HISTORY CULTURE AND LITERATURE

రాజ్యకాంక్షను కోరని ధర్మనిష్ఠుడు.. ‘విదురుడు’!

విదురుడు ధర్మశాస్త్రంలోనూ, రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు. కోపతాపాలు, ఈర్ష్యాసూయలు చూపని గొప్ప జ్ఞాని. 

తనకెంత సామర్ధ్యమున్నప్పటికీ.. రాజ్యపదవి కోసం వెంపర్లాడలేదు. అన్న ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేశాడు. ఆయన క్షేమం, రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో సూచనలు చేశాడు. మాయ జూదం ఆడడం వల్ల ఎన్నో విపరీతాలు సంభవిస్తాయని ముందుగానే హెచ్చరిస్తాడు. కానీ యుద్ధం తప్పలేదు. ఫలితంగా కురు వంశం నాశనమైంది. పాండవులు అడవులపాలయ్యారు.

ఇంతటి విజ్ఞానవంతుడైన విదురుడు ఎందుకని వైరాగ్యవంతుడూ అయిన వేద వ్యాసుడు, దాసీ కడుపున పుడతాడు. అందుకు గల కారణమేంటి?!, అతని జన్మ వృత్తాంతం.. చుట్టూ అల్లుకున్న పరిణామాలేంటి?, ఇటువంటి ఆసక్తికర విషయాల గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

విదురుడి జనన వృత్తాంతం

కురు వంశములో దేవరన్యాయం ప్రకారం జన్మించాడు విదురుడు… 

అది కురు రాజ్యం. పూర్వం శంతనుడు, సత్యవతి దంపతులు ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు… చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. శంతనుడి మరణం తరువాత చిత్రాంగదుడు రాజ్య పాలన గావించాడు. అయితే ఒకనాడు చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్దం చేసి, ఆ యుద్దములో మరణిస్తాడు. 

ఆ తరువాత విచిత్రవీరుడు రాజయ్యాడు. విచిత్రవీరుడుకి ఇద్దరు భార్యలు.. వారు అంబిక, అంబాలిక. విచిత్రవీరుడికి తీవ్ర అనారోగ్యము వల్ల పిల్లలు కలగలేదు. 

వంశరక్షణార్దం.. దేవరన్యాయం ప్రకారం పిల్లలు జన్మించే ఆస్కారం ఉందని భీష్ముడు చెప్తాడు. దేవరన్యాయం అనగా, ఒక మహాపురుషుడి వీర్య దానం వలన కలిగే సంతానం.. 

ఆ మహాపుషుడే వ్యాసుడు. వ్యాసుడు కూడా సత్యవతి దేవికి కుమారుడవుతాడు. వ్యాసుడిని సత్యవతి దేవరన్యాయం ప్రకారం కురువంశాన్ని నిలుపమని కోరుతుంది. దానికి వ్యాసుడు సైతం సమ్మతిస్తాడు. ఆ ప్రకారమే సత్యవతి అంబికను వ్యాసుడు ఉన్న గదిలోకి పంపిస్తుంది.. అంబిక వ్యాసుడ్ని చూసి భయపడి, కళ్లు మూసుకుంటుంది. అందువల్ల ఆమెకు పుట్టిన సంతానం అంధుడిగా పుడతాడు. అతనే దృతరాష్ట్రుడు.

ఈసారి అంబాలికను వ్యాసుడి గదిలోకి పంపిస్తుంది. అతడి వాలకాన్ని చూసి, భయంతో ఒక్కసారిగా వణకడంతో పాండురోగము(వణికే జబ్బు) గల పాండురాజు జన్మిస్తాడు.

పుట్టిన ఇద్దరు రాజ్యపాలనకు సరి కారని భావించి, చివరి ప్రయత్నంగా.. వ్యాసుడి వద్దకు అంబికను వెళ్ళమని చెబుతుంది. ఆమె వెళ్లేందుకు నిరాకరించి, దాసిని పంపిస్తుంది. ఆమె ఏ మాత్రం భయపడకుండా సేవిస్తుంది. ఆమె సేవను మెచ్చి, వ్యాసుడు అనుగ్రహిస్తాడు.. అలా దాసీ కడుపున జన్మించినవాడే విదురుడు. 

విదురుని జననం వెనకున్న శాపం?!..

పూర్వం మాండవ్యుడు అనే ఒక రుషి తన ఆశ్రమం ముందర ఉన్న చెట్టు కింద తపస్సు చేసుకొంటూ ఉన్నాడు. ఒకరోజున ద్రవ్యాన్ని దొంగిలించి.. కొందరూ దొంగలు ఆశ్రమం వైపుకు పరిగెత్తుకొంటూ వచ్చారు. తమ వెంటే తరుముకొంటూ వస్తూన్న భటుల చేతిలో ఎక్కడ చచ్చిపోతామన్న భయంతో.. ఆ ఆశ్రమంలో తలదాచుకున్నారు. రక్షకులొచ్చి ఆ రుషిని దొంగల ఆచూకీ అడిగితే ధ్యానంలో ఉండటం మూలాన మౌనంగా ఉన్నాడు.. ఏం మాట్లాడలేదు. ఇంతలోనే రాజభటులకు అనుమానం వచ్చి, ఆశ్రమం అంతా వెతికి, దొంగల్నీ, ధనాన్నీ కైవసం చేసుకొన్నారు. అయితే రుషి, వారితో పాటు కుమ్మక్కయ్యాడన్న అనుమానంతో వాళ్లు మునితో సహా అందర్నీ రాజు ముందుకు తీసుకొచ్చారు.

రాజు వాళ్లందరికీ శిక్షగా.. మరణ దండన విధించాడు. ఒక్కొక్కర్నీ శూలాల మొనల మీద  దిగగొట్టి, అనంతరం తలారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కొన్నిరోజుల తరువాత వచ్చిన తలారులకు, శూలం గుచ్చుకొని ఉన్నా ఏ బాధ పడకుండా, రుషి ఒక్కడే తపస్సు చేసుకొంటూ కన్పించాడు. దీంతో భయపడి ఈ  విషయం రాజుకి చెప్పారు. ఆయన వచ్చి శూలం మీద నుంచి దింపించి… ఆయనెవరో గుర్తించిన వాడికిమళ్లే..

‘నా అజ్ఞానం కొద్దీ తప్పు జరిగింది, కోపం తెచ్చుకోవద్దు. ప్రసన్నులు కండి’ అంటూ రుషిని వేడుకొన్నాడు రాజు. 

ఆ శూలం కొస ముక్క అతని కింద భాగంలో ఉండిపోయింది. అప్పట్నుంచి అతన్ని ‘అణీమాండవ్యుడ’ని పిలవడం మొదలు పెట్టారు.

రాజునేమీ కోపగించుకోలేదుగానీ, రుషి, ఈ పాపదండనలను అమలుపరిచే ఆ యమ ధర్మరాజు మీద మాత్రం బాగా మండిపడ్డాడు. 

ఈ విషయం ఇంతటితో వదిలేయకుండా..

రుషి, తన తపశ్శక్తితో యమలోకానికి వెళ్లి, 

‘నేను ఏం తప్పు చేశానని ఈ దుష్ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది’ అని సూటిగా అడిగాడు.

అప్పుడు బదులుగా యమధర్మరాజు…

‘బాల్యంలో నువ్వు తూనీగల తోకల్లో సూదిగా ఉండే గడ్డిమొనల్ని గుచ్చడం వల్లే నీకు ఈ దుస్థితి’ అన్నాడు యముడు. 

అప్పుడు రుషివర్యులు…

‘ధర్మశాస్త్రం ప్రకారం,  పన్నెండేళ్లదాకా పిల్లలేది చేసినా అది వాళ్లను అంటదు. కానీ నేను చేసిన చిన్న పాపానికి నువ్వు నాకు పెద్ద దండనే వేశావు. అందువల్ల నీవు శూద్రుడిగా పుట్టి.. ఈ దోషం నుంచి బయటపడాలి’ అంటూ యుముణ్ని శపిస్తాడు.

అలా యముడే అణీమాండవ్యుడి శాపం వల్ల విదురుడిగా పుట్టాడు. 

విదురుడువ్యక్తిత్వం

విదురుడు గొప్ప జ్ఞాని. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాడు. ఇతడు ధృతరాష్ట్రునికి తమ్ముడు. ధర్మమూర్తి యముడు మాండవ్యుముని శాప కారణంగా భూలోకంలో విదురునిగా జన్మించాడు. సాక్ష్యాత్తు ధర్మమూర్తే విదురుడవడంతో అతను మొదటి నుంచి నీతికీ, న్యాయానికీ, ధర్మానికీ మారుపేరుగా నిలిచాడు. పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలను నిరసించాడితను. కౌరవుల అన్యాయాల గురించి ధృతరాష్ట్రునికి చెప్పి, ముందే హెచ్చరించాడు. ఇలా రెండు పక్కల హితబోధ చేసినా.. పాండవులకూ కౌరవులకూ యుద్ధం తప్పలేదు. 

యుద్ధాన్ని తప్పించడానికి, సంధి కోసం ఎంతగానో ప్రయత్నించాడు. ఫలించలేదు. కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. విదురుడు ఎవరి పక్షాన నిలవలేదు. దాయాదుల మధ్య యుద్ధం చూడలేనంటూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చే వేళకి యుద్ధం ముగిసింది. కౌరవులంతా చనిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రునికి వైరాగ్యాన్ని బోధించింది విదురుడే! 

విదురుడు ధైర్యశాలి. అంతకు మించి న్యాయశీలి. నీతిపరుడు. పాండవులను ఎటువంటి తారతమ్యాలు లేకుండా కేవలం వారి నిజ గుణగణాల వల్లే వారిని ఇష్టపడతాడు. దుర్యోధనికున్న ద్వేషాన్ని గ్రహిస్తాడు. అన్న ధృతరాష్ట్రునికి ఎన్నో విధాల సహాయకారిగా ఉండి, సలహాలను ఇచ్చేవాడు. 

పాండవులు కాశీనగరానికి వెళ్ళే మార్గంలో దుర్యోధనుడు కట్టిన ప్రమాదకారి అయిన లక్కఇల్లు గురించి ముందుగానే తెలిసి విదురుడు వారికి ముందుగానే హెచ్చరిస్తాడు. ఎంత దాసీ కడుపున జన్మించినప్పటికీ, భీష్ముడికి ఎంతటి మర్యాద ఇచ్చేవారో.. అంతే గౌరవాన్ని కౌరవులు, పాండవులు ఇచ్చేవారు.

పాండవుల మేలు కోరి, అసలు విషయం నేరుగా చెప్పకుండా, శత్రువుల కుతంత్రాలను అర్ధం చేసుకోమన్నాడు. లోహంతో చేయబడిని శస్త్రం దారిలో ఉందన్నాడు. ఎండిన గడ్డి అడవిని దహిస్తుంటే కలుగులో ఎలుక తెలివిగా బయట పడుతుందన్నాడు. ఇలా పరోక్షంగా చెప్పడంతో ధర్మరాజుకి విదురుని మాటల మర్మం అర్థమైంది. దాంతో విదురుడు పంపిన ఖననకుని సాయంతో, ఆ లక్క ఇంట్లో నుంచి సొరంగ మార్గం ద్వారా బయటపడ్డారు. 

ఈ రకంగా దుర్యోధనుని వద్ద మంత్రిగా ఉంటూనే పాండవులను కాపాడుకున్నాడు. 

ఈ సంఘటనతో పాండవులు చనిపోయారని ధృతరాష్ట్రుడు బాధపడినా అసలు వాస్తవం చెప్పలేదు. 

ద్రౌపది విషయంలో ధృతరాష్ట్రుడు బాధపడినప్పుడు విదురుడు నీతిగా ఒక పరిష్కారం చెప్పాడు. పాండవులకు వారి రాజ్యభాగం వారికిమ్మన్నాడు. అందుకు సమ్మతించడంతో విదురుడే ద్రుపద నగరానికి వెళ్ళి వారిని తీసుకొని వచ్చాడు. పాండవులకు అర్ధరాజ్యం రావడానికి, యుద్ధం జరగకుండా నిలిచిందంటే దానికి కారణం విదురుడే!

అంతెందుకు.. మాయా జూదపు ఆలోచన చేసినపుడు కూడా వద్దని వారించాడు. అన్నదమ్ముల మధ్య అకారణంగా ద్వేషం పెరుగుతుందన్నాడు. ఆ సమయంలో విదురుని మాట ఎవ్వరూ వినలేదు. పాండవులు జూదంలో ఓడి.. ద్రౌపదిని తీసుకు రమ్మన్నప్పుడు విదురుడు వద్దన్నాడు. చాకచక్యంగా.. ద్రౌపది వేసిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పమన్నాడు. అనంతరం ద్రౌపది వస్త్రాపహరణం తగదని ధృతరాష్ట్రునికి చెప్పి, దుర్యోధనుని వారించమన్నాడు. 

ఆపై పాండవుల్ని అడవులపాలు చేయడం తగదన్నాడు. కుంతిని తన వద్దనే ఉండమన్నాడు. పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వమని కోరి, చివరకు పాండవ పక్షపాతిగా మాట సైతం పడ్డాడు.

ఆఖరికి ఈ దేశం విడిచి పొమ్మంటే పోయాడు. తిరిగి రమ్మంటే వచ్చాడు. 

ధృతరాష్ట్రుడు తనబాధ చెప్పుకుంటే విదురుడు చెప్పిన నీతి… “విదుర నీతి”గా ప్రాచుర్యం పొందింది. 

పాండవుల అజ్ఞాతవాసం ముగిశాక కృష్ణుడు రాయబారిగా వచ్చి విదురుని ఇంట భోంచేస్తాడు. అనంతరం సంధి పొసగదని విదురుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. యుద్ధంలో ఏ పక్షమూ చేరలేదు. యుద్ధం సమయానికి తీర్థయాత్రలకు వెళ్ళాడు. అక్కడి మైత్రేయుని వలన ఆత్మజ్ఞానం ఏంటో… అసలు బ్రహ్మదేవుని జన్మ వృత్తాంతం, కాల లక్షణం, సృష్టి విధానం… చాలానే తెలుసుకున్నాడు. అనంతరం తిరిగి రాజ్యానికి వచ్చేశాడు.

అప్పటికే యుద్ధం ముగిసింది. 

పాండవులు అతడ్ని గౌరవంగా రాజ్యానికి ఆహ్వానించినా, ధృతరాష్ట్రుని దుఃఖాన్ని పోగొట్టి సంసారం నిస్సారం అని చెప్పాడు. వైరాగ్యం చాటున దాగివున్న అసలు అర్థం చెప్పాడు. 

‘పాత వస్త్రం విడిచి కొత్త వస్త్రం ధరించినట్టు… పాత ఇల్లును వదిలి కొత్త ఇల్లును చేరినట్టు… 

జీవం ఒక దేహం వదిలి మరో దేహంలోకి ప్రవేశిస్తుందని చెప్పి, చివరకు పాండవులూ మీ బిడ్డలే వారిని చూసుకొని ప్రశాంతంగా ఉండమని కోరాడు’. 

ఆ తర్వాత ధృతరాష్ట్రునితో గాంధారీ, కుంతీలు అంతా అడవులకు తపస్సు నిమిత్తం వెళ్ళారు. వారితో విదురుడూ సహా వెళ్ళాడు. కొన్నాళ్ళకు ధర్మరాజు పిలుపుతో, యోగశక్తితో దేహాన్ని విడిచి ఆయనలో ఐక్యమయ్యాడు.

“ప్రాణం పోతున్నా సరే ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మం అనేది నిత్యం. సుఖమూ, దుఃఖమూ ఎప్పటికీ నిలిచిపోవు. మారిపోతూ ఉంటాయి. ప్రజలందర్నీ వారి వారి ధర్మాన్ని నిర్వర్తించేలాగ చేయడం రాజుగా నీ ధర్మం. ఇప్పుడు నువ్వు ధర్మరాజును క్షత్రియధర్మం నుంచి దూరం చేశావు. ఇప్పుడతన్ని తిరిగి రాజధర్మంలో ఉండేలా చేస్తేనే నీకు హితం” అంటూ రాజ్య కాంక్షను కోరి.. అన్న దృతరాష్ట్రుడుకి నీతిని బోధిస్తాడు విదురుడు..  

నీతిని బోధించే గొప్ప గ్రంథాలలో ఈ ‘విదుర నీతి’ కూడా ఒకటని చెప్పవచ్చు.

విదుర నీతి వాక్యాలు..

*తనకు అందని దాని గురుంచి ఆరాటపడనివాడు, పొయినదాని గురుంచి బాధపడనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే.. జ్ఞాని. 

*అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు ఎప్పటికీ వినయంగానే ఉంటాడు.

*మూర్ఖుడు.. వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ.. ఆలస్యంగా చేస్తాడు. అతను తప్పు చేసి, ఎదుటి వారిని నిందిస్తాడు.

*ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండి పడటం.. ఈ రెండూ విషయాలు మనిషిని కృశింపపజేస్తాయి.

*ఏదైనా కష్టం వస్తే ఒక్కడే కూర్చొని బయటపడే ఉపాయం గురుంచి ఆలోచించకూడదు.

*అందరూ నిద్రపోతుంటే, తానొక్కడే మెలకువగా ఉండకూడదు.

*మధుర పదార్థం నలుగురికి పంచకుండా ఒక్కడే తినకూడదు.

*ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికొచ్చే విద్య.. ఇవి మనుషులకున్న సుఖాలు.

*శత్రువుల్ని దూరం పెట్టినంత మాత్రాన హాని జరగదని భావించొద్దు. వారి విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

*బలవంతుడితో విరోధం పెట్టుకున్నవాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు.

మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో విదురుడు చెప్పిన నీతి వాక్యాలివి.

Show More
Back to top button