సామాజిక అసమానతలను రూపుమాపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ‘డాక్టర్ అంబేడ్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటెగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మేరేజెస్’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు అండగా నిలబడుతూ రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకించి ‘అంబేడ్కర్ ఫౌండేషన్’ను కూడా స్థాపించింది. అయితే ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే.. అర్హులెవరు? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.
కొన్ని ప్రాంతాల్లో కులాంతర వివాహాలు నేడు సాధారణమైపోయాయి. అలా పెళ్లి చేసుకున్నవారికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాల ద్వారా ఈ స్కీము అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాలలోని పలు సంక్షేమ శాఖలు ఈ పథకం అమలు బాధ్యతను చూసుకుంటున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇదివరకే అలాంటి స్కీమ్లు కొన్ని ఉన్నాయి. ఆ వివాహ పధకాలను ఈ స్కీమ్ తో మేళవించి అర్హులకు లబ్ది చేకూరుస్తున్నాయి.
అర్హత
యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. వధూవరుల్లో ఎవరైనా ఒకరు కచ్చితంగా దళితులై (SC) ఉండాలి. ఇద్దరూ దళితులే అయినా ఈ పధకానికి అర్హులు కారు. BC క్యాస్ట్కు చెందిన వేరువేరు కులాలవారు పెళ్లి చేసుకున్నా.. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందలేరు. ఈ కులాంతర వివాహం హిందూ వివాహ చట్టం-1995 ప్రకారం నమోదై ఉండాలి. పెళ్లైన సంవత్సరం లోపే ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలి. వివాహాన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తప్పకుండా రిజిస్టర్ చేయించాలి. కొత్తగా పెళ్లిన జంట వార్షిక ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదు. వనరులిద్దరికీ అది తొలి పెళ్లి ఉండాలి. రెండవ లేదా తదుపరి వివాహానికి ఎలాంటి ప్రోత్సాహకం ఉండదు.
దరఖాస్తు ఎలా?
ఈ పథకం కోసం ఆనలైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకోసం.. పెళ్లి చేసుకున్నప్పుడు దిగిన ఫొటోలు(ప్రూఫ్ కోసం), ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యాసంస్థల నుంచి వచ్చిన పదో తరగతి మెమోలు (ఏజ్ ప్రూఫ్ కోసం), గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన ఫస్ట్ మ్యారేజి సర్టిఫికెట్, ఇద్దరూ కలిసి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, సాక్షుల ఆధార్ కార్డులు, పెళ్లి చేసుకున్న వారి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు కావాలి. ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
వేరువేరు రాష్ట్రాల వారికి వేరువేరు పోర్టల్స్ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు పూర్తైన తర్వాత, ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, దాంతో పాటు పైన తెలిపిన సర్టిఫికెట్లన్నీ తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ సబ్మిట్ చేయాలి. వారు ఆ పత్రాలను పరిశీలించి, అంబేడ్కర్ ఫౌండేషన్ వారికి పంపుతారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీసిన బ్యాంక్ ఖాతా(జాయింట్ అకౌంట్)లోకి మొదట రూ.1.5 లక్షలు జమచేస్తారు. మిగిలిన మొత్తాన్ని కొంత కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు.
ఆ FD సొమ్మును మూడేళ్ల తర్వాత వడ్డీతో సహా అందజేస్తారు. అయితే ఈ నిబంధన అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి ఒక విడతలోనే మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. ఈ పథకం కింద నూతన వధూవరులిద్దరికీ ఆర్ధిక సాయం చేయాలా? వద్దా? అనే తుది నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు అంబేద్కర్ ఫౌండేషన్ వారికే ఉంటుంది. తప్పుడు పత్రాలు సమర్పించి, ఈ పథకం ద్వారా మోసపూరితంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తే చట్ట ప్రకారం వారు శిక్షారులవుతారు.