Telugu Cinema

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర బ్రహ్మ…  కె.వి మహదేవన్.

“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గణరసం ఫణిః” అన్నారు పెద్దలు. మహదేవన్ ఇది ఒక ప్రసిద్ధ సంస్కృత సిద్ధాంతం. అంటే సంగీతానికి పిల్లవాడిని, జంతువును మరియు విశ్వాన్ని ఒకేలా ఆకట్టుకునే శక్తి ఉందని అర్థం. ఇది ఆది ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉధ్బవించినది. సంగీతం అనేది సామవేద సారం. సంగీతం నాదమయం. నాదమంటే ’న’ కారానికి ప్రాణమని, ’ద’ కారానికి అగ్ని అని ప్రాణాగ్నుల సంయోగంతో ఉద్భవించేదే నాదమని శాస్త్రం చెబుతుంది.

అలాగే సంగీతానికి ప్రాణం శృతి. “శ్రూయన్త ఇతి శృతయః” అని శృతికి నిర్వచనం. స్వరమంటే? “స్వతో రంజయతి” స్వయంగా రంజింపజేయడమే ప్రధాన లక్షణంగా కలిగినది. సంగీతం ఏరూపంగా ప్రదర్శింపబడినా అది గొప్పదే. దేని విలువ దానికుంది. దేనిలో ఉండే కష్టం దానిలో ఉంది. జనాదరణే కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కానీ జనాలు సరిగ్గా ఆదరించలేకపోతే అది వారి లోపం. కానీ కళలో ఏలోపం ఉండదు.

సంగీతానికి, చిత్రసీమకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. పూర్వం నుంచీ ఇప్పటివరకూ ఉన్న సంగీత దర్శకులంతా సంగీతాన్ని చక్కగా నేర్చుకుని అందులోని రాగాలని రకరకాలుగా ప్రయోగించడం వల్లే అన్ని మంచి పాటలు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి సంగీతాన్ని తెలుగు చిత్రసీమకు, మన తెలుగు ప్రేక్షకులకు అందించిన అగ్రగణ్యులలో కె.వి.మహదేవన్ గారు ప్రముఖులు.

తెలుగు సినిమాకు సంగీత భిక్ష పెట్టిన మహనీయులలో అగ్రగణ్యుడు ‘స్వరబ్రహ్మ’ శ్రీ కె.వి. మహదేవన్ గారు. సినీ గీతంలో సాహిత్యాన్ని మన్నన చేసి మర్యాద నిలిపిన సంగీత దర్శకుడు ఆయన. తెలుగు తనానికి, తెలుగు గాన సంప్రదాయానికి ప్రతీక మహదేవన్ గారి పాట.

భారతనారీ చరితము మధుర కథా భరితము ( ఓ సీత కథ ), ఝుమ్మంది నాదం సాయి అంది పాదం ( సిరి సిరి మువ్వ ), కట్టు  జారిపోతవుంది… చీర కట్టు జారిపోతవుంది ( సంఘర్షణ ), ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము ( శంకరాభరణం ), మరుగేలరా ఓ రాఘవా ( సప్తపది ), కొమ్మకొమ్మకో సన్నాయి, కోటి రాగాలు వున్నాయి ( గోరింటాకు ), నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద ( అందరూ దొంగలే ), మల్లెపందిరి నీడలోన జాబిల్లి ( మాయదారి మల్లిగాడు )

ఇలా ప్రతీ పాటకు సాహిత్యాన్ని వ్రాసిన తరువాత ట్యూన్ కట్టేవారు మహదేవన్ గారు. తన దగ్గర ట్యూన్లు ఉండేవి కావు. తాను ట్యూన్ కట్టిన తరువాత పాట వ్రాయించేవారు కారు. వ్రాసిన పాటను బట్టి ట్యూన్ ఏర్పడుతుందనేది తాను నమ్మిన సిద్ధాంతం. తాను కట్టిన బాణీలన్నీ వ్రాసిన పాటను బట్టి పుట్టినవే. ఆదిశంకరులకు పద్మపాదుడు, కాళిదాసుకు మల్లినాథసూరి, జాన్సన్ కు బాస్వెల్ లాగా మహదేవన్ గారికి పుగలేంది జతయ్యారు . పుగలేంది గారు మలయాళంలో మంచి కథకుడు, కవి. పాతికేళ్ళ పరిచయంతో తాను తెలుగులో కూడా కొన్ని కవితలు వ్రాశారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    కృష్ణంకోయిల్ వెంకడాచలం మహదేవన్ 

ఇతర పేర్లు  :    తిరై ఇసై తిలగం

జననం    :    14 మార్చి 1918

స్వస్థలం   :    కృష్ణన్‌కోయిల్ , నాగర్‌కోయిల్ , ప్రస్తుత కన్యాకుమారి జిల్లా

తండ్రి   :   వెంకడాచలం భాగవతార్ 

తల్లి     :  పిచ్చయ్యమ్మాళ్  

వృత్తి      :    సంగీత దర్శకుడు

వాయిద్యాలు   :   కీబోర్డ్, పియానో

శైలులు     :    ఫిల్మ్ స్కోర్ , థియేటర్

పిల్లలు    :   ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు

మరణం   :   21 జూన్ 2001 (వయస్సు 83)

జననం…

కె.వి.మహాదేవన్ గారు 14 మార్చి 1917లో కేరళ రాష్ట్రానికి సరిహద్దులలో ఉన్న తమిళనాడుకు చెందిన కృష్ణన్ కోయిల్ అనే గ్రామంలో లక్ష్మీ అమ్మాళ్, వెంకటాచలం అయ్యర్ (భాగవతార్) లకు జన్మించారు. మహదేవన్ అసలు పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్. తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన మహాదేవన్ గారి తండ్రి వెంకటాచలం భాగవతార్ గారు గోటు వాద్యంలో నిష్ణాతులు. వాళ్ల కుటుంబమంతా సంగీతమయమే. మహాదేవన్ గారి తాతగారు తిరువాన్కూరు సంస్థానంలో సంగీత విద్వాంసునిగా పని చేస్తుండేవారు. మహదేవన్ గారు నాదస్వర వాద్యం అంటే విపరీతంగా ఇష్టపడేవారు. నాలుగేళ్ల ప్రాయంలోనే చిన్నారి మహాదేవన్ నాదస్వర వాద్యానికి ఆకర్షితుడై నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై దగ్గర శిష్యరికం చేశారు. అలాగే బూదంపాడి అరుణాచల కవిరాయర్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకొని కొన్ని కచ్చేరీల్లో పాల్గొన్నాడు.

సినీ రంగ ప్రవేశం…

కె.వి.మహదేవన్ గారు తాను చదువుతున్న రోజుల నుండే నాటకాలలో నటిస్తూ వుండేవారు. ఏడవ తరగతి వరకు మాత్రమే చదివారు. సినిమాలో చేరాలనే ఆశయం తో టి.వి.చారి గారి సహాయంతో మద్రాసులో అడుగుపెట్టారు. మొదట “తిరుమంగై ఆళ్వార్” అనే తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం లభించడంతో తన సినీ ప్రస్థానాన్ని నటనతో మొదలుపెట్టారు. కె.వి.మహాదేవన్ గారి మిత్రుడైన కొళత్తుమణి నువ్వు నటన వదిలేసి సంగీత దర్శకత్వ శాఖలో ప్రవేశిస్తే త్వరగా రాణిస్తావు అని సలహా యిచ్చాడు. దాంతో కొళత్తుమణికి మంచి పరిచయం ఉన్న అప్పటి సంగీత దర్శకుడు ఎస్.వి.వెంకట్రామన్ దగ్గర మహదేవన్ గారు సహాయకునిగా చేరారు.

అప్పటికే అక్కడ సహాయకునిగా పనిచేస్తున్న టి.ఎ.కల్యాణంతో మహదేవన్ గారికి మంచి పరిచయం ఏర్పడింది. టి.ఎ.కల్యాణం దగ్గరే సినిమా సంగీతంలోని పట్లు, మెళకువలు నేర్చుకున్నారు. 1942 వ సంవత్సరంలో “మనోన్మణి” అనే తమిళ సినిమాలో “మోహనాంగ వదనీ” అనే పాటకు సంగీతం సమకూర్చే అవకాశం లభించింది. ఎం.ఎస్ విశ్వనాథన్,  TK రామమూర్తి సమకాలీకుడైన మహాదేవన్ గారు 1942లో ఆనందన్ అనే తమిళ సినిమాతో చిత్ర రంగములో అడుగుపెట్టారు. ఆ తరువాత “దేవదాసి” అనే సినిమాకు సంగీతం సమకూర్చారు.

కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అంతగా పేరు రాలేదు. ఆ తరువాత రెండు మూడు సంవత్సరాల వరకు మళ్లీ అవకాశం రాలేదు. ఆర్.పద్మనాభం గారు 1952లో నిర్మించిన “కుమారి”, “రాజేశ్వరి” చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆ సమయంలోనే ఓ మలయాళీ కుర్రవాడు పరిచయం అయ్యాడు. చాలా కొద్ది కాలంలోనే మహాదేవన్ గారి మనసు గెలుచుకున్నాడు. దాంతో అతన్ని తన సహాయకునిగా పెట్టుకున్నారు. ఆ కుర్రవాడే పుహళేంది. తాను చివరి వరకు మహాదేవన్ గారి తోనే పనిచేశారు.

సంగీత దర్శకునిగా తొలి చిత్రం దేవదాసి.. 

సుకుమార్ పిక్చర్స్ వారు మహదేవన్ గారికి సంగీతం మీదవున్న పట్టు చూసి తమ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించిన “దేవదాసి” (1948) అనే చిత్రానికి  సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. హాలీవుడ్ లో శిక్షణ పొందిన మాణిక్ లాల్ టాండన్, టి.వి. సుందరం గార్లు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలసుబ్రమనియం, అంగముత్తు ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్రెంచ్ రచయిత అయిన అనటోల్ వ్రాసిన ‘తాయిస్’ అనే ఫ్రెంచ్ ఒపేరా నాటకమే ఈ సినిమాకు ఆధారం.

ఇదే నాటకం ఆధారంగా 1941 లో బెంగాలి సమర్పకుడు “చిత్రలేఖ” పేరుతో సినిమా నిర్మించి వున్నాడు. అయితే ఈ తమిళ సినిమా నిర్మాణానికి ఏకంగా మూడు సంవత్సరాలు పట్టింది. సినిమా ఆడడం కష్టమని భావించిన కృష్ణన్, మధురం తో ప్రత్యేకంగా ఒక కామెడీ ట్రాక్ ను జతచేసి సినిమా విడుదల చేశారు. ఈ చిత్రంలో పాటలన్నీ సుందరి తంబి చేత పాడించారు. కానీ ఈ చిత్రం వారు ఆశించినంత గొప్పగా ఆడలేదు. దాంతో మహదేవన్ గారు స్వరపరచిన అద్భుతమైన పాటలు కూడా మరుగున పడిపోయాయి.

దేవదాసి పరాజయంతో మహదేవన్ గారికి అవకాశాలు రాలేదు. సంగీత శాఖ నుంచి నటన వైపు వెళ్దామని ప్రయత్నించారు. జరుగుబాటు కోసం గ్రామఫోన్ కంపెనీలో పాటలు పాడుతూ, కొన్ని పాటలకు స్వరాలు కూర్చుతూ సుమారు రెండేళ్ళు పనిచేశారు. ఆ గ్రామఫోన్ కంపెనీలో పనిచేసేటప్పుడే  డి.కె. పట్టమ్మాళ్ గారు, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు, కె.బి. సుందరంబాళ్ గారు, దండపాణి గారు, దేశిగర్ గారి వంటి నిష్ణాతుల గాత్రాలను రికార్డులలో నిక్షిప్తం చేసే అవకాశం తనను వరించింది. దర్శక నిర్మాత ఆర్. పద్మనాభన్ గారు మహదేవన్ గారి ప్రతిభను గమనించి తాను నిర్మించే ‘కుమారి’ (1952) అనే చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశాన్ని కల్పించారు.

అందులో ఎం.జి. రామచంద్రన్, జూనియర్ శ్రీరంజని గార్లు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం పొందిన విజయంతో సినిమాను ఆర్. పద్మనాభన్ ‘రాజేశ్వరి’ (1952) పేరుతో సమాంతరంగా తెలుగులో నిర్మించారు. మంత్రవాది శ్రీరామమూర్తి, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, రేలంగి ముఖ్య తారాగణం కాగా సంగీతాన్ని ఓగిరాల రామచంద్రరావు సమకూర్చారు. తమిళ చిత్రంలో మహదేవన్ స్వరపరచిన పాటలనే రామచంద్రరావు యధాతధంగా వాడుకున్నారు.

“ఓహోహో పున్నమ రేయీ ఏమోయి మామా జాబిలిమామా”, “జై పతాక నిల్పరా సోదరా” అనే సైనిక గీతం, “ఆడదానికి తోడు మగాడొక్కడుండాలి”, “ఆహా ఈ లతాంగి ప్రేమ”, “మనోవిహారీ మరులుగొల్పు ఈ మలయపవనమే హాయీ”, “చూడు చూడు నాలో సిగ్గు నీకై తొంగి చూసెనోయి”, “షోకైన టంకు టమా తిల్లానత్తా ధిమిధిమి తా” పాటలు తెలుగులో బాగా పాపులర్ కావడంతో మహదేవన్ అంటే ఎవరో తెలుగు ప్రేక్షకులకు చూచాయగా తెలిసివచ్చింది. అప్పుడే పుహళేంది మహదేవన్ కు పరిచయమయ్యాడు. ఏ ముహూర్తంలో పుహళేంది పరిచయమయ్యాడో, మహదేవన్ తో చివరిదాకా అంటిపెట్టుకుని సహాయకుడిగా ఉండిపోయాడు.

తెలుగు లో “దొంగలున్నారు జాగ్రత్త” తో…

కె.వి.మహదేవన్ గారిది తమిళమే అయినా తెలుగు సినిమాకి ఆయన స్వరపరచిన బాణీలు అజరామరం అని చెప్పాలి. ప్రతిభా సంస్థ వారు 1958 వ సంవత్సరంలో నిర్మించిన “దొంగలున్నారు జాగ్రత్త” సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. ఘంటసాల బలరామయ్య గారి కుమారుడు కృష్ణమూర్తి సమర్పణలో నిర్మించిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాకు మహదేవన్ సంగీతం సమకూర్చారు. సీనియర్ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు గారు ఈ చిత్రానికి దర్శకుడు కాగా జగ్గయ్య, జి.వరలక్ష్మి, సియ్యస్సార్, రాజనాల, గుమ్మడి, రమణారెడ్డి, గిరిజ, హేమలత లాంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. “వలపే పులకింత సరసాలే గిలిగింత”, “అలాచూస్తావేమయ్యో ఓరచూపు చూచితే వూరికే పోడయ్యో”, “కల్ల కాదు కలా కాదు కన్నెపిల్ల బాసలు”, “చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలూ”, “వినరా నాన్నా, కనరా చిన్నా”, ”ఏమనేనోయి ఆమని రేయీ” లాంటి పాటలు ఆరోజుల్లో ప్రేక్షక జనానికి మంచి వినోదాన్ని అందించాయి.

అదే సంవత్సరంలో విడుదలైన ‘ముందడుగు’ సినిమాతో మహాదేవన్ ప్రతిభ బయటపడింది. కృష్ణారావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగ్గయ్య, జానకి, ఆర్. నాగేశ్వరరావు, గిరిజ వంటి వారు నటించారు. “కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా  పాట బాగా అలరించింది. అందులో  పదాన్ని సాహితీ ప్రియులు ఆత్రేయ గారు “చింతపూల రైక” అనే పదం వాడడంతో ఆపేరుతో రవిక గుడ్డలు మార్కెట్లోకి వచ్చాయి. “అప్పన్నా తన్నామన్నా మారోరిభైరాన్నా” పాట మరొక హిట్టు. “సంబరమే బలేబలే సంబరమే”, “మాబాబు మామంచి బాబు మనసిచ్చి మమ్మేలు చినబాబు”, “అందాన్నినేను ఆనందాన్ని నేను అందీ అందక నిన్ను ఆడించుతాను”, “ఆనందం ఎందుకో అనుబంధం ఏమిటో” లాంటి పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ముందడుగు చిత్రం కూడా విజయవంతం అయ్యింది.

1962 లో విడుదలైన “మంచి మనసులు” చిత్రం కేవలం పాటల వల్లే సినిమాలు హిట్ అవుతాయని నిరూపించారు మహదేవన్ గారు. అందుకు సాక్షం “మావా… మావా” అనే పాట బాగా జనాదరణ పొందడమే.

తెలుగు ప్రేక్షకులకు “మామా”…

11 ఏప్రిల్ 1962 నాడు తెలుగులో విడుదల అయిన “మంచి మనసులు” సినిమాలో తాను స్వరపరచిన “మామా మామా మామా” పాట ఆ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. దాని ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేమతో తనను “మామా” అని పిలవడం ప్రారంభించింది. అప్పటి నుంచి మహాదేవన్ గారిని చిత్రపరిశ్రమ లో “మామ” అని పిలవడం మొదలుపెట్టారు. “మూగ మనసులు” (1964) చిత్రం మహదేవన్ గారిని తిరుగులేని స్థానానికి చేర్చింది. ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉంటుంది. ఎం.ఎస్.విశ్వనాథన్, ఎస్.రాజేశ్వరరావు, టి.వి.రాజు, టి.చలపతి రావు, చక్రవర్తి, ఇళయరాజా ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. ఎంతమంది సంగీత దర్శకులు వచ్చినా కూడా మహదేవన్ గారి శైలి వేరు. రచయితలు సాహిత్యం వ్రాసిన తర్వాత దానికి స్వరాలు స్వరపరిచేవారు. ఎందుకనగా మహదేవన్ గారు స్వరపరిచిన పాటలకు ఎలాంటి జీవం పోస్తాడో అని పరోక్షంగా కూడా ప్రేక్షకులు వేచిచూసేవారు.

జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన “శంకరాభరణం”…

పండిత పామరుల్ని విశేషంగా ఆకట్టుకున్న సినిమా “శంకరాభరణం”. ఈ చిత్రం మహదేవన్ గారి కిరీటంలో ఒక కలికితురాయి. విశ్వనాథ్ గారు ఈ సినిమా రికార్దింగ్ రోజున “మీ ఇద్దరినీ నమ్ముకొని ఈ సినిమా ప్రారంభిస్తున్నా” అని మహదేవన్ గారితో అన్నారట. అయితే మహదేవన్, వేటూరి సుందరరామమూర్తి గార్లు ఆ మాటను నిలబెట్టారు. 1980 లో ఈ చిత్రానికి మహదేవన్ గారు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి అందుకున్నారు. బాల సుబ్రహ్మణ్యం, వాణీ జయరాం గార్లకు ఉత్తమ గాయకులుగా జాతీయ పురస్కారాన్ని కట్టబెట్టించారు. దానికి కారణం అందులోని పాటలే. బాలు గారు నేపథ్య గాయకుడిగా ఎదగడానికి దోహదమిచ్చిన చిత్రం కూడా శంకరాభరణం అని చెప్పుకోవాలి. నిజానికి ఈ సినిమాలోని శాస్త్రీయ పోకడులున్న పాటల్ని పాడలేనని బాలు గారు వెనుకంజ వేస్తే, పుహళేంది చేత బాలుకు తర్ఫీదు ఇప్పించి, ధైర్యాన్ని కూడగట్టించి తనతో పాటలు పాడించిన సంగీత మునీశ్వరుడు మహదేవన్ గారు. బాలసుబ్రహ్మణ్యం గారు తొలిసారిగా సోలో పాట పాడింది మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలోనే.

కుటుంబం…

నాలుగు దశాబ్దాల పాటు వేయికి పైగా చలన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్ గారు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు పొందారు. కె.వి. మహదేవన్ గారు తమిళ సినిమాలో ” తిరై ఇసై తిలగం ” (సినీ సంగీత దర్శకుల గర్వం) బిరుదును కూడా అందుకున్నారు. కె.వి.మహదేవన్ గారికి భార్య, ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒక కుమారుడు అయిన వి.మహదేవన్ సినిమాలలో రాణించారు. తమిళ చిత్రం మాసిలామణిలో న్యాయమూర్తి పాత్ర తో తన సినీ ప్రస్థానం మొదలయ్యింది.

చిత్ర సమాహారం..

మంచి మనసులు..

ముత్యాల ముగ్గు..

దాగుడు మూతలు..

మూగ మనసులు..

అంతస్తులు..

ఆస్తిపరులు..

కంచు కోట..

మనుషులు మారాలి..

అక్కా చెల్లెలు..

మల్లీ పెళ్లి..

ఇద్దరు అమ్మాయిలు..

బాలరాజు కథ..

అనురాధ..

దసరా బుల్లోడు..

ప్రేమ్ నగర్..

ఇన్‌స్పెక్టర్ భార్య..

బడి పంతులు..

బంగారు బాబు..

అందాల రాముడు..

సిరి సిరి మువ్వ..

మొనగాడు..

అడవి రాముడు..

మన వూరి పాండవులు..

కలంతకులు..

శృంగార రాముడు..

శంకరాభరణం..

గోరింటాకు (1979)..

వంశ వృక్షం..

శుభోదయం..

ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)..

సప్తపది..

అగ్ని పూలు..

గోల్కొండ అబ్బులు..

కలియుగ రాముడు..

త్రిశూలం..

కాంచన గంగ..

సిరివెన్నెల..

శృతిలయలు..

శ్రీనివాస కళ్యాణం..

జానకి రాముడు..

అడవిలో అభిమన్యుడు..

ముద్దుల మావయ్య..

ప్రళయం..

నారీ నారీ నడుమ మురారి..

అల్లుడుగారు..

అసెంబ్లీ రౌడీ..

పెళ్లి పుస్తకం..

స్వాతి కిరణం..

శ్రీనాథ కవి సార్వభౌముడు..

పురస్కారాలు..

జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకొన్న మొదటి వ్యక్తి కె.వి.మహదేవన్ గారు.

1967 సంవత్సరంలో కందణ్ కరుణై చిత్రానికి గానూ కె.వి.మహదేవన్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

1980 సంవత్సరంలో “శంకరాభరణం” చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయపురస్కారాన్ని దక్కించుకున్నారు.

1963 సంవత్సరంలో పద్మశ్రీ శివాజి గణేశన్ గారు “తిరై ఇసై తిలగం” అనే బిరుదు ఇచ్చి సన్మానించారు.

1967 సంవత్సరంలో బొంబాయి మ్యూజిక్ డైరక్టర్స్ అసోసియేషన్ తరుపున సి.రామచంద్ర గారు “మెల్లిసై చక్రవర్తి” అనే బిరుదును ఇచ్చి గౌరవించారు.

1976 సంవత్సరంలో లలిత కళానికేతన్, రాజమండ్రి వారు మహదేవన్ “స్వరబ్రహ్మ” బిరుదు ఇచ్చి సత్కరించారు.

1976 సంవత్సరంలో హైదరాబాదు ఫిలిం సర్కిల్ వారు మహదేవన్ “సంగీత చక్రవర్తి” అనే బిరుదు ఇచ్చి గౌరవించారు.

మరణం…

కె వి మహదేవన్ గారు ఐదు దశాబ్దాలుగా చలనచిత్ర రంగంలో వేయికి సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తమిళం లో 750 చిత్రాలకు, తెలుగు లో 350 చిత్రాలకు తాను సంగీత దర్శకత్వం వహించారు. నిర్మాత గా సినీ రంగంలో ప్రవేశించిన కె.వి. మహదేవన్ గారు సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాక ను ఎగుర వేశారు. కొంత కాలంగా అనారోగ్యానికి గురయ్యి అస్వస్థతతో బాధపడుతున్న తాను తన 84 ఏళ్ల వయస్సులో 21 జూన్ 2001 గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తెలుగు సినీ సంగీత రంగాన్ని అనేక సంవత్సరాల పాటు లాలించి, పాలించిన స్వరబ్రహ్మ కె.వి. మహదేవన్‌ గారు లేకపోవడం చిత్ర పరిశ్రమకు ఒక రకంగా తీరని లోటు అనే చెప్పాలి.

Show More
Back to top button