Telugu News

రేపు.భానుసప్తమి.పూజిస్తే అనంతకోటి లాభాలు.!

నిత్యం సూర్యకిరణాల ద్వారానే ఈ ప్రపంచం జీవశక్తిని నింపుకుంటోంది. అందువల్ల సూర్యుడ్ని ప్రత్యక్ష దైవం అని అంటారు. చాలా రకాల పేర్లతో సైతం పిలుస్తారు. వాటిలో భానుడు అనేది కూడా ఒక పేరు. ఈ భానుడు అనే పేరు పురాణ గ్రంథాల్లో కూడా ఉంది. ఆదివారం రోజు సూర్య భగవానుని పూజించడం అత్యంత ఫలప్రదం అని హిందువుల విశ్వాసం. ఆదివారాన్ని ఆరోగ్యవారమని కూడా శాస్త్రంలో వర్ణిస్తారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడికి ఆదివారం సూర్యోదయ సమయంలో ఇచ్చే అర్ఘ్యం ఆరోగ్యం, సుఖసంపదలు ఇస్తుందని నమ్మకం.

ఇకపోతే మార్గశిర మాసంలో భాను సప్తమి వస్తుంది. ఈరోజున సూర్య భగవానుడిని పూజించి ఉపవాసం ఉండే సంప్రదాయం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా నెలలో రెండుసార్లు భాను సప్తమి వస్తుంది.  ఒకటి కృష్ణపక్షంలో అయితే మరొకటి శుక్లపక్షంలో.. మరిముఖ్యంగా ఆదివారం రోజున సప్తమి తిథి వస్తే దానిని భాను సప్తమి లేదా సూర్య సప్తమి అని పిలుస్తారు. అటువంటి దివ్యమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు, ఆయన అనుగ్రహం పొందవచ్చని మన పెద్దలు చెబుతారు. సూర్య ఆరాధన కోటిరెట్ల ఫలవంతమైనదని అంటారు. 

ధర్మశాస్త్రం ప్రకారం పాటించాల్సిన నియమాలు:
సాధారణంగా ఆదివారం సప్తమి వస్తే దానిని భానుసప్తమి అంటారు. మిత్ర సప్తమి, నందాసప్తమి అని కూడా వ్యవహరిస్తారు. నిజానికి ఆదివారం అంటే ఆటవిడుపుగా, సెలవుదినంగా భావిస్తాం. కానీ ఆదివారం అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం మనకు చెబుతోంది. 

*సూర్యోదయానికి ముందే నిద్రలేవడం.

*ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.

*ఆదివారం రోజు ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.

*ఆదివారం విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.

*ఆదివారం ఈ అయిదు నియమాలు పాటిస్తే సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర వచనం.

ఈ రోజున చేసే పూజ, దానం, జపం, హోమం అత్యంత ఫలవంతం అని, ఈ పూజలు అనంతకోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. 

*భాను సప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానాదులు చేసి, సూర్యభగవానునికి నమస్కరించుకోవాలి.

*ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం, బెల్లం, నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసుకోవాలి.

*సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని రథం ఆకారంలో ముగ్గు వేసుకుని అందులో మధ్యభాగంలో పద్మాన్ని వేసుకోవాలి. ముగ్గుకు నలువైపులా పూలతో, పసుపుకుంకుమలతో అలంకరించుకోవాలి.

*సూర్య భగవానునికి 12 సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి, రాగిపాత్రలో నీరు తీసుకొని అర్ఘ్యం సమర్పించాలి.

*ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్య భగవానునికి నివేదించాలి. అనంతరం ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించాలి.

*రోజూ సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానాదులు చేయకుండా ఆహార నియమాలు పాటించనివారిని అనారోగ్యం, దారిద్య్ర్యం పీడిస్తాయని సూర్యాష్టకం పేర్కొంది. అందువల్లే ఈ నియమాలు విధించింది.

*నవగ్రహాలకు అధిపతి సూర్యనారాయణుడు. భానుసప్తమి రోజున సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలను పఠనం చేయడం శ్రేయస్కరం. 

*శ్రీసూర్య నారాయణాయ నమః అని స్మరించటం వల్ల కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. సూర్య నమస్కారాలు చేయటం వల్ల అష్ట ఆద్యులు సిద్ధిస్తాయి. శ్రీరామ చంద్రుడు సూర్యదేవుడ్ని ప్రార్ధించి రావణాసురుడిని సైతం జయించాడు.

*సూర్య భగవానుడ్ని ఈ సృష్టికి ప్రాణప్రధాతగా భావిస్తాం. శక్తికి మూలం సూర్యుడే! కేవలం భానుసప్తమి రోజే కాకుండా ప్రతి రోజూ ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శరీరానికి కొత్త శక్తి అందుతుందట. అన్ని రకాల రోగాల నుంచి రక్షణ లభిస్తుందట. మనసు, శరీరం రెండూ శుద్ధి అవుతాయి.

తిథి: పంచాంగం ప్రకారం సప్తమి తిథి 21 డిసెంబర్ 2024 శనివారం మధ్యాహ్నం 12:21 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఆదివారం 02:31 గంటలకు ముగుస్తుంది. దీని ప్రకారం, భాను సప్తమి 22 డిసెంబర్ 2024న జరుపుకోవడం విశేషం!

Show More
Back to top button