100 గ్రాముల వెయిట్..వెరసి పథకానికి దూరం..రెజ్లర్ వినేష్ పొగాట్.. విషయంలో జరిగిందేంటి..?
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ లో పతకానికి అతి చేరువలో ఉన్న వినేష్ పొగాట్ విషయంలో.. చివరినిమిషంలో అనర్హత వేటు పడటంపై యావత్ దేశం షాక్ కు గురైంది. అయితే, వినేశ్ బరువును నిర్దేశిత పరిమితిలోపు ఉంచేందుకు భారత బృందం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… 100 గ్రాముల అదనపు బరువుతో ఆమె పతకానికి దూరమైంది. అసలు ఎందుకలా జరిగింది.. రెజ్లింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే…
బాక్సింగ్, రెజ్లింగ్ వంటి పోరాట క్రీడల్లో పోటీపడుతున్న రెజ్లర్లందరికీ సరైన అవకాశం కల్పించేందుకు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఏ టోర్నమెంట్‌లో అయినా నిర్ణీత బరువు విభాగంలో రెండు రోజులు పోటీ నిర్వహిస్తారు.
ప్రతి రెజ్లర్‌ను ఒక కేటగిరీలో ఆడేందుకు మాత్రమే అనుమతిస్తారు. తొలిసారి అధికారికంగా బరువు చూసే సమయంలో క్రీడాకారిణి లేదా క్రీడాకారుడు
ఎంత బరువుంటారో…ఆ కేటగిరీకి మాత్రమే వారు ప్రాతినిధ్యం వహిస్తారు. రెజ్లింగ్ కోసం సింగ్లెట్ యూనిఫాంను అనుమతిస్తారు. తమ బరువుకు తగ్గట్టుగా కచ్చితమైన కొలతలతో సింగ్లెట్ ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం మినహాయింపు ఉండదు.
అలాగే పోటీ జరిగేరోజున ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించి, బరువు చెక్ చేస్తారు.
పోటీలు ప్రారంభమయ్యేరోజు ఉదయం ముందుగా రెజ్లర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో రెజ్లర్లకు అంటువ్యాధుల తీవ్రత లేదా ఏదేని అనారోగ్యం ఉన్నట్టు గమనిస్తే వారిని పోటీ నుంచి తప్పించొచ్చు. అలానే పోటీలో పాల్గొనేవారు గోళ్లను కచ్చితంగా కట్ చేసుకోవాలి.
కానీ అనుమతించిన బరువు కన్నా వినేష్ బరువు ఎక్కువ ఉందని అధికారులు గుర్తించారు. క్రీడాకారుల బరువును తూచే సమయంలో ఇది తేలింది. వినేశ్ విషయంలో ఇంకొంత సమయం కావాలని భారత బృందం కోరింది. కానీ వినేశ్ బరువు తగ్గలేకపోవడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అనర్హత వేటుతో వినేశ్ తీవ్ర నిరాశ చెందింది.
రెజ్లింగ్ కు బరువే ప్రామాణికం..!
మొదటిసారి బరువు పరిశీలించడం, వైద్య పరీక్షలకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. అప్పుడు ఆ కేటగిరీకి సరిపడినవారినే ఆడేందుకు అనుమతిస్తారు. ఫైనల్స్‌కు అర్హత సాధించినవారికి.. సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ, పతకం కోసం మరో పోటీలో ఆడాల్సిఉన్నవారికి రెండోరోజు ఉదయం మళ్లీ బరువు చెక్ చేస్తారు. ఇందుకు 15 నిమిషాల సమయం పడుతుంది.
యూడబ్ల్యూడబ్ల్యూ నిబంధనల ప్రకారం రెండోసారి బరువు చెక్ చేసినప్పుడు.. ఏ మాత్రం బరువు ఎక్కువ ఉన్నా పోటీకి అనుమతించరు.
బరువు చూసే మొత్తం సమయంలో రెజ్లర్లు వాళ్ల కోరుకున్నన్నిసార్లు తమ బరువు చూసుకునేందుకు అవకాశం ఉంది. బరువు చెక్ చేసే బాధ్యత పూర్తిగా రిఫరీలదే. రెజ్లర్లు ఏ కేటగిరీలో పోటీలో పాల్గొంటున్నారో అందుకు తగిన బరువు ఉన్నారా? లేదా? అన్నది రిఫరీలు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. పోటీకి సరిపడా అన్ని విషయాలను వారు గమనించాలి. బరువు మొదలుకుని డ్రెస్ వరకు అన్ని విషయాల్లో రెజ్లర్లు ఎలాంటి స్థితిలో ఉన్నారనేది వారికి తెలియజేయాలి.
వైద్యపరమైన అవసరముంటే తప్ప.. ఏ అథ్లెట్ మొదటి లేదా రెండోసారి బరువు చెక్ చేసుకోకపోయినా, అందులో విఫలమైనా వారిని పోటీ నుంచి తప్పిస్తారు.
నిర్ణీత బరువుకంటే ఎక్కువ బరువున్న ఫైనలిస్ట్ ఎవరైనా పోటీలో పాల్గొనే అర్హత కోల్పోతే, సెమీ ఫైనల్‌లో పోటీ పడిన క్రీడాకారుడు/ క్రీడాకారిణి వారికి బదులుగా ఫైనల్‌లో పాల్గొంటారు. వినేశ్ కేసులో ఐఓసీ ఇదే చేసింది. పోటీ కేటగిరీ బరువుకు తగ్గట్గుగా క్రీడాకారులు బరువు తగ్గించుకోవడాన్ని వెయిట్ కటింగ్ గా పిలుస్తారు.
నిజానికి టోర్నమెంట్‌కు కొన్ని వారాల ముందు నుంచే అథ్లెట్లు బరువు తగ్గడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా బరువు తగ్గడం మంచిది. అయితే ఇందులో కొంత ప్రమాదం ఉందని స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ల అభిప్రాయం.
బరువు తూచేముందు కొందరు అథ్లెట్లు బరువు తగ్గి.. మళ్లీ టోర్నమెంట్ ముందు బరువు పెరుగుతారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
దీనికి కౌంటర్‌గా యూడబ్ల్యూడబ్ల్యూ 2017లో ఫార్మాట్ మార్చింది. అంతకుముందు బరువు కేటగిరీలో అన్ని మ్యాచ్‌లను ఒకే రోజు నిర్వహించేవారు. ఇప్పుడు అమలు చేస్తున్న రెండు రోజుల విధానంతో అథ్లెట్లు ఒక్కరోజులో ఎక్కువ బరువు తగ్గితే.. రెండోరోజు కూడా అంతే బరువు ఉండాలి. ఈ నిబంధనలు అతిక్రమించినా.. ఫాలో అవ్వకపోయినా డిస్ క్వాలిఫై చేస్తారు.
పోటీకి అవసరమైన కేటగిరీ బరువుకు అతిదగ్గరగా ఉన్న అథ్లెట్లు….ఆట ఆడే సమయంలో విపరతీమైన ఒత్తిడికి లోనవుతారట.
గతంలో కూడా బరువు కారణంగానే వినేశ్ ఎంతో బాధపడింది. 2016 ఒలింపిక్స్ కోసం జరిగిన తొలి ఆసియా క్వాలిఫయర్ మ్యాచ్‌లో 48 కేజీల కేటగిరీలో ఆడేందుకు…తన బరువు తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడింది. తర్వాత ఆమె ఆ కేటగిరీలో ఆడేందుకు అర్హత సాధించింది. అదే కేటగిరీలో ఆడిన వినేశ్ తర్వాత గాయం కారణంగా ఆ ఒలిపింక్స్ నుంచి వైదొలిగింది.
తిరిగి టోక్యో ఒలింపిక్స్‌లో 53 కేజీల కేటగిరీలో పోటీపడి, క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుతిరిగింది.
ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో తక్కువ బరువు కేటగిరీలో పోటీపడాలని ఆమె నిర్ణయించుకుంది. బరువు తగ్గాలని భావించింది. కానీ చివరకు కేవలం కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్టు తేలడంతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఈ పర్యవసానాలతో… రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది.
తనపై కుస్తీ గెలిచింది..
అంటూ ఫైనల్ చేరినా, పతకం దురమైనందుకు నిరాశతో కఠిన నిర్ణయం తీసుకుంది. తాజాగా అంతర్జాతీయ రెజ్లింగ్ కు తన రిటైర్మెంట్ ను ప్రకటించింది.