క్యాన్సర్ సోకిన వారు చికిత్స చేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఖరీదుతో కూడుకున్న పని. ఆర్థిక స్తోమత ఉన్నవారు మాత్రమే ధైర్యంగా క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పేదవారికి ఈ ఖర్చు భరించలేనిదని వ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకోసమే.. కేంద్ర ప్రభుత్వం పేదరికంలో ఉన్న క్యాన్సర్ బాధితులకు చికిత్స చేయించుకునేందుకు ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’ పథకంలో భాగంగా క్యాన్సర్ బాధితుల వైద్య ఖర్చుల మేరకు రూ.15లక్షలు సాయం చేస్తుంది. దురదృష్టవశాత్తు ఈ పథకం గురించి సరైన ప్రచారం, సమాచారం తెలియక పేదరికంలో ఉండి క్యాన్సర్‌తో పోరాడుతున్న వారు వినియోగించుకోలేక పోతున్నారు. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి 97 మంది లబ్ధిదారులు ఉండగా.. తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు. ఈ పథకం సమాచారం, అర్హతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రాష్ట్రీయ ఆరోగ్య నిధి
ఈ పథకం పేరు ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’. దీన్ని హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తుంది. క్యాన్సర్ సోకిన పేదలకు చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో 2009లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో రాష్ట్రీయ ఆరోగ్య నిధి అమలు అవుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు క్యాన్సర్ చికిత్స కోసం వైద్యం సాయం అందజేయాలని దేశంలో 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదట క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేస్తారు. తర్వాత అంతకంటే ఎక్కువ డబ్బు అవసరమైతే ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి’కి దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు పరిశీలించి అవసరాన్ని బట్టి గరిష్ఠంగా రూ.15 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అయితే ఈ డబ్బును పూర్తిగా క్యాన్సర్ చికిత్స కోసమే ఖర్చు చేయాలి.
* అర్హులెవరు?
ప్రభుత్వం ఇచ్చే పథకం డబ్బుతో ఈ కింది చికిత్సలు చేయించుకోవచ్చు
క్యాన్సర్ గడ్డల ఆపరేషన్
యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ
రేడియేషన్ థెరఫీ
బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్
అర్హతలు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
సంబంధిత MRO జారీ చేసిన రేషన్ కార్డ్, వార్షిక ఆదాయ ధృవపత్రం ఉండాలి.
క్యాన్సర్ ఉందని నిర్ధారణ పరీక్షల ధ్రువపత్రాలు ఉండాలి.