
థాయ్‌లాండ్, కంబోడియాల మధ్య సరిహద్దు వివాదం ఆసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 508 మైళ్ల సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆలయాలు, పర్వతాలు, అరణ్యాలు కలిసిన ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ప్రీహ్ విహార్ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా, ఖెమర్ పాలకులు నిర్మించగా, 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియాకు చెందుతుందని తీర్పు ఇచ్చింది. యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించగా, థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది.
కంబోడియా చూపిన మ్యాప్‌లో 4.6 చదరపు మైళ్ల ఆక్రమణను థాయ్‌లాండ్ ఆరోపించింది. ఈ వివాదంతో 2008-11 మధ్యలో పలు ఘర్షణలు జరిగాయి. 2011లో డజను మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమ ఇళ్లను విడిచి పారిపోయారు. ఐసీజే మరోసారి తీర్పు ఇచ్చి కంబోడియా సార్వభౌమత్వాన్ని గుర్తించగా, మ్యాప్‌లు, మిలిటరీ గస్తీలపై మరోసారి వివాదం చెలరేగింది.
ఇటీవల మేలో జరిగిన ఘర్షణలో ఓ కంబోడియా సైనికుడు మృతి చెందడంతో, థాయ్ యువ ప్రధాని షినవత్రా రాజకీయంగా దెబ్బతిన్నారు. ఆమె కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో చేసిన ఫోన్‌కాల్ లీకవడంతో, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నదని ఆరోపణలు వచ్చాయి. దాంతో కన్జర్వేటివ్ పార్టీలో భేదాభిప్రాయాలు వెల్లివచ్చాయి. చివరకు ఆమె పదవిని కోల్పోయారు.
ఇటీవల ల్యాండ్ మైన్ల పేలుళ్లతో థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనిపై రెండు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కంబోడియా రష్యా మైన్లను పాతిందని బ్యాంకాక్ ఆరోపిస్తుండగా, కంబోడియా ఖండిస్తోంది. థాయ్ సేనలు ఒప్పందంలోని మార్గాలను ఉల్లంఘిస్తున్నాయని చెబుతోంది.
తాజాగా థాయ్ వాయుసేన ఎఫ్-16 యుద్ధవిమానాలతో ట మోన్ థోమ్ ఆలయ ప్రాంతంలో బాంబింగ్ చేసింది. కంబోడియా శతఘ్నులతో ప్రత్యుత్తరం ఇస్తోంది. దాదాపు 40,000 మంది ప్రజలు ఘర్షణ ప్రాంతంలో ఉన్నారు. సరిహద్దు వివాదం యుద్ధ స్థాయికి చేరుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది.










