

తిరుపతికి వెళ్ళిన భక్తులు చాలామంది కాళహస్తి చూసుకుని కానీ తిరుగుముఖం పట్టరు. అసలు తిరుపతి ప్రయాణం కాళహస్తితోనే పూర్తవుతుందని, కాళహస్తిలో శివున్ని దర్శించుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకుండా నేరుగా ఇంటికి చేరుకోవాలని చెబుతారు. కాళహస్తిలోని ముఖద్వారం గడప కింద ఇద్దరు భక్తుల దేహాలు ఇప్పటికి ఉంటాయని అంటారు. అందుకే ఈ గడప

తర్వాత మరో గడప కూడా కనిపిస్తుంది. ఈ భక్తులలో ఒకరు శ్రీకాళహస్తి మహత్యం అనే కావ్యం రాసిన ధూర్జటి కాగా మరొకరు రోమసుడు అనే మహర్షి. 

కాళహస్తి ఆలయంలో ముందుగా మనకు పాతాళ గణపతి కనిపిస్తారు. ఈయన ముందు నిలబడి నాలుగుసార్లు వినాయకుడ్ని తలుచుకుంటే మోక్షం లభిస్తుందని అంటారు. 

కాళహస్తిలోని శివుడు వాయురూపంలో ఉంటాడని ఇందుకు నిదర్శనంగా అక్కడి గర్భగుడిలో శివలింగానికి ముందున్న దీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటాయి. గర్భగుడిలో ఎలాంటి గాలి ప్రవేశించకపోయినా కూడా కేవలం కుడివైపున ఉన్న రెండు దీపాలు మాత్రమే ఇలా రెపరెపలాడటం విశేషం.

కాళహస్తి గర్భాలయంలో మూల విరాటుకు నిత్యం అభిషేకం చేస్తారు. ఇలా ఎంతగా అభిషేకం చేసినా అక్కడి నీరు ఇంకిపోతూనే ఉంటుందట. ఈ నీరు ఎక్కడికి వెళ్తుందో అనేది ఎవరికీ తెలియదు.

ఇక్కడి అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.. భక్తుల కోరికలను వింటున్నట్లుగా ఈ అమ్మవారి తల ఓ వైపు వాల్చి కనిపిస్తుంది. దేశంలోని మరే క్షేత్రంలోనూ ఇలా కనిపించదు.

ఇక్కడ దేవాలయంలోని పాతాళ గణపతి ఉత్తరంవైపు.. 

జ్ఞాన ప్రసూనాంబ తూర్పువైపు.. 

కాళహస్తీశ్వరుడు పశ్చిమంవైపు.. 

దక్షిణామూర్తి దక్షిణంవైపు తిరిగి ఉంటారు.. ఇలా ఒక దేవాలయంలోని నలుగురు దేవతలు నాలుగు దిక్కులు చూస్తూ ఉండటం దేశంలో మరెక్కడా మనకూ కనిపించకపోవచ్చు.

దేశంలో చాలా శివాలయాలను దక్షిణ కాశీగా పిలుస్తారు. కానీ ఒక్క శ్రీకాళహస్తి ఆలయాన్నే దక్షిణ కైలాసంగా పిలుస్తారు. చంద్రగ్రహణం సమయంలో ఏ దేశంలో ఏ ఆలయాన్నైనా మూసివేయడం సహజం. కానీ కాళహస్తీశ్వరుడు గ్రహణాలకు అతీతుడు పైగా గ్రహణం కలిగించే రాహు, కేతువులకు అక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. 

అందుకే ఒక్క కాళహస్తి ఆలయం మాత్రం గ్రహణం సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఏ గుడిలో అయినా సవ్యదిశలో ప్రదక్షిణ చేస్తారు. కానీ ఈ ఆలయంలోని అమ్మవారిని, స్వామిని చూసేందుకు వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాలి. కాళహస్తి ఆలయానికి సమీపం నుంచే సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ ప్రవాహం ఎంత ఉదృతంగా ఉన్నా కూడా కాళహస్తి ఆలయంలో ఎలాంటి చప్పుడు చేయకుండా ప్రవహించడం, ఆ సడి వినపడకపోవడం విశేషం!

స్థలపురాణం..

శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభువుగా కొలువై ఉండగా, ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడి అమ్మవారు జ్ఞానాంబిక పూజలందుకోవడం విశేషం. బ్రహ్మదేవుడి చేత పూజలందుకుంటున్న ఈ శైవక్షేత్రం ఏటా భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహమేమి లేదు. 

శ్రీకాళహస్తీశ్వరుడు… అంటే, శ్రీ (సాలెపురుగు), కాళం (పాము), హస్తి (ఏనుగు)ల పేరిట ఏర్పడిన ఈ క్షేత్రం… ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీకగా చెబుతారు. లింగాకారంలో ఇక్కడ వెలసిన పరమేశ్వరుడిని ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు నిత్యం అర్చిస్తుండేవట. సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది. సర్పం మణులతో, ఏనుగు బిల్వపత్రాలతో అర్చించేవి. సాలెపురుగు భక్తిని పరీక్షించాలనుకున్న పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికీలలతో దగ్ధం చేయగా, తిరిగి గూడు అల్లేది. చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకుని ప్రాణత్యాగం చేసింది. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు.

ఇక పాము నిత్యం మణులతో శివుడిని పూజిస్తుండగా, ఏనుగు వచ్చి ఆ మణులు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించేది. మర్నాడు వచ్చిన సర్పానికి మణులకు బదులు బిల్వపత్రాలు కనిపించేవి. రోజూ ఇదే పరిపాటిగా జరిగేది.  ఒకరోజు ఆగ్రహించిన పాము దీనికి కారకులెవరో తెలుసుకోవాలనుకుంది ఒకరోజు ఉదయం.. ఏనుగు వచ్చి సర్పం ఉంచిన  మణులు తొలగించి పత్రాలతో అర్చిస్తున్న సమయంలో పత్రాలనుంచి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలాన్ని చేరి పీడించింది. సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించింది. కుంభస్థలంలో ఉన్న సర్పరాజు కూడా అసువులు బాసింది. ఏనుగు, సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు వాటికీ ముక్తి ప్రసాదించాడు. అంతేకాకుండా సాలీడు, పాము, ఏనుగుల పేర్ల మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమిచ్చాడు. ఆ వరం ప్రకారం శ్రీ (సాలె) కాళ (పాము) హస్తి (ఏనుగు) అని ఈ క్షేత్రానికి పేరొచ్చింది. 

పరమేశ్వరుడిక్కడ కృతయుగంలో వాయురూపంలో, త్రేతాయుగంలో స్వర్ణరూపంలో,  ద్వాపరయుగంలో రజతరూపంలో, కలియుగంలో శ్వేతశిలారూపంలో కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయం గురించి మహాభక్తుడైన భక్త కన్నప్ప గురించి మరో గాథ వుంది. భక్త కన్నప్ప వృత్తాంతమూ ఈ క్షేత్రానికి సంబంధించిందే. కుజదోష నివారణ పూజలు.. నాగదోష నివారణ పూజలు.. నవగ్రహ దోష నివారణ పూజలు ఈ క్షేత్రంలో ప్రత్యేక ప్రభావం కలిగి ఉంటాయని భక్తుల విశ్వాసం. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం దక్షిణ కైలాసంగా పేరుపొందింది. ఒకప్పుడు, తిరుమల కంటే ప్రఖ్యాతిగాంచిన ఈ శ్రీకాళహస్తి దేవాలయం తిరుపతికి సమీపంలోనే ఉంది. 

మరో వృత్తాంతం..

ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడని ప్రతీతి. 

అర్జునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేకపోవడంతో మరో జన్మఎత్తాడు. తండై, నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబానికి చెందినవాడు. అందువల్ల రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే చెట్టుకింద విశ్రాంతి తీసుకున్నాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.

తిన్నడు వెంటనే నిద్ర నుంచి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగమే దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి ”అయ్యా, శివయ్యా! నీకు నామీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా” అని పిలిచాడు.

మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లూవాకిలీ మరచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడిపేవాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేయడం.. నోటితో నీరు తెచ్చి, అభిషేకం చేసేవాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.

 అదే ఊర్లో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగంమీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. ”మహాశివా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాపపంకిలమైన పనులు చేయడమే కాదు, చూడటమూ ఘోరమే.. ఇంతకంటే చనిపోవడం మేలు…” అని దుఃఖిస్తూ, తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు. ఇంతలోనే మహాశివుడు చిరునవ్వు నవ్వి ”ఆగు.. తొందరపడకు.. ఇక్కడే దాక్కుని, ఏం జరగబోతోందో చూడు..” అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు.

అప్పుడే నోటితో నీళ్ళు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే, శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది, శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే, శివుడి ఒక కంటిలోంచి కన్నీరు కారుతోంది.

రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం చూసి తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి, రాతిమీద నూరి, కంటికి కట్టు కట్టాడు. తీరా చూస్తే, రెండో కంటి నుంచి రక్తం కారుతోంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ, అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.

తిన్నడు మరింత దుఃఖిస్తూ, ”శివా, విచారించకు.. నా రెండో కన్ను కూడా తీసి పెడతాను..” అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని, ఆ కన్ను దగ్గర పెట్టి, రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనకనుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకుండాపోయింది.

 తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా అతడ్ని వారించి, ”భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు’’ అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు.

పక్కన నిలబడిన శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి అలానే చూస్తుండిపోయాడు.

తీర్థప్రసాదాలు…

* ఆలయంలో జరిగే అభిషేక సేవలకు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. రుద్రాభిషేకానికి పులిహోర, లడ్డూ, కండువా, జాకెట్టుముక్క, స్వామి అమ్మవార్ల చిత్రపటం, పంచామృతం, పచ్చకర్పూర తీర్థజలం, విభూది మొదలైనవి ఆలయం తరఫున భక్తులకు అందజేస్తారు.

* పచ్చకర్పూర అభిషేకం చేయించిన భక్తులకు తీర్థంగా పచ్చకర్పూర జలాన్ని, పంచామృత అభిషేకం చేయించిన భక్తులకు అభిషేకం చేసిన పంచామృతాన్ని కానుకగా అందజేస్తారు.

* నిత్య కల్యాణోత్సవం చేయించిన వారికి లడ్డూ, వడను నైవేద్యంగా ఇస్తారు.

* చండీ, రుద్రహోమాలు చేయించిన వారికి ఉప్పు పొంగలి ప్రసాదంగా అందజేస్తారు.

Show More
Back to top button