HISTORY CULTURE AND LITERATURE

శివుడి జ్యోతి స్వరూపం వెలుగొందే లింగ క్షేత్రాలు.. ద్వాదశ జ్యోతిర్లింగాలు.

శివుడు.. శంకరుడు.. పరమేశ్వరుడు.. రుద్రుడు.. భోలేనాథ్.. ముక్కంటి.. ఇలా ఎన్ని పేర్లో ఆ జంగమయ్యకు. చేతిలో శూలం.. మెడలో సర్పం.. పులిచర్మం కట్టుకుని.. ఒళ్లంతా బూడిద పూసుకుని.. ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు. శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు) రూపాతీతుడు. శివుడు జననమరణాలుకు అతీతుడు. కాలతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు.

శివుడికి మరో పేరు సదాశివుడు. సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు. శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ , విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు. మహా కాలునిగా బ్రహ్మ , విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వవింప చేసేవాడే మహా కాలుడు. సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు.

శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు శివజ్యోతి ప్రతిరూపాలు, మహిమాన్వితాలు. ప్రతి హిందువుకి జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాణ ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడినది. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి.

  • 1. సోమనాథ లింగము – సోమనాథ్
  • 2. మల్లికార్జున లింగము – శ్రీశైలము
  • 3. మహాకాళ లింగం – ఉజ్జయని
  • 4. ఓంకారేశ్వర అమలేశ్వర లింగములు – ఓంకారక్షేత్రం
  • 5. వైధ్యనాథ లింగం – చితా భూమి (దేవఘర్)
  • 6. భీమశంకర లింగము – భీమా శంకరం
  • 7. రామనాథస్వామి లింగము – రామేశ్వరము
  • 8. నాగేశ్వర లింగం – దారుకావనం (ద్వారక)
  • 9. విశ్వేశ్వర లింగం – వారణాశి
  • 10. త్రయంబకేశ్వర లింగం – త్రయంబకేశ్వరం
  • 11. కేదారేశ్వర – కేదారనాథ్
  • 12. ఘృష్ణేశ్వర లింగం – ఘృష్ణేశ్వరం..

జ్యోతిర్లింగ స్త్రోత్రం..

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.


పై జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.

కథ సంక్షిప్తంగా.

శివ పురానం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు, తమలో తము “నేను గొప్ప అంటే నేను గొప్ప” అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది. ఆ మహా లింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రుపమలో ఆదిని కనుక్కోవడానికి బయలు దేరారు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం (మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు బ్రహ్మకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు.

ఆవు కనపడితే అదే విధంగా చెప్పి, ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా, విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనంటుంది. రెండు, కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని, కావాలంటే ఆవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు. బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక నిజమే అంది మొగలి పువ్వు. ఆయన లింగం అగ్ర భాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది కాని, అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ దేవుడు అబద్దం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శాపం యిచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. చల్లబడిన ఆ లింగం నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ “జ్యోతిర్లింగాలు” అయినాయి.

ద్వాదశ జ్యోతిర్లింగాలు.

1. శ్రీ  సోమనాథ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం..

గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద  సోమనాథ్ క్షేత్రం ఉన్నది. శివ భక్తులు విరివిగా దర్శించే ఈ  సోమనాథ్ క్షేత్రం ఎంతో  ప్రాముఖ్యతను సంతరించుకున్నది.  ఈ సోమనాధ జ్యోతిర్లింగక్షేత్రం తొలి తీర్దయాత్ర కేంద్రంగా ప్రసిద్దిచెందింది. అయితే కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం 16సార్లు  ధ్వంసం కావించబడినప్పటికీ  తిరిగి జీర్ణోద్ధారణ పొందింది. గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడిచేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆఖరిసారిగా ఔరంగజేబు పాలనలో నేలమట్టమయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయి పటేల్ దీనిని తిరిగి నిర్మింపజేశాడు. దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్రతీరం ఉంది. సమీపంలో భల్కా తీర్థం ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు, తన భార్యలు, అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరిని సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు. అంతట శివుడు చంద్రుని కోరికతో  సోమనాధుడుగా  అచట నుండి భక్తులు కోరిన కోర్కెలను నెరవేస్తున్నారు.

2. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ ).

శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం కృష్ణా నది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. దీనిని “దక్షిణ కైలాశం” అని కూడా పిలుస్తారు. శ్రీమల్లిఖార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో  పరమశివుడు “శ్రీ మల్లిఖార్జునుడు” గా మరియు పార్వతి “భ్రమరాంబిక” గా కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఈ  జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గొప్ప శైవక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ దేవాలయంలోని ప్రధాన దేవతలు మల్లికార్జున (శివుడు) మరియు భ్రమరంబా (దేవి). ఈ క్షేత్రం కర్నూలు నుండి 180 కి.మీ. హైదరాబాదు నుండి 213 కి.మీ, గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రానే అన్ని పాపాల నుండి విముక్తి కలగటమే కాకుండా జననమరణ బంధం నుండి దాస్యవినిర్ముక్తులౌతారని భక్తుల నమ్మిక.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

3. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ( ఉజ్జయిని, మధ్యప్రదేశ్ )..

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయినీలోని దట్టమైన మహాకాల్ అడవిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్ లోని ఈ జ్యోతిర్లింగం  మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్య క్షేత్రం. మహాకాలేశ్వర దేవాలయం హిందువులకు అతి ముఖ్యమైన దివ్యక్షేత్రముగా పరిగణించడంలో మరో కారణమ్, ఇది ఏడు “ముక్తి-స్థల్” దేవాలయాల్లో  ఒకటి.  “ముక్తి-స్థల్” అంటే అర్ధం “మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశం”. ఈ జ్యోతిర్లింగం ఎలా ఉనికిలోకి వచ్చింది అనేదానికి సంబంధించిన అనేక కథలు పురాణముల్లో చెప్పబడి ఉన్నాయి. 

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేద ధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు “దేవప్రియుడు”. రెండవవాడి పేరు “ప్రియమేథుడు”. మూడో కుమారుడి పేరు “సుకృతుడు”. నాలుగవ కుమారుడి పేరు “సువ్రతుడు”. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు.

అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు. దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. “హర ఓం హర హర” అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు.

4. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం  ( అమలేశ్వరం, మధ్యప్రదేశ్ )..

అత్యంత ప్రముఖమైన జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ లోని నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో ఉంది. ఓంకారేశ్వర్ అంటే “ఓంకార శబ్దానికి ప్రభువు” అని అర్ధం. ఇక్కడి శివ లింగం “భాణలింగం”. నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది. అన్ని నదులూ  తూర్పు  దిశగా ప్రవిహించి సముద్రం లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషం. ఈ పుణ్యక్షేత్రానికి చేరడానికి పూర్తిగా నర్మదా నదిపై స్టీమ్ బోట్లు, రెండు ఒడ్డులను అనుసంధానించే వంతెనలు ఉన్నాయి. ఓంకారేశ్వరం దగ్గరగా విమానాశ్రయాలు ఇండోర్ (77 కి.మీ.), ఉజ్జయినీ (133 కి.మీ.) నగరాలలో ఉన్నాయి.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చి వింధ్యుడి పూజని గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు. “నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే. మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి” అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారాంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడని, పార్దివాకారంలో అమలేశ్వరుడని రెండు పేర్లతో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు.

5. శ్రీ వైద్యానాథ జ్యోతిర్లింగం ( దేవ్‌ఘర్ , ఝార్ఖండ్ రాష్ట్రం )…

ఈ వైద్యనాధ జ్యోతిలింగ దేవాలయం ఝార్ఖండ్ లోని శాంటల్ పరగణాలలో దేవ్‌ఘర్ ప్రాంతం వద్ద ఉంది. ఇది అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలలో ఒకటి. భక్తులు బైద్యనాథ జ్యోతిర్లింగాన్ని నిష్కల్మషమైన భక్తితో పూజిస్తే తమయొక్క బాధలనుండి  ఉపశమనం చేకూరుస్తుందని విశ్వసిస్తారు. ప్రజలు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం ద్వారా మోక్షాన్ని పొందుతారని ప్రజలు నమ్ముతారు. ఆ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ జాసిదిహ్ రైల్వే స్టేషన్, ఇది వైద్యనాథ్ ఆలయం నుండి 7 కి.మీ దూరంలో ఉంది. జాసిద్ పాట్నా మార్గంలో హౌరా – సీల్దా నుండి 311 కి.మీ దూరంలో ఉంది.

★ స్థల పురాణం…

రాక్షసులరాజు రావణుడు ప్రపంచంలో అతనిని ఎవ్యరూ నినాశనం చేయకుండా వరం పొందటానికి ఆలయం ప్రస్తుత స్థలంలో శివుడిని పూజించాడని  హిందూ విశ్వాసాల ప్రకారం ఒక నమ్మకం ఉంది.రావణుడు తన పది తలలను ఒకదాని తరువాత ఒకటి శివుడికి బలిగా అర్పించాడు.దీనితో సంతోషించిన శివుడు గాయపడిన రావణుడిని నయం చేయడానికి దర్శనమవుతాడు.శివుడు ఆ సందర్భంలో వైద్యునిగా వ్యవహరించినందున,ఈ కోణంలోఈ ఆలయానికి “వైద్య” అనే పేరు వచ్చిందని ఒక నమ్మకం.

6. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ( పూణే, మహారాష్ట్ర ).. 

 శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర పూణే లోని సహ్యాద్రి ప్రాంతంలో ఉంది. ఇది భీమ నది ఒడ్డున కలదు. ఇది ఈ నదికి మూలం. ఈ జ్యోతిర్లింగం ఉనికి భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. , ముంబాయికి 200 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమశంకరం లోని భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

భీముడు తానూ కుంభకర్ణుని కుమారుడినని తెలుసుకొన్నంతనే తన తండ్రిని రామావతారంలో విష్ణువే వధించెనని తెలుసుకొని విష్ణువుపై ప్రతీకారేచ్చతో రగిలిపోయాడు. బ్రహ్మ తృప్తి కొరకై కఠోర తపస్సు చేసాడు.  బ్రహ్మదేవుడిని తృప్తి పరచి అపార శక్తిని సాధించడంతో భీమా ప్రపంచ నాశనాన్ని ప్రారంభించాడు. అతను శివుడు కమృప్తేశ్వర్ యొక్క భక్తుడిని ఓడించి అతనిని నేలమాళిగలో ఉంచాడు. ఈ దౌర్జన్యానికి ముగింపుపలకటానికి శివ భగవంతుడిని కోరుతూ దేవతలందరూ ప్రార్ధించారు.  అనంతరం  జరిగిన యుద్ధంలో  చివరకు రాక్షసుడైన భీమని శివుని ఆగ్రహజ్వాల బూడిదగా చేసింది. ఆ ప్రదేశాన్ని శివుని క్షేత్రంగా చేసుకోమని దేవతలా ప్రార్ధనపై శివుడు భీమశంకర్ జ్యోతిర్లింగంగా తనను ప్రత్యక్షంగా ప్రదర్శించాడు. యుద్ధం తర్వాత శివుని శరీరం నుండి పోసిన చెమట భీమ నదిగా ఏర్పడిందని నమ్ముతారు.

7. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ( రామేశ్వరం , తమిళనాడు ) 

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు లోని సేతు తీరంలో రామేశ్వరం ద్వీపంలో ఉంది. ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలకు దక్షిణ భాగం. ఈ ఆలయం దాని వాస్తుకళకు ప్రసిద్ధి చెందింది, ఇది చాలా ప్రముఖమైనది, పొడవుగా అలంకరించబడిన కారిడార్లు, టవర్లు మరియు 36 తీర్థాలతో ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది. ఈ దివ్యధామమ్ యాత్రాకేంద్రముగా బనారస్ తో సమానంగా ఖ్యాతి గడించింది.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు, విష్ణువు ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురిడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించు కోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలను కుంటాడు. రాముదు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకోని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయరుచేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువ బడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం.

8. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ( దారుకావనం , గుజరాత్ )…

నాగనాథ ఆలయంగా కూడా పిలుచుకునే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గోమతి ద్వారకా మరియు గుజరాత్ లోని సౌరాష్ట్ర తీరంలోని బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత ఏమిటంటే  అన్ని రకాల కాలకూట విషాల నుండి రక్షణను సూచిస్తుంది. ఈ దేవాలయంలో పూజించేవారు అన్ని విష ప్రమాదాల నుండి తప్పించుకున్నారని నమ్ముతారు.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి, ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నాడు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగదారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చేయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురునికి చెప్పిరి.

తారకాసురుడు సుప్రియునితో “నీవు దైవారాధన చేయవద్దు” అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసురుడు కోపమును పట్టలేక తన చేతిలోని గదచే తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే “నాగలింగేశ్వర” నామముతో లింగరూపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు “నాగేశ్వర లింగము” అని పేరు వచ్చింది.

9. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ( కాశీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం )..

ప్రపంచంలోనే అత్యంత గౌరవింపబడే ప్రదేశం “కాశీ”. ఇది పవిత్ర నగరం. రద్దీగా వుండే  బనారస్ (వారణాసి)లో  ఉంది. వారణాసి యొక్క కనుమలు మరియు గంగా కంటే, యాత్రికులకు భక్తి దృష్టి ఉంది. బనారస్ లో ఇతర దేవతలపై ఆధిపత్యాన్ని చూపించిన మొట్టమొదటి జ్యోతిర్లింగం భూమి యొక్క అంతర్భాగాన్ని చీల్చుకొచ్చి స్వర్గానికి కాంతులు పంచిందని నమ్ముతారు. ఈ దేవాలయం శివునికి అత్యంత ప్రియమైనదిగా చెప్పబడింది. ఇక్కడ చనిపోయినవారికి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. పరమశివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తూ భక్తులకు ముక్తిని  మరియు సంతోషం ఇచ్చేవాడని నమ్మకం. ఈ ఆలయం అనేక సార్లు పునర్నిర్మించబడింది, కానీ దాని ప్రాముఖ్యతని ఎల్లప్పుడూ కొనసాగించింది.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం..

కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం.

10. శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ( నాసిక్ , త్రయంబకేశ్వర్ )…

ఈ త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి 30 కి.మీ.ల దూరంలో గోదావరి నది పరీవాహక ప్రాంతములో ఉండే  బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉంది. ఈ దేవాలయం గోదావరి నదికి మూలంగా పరిగణించబడుతుంది.  దీనిని “గౌతమి గంగా”అని  పిలుస్తారు.  ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్ర నది. శివ పురాణం  ప్రకారం, గోదావరి నది కోరికపై  గౌతమ్ రిషి మరియు శివుని అనుగ్రం పొందిన ఇతర దేవతలు ఇచట కొలువై ఉండాలని నిర్ణయించి ఈ ప్రాంతానికి త్రయంబకేశ్వర్ పేరు నిర్ణయించారు.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. “అంబక” మంటే “నేత్ర” మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని – అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. “త్రయంబకం యజామహే – సుగంధిం పుష్టి వర్ధనమ్” మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.

11. శ్రీ కేదార్నాధ్  జ్యోతిర్లింగం ( కేధార్‌నాథ్‌ , ఉత్తరాఖండ్ రాష్ట్రం )    

భారతదేశంలోని అతి పవిత్రమైన యాత్రా స్థలాలలో ప్రముఖమైనది శ్రీ కేదార్నాథ్ దేవాలయం. హిమాలయ పర్వత శ్రేణులలో 12000 అడుగుల ఎత్తున కేదర్ అనే పర్వతం పై ఉంది. ఇది హరివార్ నుండి సుమారు 150 మైళ్ళ దూరంలో ఉంది. జ్యోతిర్లింగానికి చెందిన ఈ ఆలయం ఏడాదికి ఆరు నెలలు మాత్రమే తెరువబడి ఉంటుంది. ఇచట  సంప్రదాయం ఏమిటంటే, కేదార్ నాథ్  తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు  భక్తులు మొదట యమునోత్రి మరియు గంగోత్రి సందర్శించి అచట నుండి పవిత్ర జలాలతో  కేదార్ నాథ్ ను అభిషేకిస్తారు.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

కురుక్షేత్ర యుద్ధం తరువాత, వ్యాస ముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారని కథనం. అది ముందుగా గ్రహించి, శివుడు వారిని క్షమించటానికి ఇష్టపడక, ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు. పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడుని గుర్తించే సమయంలో, ఆ రూపం నేలమీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది. పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకుని, వారి ముందు హాజరుకావాలని, వారిని క్షమించమని బలవంతం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేధార్‌నాథ్‌లో మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం..

12. శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ( ఎల్లోరా, మహారాష్ట్ర )..

శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని దౌలాతబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుల్ అనే గ్రామంలో ఉంది. అజంతా & ఎల్లోరా గుహలు ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వారణాసిలోని కాశీ విశ్వనాధ్ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఘృష్ణేశ్వర ఆలయం కుసుమేస్వరార్, ఘుశ్మేశ్వర, గ్రుష్మేశ్వర, మరియు ఘ్రిష్ణేశ్వర  వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.

12 Jyotirlingas In India For Spiritual Journey!

★ స్థల పురాణం…

శివ పురాణాల ప్రకారం, సుధర్మడు  మరియు సుదేహ అనే జంట దేవగిరి పర్వతం మీద నివసించేవారు. వారు సంతానహీనులయ్యారు, అందువలన సుదేహ ఆమె సోదరి ఘుష్మాను సుధర్మతో  వివాహం జరిపించింది. సుధర్మ మరియు ఘుశ్మ జంటకు కుమారుడు కలిగాడు. ఇది సుదేహాలో  అసూయ రగిల్చింది. ఈర్ష్యతో సుదేహ  కుమారుడిని నదిలో పారవేస్తుంది.  ఈ ప్రాంతంలోనే ఘృష్ణ 101 లింగాలను  నిమజ్జనం చేసింది. ఘుశ్మ బాధ చూడలేని శివుడు తిరిగి ఆమె కుమారుడిని ఆమె వద్దకు చేర్చగా సుధర్మ కోరికపై అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి శ్రీ ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగంగా అవతరించాడు.

Show More
Back to top button